Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

పారే నీటికి పక్కా లెక్క!

* సాగు బాగుకు వ్యూహం
ఏదైనా ఒక కార్యక్రమాన్ని చేపట్టినప్పుడు అది ప్రణాళికాబద్ధంగా లక్ష్యసాధన దిశగా సాగుతోందా లేదా అన్నది చూడాలి. లేనట్లయితే అందుకు కారణాలేమిటి, కార్యాచరణలో లోపాలున్నాయా, వాటిని సరిదిద్ది, సక్రమ మార్గంలో ముందడుగు వేయడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలపై దృష్టి సారించాలి. ఆలోచించి ముందుకు సాగాలి. అదే విజ్ఞుల లక్షణం. అందుకు భిన్నంగా వ్యవహరిస్తే, చేపట్టిన కార్యక్రమాల ద్వారా ఆశించిన లక్ష్యం నెరవేరదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నీటివసతి ఉన్నచోట ఫిబ్రవరి 15 తరవాత మూడోపంట వేయడానికి రైతాంగం సమాయత్తమవుతోంది. ఈ పంట నుంచి చక్కటి దిగుబడులు సాధించాలంటే అందుబాటులోగల పరిమిత నీటి వనరుల్ని ప్రణాళికబద్ధంగా వినియోగించాల్సి ఉంటుంది. అందుకోసం పకడ్బందీ వ్యూహం రూపొందించుకున్నప్పుడే సరైన ఫలితం వస్తుంది.

ప్రణాళికే కీలకం
అభివృద్ధి చెందిన ఎన్నో దేశాల్లో సాగునీటి వినియోగ సామర్థ్యం 50-60శాతం వరకు ఉండగా, భారతదేశంలో అది 30-35శాతానికి మించడం లేదు. కనీస వినియోగ సామర్థ్యాన్ని సుమారు 40-45శాతానికి పెంచుకోవడం లక్ష్యం కావాలి. దానితో 30శాతం వరకు సాగునీరు ఆదా అవుతుంది. సుమారు 30శాతం పంట భూమిని విస్తరించుకోడానికీ అవకాశం ఏర్పడుతుంది. పొలానికి కావలసిన పరిమాణంకంటే నీరెక్కువైనా, తక్కువైనా పంట ఉత్పాదకత తగ్గిపోతుంది. పంటకు వివిధ దశల్లో, అవసరమైన పరిమాణాల్లో నీటిని అందజేసినప్పుడే ఉత్పాదకత గరిష్ఠంగా లభిస్తుంది. ప్రభుత్వాధికారులు ఈ విషయాన్ని క్షేత్రస్థాయిలో రైతులకు కార్యవర్తన ప్రణాళిక ద్వారా ప్రయోగపూర్వకంగా నిరూపించి చెప్పగలిగితే, అవసరాన్ని మించి నీటిని వినియోగించేందుకు వారు ఏనాడూ ప్రయత్నించరు. సకాలంలో నదుల్లో ప్రవహించే నీటిని జలాశయాల్లో నిల్వ చేయాలి. పంట అవసరాలను బట్టి కాలువలకు విడుదల చేయాలి. క్రమబద్ధీకరించి, పారించి, కొలత ప్రకారం వివిధ డిస్ట్రిబ్యూటరీలకు విభజించాలి. నిర్ధారిత పరిమాణంలో పంట బోదెల వద్ద అందజేసి, సాగునీటిని పంట పొలాలకు మళ్లించాలి. సంఘటితమైన ఈ ప్రక్రియనే ‘కార్యవర్తన ప్రణాళిక’ అంటారు. నీటిపారుదల పథకం కింద చేర్చిన ఆయకట్టు భూమికంతటికీ సక్రమ పద్ధతిలో నీటిని పంపిణీ చేయడానికి ‘కార్యవర్తన ప్రణాళిక’ ఒక ముఖ్య సాధనం.
వివిధ పంటలకు, వివిధ దశల్లో నియమిత కాలానికి (10 లేక 15 రోజులకు) అవసరమయ్యే నీటిని లెక్కగట్టి, ప్రతి కాలువకు నీటి పంపిణీ కాల పట్టికలను నిర్ణయించాలి. వ్యవసాయ శాఖాధికారుల సహాయంతో నీటిపారుదల ఇంజినీర్లు కార్యవర్తన ప్రణాళిక తయారుచేయాలి. ఈ కాల పట్టికలను ముందుగానే ప్రకటించడం వల్ల, ప్రతి తూము వద్ద ఏ తేదీన, ఎంత పరిమాణంలో నీరందేదీ తెలుస్తుంది. దాంతో, రైతులు అవసరమైన విత్తనాలు, ఎరువులు, కూలీలను సకాలంలో సమీకరించుకొని వ్యవసాయ పనులకు సిద్ధమవుతారు. నిర్దిష్ట కాలపట్టికల ప్రకారం నీటి పంపిణీ జరగడం వల్ల, కాలువ ఎగువ భాగంలోని రైతులు తమ వాటాకు మించి ఎక్కువ నీటిని పొందడానికి ఏమాత్రం అవకాశం ఉండదు. ఒకవేళ ఎవరైనా ఎక్కువ నీటికోసం మొండిగా ప్రయత్నిస్తే, నీటి వినియోగదారుల సంఘాలు ఆ ప్రయత్నాన్ని తిప్పికొడతాయి. దానివల్ల, కాలువ ఎగువ, దిగువ, చివరి భూములకు నమ్మకంగా నీరందుతుంది.
ఏటా ఖరీఫ్‌/రబీ పంట సీజను ప్రారంభంలో జలాశయంలో ఎంత నీరు నిల్వ ఉందో, తదుపరి మరెంత నది నుంచి లభిస్తుందో అంచనా వేసి, కాలువలకు నీరు వదిలే తేదీని నిర్ణయించాలి. ప్రాజెక్టు కింద స్థిరీకరించిన మొత్తం ఆయకట్టులో సగభాగానికి నారు పోసి, దమ్ముజేసి, నాట్లు వేయడానికి ఎంత నీరు కావాలో లెక్కగడతారు. అంత నీరు జలాశయంలో ఉన్నప్పుడు సాధారణంగా కాలువలను తెరుస్తారు. ఆయకట్టు సగభాగంలో జలాశయంలోని నీటితో నాట్లు పూర్తి చేసే సమయానికి నదిలో పుష్కలంగా ప్రవాహం ఉంటుంది. జలాశయంలో ఆశించిన నీరు చేరుతుంది. మిగిలిన సగభాగానికి కావలసిన నీరందుతుందన్నది దీని వెనక ఉద్దేశం. నిరుడు పండిన పంటను గరిసెల్లో నిల్వ చేసుకొని, ఈ సంవత్సరం పంట చేతికి అందేవరకు ఉపయోగించుకున్నట్లే, ఒక సంవత్సరం జలాశయంలో చేరిన నీటిలో కొంత భాగాన్ని మిగుల్చుకొని, దాన్ని మరుసటి ఏడాది మళ్ళీ నీరు చేరేవరకు జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. అలా చేసినప్పుడే, కాలువలను నిర్ణీత తేదీన తెరవడానికి వీలవుతుంది.

