Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

రొక్కం దక్కితేనే దుఃఖం తీరేది!

* రైతుకు కావాలి మరింత భరోసా
రైతుల ఆదాయాలు 2022నాటికి రెట్టింపు చేస్తామంటున్న ప్రభుత్వం- ఆ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొనే 2017-18 బడ్జెట్‌లో కేటాయింపులు జరిపింది. పంటల సాగు ద్వారా రైతుకు వస్తున్న ఆదాయం, మొత్తం ఆదాయంలో 40 శాతమేనని, 60 శాతానికి పైగా ఆదాయం వ్యవసాయేతర పనుల ద్వారా వస్తోందని జాతీయ నమూనా సర్వేలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పన, గ్రామీణాభివృద్ధి, పాడి పరిశ్రమ, ఉపాధి హామీ, సాగునీటి ప్రాజెక్టులు, పంటల బీమా, విద్యుదీకరణ, వ్యవసాయంతో ఉపాధి హామీ అనుసంధానం వంటి వాటికి తగినన్ని కేటాయింపులతో నిర్దిష్ట లక్ష్యం చేరుకోదలచారు. వ్యవసాయం నుంచి తప్పుకొనేందుకు సిద్ధమవుతున్న రైతన్నకు మరింత భరోసా కల్పించాల్సిన అవసరం ఇప్పుడు ఎంతైనా ఉంది. మిగతా రంగాలతో సమానంగా గౌరవప్రదమైన, ఆశాజనకమైన రంగంగా వ్యవసాయాన్ని తీర్చిదిద్దాలంటే, తగినంత ఆర్థిక మద్దతు అవసరం. ఈ దృష్ట్యా గత బడ్జెట్లకు భిన్నంగా ఈసారి గ్రామీణాభివృద్ధికి అధిక ప్రాధాన్యమివ్వడం హర్షించదగినది. రైతుల ఆర్థిక, సామాజిక, సంప్రదాయ జీవనం గ్రామాలతోనే ముడివడి ఉంది. గ్రామీణాభివృద్ధి-రైతాంగ అభివృద్ధి పరస్పర ఆధారితం. ఈసారి గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, అనుబంధ రంగాలకు 24 శాతం నిధులు అదనంగా (రూ.1.87 లక్షల కోట్లు) కేటాయించారు. అందులో సహకార పరపతి సంఘాల ద్వారా చిన్న, సన్నకారు రైతాంగానికి పరపతి అందించే ఆలోచన మంచిదే. దేశంలో 40 శాతం చిన్న, సన్నకారు రైతులకు ఇప్పటికీ సహకార పరపతి సంఘాలే ఆధారం.

చెల్లింపు వ్యవస్థలతో సాంత్వన
దేశంలో 92 వేలకు పైగా ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘాలున్నాయి. వచ్చే మూడు సంవత్సరాల్లో నాబార్డ్‌ ద్వారా చిన్న, సన్నకారు రైతులకు భారీయెత్తున రుణాలు అందించదలచారు. దేశంలో వ్యవసాయం ప్రధానంగా వర్షాధారం. ఏటా ఏదో ఒక ప్రాంతంలో, మొత్తంగా 10 నుంచి 15 శాతం వరకు అతివృష్టి లేదా అనావృష్టి సంభవిస్తోంది. ఫలితంగా పంట నష్టపోవలసి వస్తోంది. ఇటువంటప్పుడు పంటల బీమా రక్షణ ఛత్రంగా ఉపయోగపడుతుంది. గత మూడు దశకాలుగా పైలట్‌ పథకాలుగా, అసమగ్రంగా ఉన్న పంటల బీమాల స్థానంలో 2016 జనవరిలో ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి పంటల బీమా పథకం రైతులకు సాంత్వన చేకూర్చేదే. తక్కువ ప్రీమియమే చెల్లించాల్సి రావటంతో రైతులు దాన్ని ఆదరిస్తున్నారు. 2016-17 బడ్జెట్‌లో ఇందుకోసం రూ.5,500 కోట్లు కేటాయించారు. సవరించిన బడ్జెట్‌లో రూ. 