Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

నైపుణ్యాల సాగు బడి

* రైతులకు శిక్షణతో లాభాలపంట
రాబోయే అయిదేళ్లలో 6.33 లక్షల రైతులకు నైపుణ్య శిక్షణ ఇచ్చి సాగు నిపుణులుగా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం సంకల్పించింది. వ్యవసాయంతోపాటు పశుపోషణ, కోళ్లు, మత్స్య సంపద, తేనెటీగల పెంపకం వంటి అనుబంధ రంగాల్లో అదనపు పని దినాలు, ఆదాయం కల్పించే యోజన ఇది. వ్యవసాయం అనాదిగా వస్తున్నా- ఆధునిక పరిజ్ఞానం, వినియోగదారుల అవసరాలు అందిపుచ్చుకొని కాలానుగుణ మార్పులతో సాగు చేపడితేనే అది గిట్టుబాటు అవుతుంది. ఎగుమతులకు అవసరమయ్యే ప్రమాణాలు, గిట్టుబాటు ధరలు పొందేందుకు కావలసిన నాణ్యత, సాగు ఖర్చులు తగ్గించే ఉపాయాలు, వినియోగదారులకు అవసరమైన ఉత్పత్తుల తయారీ వంటి విషయాల్లో నైపుణ్యాలను వారు అందిపుచ్చుకోవాల్సి ఉంది. మేలైన భవిష్యత్తు ఉన్న ఆహార శుద్ధి రంగం పూర్తిగా నైపుణ్యత మీదే ఆధారపడి ఉంటుంది. బ్రెజిల్‌, అమెరికా, చైనా లాంటి వ్యవసాయ అగ్రగామి దేశాలు గ్రామాల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, వ్యవసాయేతర మార్గాల్లో అదనపు సంపద సృష్టిస్తున్నాయి. తద్వారా రైతాంగం జీవన ప్రమాణాల్ని మెరుగుపరుస్తున్నాయి. ఆ తరహా విధానాలు మనదేశానికి ఎంతైనా అనుసరణీయం!.

పలు రాష్ట్రాల ముందడుగు
దేశంలో ఇప్పటికే ఉద్యానరంగం వేగంగా అడుగులు వేస్తోంది. ఆహార పంటలతో పోలిస్తే ఉద్యాన పంటల్లో ఉత్పాదకత ఎక్కువ. బొప్పాయి, దానిమ్మ వంటి పంటల్లో భారత్‌దే మొదటి స్థానం. వీటిని ఇబ్బడిముబ్బడిగా పండిస్తున్నా, రైతులకు లాభాల పంట దక్కడం లేదు. చైనా, ఇండొనేసియా దేశాలు విలువల జోడింపుతో గిట్టుబాటు ధర అందిస్తున్నాయి. చైనాలో 23 శాతం, ఇండొనేసియాలో 50 శాతం పండ్లను శుద్ధి చేస్తున్నారు. పరిశ్రమలకు ఉత్పత్తులను తరలించడం ద్వారా రైతులు మేలైన ధరలు పొందగలుగుతున్నారు. ఆహార ధాన్యాల పంటలతో పోలిస్తే ఉద్యాన పంటలు 80 శాతం తక్కువ నీటిని తీసుకుంటాయి. పంటల సాగు ఖర్చులు తగ్గించుకోవడంతో పాటు, పర్యావరణ సహిత సాగును మధ్యప్రదేశ్‌ ప్రోత్సహిస్తోంది. పర్యావరణ మార్పులను తట్టుకొని ఉత్పాదకత, ఆదాయాల పెంపుదలకు వీలుగా అది ప్రత్యేకంగా 1,100 గ్రామాలను ఏర్పరచింది. ఈ గ్రామాల్లో స్వల్పకాలిక రకాలతోపాటు నీటి ఎద్దడి తట్టుకునే రకాలను సాగుచేస్తున్నారు. సమగ్ర సేద్యం, పశుపోషణ, అటవీ వ్యవసాయ అంశాలను ఆయా గ్రామాల్లో సాగులో భాగంగా చేర్చారు. తద్వారా రైతులకు ఏడాది పొడవునా ఆదాయం, పని కల్పించడంతోపాటు సుస్థిర భూముల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నారు.
