Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

సేద్యంపైనా ట్రంప్‌ ‘పిచ్చి’కారీ?

* ప్రపంచ వ్యవసాయరంగంపై దుష్ప్రభావం
నేడు ప్రపంచంలో అత్యధికంగా వ్యవసాయ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్న దేశం అమెరికానే. 2016లో అమెరికా వ్యవసాయ ఎగుమతుల విలువ 12,500 కోట్ల డాలర్లకు (దాదాపు ఎనిమిది లక్షలకోట్ల రూపాయలకు) పైనే ఉంది. ఈ ఎగుమతులు ప్రపంచ ఆహార భద్రతకు ఎంతో దోహదం చేస్తున్నాయి. అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వ్యవసాయ విధానాలను కూడా తిరగరాస్తే భారత్‌ సహా అనేక వర్ధమాన దేశాల్లో పంటల ధరలపై ప్రతికూల ప్రభావం పడుతుంది. అమెరికన్‌ రైతులతోపాటు, కార్పొరేట్‌ వ్యవసాయ క్షేత్రాల లాభాలూ దెబ్బతింటాయి. ట్రంప్‌ వ్యవసాయ రంగం గురించి స్పష్టమైన విధానాలను ప్రకటించకపోయినా, ఆయన తొలి నూరు రోజుల పాలనలో చేపట్టే కార్యాచరణ ప్రణాళికలోని ప్రతి అంశమూ ఏదో ఒక రూపంలో వ్యవసాయాన్ని ప్రభావితం చేస్తుంది. ఆ ప్రభావం భారత్‌పై కొంత ప్రతికూలంగా ఉండవచ్చు.

అమెరికాకూ నష్టమే...
విశాల పసిఫిక్‌ భాగస్వామ్య (టీపీపీ) నుంచి వైదొలగుతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన ట్రంప్‌, ఉత్తర అమెరికా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని (నాప్టా) రద్దు చేయడానికీ పావులు కదుపుతున్నారు. 22 ఏళ్ల క్రితం అమెరికా, కెనడా, మెక్సికోల మధ్య నాప్టా ఒప్పందం కుదిరినప్పటి నుంచి ఈ మూడు దేశాల మధ్య వస్తుసేవలు, పెట్టుబడుల ప్రవాహం పెరిగిపోయింది. సరకుల ఉత్పత్తి, పంపిణీ గొలుసులు విస్తరించాయి. అమెరికా నుంచి మెక్సికోకు మొక్కజొన్న, సోయా, పంది మాంసం ఎగుమతులు ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయాయి. మెక్సికోలో ఎన్నో పందుల ఫారాలు, పంది మాంసం కర్మాగారాలు ఆవిర్భవించగా, వాటిలోకి విదేశీ పెట్టుబడులు వరదలా వచ్చిపడ్డాయి. దీనివల్ల లక్షలాది మెక్సికన్‌ రైతులు భూములు కోల్పోవడంతో జీవనోపాధి కోసం అమెరికా, మెక్సికో దేశాల్లోని నగరాలు, పట్టణాలకు వలసవెళ్లక తప్పడం లేదు. అమెరికా నుంచి ఆహారం, పాలు, మాంస ఉత్పత్తులు చౌకగా వచ్చిపడుతున్నాయి. వీటిని భుజించిన మెక్సికోవాసులకు ఆరోగ్య సమస్యలు పట్టుకొంటున్నాయి. వారిలో స్థూలకాయుల సంఖ్య పెరిగిపోతోంది. ఈ పరిణామాలవల్ల అమెరికా రైతులకూ ఏమీ ఒరగడం లేదు. ‘నాప్టా’ వల్ల గడచిన రెండు దశాబ్దాల్లో వ్యవసాయ రంగంపై కార్పొరేట్ల పట్టు మరింత బిగుసుకుంది. తమ ఉత్పత్తి ప్రక్రియలను ప్రపంచంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా బదిలీ చేసుకునే సౌలభ్యం వ్యవసాయ కంపెనీలకు ఉంది. సుంకాలు, ఆహార భద్రత, మేధోపరమైన హక్కులు, పెట్టుబడులకు సంబంధించిన వాణిజ్య ఒప్పందాలు వాటికి ఆ వెసులుబాటును అందిస్తున్నాయి. దీనివల్ల కంపెనీలు బాగుపడితే రైతులు నష్టపోతున్నారు. అమెరికా వ్యవసాయం కార్పొరేటీకరణకు లోనైనందున ఆదాయ అసమానతలు, పర్యావరణ క్షయం పెచ్చరిల్లాయి. కార్పొరేటీకరణ వల్ల ప్రజలకు ఆరోగ్యకరమైన ఆహారాలూ అందడం లేదు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థలూ పటిష్ఠం కాలేదు. ఏదిఏమైనా నాప్టాను ట్రంప్‌ రద్దు చేస్తే, అమెరికన్‌ కంపెనీలతోపాటు రైతులూ నష్టపోతారు. నాప్టాను రద్దు చేయకుండా సవరించే అవకాశం ఉంది.
