Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

రైతు ఆక్రందన ఆగేదెన్నడు?

* వెతలు తీరే మార్గాలివీ...
తెలుగు రాష్ట్రాల్లో రైతన్నల బలవన్మరణాలు ఆగడం లేదు. జాతీయ నేర నమోదు గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం 2015లో దేశవ్యాప్తంగా 8,007 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అందులో మహారాష్ట్రలో 3,030, తెలంగాణలో 1,358, ఆంధ్రప్రదేశ్‌లో 516 మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. వివిధ రంగాల్లో గణనీయ పురోగతి సాధిస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాలు వ్యవసాయ, అనుబంధ రంగాల్లో మాత్రం వెనకబడిపోయాయి. రుణాల వూబిలో కొట్టుమిట్టాడుతున్న రైతులు తెలుగు రాష్ట్రాల్లోనే అధికం. వరసగా రెండేళ్లు కరవును ప్రకటించిన జాబితాలో తెలుగు రాష్ట్రాలున్నాయి. సులభంగా వ్యవసాయ వాణిజ్యం సాగుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ తొమ్మిదో స్థానంలో, ఆంధ్రప్రదేశ్‌ ఏడో స్థానంలో ఉన్నాయి. రైతు ఆదాయాలపరంగానూ రెండు రాష్ట్రాలు బాగా వెనకబడి ఉన్నాయి. పంటల ఉత్పత్తి ఖర్చులు ఉభయ రాష్ట్రాల్లో ఎక్కువ. ఒక మాదిరి పంటల ఉత్పాదకత ఉన్నా, నికరాదాయం తక్కువే. దేశంలో రైతుల సరాసరి రుణం రూ.46,945. ఆంధ్రప్రదేశ్‌లో అది ఏకంగా రూ.1,23,112. తెలంగాణలోనూ ఇదే పరిస్థితి ఉంది.

అడుగడుగునా కడగండ్లు
దేశవ్యాప్తంగా 52 శాతం వ్యవసాయ కుటుంబాలు అప్పుల వూబిలో ఉంటే, ఆంధ్రప్రదేశ్‌లో 93 శాతం, తెలంగాణలో 89 శాతం రైతులు రుణ వూబిలో కూరుకుపోయారు. పెరుగుతున్న పంటల సాగు ఖర్చులు, నికర లాభాల లేమి రైతులను అప్పుల వూబిలోకి నెడుతున్నాయి. ఎరువులు, విత్తనాలు, పురుగు మందుల ధరలు ఏటా 30 నుంచి 40 శాతం పెరుగుతున్నాయి. దేశంలోనే ఎక్కువ మోతాదులో ఎరువులు వాడుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఉంది. దీంతో మిగతా రాష్ట్రాల పంటలతో పోలిస్తే, ఉత్పత్తి ఖర్చులు ఎక్కువ కావడంతో ఆదాయం కళ్లజూసే పరిస్థితి లేదు. బ్యాంకుల నుంచి పంట రుణాలు రాకపోవడం, ఇచ్చినా సకాలంలో అందకపోవడంతో పెట్టుబడి కోసం రైతులు వడ్డీ వ్యాపారుల నుంచి 30 నుంచి 40 శాతం వడ్డీకి డబ్బు తెస్తున్నారు. తరవాత వడ్డీ వ్యాపారులు రైతు శ్రమఫలాన్ని తక్కువ ధరకే దక్కించుకుంటుండటంతో పరిస్థితి దారుణంగా మారుతోంది. వ్యవసాయ నష్టాలను పూడ్చుకోవడానికి కొందరు రైతులు వ్యవసాయేతర ఆదాయ వనరులపై దృష్టి పెడుతున్నారు. దేశవ్యాప్తంగా 40 శాతం రైతుల ఆదాయం వ్యవసాయేతర వనరులే. తెలంగాణాలో ఇది 73 శాతం. ఇక్కడ 85 శాతం చిన్న, సన్నకారు రైతులే ఉన్నారు. దేశంతోపాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోని చిన్న, సన్నకారు రైతుల ఆస్తులు, అప్పుల నిష్పత్తి చాలా సున్నితమైంది. వీటి మధ్య అంతరం పెరిగితే రైతు అప్పుల వూబిలో కూరుకుపోవాల్సి వస్తోంది. ఒక సీజన్‌ పంట కోల్పోతే ఈ నిష్పత్తి దెబ్బతింటోంది. 