13,240 కోట్లు వెచ్చించారు. ఇది దాదాపు రెండింతల పైనే. బీమా కిందకు తీసుకు రావలసిన సాగు విస్తీర్ణాన్ని 2017-18లో 40 శాతానికి, 2018-19లో 50 శాతానికి పెంచాలని నిర్ణయించారు. అంతా బాగానే ఉన్నప్పటికీ, నష్టపరిహారం చెల్లింపు మాత్రం సంతృప్తికరంగా లేదన్నమాట వినవిస్తోంది. దీన్ని పరిగణనలోకి తీసుకుని ఇంకా బడ్జెట్‌ కేటాయిస్తే బాగుండేది. ఆ మేరకు పరిహారం చెల్లింపు వ్యవస్థను మెరుగుపరచాల్సి ఉంది. ఇటీవలి ఆర్థిక సర్వేలో మాత్రం పంటల బీమా పథకం గురించిగాని, సామర్థ్యం గురించిగాని వివరించలేదు. అమెరికా, చైనాలాంటి దేశాలు ప్రధానంగా సాగునీటిని సద్వినియోగించుకొని అధిక ఉత్పత్తి సాధించగలుగుతున్నాయి. వర్షాధార పంటలతో పోలిస్తే సాగునీటి పారుదల సౌకర్యమున్న ప్రాంతాల్లో పంటల దిగుబడి రెండున్నర నుంచి మూడు రెట్లు ఎక్కువ. భారత్‌లో అటువంటి లాభాలు అందాలంటే, ప్రతి క్షేత్రానికీ సాగునీటి అందుబాటు ఉండాలి. ఇప్పుడున్న సాగునీటి సౌకర్యాల్లో బోరుబావులు, గొట్టపు బావుల నుంచి నీటిని పంటలకు సరఫరా చేయటానికి రైతుకు ఖర్చు పెరుగుతుంది. సాగు గిట్టుబాటు కావటంలేదు. ఎంత మేరకు సాగునీటి విస్తీర్ణాన్ని పెంచగలిగితే అంత లాభముంటుంది. బడ్జెట్‌లో దీర్ఘకాలిక సాగునీటి నిధి కింద నాబార్డ్‌కు రూ.20 వేలకోట్లు కేటాయించారు. దీనికి అదనంగా ప్రధానమంత్రి మరో రూ.20 వేలకోట్లు ప్రకటించారు.
ప్రతి నీటి బొట్టుకు అత్యధిక పెట్టుబడి సాధించాలంటే- ఆధునిక సాంకేతిక పద్ధతులు, సూక్ష్మ సాగునీటి పారుదల వ్యవస్థలను అనుసరించాలని ప్రధానమంత్రి మొదటినుంచీ చెబుతున్నారు. తక్కువ నీటి వనరులున్న ఇజ్రాయెల్‌ లాంటి దేశాలు ఈ పద్ధతి పాటించి అద్భుతాలు ఆవిష్కరిస్తున్నాయి. బిందు, తుంపర సేద్య పద్ధతుల ద్వారా అదే సాగునీటిని రెండింతల విస్తీర్ణానికి అందించవచ్చు. దేశంలో తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు ఈ పద్ధతిలో మేలైన నీటి యాజమాన్యానికి ప్రాధాన్యం ఇస్తున్నాయి. బడ్జెట్‌ బాగానే కేటాయిస్తున్నాయి. సూక్ష్మనీటి సేద్యం కోసం రూ.5,000 కోట్లతో సంచితనిధి ఏర్పాటు చేయడం భవిష్యత్తులో మేలైన ఫలితాలు ఇచ్చే చర్యే. పర్యావరణ మార్పుల నేపథ్యంలో ఎదురుకానున్న నీటిఎద్దడి నుంచి పంటలను కాపాడుకునేందుకు అయిదు లక్షల క్షేత్రాల్లో నీటి గుంతల ఏర్పాటుకు కొంత బడ్జెట్‌ కేటాయించడం నూతన ఒరవడి. నీటి కొరతను అధిగమించడంలో, నీటి ఎద్దడిలో పంటలను కాపాడుకోవడంలో ఇవి తోడ్పడనున్నాయి. భూసారాన్ని అంచనా వేసి పంటలు, ఎరువుల మోతాదు నిర్ణయిస్తే దిగుబడులు మరింత పెరుగుతాయి. పంటల సాగు ఖర్చులు తగ్గుతాయి. ఇందుకు దేశంలోని 14 కోట్ల కమతాలకు భూసార పరీక్షలు చేయాలి. ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి మరింత కృషి చేయాలి. ప్రస్తుత బడ్జెట్‌లో దేశంలోని 648 కృషి విజ్ఞాన కేంద్రాలతోపాటు మరో 1000 చిన్న భూసార పరీక్ష ప్రయోగశాలల ఏర్పాటును ప్రతిపాదించారు. స్థానికంగా అర్హులైనవారికి సబ్సిడీ ఇచ్చి వీటి ఏర్పాటును ప్రోత్సహిస్తామంటున్నారు. ప్రతి జిల్లాకు ఒక కృషి విజ్ఞాన కేంద్రం (కేవీసీ) ఉండాలన్న నిబంధన ఉన్నప్పటికీ, ఇప్పటికీ అనేక రాష్ట్రాల్లో అది అమలు కావడం లేదు. ఉన్నవీ సిబ్బంది కొరతతో కొట్టుమిట్టాడుతున్నాయి. ఇందుకోసం ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేసి ఉంటే బాగుండేది.