మెక్సికో నుంచి అక్రమంగా వలస వచ్చిన కూలీలే అమెరికా వ్యవసాయానికి, పాడి పరిశ్రమకు ఆధారం. దాదాపు 1.25 లక్షల మెక్సికన్‌ కార్మికులు పండ్ల తోటల్లో, కూరగాయలు, ప్రత్యేక పంటల పొలాల్లో పనిచేస్తున్నారు. అమెరికా పాడి పరిశ్రమ కార్మికుల్లో సగంమందికి పైగా వలసదారులే. వీరిని వెళ్లగొడితే అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఏటా 3,200 కోట్ల డాలర్ల నష్టం సంభవిస్తుంది. అమెరికా రైతులకు కలిగే నష్టాన్ని ట్రంప్‌ ఎలా భర్తీ చేస్తారో చూడాల్సి ఉంది. లేదంటే ప్రపంచ విపణిలో అమెరికా వ్యవసాయోత్పత్తులు మహా ఖరీదైనవిగా మారతాయి. ట్రంప్‌ ఒకవేళ తమ రైతులకు సబ్సిడీలు ఇస్తే, ఇతర దేశాలూ అదే పనిచేయవచ్చు. ఇది చివరకు వాణిజ్య యుద్ధానికి దారితీసే ప్రమాదం ఉంది. ట్రంప్‌ వైఖరి మారకపోతే రేపు ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)లో కొత్త సమీకరణలకు తెరలేవవచ్చు. వ్యవసాయోత్పత్తుల ఎగుమతిలో అగ్రగాములైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌, కెనడా, బ్రెజిల్‌, ఫ్రాన్స్‌ వంటి దేశాలకు నాయకత్వం వహించే అవకాశం అమెరికాకు ఇక ఉండకపోవచ్చు. అంటే డబ్ల్యూటీఓపై అమెరికా పట్టు సడలుతుందన్న మాట. ఇది భారత్‌కు సానుకూలించే అంశమే. రూ.2,500 కోట్ల విలువైన కోడి మాంసం ఉత్పత్తులను ఎగుమతి చేయడానికి భారతీయ విపణిని తెరవాలని గత ఏడాది అమెరికా డబ్ల్యూటీఓలో గట్టిగా వాదించి, కేసు గెలిచింది. అప్పట్లో చాలా దేశాలు అమెరికాకు వత్తాసు పలికాయి. ట్రంప్‌ అధ్యక్ష పదవి చేపట్టగానే టీపీపీని రద్దు చేయడంతో పాత సమీకరణలు మారే అవకాశముంది. అమెరికా ఇతర దేశాలకు తన వ్యవసాయోత్పత్తులను ఎగుమతి చేసుకోవడం అంత తేలిక కాకపోవచ్చు. అమెరికా నుంచి బోయింగ్‌ విమానాలతోపాటు పత్తి, గోధుమ, బీన్స్‌లనూ చైనా కొంటోంది. ట్రంప్‌ హయాములో డాలర్‌ బలపడితే అమెరికన్‌ ఉత్పత్తులు ఖరీదై ఇతర దేశాలు కొనలేని పరిస్థితి ఏర్పడుతుంది. డాలర్‌ విలువ పెరిగితే భారత్‌కు, ముఖ్యంగా ఐటీ ఎగుమతులకు లాభమే కానీ ఆస్ట్రేలియా, బ్రెజిల్‌, కొన్ని ఐరోపా దేశాల వ్యవసాయోత్పత్తులు చవకై బాగా లబ్ధి పొందుతాయి. చైనా తన కరెన్సీ విలువను ఉద్దేశపూర్వకంగా తగ్గిస్తోందని ట్రంప్‌ ప్రభుత్వం ఆరోపిస్తోంది. మరోవైపు డాలర్‌ విలువ పెరిగినట్లయితే అమెరికన్‌ వ్యవసాయ కంపెనీల ఎగుమతులు దెబ్బతింటాయి. ఆ దేశంలో వ్యవసాయం బడా కంపెనీల గుప్పిట్లో ఉంటుందని గుర్తుంచుకోవాలి. ట్రంప్‌ ప్రభుత్వ చర్యలు తమకు నష్టం కలిగిస్తే అవి వూరుకోవు. అమెరికాలో ఈ ఏడాది పంటలు విరగపండినా, వాటిని స్వదేశీ, విదేశీ విపణులకు