2014, 2015లలో సరిగ్గా ఇదే జరిగింది. ఇక రోజు రోజుకు కౌలు రైతుల సంఖ్య పెరుగుతోంది. కానీ, పంటల సాగుకు అవసరమైన పెట్టుబడులు వారికి అందడం లేదు. అందినకాడికి అప్పు తెచ్చి పంటల సాగులో నష్టపోతున్నారు. రైతుల ఆరోగ్య పరిరక్షణకు ఉద్దేశించిన ప్రత్యేక పథకాలను పాలకులు తీసుకురాలేదు. దేశవ్యాప్తంగా 72 శాతం మేర ఉపాధి హామీ కూలీ చెల్లింపులు ఆలస్యంగానే జరుగుతున్నాయని నమూనా సర్వే చెబుతోంది. నెలకు రైతు కుటుంబం సరాసరి ఆదాయం రూ.6,426. ఖర్చులు రూ. 6,223. అంటే నెలకు సరాసరి మిగులుతోంది కేవలం రూ. 223. వీటితో ఏ మేరకు కుటుంబ అవసరాలు తీరుతాయి? తెలంగాణ రాష్ట్రంలో 54శాతం విస్తీర్ణం దీర్ఘకాలికంగా కరవు పరిస్థితులు ఎదుర్కొంటోంది. సగానికి పైగా సాగు విస్తీర్ణం వర్షాధారమే. వర్షాధార సాగులో నికర ఆదాయాలు తక్కువ. వానలూ తక్కువైతే పెట్టిన పెట్టుబడులు నష్టపోయినట్టే! 2015లో తెలంగాణలో ఖరీఫ్‌ పంటల సాగుకు ప్రధాన నీటి వనరు అయిన వర్షపాతంలో 21 శాతం లోటు ఏర్పడింది. అంతకుముందే కరవుతో భూగర్భ జలాలు అడుగంటాయి. ఆపై విద్యుత్‌ కోతలు సమస్యకు ఆజ్యం పోశాయి. ఫలితంగా వేసిన కొద్ది పంటలు ఎండిపోయాయి. వరి సాగు విస్తీర్ణమూ పడిపోయింది. 2014లో 42 లక్షల హెక్టార్లలో వరి విస్తీర్ణం ఉంటే, 2015లో అది 30 లక్షల హెక్టార్లే. రైతు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసిన పరిణామమిది. వర్షపాత లోటుతో ఖరీఫ్‌ పంట కాలం మొదలయ్యే ఒక్క జులైలోనే అయిదు జిల్లాల్లో 12 మంది రైతులు బలవన్మరణం చెందారు. తెలంగాణాతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయరంగ స్థితిగతులు కొంత మెరుగ్గా ఉన్నాయి.
దేశంలో రైతు ఆత్మహత్యల పరంపర దశాబ్దాలుగా కొనసాగుతోంది. అయినప్పటికీ, ప్రభుత్వపరంగా వీటిని ఆపగలిగే విధానాలు, కార్యాచరణ కొరవడ్డాయి. గత 21 ఏళ్లలో దేశంలో 3.20లక్షలకు పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారన్నది అర్జున్‌ సేన్‌ గుప్తా కమిటీ పరిశీలన. ప్రత్యామ్నాయం ఉంటే 78 శాతం రైతులు వ్యవసాయం నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నట్లు జాతీయ నమూనా సర్వే గణాంకాలూ చెబుతున్నాయి. 60 శాతం రైతులు జీవన భృతి కోసం ఉపాధి హామీ పనుల మీద ఆధారపడుతున్నారన్నది నిష్ఠుర సత్యం. ఎన్‌సీఆర్‌బీ గణాంకాల ప్రకారం రోజుకు 42 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గ్రామీణ ప్రాంతాలే రైతులకు ప్రధాన ఆవాసాలు. వాటి అభివృద్ధిని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయి. కొన్ని పెద్ద సంస్థలు వ్యవసాయాన్ని పూర్తిగా నీరుగార్చినట్లయితే పరిశ్రమలకు కూలీలు చౌకగా లభిస్తారన్న అంచనాలతో ఉన్నాయి. స్వామినాథన్‌ కమిటీ- రైతులకు మేలుచేసే పలు సిఫార్సులు చేసింది. పదేళ్లు గడచినా వాటిలో ఒక్క సిఫార్సునూ ప్రభుత్వాలు అమలుచేయలేదు. ఆధునిక సాగును ప్రోత్సహించే పేరిట బహుళజాతి సంస్థలు రైతుల ఆత్మహత్యలకు మరింత ఆజ్యం పోస్తున్నాయి. రైతులు పండించిన పంట ఉత్పత్తుల ధరలు రోజు రోజుకు విపణిలో తగ్గుతుంటే- పూర్తిగా బహుళజాతి సంస్థల చేతుల్లో ఉన్న విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.