రైతు ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు ధర విపణిలో నిర్ణయమవుతుంది. రైతు నికరాదాయం పొందటంలో కీలక పాత్ర ఉత్పత్తుల అమ్మకపు ధర. నియంత్రిత మార్కెట్ల అందుబాటు తగినంతగా లేకపోవడం, కనీస సౌకర్యాల లేమి, దళారుల వ్యవస్థ కారణంగా రైతుకు విపణిలో సరైన ధర దక్కడం లేదు. దీనికితోడు పలు మార్కెట్‌ రుసుములు చెల్లించాల్సి రావడం, నేరుగా ఉత్పత్తులను పొలం నుంచే వినియోగదారులకు విక్రయించుకునే సౌకర్యం లేకపోవడంతో నష్టాలు పెరుగుతున్నాయి. ఇప్పటికే ప్రారంభించిన జాతీయ వ్యవసాయ విపణి (ఇ-నామ్‌)తో దేశమంతా ఒకే విపణిగా మారింది. 250 నుంచి 585 వరకు వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ కమిటీ (ఏపీఎంసీ)లకు వర్తింపజేసేలా ఇ-నామ్‌ను విస్తృతపరచదలిచారు. నాణ్యత ప్రమాణాలు, సౌకర్యాలు మెరుగుపరచటానికి ప్రతి ఇ-నామ్‌ విపణికి గరిష్ఠంగా రూ.75 లక్షలు ఇస్తామంటున్నారు. దీనివల్ల రైతులకు ఎంతవరకు ప్రయోజనం చేకూరుతుందో చూడాలి. చెడిపోయే స్వభావమున్న పండ్లు, కూరగాయలను ఏపీఎంసీ నుంచి తొలగించాల్సి ఉంది. దీనివల్ల రైతులు నేరుగా మేలైన ధర లభించే చోట వినియోగదారులకు విక్రయించవచ్చు. వ్యవసాయ శుద్ధి కేంద్రాల ఏర్పాటుతో విలువ జోడింపు జరుగుతుంది. కోత అనంతరం జరిగే నష్టాలను తగ్గించుకోవచ్చు. అందుకు మార్గంగా నమూనా ఒప్పంద సాగు చట్టం ముసాయిదాను కేంద్రం రాష్ట్రాలకు పంపించింది. దీనిపై రాష్ట్రాలు ఎలా స్పందిస్తాయో చూడాలి.
వ్యవసాయ ఉత్పత్తులకు ప్రకటిస్తున్న మద్దతు ధరలు రైతులకు ఎంతమాత్రం గిట్టుబాటు కావడం లేదు. దీంతో, పెట్టిన పెట్టుబడీ తిరిగిరాక వ్యవసాయదారులు దిగాలు పడిపోతున్నారు. ఈ పరిస్థితి మారాలి.రాష్ట్రాలవారీగా పంటల సాగు ఖర్చులు, ఉత్పాదకతలో వ్యత్యాసం ఉన్న కారణంగా ఆయా రాష్ట్రాలకే మద్దతు ధరలు నిర్ణయించే అధికారాన్నిచ్చి, తదనుగుణంగా కేంద్రం నిధులు సమకూర్చాలి. భారత హరిత విప్లవ పితామహుడు ప్రొఫెసర్‌ స్వామినాథన్‌ ప్రతిపాదించిన ప్రకారం- పెట్టుబడి ఖర్చులు పోను 50 శాతం లాభం ఉండేలా మద్దతు ధరలు నిర్ణయించాలి. అప్పుడు రైతుల వ్యవసాయ ఆదాయాలు రెట్టింపు కాకపోయినా కనీసం నష్టం రాకుండా ఉంటుంది. ఈ సూత్రాన్ని అమలు చేయడానికి తగిన సమయమిదే.