దేశంలో 15-35 ఏళ్ల యువతలో ఎక్కువ భాగం గ్రామాల్లో జీవిస్తున్నారు. చిన్న, సన్నకారు రైతులే కాకుండా, పెద్ద రైతులు సైతం తమ తరవాతి తరం గిట్టుబాటు కాని వ్యవసాయంలో కొనసాగడాన్ని ఇష్టపడటం లేదు. ఉపాధి కోసం గ్రామీణ యువత పట్టణాలకు వలస పోతోంది. అన్నదాతల స్థితిగతుల మెరుగుదలపై ఏర్పరచిన జాతీయ కమిషన్‌ (2006) ఈ స్థితిగతుల మార్పునకు అనేక సూచనలు చేసింది. పట్టణాలకు దీటుగా గ్రామాల్లో రోడ్లు, విద్యుత్‌, విద్య, ఆరోగ్య పరిరక్షణకు చర్యలు చేపట్టాలని కోరింది. వ్యవసాయ అనుబంధ ఆదాయాలు పొందడంపై యువతకు విశ్వవిద్యాలయాలు శిక్షణ ఇవ్వాలని సిఫార్సు చేసింది. ఆ మేరకు భారత వ్యవసాయ పరిశోధన మండలి- సేద్యంలోకి యువతను ఆకర్షించి కొనసాగించడానికి ఒక పథకం (అట్రాక్టింగ్‌ అండ్‌ రిటైనింగ్‌ యూత్‌ ఇన్‌ అగ్రికల్చర్‌- ఎ.ఆర్‌.వై.ఎ.) ప్రారంభించింది. 25 రాష్ట్రాల్లోని కృషి విజ్ఞాన కేంద్రాల(కేవీకేల) ద్వారా దీన్ని అమలు చేస్తారు. చేపలు, కోళ్లు, తేనెటీగల పెంపకం నుంచి భూసార పరీక్షల వరకు అనేక అంశాల్లో యువతకు నైపుణ్య శిక్షణ ఇవ్వనున్నారు. ప్రతి కేవీకేలో 200 నుంచి 300మందిని చేర్చుకుంటారు. బ్యాంకు రుణాలు పొందడంలో కేవీకేలు వీరికి సహాయం చేయనున్నాయి. కేరళ అయితే మధ్యలో బడి మానేసినవారు, నైపుణ్యేతర కూలీలు, ఉపాధిలేని యువత, అసంఘటిత రంగాల కార్మికులు, మహిళలతోపాటు ఉన్నత మాధ్యమిక పాఠశాల స్థాయి నుంచి విద్యార్థుల కోసం కూడా నైపుణ్యాభివృద్ధి, శిక్షణ కార్యక్రమాలు చేపడుతోంది. వివిధ రంగాల అవసరాలకు అనువైన నైపుణ్యాలను గుర్తించి, తగిన శిక్షణ ఇస్తోంది. శిక్షణ, ఆధునిక పరిజ్ఞానాలతో అద్భుతాలు ఆవిష్కరిస్తోంది. మహారాష్ట్రలోని మారుమూల గిరిజన గ్రామం ‘హరిసార్‌’. వ్యవసాయం ప్రధాన వ్యాపకంగా ఉన్న ఆ గ్రామంలో పోషకలేమితో నష్టపోయినవారెందరో. వెదురు పుష్కలంగా లభించే గ్రామమది. శిక్షణ తరవాత వెదురు కళాకృతులు, కళాత్మక చాపలు, గిన్నెలు, పూలు, బుట్టలు తయారుచేసి ప్రపంచ పోటీదారులను ఢీకొనే సామర్థ్యాన్ని ఆ గ్రామస్తులు సొంతం చేసుకున్నారు. ఈ ఉత్పత్తులను ఆన్‌లైన్‌లో సైతం విక్రయిస్తున్నారు.