దేశంలో సాగు ప్రధానంగా వర్షాధారం. అందులో మహారాష్ట్ర, తెలంగాణ, రాయలసీమల్లో వరసగా అయిదు పంటలు వర్షాభావంతో విఫలమయ్యాయి. వాతావరణ స్థితిగతుల్ని కచ్చితంగా అంచనా వేయడానికి అంతర్జాతీయ నిపుణులతో సమగ్ర మేఘ మార్పిడి పరిజ్ఞాన సంఘాన్ని ఏర్పాటు చేయాలని 2004లోనే అబ్దుల్‌ కలామ్‌ సూచించారు. అది సూచనగానే మిగిలిపోయింది. అలాగే వలసలు తగ్గించడానికి గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ స్థాయిలో సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్న కలామ్‌ ఆలోచనకూ మన్నన దక్కడం లేదు. కేంద్ర, రాష్ట్రాలు కలిసికట్టుగా నిర్దిష్ట ప్రణాళికలు రచించి, కచ్చితంగా అమలుచేస్తేనే- దేశంలో రైతుల ఆత్మహత్యలు ఆగుతాయి. రైతులు నేలల సారాన్ని, స్థానిక వాతావరణ పరిస్థితులను బట్టి అత్యంత అనుకూలమైన పంటలనే సాగుచేయాలి. నాణ్యమైన అధిక దిగుబడి సాధిస్తూనే పంటల ఉత్పత్తి ఖర్చులు తగ్గించుకోవాలి. వైవిధ్య పంటలను సాగుకు ఎంచుకోవాలి. ఉద్యాన పంటలు, పశుపోషణ, చేపలు, పట్టుపురుగుల పెంపకంపైనా దృష్టి సారించాలి. వీటితో రైతులకు అదనపు ఆదాయం లభిస్తుంది. అవకాశమున్న ప్రతి ఉత్పత్తికి విలువల జోడింపు చేపడితే ఆదాయం, ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన వినియోగంతో ఉత్పాదకతను పెంచుకోవచ్చు. చిన్న చిన్న కమతాలు ఇందుకు అడ్డు. సహకార సాగు చక్కని పరిష్కారం. మహారాష్ట్ర ప్రభుత్వం గుంపు సాగును ప్రోత్సహిస్తోంది. 20 మంది రైతులు జట్టుగా ఏర్పడితే ట్రాక్టర్‌, టిల్లర్‌ వంటి యంత్ర పరికరాలను అరువుగా ఇస్తోంది. పంట చేతికి అందిన తరవాత లాభాల నుంచి మూల్యాన్ని తీసుకుంటోంది. ఈ ఏర్పాటువల్ల చిన్న, సన్నకారు రైతులకు భారీ యంత్రాలు అందుబాటులోకి వచ్చాయి. తరచూ ఎదురయ్యే పంట వైఫల్యాల నుంచి రైతులను ఆదుకునేందుకు పంటల బీమా చాలా అవసరం. ప్రధానమంత్రి ఫసల్‌ భీమా పథకం మేలుగా ఉన్నా, అధికారుల నిర్లక్ష్యంతో అది రైతులకు పూర్తిస్థాయిలో చేరడంలేదు. అధిక దిగుబడికి దారితీసే సాగునీటి పారుదల సౌకర్యాల కల్పన అత్యవసరమే.

