Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

సంస్కరణలతోనే రైతన్నకు సాంత్వన

గ్రామీణ భారతం రుణగ్రస్తంగానే ఉండిపోతోంది. దేశంలో 10.8కోట్ల రైతు కుటుంబాలు ఉన్నాయి. వారిలో 52శాతం అప్పుల వూబిలో కూరుకుపోయి ఉన్నారు. మొత్తం రైతుల్లో 75శాతం ఒక హెక్టారుకన్నా తక్కువ ఉన్న సన్నకారు రైతులే. ఒక్కో రైతుకు సరాసరి స్థూల పంటల సాగు విస్తీర్ణం 0.937 హెక్టార్లు. చిన్న, సన్నకారు రైతులకు సాగులో ఏ ఒక్క అంశమూ అనుకూలంగా లేదు. దేశంలో 67శాతం సాగునీరు అందుతున్న భూములకు ఆధారం భూగర్భ జలాలే. ఈ నీటిని రైతు సొంతంగా తోడుకోవాల్సి రావడంతో పెట్టుబడి ఖర్చులు పెరుగుతున్నాయి. అందుకోసం సంస్థాగతేతర రుణాలపై ఆధారపడటంతో పరిస్థితి మరింత దారుణమవుతుంది. రైతులు తీసుకొంటున్న రుణాల్లో 40శాతం సంస్థాగతం కావు.

ఆదుకోని మద్దతు ధరలు

రైతులు సాగులో పెట్టే పెట్టుబడి ఖర్చులు తిరిగి వచ్చేలా వ్యవసాయం ఉండటానికి ప్రభుత్వం కనీస మద్దతు ధరలు ప్రకటిస్తుంది. అయితే, 50శాతం రైతులకైనా అవి అందడం లేదు. కనీస మద్దతు ధరల్లో ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్న వరి ధాన్యంలోనూ 32శాతమే మద్దతు ధరకు అమ్ముడవుతోంది. 13.5శాతం ధాన్యానికే సేకరణ ధరలు లభించాయి. ప్రకృతి వైపరీత్యాలు, అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు సంభవించినప్పుడు తమను ఆదుకునే పంటల బీమా పథకాల గురించి చాలామంది రైతులకు కనీస అవగాహన ఉండటం లేదు. 95శాతం వరి, గోధుమ, 99శాతం చెరకు రైతులు పంటల బీమా జోలికే వెళ్లడం లేదు. వ్యవసాయంలో చైనా సాధిస్తున్న విజయానికి కారణం- ఆధునిక సాగు వివరాలు అక్కడి రైతులకు అందుబాటులో ఉండటం! భారత్‌లో అలాంటి పరిస్థితి లేదు. ఇక్కడ రైతాంగానికి అందుతున్న వ్యవసాయ విస్తరణ సేవలు చాలా తక్కువ. 59శాతం రైతులకు ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల నుంచి విస్తరణ సేవలు అందడంలేదు. మొత్తంగా దేశంలో సాగుదారుల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రత్యామ్నాయ మార్గాలుంటే 42శాతం రైతులు వ్యవసాయం నుంచి తప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రతి రోజు రెండు వేలమంది రైతులు వ్యవసాయాన్ని వదిలేస్తున్నారు. జీవనోపాధి కోసం పట్టణాలకు వలసపోతున్నారు. వ్యవసాయానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని చెబుతున్న పాలకులు రైతు ఆదాయం పెంచడానికి మెరుగైన మార్గాలు అన్వేషించాలి. కనీస మద్దతుధరలు ఇవ్వాలి. మార్కెటింగ్‌ చట్టాల్లో సవరణలు చేయాలి. ఉత్పాదకత పెంచడంతోపాటు, వ్యవసాయేతర ఆదాయ మార్గాలను రైతులకు పరిచయం చేయాలి. అందుకు ప్రభుత్వ విధానాలే కీలకం.