వ్యవసాయంలో ఆధునికీకరణ, యాంత్రీకరణను ప్రోత్సహించేందుకు ముఖ్యంగా చిన్న, సన్నకారు రైతులకు ఆ ఫలాలు అందేలా చూసేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలి. ఈ విషయంలో మధ్యప్రదేశ్‌, పంజాబ్‌, హరియాణా ఎంతో ముందున్నాయి. అధిక ధరతో కూడిన కోత, తూర్పార యంత్రాలు, ట్రాక్టర్లను కిరాయికి ఇవ్వడానికి కేంద్రాలు పెడుతున్నారు. వాటిలో విద్యావంతులైన గ్రామీణ యువతకు ఉపాధి కల్పిస్తున్నారు. యంత్రాల వాడకం వల్ల పంటల ఉత్పాదకత పెరిగింది. రాజస్థాన్‌లో రైతులు సమూహాలుగా ఏర్పడి ‘విత్తన గ్రేడింగ్‌ యంత్రాలు’ కొనుగోలు చేస్తున్నారు. ధ్రువీకృత విత్తనోత్పత్తి, గ్రేడింగ్‌ ద్వారా వ్యవసాయేతర ఉపాధి, ఆదాయం పొందుతున్నారు. గణాంకాల పరంగా వ్యవసాయ వృద్ధిరేటులో తనదైన ప్రణాళికలతో గుజరాత్‌ ముందుంది. వైవిధ్య పంటల సాగు, అనుకూల పంటల సరళి, బలమైన సహకార సంఘాలు, హైటెక్‌ వ్యవసాయ పద్ధతులైన హరిత గృహాల్లో సాగు, టిష్యూ కల్చర్‌ మొక్కల వాడకం, వ్యవసాయ ఎగుమతి మండళ్లు, శీతల గిడ్డంగులు, ఆహార శుద్ధి కేంద్రాలు, రవాణా సౌకర్యాలతో పాటు విపణి సౌకర్యాలు ఈ విజయానికి కారణమవుతున్నాయి. అధిక విలువ కలిగిన పండ్లు, కూరగాయలు, పశుపోషణలతో పాటు పత్తి, గోధుమల సాగువల్ల ఆ రాష్ట్రంలో 2000 సంవత్సరం నుంచి వ్యవసాయ వార్షిక సరాసరి వృద్ధిరేటు 28 శాతంగా నమోదైంది. గుజరాత్‌లో 63 శాతం గ్రామీణ జనాభా ఉంది. వారి ప్రధాన వ్యాపకం వ్యవసాయమే. సులభ రీతులతో వ్యవసాయం చేపట్టి, ఉత్పత్తులను అంతర్జాతీయ విపణుల్లో విక్రయించే ప్రణాళికలను గుజరాత్‌ రచిస్తోంది. ‘సులభ వ్యవసాయ వాణిజ్య సూచీ’ ర్యాంకుల్లో మహారాష్ట్ర తరవాతి స్థానం గుజరాత్‌దే. సహకార స్ఫూర్తి విజయాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది ‘అమూల్‌’. ఈ స్ఫూర్తితో రైతు సహకార సంఘాలు, గ్రేడింగ్‌, సార్టింగ్‌, ప్రమాణీకరణ, ప్యాకేజింగ్‌ పరికరాలు, సదుపాయాలకు గుజరాత్‌ పెద్దపీట వేస్తోంది. ప్రాంతీయ అనుకూలతలనుబట్టి రైతులకు అండగా నిలబడితే ఉద్యానం, పౌల్ట్రీ, మత్స్య రంగాలకు మేలైన భవిష్యత్తు ఉంటుంది. తెలంగాణలోని అంకాపూర్‌ గ్రామం (నిజామాబాద్‌ జిల్లా) తరహాలో వినూత్న ‘విత్తన పంటల’ సాగు ఆదర్శనీయమైంది. ఇవన్నీ రైతుల నవీన ఆలోచనలను, సంఘటిత శక్తిని చాటిచెప్పేవే. గత పదేళ్లలో బ్రెజిల్‌, ఉరుగ్వే దేశాలు వరి పంటలో గణనీయ ఉత్పాదకత సాధించాయి. నిపుణులైన విస్తరణ అధికారుల సేవలు, ఆధునిక సాంకేతిక పద్ధతులు అందుకు దోహదపడ్డాయి. బ్రెజిల్‌ హెక్టారు వరి ఉత్పాదకతను 5.5 టన్నుల నుంచి 7.5 టన్నులకు, ఉరుగ్వే 6.5 టన్నుల నుంచి ఎనిమిది టన్నులకు పెంచుకోగలిగాయి.

బడ్జెట్‌ మద్దతు కీలకం
రైతులు ఉత్పత్తుల నాణ్యత పెంచుకుని అద్భుతాలు సాధించవచ్చు. పంజాబ్‌లో ప్రైవేటు సంస్థల సహకారంతో అత్యంత మేలైన బంగాళా దుంపల ఉత్పత్తికి కావలసిన శాస్త్రీయ పరిజ్ఞానాలపై రైతులకు శిక్షణ ఇస్తున్నారు. తద్వారా రైతులు ‘బంగాళాదుంపల చిప్స్‌’ తయారీకి నాణ్యమైన దుంపలు ఉత్పత్తి చేయగలుగుతున్నారు. అత్యధికంగా నీరు అవసరమయ్యే చెరకు సాగును తుంపర సేద్యం ద్వారా చేపట్టి కర్ణాటకలో ఉత్పత్తి ఖర్చులు తగ్గించుకోగలిగారు. దానివల్ల ఇతర పంటలకు నీటి లభ్యత పెరిగింది. దేశ వ్యవసాయ రంగం 14.4 కోట్ల భూమిలేని కూలీలకూ ఉపాధి కల్పిస్తోంది. ఆదాయాల్లో కోత ఈ రంగం పాలిట శాపమవుతోంది. ఆదాయ వనరులు పుష్కలంగా ఉన్న వ్యవసాయేతర రంగాల వైపు దృష్టి సారించడానికి తగినన్ని నైపుణ్యాలు వారికి లేవు. అందుకే వ్యవసాయాధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసుకోలేకపోతున్నారు.