ఆహార భద్రతకు ముప్పు
రైతులు వ్యవసాయంలో నష్టపోవడానికి ప్రధాన కారణం- ప్రభుత్వం నిర్ణయిస్తున్న ధరలే. ఒక్కో రాష్ట్రంలో భూముల సారం, ఉత్పత్తి కారకాల అవసరాలు వేరు. అందువల్ల పంటల సాగుకు అయ్యే పెట్టుబడి ఖర్చుల్లో వ్యత్యాసం ఉంటుంది. కానీ, దేశవ్యాప్తంగా ఒకే మద్దతు ధర నిర్ణయిస్తున్నారు. ఇటీవలి లెక్కల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో క్వింటా వరి ఉత్పత్తికి రూ.2,158 ఖర్చు అవుతోంది. ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాలో ఖర్చు ఇంతకంటే తక్కువే. కేంద్రం క్వింటాకు మద్దతు ధరగా ప్రస్తుతం రూ.1,470 ఇస్తోంది. అంటే తెలంగాణ వరి రైతులు నికరంగా రూ.688 నష్టపోవాల్సి వస్తోంది. దాదాపు అన్ని పంటల విషయంలో ఇదే పరిస్థితి ఉంది. కేంద్రం ప్రస్తుతం ప్రోత్సహిస్తున్న అపరాల వాస్తవ ఖర్చులకు, మద్దతు ధరలకు పొంతన లేకుండా పోయింది. స్వామినాథన్‌ సిఫార్సు ప్రకారమైతే వాస్తవ సాగు ఖర్చులు పోను 50శాతం లాభం ఉండేలా మద్దతు ధరలు నిర్ణయించాలి. అదీ అమలు జరగడంలేదు. ద్రవ్యోల్బణం బూచి చూపి వరి ధరలను పెంచడం లేదు. ఏటా అన్ని రాష్ట్రాల నుంచి వివిధ పంటల ఉత్పత్తి ఖర్చులను వ్యవసాయ ఖర్చులు-ధరల కమిషన్‌ సేకరిస్తుంది. ఆయా రాష్ట్రాల్లో అన్నదాతల కష్టనష్టాలను దృష్టిలో ఉంచుకుని, కేంద్రం నిర్ణయించే మద్దతు ధరలు, రైతులకయ్యే వాస్తవ వ్యయాలను సేకరించి, రాష్ట్రప్రభుత్వాలు నిర్ణయించే ధరల వ్యత్యాసాన్ని ఆయా రాష్ట్రాలే చెల్లించాలి. రాష్ట్రస్థాయిలో వ్యవసాయ ఖర్చులు-ధరల కమిషన్‌ ఏర్పాటు చేస్తే ఇంకా మేలు. మద్దతు ధరలూ మధ్యదళారులకే వెళ్తున్నాయి. పంటకోత సమయంలో దళారులే తక్కువ ధరకు కొనుగోలుచేసి, గిరాకీ సమయంలో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. ఇందుకు విరుగుడుగా నియంత్రిత విపణులను రైతులకు అందుబాటులోకి తీసుకురావాలి. కానీ, దేశంలో నలభై రెండు వేల విపణులు అవసరమైతే, ఉన్నవి ఏడు వేలేనని సీఏసీపీ చెబుతోంది. రైతు ఆదాయాలు పెరగాలంటే ముందు గ్రామీణ ప్రాంతాల్లో ఆదాయాలు పెరగాలి. అందుకు గ్రామాల్లో రోడ్లు, సాగునీరు, విద్యుత్‌, విద్యాసంస్థలు, ఆసుపత్రులు, వ్యవసాయాధారిత పరిశ్రమలు పెరగాలి. అదనపు ఆదాయ వనరులు అధికం కావాలి. వ్యవసాయ పంటలు విఫలమైతే ప్రత్యామ్నాయ వనరులు ఆదుకోవాలి. అందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు భారీగా అందుబాటులోకి రావాలి. సంస్థాగత రుణాల్లో 42 శాతం వ్యవసాయ, అనుబంధ రంగాలకు; అందులో ఏడు శాతం సన్న, చిన్నకారు రైతులకు చెల్లించాలన్న నిబంధనలను కచ్చితంగా అమలుచేయాలి. మహారాష్ట్ర తరహాలో ప్రైవేటు వడ్డీవ్యాపార వ్యతిరేక చట్టం (2008); ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కేరళ తరహాలో పంట రుణాల మాఫీ దేశమంతటా అమలుచేయాలి. దేశంలో రైతుల ఆత్మహత్యల నివారణకు వెంటనే నడుం బిగించాల్సిన సమయమిది. లేదంటే దేశ ఆహార భద్రతకు ముప్పు తప్పదు!.

Posted on 20-01-2017