చిన్న పాల ఉత్పత్తిదారుల పెద్ద విజయానికి చిరునామా అయిన 'పాల విప్లవం' అందరికీ ఆదర్శప్రాయం. 1970లో 'ఆపరేషన్‌ ఫ్లడ్‌' పేరిట మొదలైన చిన్నపాటి పాల ఉత్పత్తిదారుల సహకార సంఘాలు 1996 నాటికి తక్కువ ధరతో భారతీయులకు పాలు అందించి, లాభాల బాట పట్టింది. భారత్‌ను ప్రపంచంలో అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా నిలబెట్టింది. తమ ఉత్పత్తులు అమ్ముకోవడానికి సహకార సంఘాలను రైతులు వినియోగించుకోవాలి. 'ఒప్పంద సాగు' కూడా చిన్న, సన్నకారు రైతులు నికర లాభాలు పండించేదే. కొన్ని ప్రైవేటు సంస్థలూ కోళ్ల పరిశ్రమలో విజయవంతంగా ముందుకెళుతున్నాయి. మేలైన సాంకేతిక పరిజ్ఞానం, ఉత్పత్తి కారకాలను అందిస్తూ ఉత్పత్తిదారులను ఈ సంస్థలు విపణికి అనుసంధానం చేస్తున్నాయి. ముందస్తు ఒప్పందంవల్ల రైతులు అధిక ఉత్పత్తి పొందడంతోపాటు నికర లాభాలు ఆర్జిస్తున్నారు. తమ లక్ష్యాలకు అనుగుణంగా ఉత్పత్తుల సరఫరాతో ఆయా సంస్థలూ లాభాల బాటలో నడుస్తున్నాయి. ఈ తరహాలోనే చిల్లర మార్కెట్లూ రైతులతో ముందస్తు ఒప్పందాలతో 'కంట్రాక్టు వ్యవసాయం' ద్వారా కూరగాయలు, పండ్ల సాగు చేపట్టి, మార్కెటింగ్‌ వ్యూహాల ద్వారా విజయపథంలో నడుస్తున్నాయి.

పాల ఉత్పత్తుల్లో 90శాతం; కూరగాయల్లో 70నుంచి 90శాతం, కోళ్ల పరిశ్రమలో 60శాతం రవాణా ఖర్చులు ఒప్పంద వ్యవసాయం వల్ల తగ్గాయి. అధునాతన మార్కెట్లకు చిన్న, సన్నకారు రైతుల ఉత్పత్తులను చేరవేయడంలో ఒప్పంద వ్యవసాయం మేలైన మార్గంగా ఎంచుకోవచ్చు. ఇది దేశంలో రైతుల వ్యవసాయేతర ఆదాయం పెంచడంలో కీలకం కానుంది. కోత అనంతర చర్యలు, ఉప ఉత్పత్తులకు విలువల జోడింపు, క్షేత్రాల్లో కోత అనంతరం మార్కెట్లకు తరలించే లోపు ధాన్యపు గింజల్లో అయిదు నుంచి 10 శాతం; నూనె గింజలు, అపరాల్లో 20నుంచి 30శాతం; పండ్లు, కూరగాయల్లో 30నుంచి 50శాతం నష్టం సంభవిస్తుంది. వ్యవసాయ ఉత్పత్తుల శుద్ధి(అగ్రి ప్రాసెసింగ్‌), విలువల జోడింపు ద్వారా ఈ నష్టాలను తగ్గించడంతోపాటు అదనపు ఆదాయమూ సమకూరుతుంది. ఉపాధి లభిస్తుంది. ఉదాహరణకు, వరిలో మేలైన కోత పద్ధతులు, ఉడకబెట్టి దంపుడు విధానం(పారా బాయిలింగ్‌) ద్వారా 10శాతం మేర బియ్యం ఉత్పత్తి పెంచుకోవచ్చు. మహారాష్ట్రలో పండ్ల రైతులు క్షేత్రస్థాయిలో ఉత్పత్తుల శుద్ధి ద్వారా అధికాదాయం పొందుతున్నారు. ద్రాక్ష పండ్ల శుద్ధితో కిస్మిస్‌ చేయడం, అత్తి పండ్లు ఎండబెట్టడం, మామిడి తాండ్ర తయారీతో మూడింతల ఆదాయం సమకూరుతోంది. ఉపాధి అవకాశాలు తక్కువగా ఉన్న గ్రామాల్లో సమూహాలు(క్లస్టర్లు)గా చేసి, ప్రభుత్వాలు తమ ఆధ్వర్యంలో అగ్రి ప్రాసెసింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేయాలి. దేశంలో ఉత్పత్తి అవుతున్న పండ్లు, కూరగాయల్లో రెండు శాతమే మనదేశంలో ఉత్పత్తుల శుద్ధి చేపడుతున్నారు. చైనాలో అది 23శాతం, ఫిలిప్పీన్స్‌లో 78శాతం, మలేసియాలో 83శాతంగా ఉంది.