దేశంలోని వ్యవసాయదారుల్లో అత్యధికం (82 శాతం) చిన్న, సన్నకారు రైతులే. వారి వ్యవసాయరంగ పెట్టుబడికి, తద్వారా ఉత్పాదకతకు పరపతి అతి ముఖ్యమైంది. వరసగా రెండు సంవత్సరాలు పంట నష్టపోయిన రైతు, పెట్టుబడికి సిద్ధంగా లేడు. వడ్డీ వ్యాపారస్తులను ఆశ్రయిస్తే వచ్చిన పంట మొత్తాన్ని నష్టానికే తెగనమ్ముకోవలసి వస్తుంది. చేతికొచ్చిన పంటను విపణికి తీసుకువెళితే కనీసం పెట్టుబడి ఖర్చులు తిరిగిరాని దుస్థితి నెలకొంది. ఇలాంటప్పుడు రైతుకు ‘వ్యవసాయ పరపతి’ వసతి విస్తరించాలి. దేశంలో సగానికన్నా ఎక్కువ (6.76 కోట్ల) రైతులు అప్పుల వూబిలో కూరుకుపోయి ఉన్నారు. దళారుల అధిక ప్రమేయంతో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకపు ధరల్లో 10 నుంచి 15 శాతం మించి రైతుకు అందడంలేదు. ఉత్పత్తి ఖర్చులు మిగలడంలేదు. ఈ పరిస్థితుల్లో రైతు ఆదాయాల రెట్టింపుపై దృష్టి కేంద్రీకరించాల్సిందే. 70వ జాతీయ నమూనా సర్వే ప్రకారం, భారత రైతు సగటు నెలసరి ఆదాయం రూ.6,424. ఇది కేవలం వ్యవసాయం ద్వారా వస్తున్న రాబడి కాదు. పంటలతోపాటు పశుపోషణ, ఉపాధి, వ్యవసాయేతర వ్యాపకాల ద్వారా సంపాదిస్తున్న ఆదాయం. అదే సమయంలో వ్యవసాయ కుటుంబానికి నెలకు సరాసరిన అయ్యే ఖర్చు రూ.6223. అంటే మొత్తం ఆదాయం కుటుంబ పోషణకే సరిపోతుంది. ఒకవేళ ఆదాయాలు రెట్టింపు అయితే పోషక ఆహారంపై ఖర్చులు పెరుగుతాయని వివిధ సర్వేలు చెబుతున్నాయి. మిగులు ఆదాయం చాలా తక్కువ. నిజంగా వారి ఆదాయాలు రెట్టింపైనా ఒక చిన్నపాటి ప్రభుత్వ ఉద్యోగి ఆదాయం కన్నా తక్కువగానే ఉంటాయి. రైతుల ఆదాయం అంటే కేవలం వ్యవసాయం నుంచి వస్తున్న ఆదాయమేనా? లేక అన్ని వనరులు కలిపా? లేక రైతు వ్యవసాయ కుటుంబ ఆదాయమా? ఈ విషయంలో స్పష్టత రావాలి.

ఆదుకొనే మార్గాలివి...
నామమాత్రపు ఆదాయంలో రెట్టింపుతో ఒనగూడేదేమీ లేదు. గౌరవంగా బతకగలిగే ఆదాయం ఉండాలి. అందుకు స్వల్పకాలిక ఉపశమన చర్యగా రైతుల పంట రుణాలను మాఫీ చేయాల్సింది. రెండు సంవత్సరాల కరవు, పెద్దనోట్ల రద్దుతో రైతులు నష్టపోయిన సొమ్ము తిరిగి వచ్చేలా కనీసం చిన్న, సన్నకారు రైతులకు ఉత్పత్తికారకాలను ఉచితంగా అందించే ప్రయత్నం చేయాలి. రైతుల ఆదాయం రెట్టింపు కావాలంటే వ్యవసాయంలో వృద్ధి రేటు 12 నుంచి 14 శాతం ఉండాలని గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నిరాశాజనకంగా ఉన్న వృద్ధిరేటు పెంపుదలకు కృషిచేయాలి. పంటల్లో ఉత్పాదకత పెరగాలంటే ఉత్పత్తి కారకాల వాడకం ముమ్మరం చేయాలి. రసాయన ఎరువుల విపరీత వాడకంతో భూములు నిస్సారమయ్యాయి. చీడపీడల సమస్య పెరిగింది. పంటల కనీస మద్దతు ధరలు మాత్రం పెరగడం లేదు. వ్యవసాయ భూములను భావితరాలకు అందించడానికి, వాటి సుస్థిరత కాపాడుకోవడానికి ‘సేంద్రియ సాగు’కు ప్రోత్సాహం అవసరం. ధరల స్థిరీకరణ నిధికి ప్రాముఖ్యం ఇవ్వాలి. ప్రస్తుతం సాగులో దాదాపు 50 శాతం మహిళా రైతులు ఉన్నారు. కానీ సంస్థాగత రుణాలు పొందటానికి అవసరమయ్యే భూమి పట్టాలు వారి పేరున లేవు. వారిని గుర్తిస్తే తప్ప, సంస్థాగత రుణాలు అందవు. మొత్తంగా వ్యవసాయం-గ్రామీణాభివృద్ధికి కేటాయించిన బడ్జెట్‌ పూర్తిగా క్షేత్రస్థాయిలో అంది, సద్వినియోగమైతే రైతుల ఆదాయాలు పెరిగి, పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంటుంది. రైతే రాజు అంటాం. చేతల్లో దాన్ని రుజువు చేయాల్సిన తరుణమిదే!

Posted on 18-02-2017