చేరవేయాలంటే పటిష్ఠమైన మౌలిక వసతులు అవసరం. కానీ, అమెరికన్‌ రహదారులు, రైల్వేలు, వంతెనలు, జల మార్గాలు క్షీణించడం వ్యవసాయ రంగానికి పెద్ద ఆటంకంగా ఉంది. వ్యవసాయంలో వాడే ఎరువులు, క్రిమినాశనుల వల్ల పర్యావరణం కలుషితమవుతోంది. దీన్ని నియంత్రించడానికి పట్టుదలగా కృషి చేస్తున్న పర్యావరణ రక్షణ సంస్థను నీరుగారుస్తానని ట్రంప్‌ హామీ ఇచ్చినందువల్లే గ్రామీణ అమెరికన్లు ఆయనకు ఓట్లు వేశారు. కానీ, ట్రంప్‌ హామీని నిలబెట్టుకోవడం అంత తేలిక కాదు. జీవ ఇంధనమైన ఎథనాల్‌ను ప్రోత్సహిస్తానని ట్రంప్‌ ఎన్నికల ప్రచారంలో మాట ఇచ్చినా, ఆయన బృందంలో దీనికి అనుకూలురు, ప్రతికూలురు ఉన్నారు. పైగా పారిస్‌ వాతావరణ ఒప్పందాన్ని ట్రంప్‌ వ్యతిరేకిస్తున్నందున జీవ, పునరుత్పాదక ఇంధనాలను ఆయన ప్రభుత్వం ఏ మేరకు ప్రోత్సహిస్తుందో చెప్పలేం. ట్రంప్‌ అమెరికాకు లాభదాయకమైన వాణిజ్య ఒప్పందాలను కుదుర్చుకోవడం ద్వారా వ్యవసాయ ఎగుమతులు వృద్ధి చేస్తారనే ఆశతో అమెరికన్‌ గ్రామీణ ఓటర్లు ఆయనకు మద్దతు ఇచ్చారు. కానీ, వారి ఆశ ఎంతవరకు నెరవేరుతుందో చెప్పలేకున్నాం. వ్యవసాయం నుంచి లభించే ప్రతి డాలరు ఆదాయంలో 20 సెంట్లు ఎగుమతుల ద్వారానే లభిస్తోంది. ట్రంప్‌ ప్రభుత్వం స్వీయ వాణిజ్య రక్షణ విధానాన్ని అనుసరించడంతో ఇతర దేశాలూ అదే బాట పట్టనున్నాయి. దీనివల్ల అమెరికన్‌ ఎగుమతులు, రైతులు, కార్పొరేట్ల వ్యవసాయాదాయాలూ తగ్గిపోతాయి.

వాగ్దానాలు తెచ్చిన తంటా
ఎన్నికల ప్రచారంలో ట్రంప్‌ వ్యవసాయ రంగానికి బోలెడు వాగ్దానాలు చేశారు. సేద్యంపై అతి నియంత్రణలను, ఎస్టేట్‌ పన్నును ఎత్తివేస్తానని, మొక్కజొన్న నుంచి తీసే ఎథనాల్‌ ఉత్పత్తిని ప్రోత్సహిస్తానని చెప్పుకొచ్చారు. అమెరికా జలాల స్వచ్ఛతను కాపాడటానికి పర్యావరణ రక్షణ సంస్థ విధించిన కఠిన నిబంధనలను తొలగిస్తానని భరోసా ఇచ్చారు. 2014 నాటి వ్యవసాయ చట్టంలోని కొన్ని అంశాలను పత్తి, పాడి, ఆహార ధాన్య రైతులు వ్యతిరేకించారు. వాటిని సరిచేస్తానని ట్రంప్‌ హామీ ఇచ్చారు. ఈ వేడిలో ఆయన ఇతర ప్రతిపాదనలను రైతులు, వ్యవసాయ కంపెనీలు పట్టించుకోలేదు. తీరా ఇప్పుడు మెక్సికన్‌ వలస కార్మికులను తిప్పిపంపేస్తానని ట్రంప్‌ భీష్మించడం వల్ల వ్యవసాయ రంగం నష్టపోతుందని గ్రామీణులు గ్రహిస్తున్నారు. వ్యవసాయ ఉత్పత్తి-సరఫరా గొలుసును పటిష్ఠపరచడానికి మౌలిక వసతుల వృద్ధిపై పెట్టుబడులు పెడతానని, పంటల రక్షణ, ఆహార భద్రతకు ప్రాధాన్యమిస్తానని ట్రంప్‌ చెప్పడం బాగానే ఉంది కానీ చైనా, మెక్సికోలను దూరం చేసుకోవడం మాత్రం అమెరికన్‌ వ్యవసాయానికి తీరని దెబ్బగా