కాబట్టి, భారత్‌లో ఆహార ఉత్పత్తుల శుద్ధి రంగానికి అపార అవకాశాలున్నాయి. భారతదేశంలో 67శాతం జనాభా గ్రామాల్లోనే ఉంది. గ్రామాల్లో 95శాతం ప్రజలకు వ్యవసాయం, అనుబంధ రంగాలే ప్రధాన ఆదాయవనరులు. అయితే, వ్యవసాయేతర ఆదాయం 44శాతమే ఉంది. రైతుకు వ్యవసాయేతర ఆదాయం పెంచగలగాలి. అందుకు అధిక గ్రామీణ జనాభా ఉన్న చైనా, బ్రెజిల్‌ దేశాలు తీసుకుంటున్న చర్యల్ని భారత్‌ ఆదర్శంగా తీసుకోవాలి. ఆ దేశాలు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాయి. సాగునీటి పారుదల, విద్యుత్‌, రోడ్లు, గిడ్డంగులు నిర్మించాయి. పంటల ఉత్పాదకత పెంచాయి. ఫలితంగా గడచిన రెండు దశాబ్దాల్లో చైనాలో వ్యవసాయ పరిశోధనలు, విస్తరణపై ప్రభుత్వ పెట్టుబడులు రెండింతలయ్యాయి. అదే బ్రెజిల్‌లో 2008-2011 మధ్యకాలంలో 20శాతం మేర వృద్ధి నమోదైంది. గ్రామీణ మార్కెట్లపై నియంత్రణలు తొలగించడం, వ్యవసాయ ఉత్పత్తుల్లో వికేంద్రీకరణ వంటి సంస్కరణలు చైనాలో ఆర్థిక పుష్టికి వూతమిచ్చాయి. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ విస్తరణ వ్యవస్థలు, ప్రభుత్వరంగ సంస్థల్ని బలోపేతం చేయడం; నేల, నీటిని శాస్త్రీయంగా, ఆధునిక పద్ధతుల్లో వాడటం ద్వారా ప్రతి అంగుళం భూమిలో, ప్రతి నీటిబొట్టుకు అధిక దిగుబడి సాధిస్తోంది చైనా. జీవ సాంకేతిక శాస్త్రాన్ని వ్యవసాయానికి అన్వయించి ప్రపంచంలోనే అత్యధిక దిగుబడులు సాధిస్తోంది. ఇలాంటి బహుముఖ వ్యూహాలతో గ్రామీణ రంగాన్ని బలోపేతం చేయటంవల్లే చైనా పాలకులు తమ దేశంలో పేదరికాన్ని మూడు శాతం దిగువకు తీసుకురాగలిగారు.