ప్రయోజనకర విధానాలు
వర్షరూపంలో, సాగునీటి రూపంలో పంటభూమికి అందజేసే నీటిలో కొంతభాగం సూర్యరశ్మికి ఆవిరి అవుతుంది. మరికొంత నేలలోకి ఇంకిపోతుంది. అందులో కొద్దిభాగమే మొక్క పెరగడానికి, ఆకుల ద్వారా బహిర్గతం కావడానికి ఉపయోగపడుతుంది. ప్రతి కాలువకు విడుదల చేయాల్సిన నీటిని లెక్కకట్టడానికి, దాని కింద ఉన్న ఆయకట్టును, దానిలో వేసిన ముఖ్య పంటను పరిగణనలోకి తీసుకోవాలి. నీరు పొలంలో నిల్వ ఉన్నప్పుడు, కాలువల్లో ప్రవహించేటప్పుడు, భూమిలోకి ఇంకిపోయాక జరిగే నష్టాన్నీ లెక్కలోకి తీసుకోవాలి. ప్రతి కాలువ ప్రధాన తూముల వద్ద ఎంత నీటిని, ఎంతసేపు విడుదల చేయాలో నిర్ణయించాలి. దాని ప్రకారం పంట కాలం అంతటిలో ప్రతి 10 లేక 15 రోజులకు నీటి అవసరాలు లెక్కకట్టి, పంపిణీ కాల పట్టికలను తయారుచేయాలి. వాటి ప్రకారం కాలువలకు నీటిని విడుదల చేస్తే, పంటలకు పంపిణీలో అసమానతలకు తావుండదు.
ఇదంతా సక్రమంగా జరగాలంటే- కాలువల నిర్వాహకులకు, రైతులకు, ఆయకట్టు ప్రాంతంలోని వర్షపాత వివరాలు సాధ్యమైనంత త్వరలో అందుతుండాలి. దానికోసం పటిష్ఠమైన సమాచార-రవాణా సౌకర్యాలను, వర్షమాపక సాధనాలను ఆయకట్టు ప్రాంతమంతటా నెలకొల్పాలి. వంతులవారీగా పంట పొలాలకు సాగునీటి పంపిణీకి ఉద్దేశించిన వారబందీ విధానం బహుళ ప్రయోజనకరమైనదనడంలో సందేహం లేదు. ఈ విధానాన్ని సత్వరమే అమలుచేయడానికి, ప్రభుత్వం రైతు సంస్థలను ప్రోత్సహించాలి. ఇంజినీర్లతో ప్రతి తూము కిందనున్న ఆయకట్టు వారబందీ కాలపట్టికలను తయారు చేయించాలి. వాటిని రైతు సంస్థల ద్వారా అమలుపరచాలి. ప్రజా నీటిపారుదల వ్యవస్థ ద్వారా ఆయకట్టు అంతటికీ నమ్మకంగా, న్యాయోచితంగా నీరందించాలి. అప్పుడే- ప్రణాళిక లక్ష్యాలను సాధించి, రైతులకు అధిక ప్రయోజనం చేకూర్చవచ్చు.

Posted on 27-01-2017