Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

నేల విడిచి సాగు!

* రసాయనాలతో క్షీణిస్తున్న సారం
భారత ఉపఖండంలో వ్యవసాయానికి ఉన్న ప్రాముఖ్యం మరే రంగానికీ లేదు. వివిధ వాతావరణ పరిస్థితులు, నేలలు, నైసర్గిక స్వరూపాలు, పంటలు గల భారత్‌ వంటి దేశం ప్రపంచంలో మరొకటి లేదు. వైశాల్యంలో పెద్ద దేశాలు ఎన్నో ఉన్నా, వ్యవసాయయోగ్యమైన భూమి గల దేశాల్లో రెండోస్థానం ఇండియాదే. ఏడాది పొడవునా పంటలు పండించే అవకాశం ఉన్న దేశమూ మనదే. అందువల్లే అనాదిగా ఇది వ్యవసాయిక దేశం. పంటలు, పశువులు, పక్షులు జలచరాది సంపదలతో నిర్దిష్టమైన రుతువులు గల దేశంలో ఇటీవలి కాలంలో పెను మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నైరుతి రుతుపవనాలు సకాలంలో వర్షించడం లేదు. పంటకాలం చివర్లో భళ్లున వానలు కురిపించి వరదలు మిగిల్చిపోతున్నాయి. ఈశాన్య రుతుపవనాలు సైతం రైతులకు దుఃఖ కారకమవుతున్నాయి. సూర్యకాంతి, ఉష్ణాల్లో తేడాలు దిగుబడులపై ప్రభావం చూపుతున్నాయి. వ్యవసాయ కార్యక్రమాలు, పంటలు, వాతావరణ ఆటుపోట్లకు గురవుతున్నాయి. రసాయనాల వినియోగం నేల తీరుతెన్నుల్లో మార్పులు తెస్తోంది. ఈ పరిణామాలు ప్రకృతిలో సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి.

అడుగడుగునా సమస్యలు
దేశంలో జనాభా విపరీతంగా పెరుగుతోంది. మరో పదేళ్లలో ప్రపంచంలోనే అత్యధిక జనాభాగల దేశంగా భారత్‌ అవతరించనున్నట్లు అంచనాలు వెలువడుతున్నాయి. పెరుగుతున్న జనాభాకు అవసరమైన ఆహారం, నీరు, బట్ట, గూడు, పరిశుభ్రమైన వాతావరణం, ఆరోగ్య సంరక్షణ కల్పించాలి. వ్యవసాయం కానిదిగా మారి రైతులు కష్టనష్టాలను ఎదుర్కొంటున్నారు. రుణభారం పెరిగి పొలాలను బీడు పెట్టే పరిస్థితులు నెలకొన్నాయి. ఇది ఒక్క రైతుల సమస్య అనుకోవడం పెద్ద పొరపాటు. వ్యవసాయం పడకేస్తే అది ఆహార అభద్రతకు దారి తీస్తుంది. దేశంలో ఎట్టి పరిస్థితుల్లోనూ స్తంభించకూడని రంగం వ్యవసాయమేనని ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ పదేపదే చెప్పేవారు. అందుకే సాగునీటి ప్రాజెక్టులు, రసాయన ఎరువుల కర్మాగారాల ఏర్పాటుకు బలమైన పునాదులు వేశారు. దాని పర్యవసానమే నేడు ప్రపంచంలో చైనా తరవాత అధికంగా రసాయన ఎరువులను వాడుతున్న రెండో దేశంగా భారత్‌ గుర్తింపు పొందింది. రూ.15 వేలకోట్ల విత్తన వ్యాపారంతో ప్రపంచంలో భారత్‌ అయిదో స్థానంలో ఉంది. అయినా నమ్మకమైన అధిక దిగుబడినిచ్చే రకాలు, సంకర విత్తనాల సమస్య వెంటాడుతూనే ఉంది. ఈ అభివృద్ధి ద్వారా అరవై ఏళ్లలో ఆహారోత్పత్తిని నాలుగు రెట్లు పెంచి, పెరిగిన జనాభాను ఆదుకోగలిగాం. ఈ దశాబ్దంలో వివిధ కారణాల వల్ల వ్యవసాయ రంగంలో స్తబ్ధత నెలకొంది. ఇప్పటికీ దేశంలో పప్పుధాన్యాలు, వంటనూనెల లోటు పూడ్చడానికి ప్రపంచంలోని మారుమూల ప్రాంతాల నుంచి దిగుమతులు చేసుకోవాల్సి వస్తోంది. గోధుమలు, బియ్యం, సుగంధ ద్రవ్యాలు నూనె తీసిన పిప్పి, కాఫీ, టీ ఉత్పత్తులు, పాల ఉత్పత్తుల ఎగుమతుల స్థాయికి చేరుకున్నా, ముందుకు చొచ్చుకుపోయే పరిస్థితులు కనిపించడం లేదు. దీనికి కారణం, తరుగుతున్న భూసారం, సాగునీటి లభ్యతలో ఆటుపోట్లు, పంట దిగుబడుల్లో స్తబ్ధత, ఉత్పత్తుల్లో రసాయనాల అవశేషాలు. వీటిని అధిగమించి ఎగుమతులు పెంచుకోనిదే దేశ వ్యవసాయ పరిస్థితి మెరుగుపడదు.