పరిణమించనుంది. అమెరికా సోయా ఎగుమతులకు చైనా, మెక్సికోలే అతిపెద్ద మార్కెట్లు. ట్రంప్‌ తమ పట్ల అనుసరిస్తున్న విధానాలు ఆ రెండు దేశాలకు ఏ మాత్రం రుచించడం లేదు. దీనితో అమెరికా వేరే విపణులను వెతుక్కోవాల్సి వస్తుంది. అది అనుకున్నంత తేలికకాకపోవడంతో అమెరికా సోయా పంటకు గిరాకీ పడిపోయే ప్రమాదం ఉంది. దీనివల్ల పోటీదారులు పుంజుకొంటారు. ట్రంప్‌ ప్రభుత్వం అంతర్జాతీయ వాణిజ్యానికి అడ్డుగోడలు కడితే భారతదేశమూ నష్టపోతుంది. 2015లో భారతదేశం నుంచి అమెరికాకు దిగుమతులకన్నా ఎగుమతులే ఎక్కువ జరిగాయి. ఈ విధంగా ముంచుకొస్తున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కొంటూ, కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి భారతదేశం వ్యూహరచన చేయాలి. మన రైతాంగాన్ని బాగా ప్రోత్సహించాలి. డబ్ల్యూటీఓ నిబంధనలకు అనుగుణంగా రైతులు తమ పంటల నాణ్యత, దిగుబడులను పెంచుకోవడానికి తోడ్పడాలి. భూసార పరీక్షలు, విత్తన శుద్ధి, నాణ్యమైన విత్తనాల ఎంపిక, సస్యరక్షణ, మార్కెట్‌కు అనువైన గ్రేడింగ్‌, శీతల గిడ్డంగులు, రవాణా సౌకర్యాలను విరివిగా అందుబాటులోకి తీసుకురావాలి. ప్రపంచ విపణిలో గిరాకీ ఉండే పంటలను ఉత్పత్తి చేసి ఎగుమతి చేయాలి. ఈ దిశగా ఇప్పటికే దేశంలో కొన్ని ప్రాంతాల్లో చేపట్టిన ప్రయోగాలు విజయవంతమయ్యాయి. ఉదాహరణకు కర్ణాటకలోని బాగల్‌కోట్‌ రైతులు సేంద్రియ బెల్లం తయారుచేసి రెట్టింపు ధరలపై రష్యాకు అమ్ముకోగలిగారు. ఇటువంటి అవకాశాలను అందిపుచ్చుకొనే విధంగా రైతులకు అండదండలివ్వాలి. రాగల సంవత్సరాల్లో ప్రపంచ విపణిలో కొంత అనిశ్చితి నెలకొనబోతోంది. ఈ పరిస్థితికి జంకకుండా సమయస్ఫూర్తితో ముందడుగు వేస్తూ కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవాలి.

భారత-అమెరికాల మధ్య వాణిజ్యసరళి
* 2014-15 సంవత్సరంలో భారత్‌ నుంచి అమెరికాకు ఎగుమతి అయిన వ్యవసాయోత్పత్తుల విలువ 429.3కోట్ల డాలర్లు. ఎగుమతి అయిన ఉత్పత్తుల్లో బియ్యం, జీడిపప్పు, రొయ్యలు, తేనె, మిరియాలు, సోయాబీన్‌ ప్రధానమైనవి.
* అదే ఏడాది అమెరికా నుంచి భారత్‌ దిగుమతి చేసుకున్న వ్యవసాయ ఉత్పత్తుల విలువ 104.2 కోట్ల డాలర్లు. దిగుమతి అయిన ఉత్పత్తుల్లో బఠాణీలు, పప్పులు, బాదంపప్పు, తాజా ఆపిల్స్‌, ఆహార ముడి పత్తి ముఖ్యమైనవి.
* ఆలు, కాప్సికం, కొబ్బరి, ద్రాక్ష, బార్లీ, ఆవాలు, చక్కెర వంటివాటిని అమెరికా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. మనదేశంలో అధికంగా ఉత్పత్తి అవుతున్న వీటిని అమెరికాకు ఎగుమతి చేయగల అవకాశాలను అందిపుచ్చుకోవాలి.

Posted on 15-02-2017