అన్నదాత చొరవే కీలకం

మహారాష్ట్రలో సంయుక్త పత్తిసాగు, రైతులకు నికర లాభాలనిస్తోంది. ప్రభుత్వ పర్యవేక్షణలో రైతుల్ని బృందాలుగా విడదీసి, పత్తిసాగును ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వం మధ్యవర్తిగా జౌళి మిల్లులతో రైతు బృందాలు ఒప్పందాలు కుదుర్చుకుంటాయి. మహారాష్ట్రలో పత్తి విపణి అవకాశాలు అంతగాలేని ఆరు జిల్లాల్లో 'సంయుక్త పత్తిసాగు అంగీకారం ఒప్పందం' కింద 7,304మంది రైతులు 12,500హెక్టార్లలో పత్తిసాగు చేస్తున్నారు. ఏడు జౌళి మిల్లులు సహా 18 ఇతర మిల్లులకు లాభసాటి ధరలతో పత్తి సరఫరా చేస్తున్నారు. అవకాశం ఉన్న ప్రతిచోటా మహారాష్ట్ర ప్రభుత్వం పండ్ల తోటలు నాటుతోంది. తోటలకు కావలసిన భూముల లీజు, నీటినిర్వహణ సౌకర్యాలు, మొక్కలకు అయ్యే ఖర్చును ప్రభుత్వ పథకాల నుంచి భరిస్తోంది మొక్కలు పండ్లు ఇవ్వడం మొదలుపెడితే, అప్పటినుంచి కూలీలకు సొమ్ము ఆ తోటల నుంచి వచ్చిన ఆదాయం ద్వారా అందజేయాలి. అప్పటివరకు కూలీ ఖర్చు వివిధ పథకాల ద్వారా ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ పథకం అమలువల్ల గిరిజన ప్రాంతాల్లో వలసలు తగ్గాయి. పాఠశాలకు వెళ్లే పిల్లల హాజరు ఎక్కువైంది. కుటుంబాలకు పోషకాహారం అందుబాటు అధికమైందని గణాంకాలు చెబుతున్నాయి. రైతు కుటుంబాలకు అండగా కర్ణాటక ప్రభుత్వం 'యశస్విని ఆరోగ్య పరిరక్షణ పథకం' అమలు చేస్తోంది. ఇందులో రైతు కుటుంబం సాలీనా రూ.120 ప్రీమియం చెల్లిస్తే అన్నిరకాల సాధారణ వైద్యం, శస్త్రచికిత్సలు ఉచితంగా పొందవచ్చు. వివిధ సహకార సంఘాలు వీటిని సమన్వయం చేస్తున్నాయి.

ఈ పథకాన్ని అన్ని జిల్లాల్లో ప్రవేశపెట్టేందుకు కర్ణాటక ప్రణాళికలు రచిస్తోంది. సూటి రకాల్లో మేలైన విత్తనాల అందుబాటు పెంచేందుకు అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లో ప్రవేశపెట్టిన 'గ్రామీణ విత్తనోత్పత్తి పథకం' అన్ని పంటలకు విస్తరింపజేయాలి. ఇటీవల తెలంగాణలో వర్షాభావ పరిస్థితితో ఆరు జిల్లాల్లో పంటలు దెబ్బతిన్నాయి. రైతులను ఆదుకునేందుకు 'ఇన్‌పుట్‌ సబ్సిడీ' వంటి చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరలు రైతులకు అందనప్పుడు తన రాష్ట్ర రైతులకు ఆ ధరలు దక్కడం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన 'మార్కెట్‌ జోక్యపు నిధి' విధానం అన్ని రాష్ట్రాలు ఆచరించదగినది. వ్యవసాయానికి ప్రాణాధారమైన 'సాగునీటి' రంగ విస్తరణకు పాలకులు ఇకపై అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రస్తుత నీటివనరుల వాడుక సామర్థ్యం 40శాతమే. ప్రతి నీటిబొట్టుకు అధిక దిగుబడి సాధించేలా వ్యవసాయ పరిజ్ఞానాన్ని రైతులకు అందించాలి. 'పాడి-పంట-ఉద్యానం' సమ్మిళితంతో కూడిన సమగ్ర వ్యవసాయాభివృద్ధికి ప్రణాళికలు రచించాలి. దేశంలో మూడింట రెండొంతులు ఉన్న వర్షాధార ప్రాంతాల్లో సాగుకు ప్రత్యేక రకాలు, సాగు పద్ధతులు, పరిశోధనలు ముమ్మరం చేయాలి. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే వంగడాలను రూపొందించి అందించాలి. 26.4కోట్ల ఆహారధాన్యాలు; 27కోట్ల టన్నులకుపైగా ఉద్యాన ఉత్పత్తులతో ప్రపంచంలోనే భారత్‌ పెద్ద ఉత్పత్తిదారుగా ఉంది. దేశానికి అంతటి ప్రతిష్ఠ కల్పిస్తున్న రైతుకు లభిస్తున్న సగటు నెలసరి ఆదాయం రూ.6,426 మాత్రమే. కాబట్టి, ప్రభుత్వం రచించే ఏ విధానమైనా రైతు ఆదాయాన్ని పెంచేదిగా ఉండాలి!

(రచయిత - డాక్టర్ పిడిగెం సైదయ్య)
(రచయిత- శాస్త్రవేత్త, ఉద్యాన విశ్వవిద్యాలయం)
Posted on 02-01-2015