తీరు మారాలి
సాగు భూములను సజీవ పదార్థాలుగా కాకుండా మట్టిదిబ్బలుగా పరిగణిస్తున్నాం. ఆ మట్టిలో ఉండే జీవరాశులు, అవి చేసే ఉపకారాల గురించి తెలుసు కనుకే మన పూర్వీకులు పంట చేలు సజీవంగా ఆరోగ్యంగా ఉండాలని తాపత్రయ పడేవారు. నేలలోని సేంద్రియ పదార్థం జీవరాశుల నిలయం. ఆ సేంద్రియ పదార్థం తరిగిపోకుండా భూమిలో తగినంత గాలి, తేమ ఉండే విధంగా ప్రతి పంటకు ముందు, తరవాత శ్రద్ధ తీసుకొనేవారు. ప్రస్తుతం రసాయన ఎరువులు గుమ్మరించి పైరు పెంచి దిగుబడులు పెంచుకోవడమే లక్ష్యంగా మారింది. చేలో మిగిలిపోయిన వ్యర్థాలను సద్వినియోగం చేసుకోవాలని గాని, పరిమితికి మించని రసాయన ఎరువులతో పాటు సేంద్రియ ఎరువులను కూడా పంట భూములకు అందించాలని కానీ ఆలోచించడం లేదు.వివిధ పంటల మేళవింపు లేకుండా ఒక్కో భూభాగం అంతా ఒకే పంట వేసుకోవడం, నేలలకు అనువైన పంట మార్పిడి విధానం గురించి ఆలోచించకపోవడం, అంతర సేద్యం, కలుపు నిర్మూలన, నీటి వనరుల సద్వినియోగం లాంటి అంశాలను ఆకళింపు చేసుకోకపోవడంతో దిగుబడుల్లో స్తబ్ధత ఏర్పడింది. భూమిలో సూక్ష్మజీవుల పెరుగుదలకు అవసరమైన సేంద్రియ కర్బనం లభించనిదే రసాయన ఎరువుల నుంచి పోషకాలను పైర్లు తీసుకోలేవు. పరిమితికి మించి రసాయన ఎరువులు వేసినా అవి వినియోగపడక నేలలో స్థిరీకరణ చెంది నిరుపయోగమవుతున్నాయి. మొక్కలకు నేలలో తేమ అందాలేకానీ నీటి నిల్వ అవసరం లేదని, అధికంగా నీరు పారించడం వల్ల నష్టమేకానీ ప్రయోజనం లేదని తెలుసుకోకపోవడం వల్ల నీటి వినియోగ సామర్థ్యం దెబ్బతింది. పంటలను పండించడం ఒక ఎత్తు, వాటిని అమ్మి సొమ్ము చేసుకోవడం మరొకెత్తు. ముఖ్యంగా ఉద్యాన పంటల్లో పండించిన దానిలో మూడో వంతు చెడిపోయి వృథా అవుతోంది. వీటిని కొద్దిరోజులపాటు నిల్వచేసుకునే వెసులుబాటు ఉండాలి. ప్రతి గ్రామంలో వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ కేంద్రం, మండలంలో కనీసం ఒక శీతల గిడ్డంగి అవసరం. ప్రస్తుతం పాలు, రొయ్యలు, చేపల విక్రయాలు వూపందుకుని ఉత్పత్తి లాభసాటిగా ఉండటానికి కారణం- వాటి నిల్వ సామర్థ్యం పెంపుదలకు జరిగిన కృషే. అలాగే పండ్లు, కూరగాయలు, పూల నిల్వ సామర్థ్యం పెంచగలిగితే ఉద్యాన పంటల నుంచి మంచి ఫలితాలను, రాబడులను రైతు పొందగలుగుతాడు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు సంయుక్తంగా ఈ కార్యక్రమాలు చేపట్టగలిగితే వ్యవసాయరంగం వృద్ధి చెందుతుంది.

- డాక్టర్‌ మొవ్వ రామారావు
Posted on 15-10-2016