మొత్తం ప్రపంచంలోనే భారత వ్యవసాయరంగం ఎంతో వైవిధ్యభరితమైంది. 6.38 లక్షల వ్యవసాయాధారిత గ్రామాలు మనదేశంలో ఉన్నాయి. దేశంలో 13 కోట్ల మంది రైతులు ఉన్నారు. 14 కోట్ల హెక్టార్ల సాగు భూమి ఉంది. 15 వ్యవసాయ వాతావరణ మండలాలు, మూడు వేలకు పైగా పంటలు, లక్షల కొద్దీ పంటల రకాలు అందుబాటులో ఉన్నాయి. అతి తక్కువ ఉష్ణోగ్రతలో పండే పంటల నుంచి అత్యధిక వేడి తట్టుకోగల రకాల వరకు సాగయ్యే భూములు భారత్‌ సొంతం. ప్రపంచ దేశాల్లో గల అన్ని పంటలు సాగు చేయడానికి అనువైన వాతావరణం భారత్‌లో ఉంది. దురదృష్టవశాత్తు రైతన్నకు అండదండలే కరవవుతున్నాయి. దేశానికి ఆహార భద్రత చేకూరుస్తున్నా, రైతు మాత్రం పేదగానే మిగిలిపోతున్నాడు.
రైతులకు ఆదాయాలు పెరగాలంటే బడ్జెట్‌ రూపంలో మద్దతు అవసరం. అవి సాగు ఖర్చులు తగ్గించేలా ఉండాలి. ఉత్పత్తులను వాణిజ్యస్థాయిలో అమ్ముకొనే స్థాయికి రైతును తీసుకెళ్లాలి. అందుకు కొన్ని తక్షణ చర్యలు అవసరం. చిన్న కమతాలను దృష్టిలో పెట్టుకొని, ఆధునిక యంత్రాల వినియోగానికి సహకార సాగు తరహాలో ‘భూమి లీజింగ్‌ చట్టం’ తేవాలి. ‘అమూల్‌’ తరహాలో పంటలు, ఉత్పత్తులు, ప్రాంతాలను బట్టి సంఘటితంగా సాగు, మార్కెటింగ్‌కు రైతులు పూనుకోవాలి. దేశంలోని మొత్తం పండ్లు, కూరగాయల ఉత్పత్తుల్లో రెండు శాతమే శుద్ధి అవుతోంది. వ్యవసాయ రంగాన్ని ‘ప్రాసెసింగ్‌’ రంగంతో సమ్మిళితం చేయడం ద్వారా పరిస్థితిని మెరుగుపరచవచ్చు. ‘భారత్‌లో తయారీ’ కార్యక్రమంలో ‘అగ్రి ఫుడ్‌ ప్రాసెసింగ్‌’ను చేర్చాలి. సంస్థాగత వ్యవసాయ రుణాలను రైతులకు అందించాలి. పరిశోధన ఫలితాలు, విస్తరణ వ్యవస్థలు, మార్కెటింగ్‌ ధరలు రైతులకు అందుబాటులో ఉంచేందుకు ‘గ్రామాల్లో కియోస్క్‌’లు ఏర్పాటు చేయాలి. భారత్‌ నుంచి ఎగుమతులు పెంచేందుకు మేలైన సాగు పద్ధతులు, ఆహార పదార్థాల నాణ్యతా ప్రమాణాలు, సంబంధిత ప్రయోగశాలలు, పరిశ్రమలకు వూతమివ్వాలి. రైతులకు వీటిపై నైపుణ్య శిక్షణ ఇవ్వాలి. పంటలను ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడేందుకు ఉద్దేశించిన ‘పంటల బీమా’ను అన్ని రకాల పంటలకు, కమతాలకు వర్తింపజేయాలి. రైతును వ్యవసాయ వాణిజ్యదారుగా తీర్చిదిద్దే ‘జాతీయ వ్యవసాయ మిషన్‌’ ఏర్పాటు చేయాలి. రైతేరాజు అన్న మాటకు అప్పుడే సార్థకత!

Posted on 01-02-2017