Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

ఆహార భద్రతకు బీజాక్షరం!

* సరైన విత్తనంతోనే అధిక దిగుబడులు
తొలకరి పలకరించడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో రైతులు ఏరువాక సంబరాలు జరుపుకొంటున్నారు. భూమిని దున్ని విత్తనాలు చల్లడమే తరువాయి. సరైన విత్తనాల ద్వారానే పంట దిగుబడులు ఇనుమడిస్తాయి. మార్కెట్‌లో నకిలీ విత్తనాలు విస్తరించడం రైతాంగాన్ని ఆందోళనకు గురిచేస్తోంది. నాగరికత పురోభివృద్ధికి మూలకారణం వ్యవసాయం. నీరు, నేలతోపాటు విత్తనమూ సేద్యానికి బీజాక్షరమే! అందుకే ఏ దేశ పురోగతినైనా అక్కడి విత్తనాభివృద్ధి, నాణ్యతా ప్రమాణాలే ప్రాథమికంగా నిర్దేశిస్తాయి. వ్యవసాయ ప్రగతి సాధించిన దేశాలన్నీ విత్తనాభివృద్ధి ద్వారానే దిగుబడి, నాణ్యతలను పెంపొందించుకోగలిగాయి. ఆహార భద్రతను సాధించగలిగాయి. తద్వారా విత్తన రంగంలో పరిశోధనలకు ప్రాధాన్యం పెరిగింది.

విత్తనాలు చీడపీడలను తట్టుకోగలగాలి. స్థానిక వాతావరణ పరిస్థితులకు అనువైనవిగా ఉండాలి. ఆహార ధాన్యాలు, పండ్లు కూరగాయల్లో ఆ తరహా విత్తనాలను ఎంపిక చేసి వాటి నాణ్యత, దిగుబడులను పెంచుకోవాలి. ఇదే సూత్రంతో ఇన్నేళ్లుగా కొత్త విత్తన రకాలను దేశంలో సృష్టించారు. పెరుగుతున్న జనాభా అవసరాలను అభివృద్ధి పరచిన ఈ విత్తన రకాలే ఆదుకున్నాయి. గత శతాబ్దం మొదటి అయిదు దశకాలు కరవు కాటకాలతో అల్లాడిన దేశం మనది. మంచి విత్తనాల ద్వారా దిగుబడులు పెంచుకుని నాటి కష్టాలను అధిగమించగలిగాం. ఆపై రెండు దశాబ్దాల్లో ప్రపంచవ్యాప్తంగా విత్తన విప్లవం వేళ్లూనుకుంది. దేశ, విదేశాల్లోని వ్యవసాయ శాస్త్రజ్ఞులు, రైతులు, అంతర్జాతీయ వ్యవసాయ పరిశోధన స్థానాల్లో మొగ్గతొడిగిన ఆలోచనలు, పరిశోధనలు ఇందుకు ఎంతగానో దోహదపడ్డాయి. ప్రపంచంలో వివిధ వ్యవసాయ మండలాల్లోని పంటల జన్యు సముదాయాల పరిశీలనలు వ్యవసాయ పరిశోధనలకు వూపునిచ్చాయి. ఆరో దశకంలో మెక్సికో నుంచి వచ్చిన పొట్టిగోధుమ రకాలు, దేశవాళీ పొడవు రకాలకన్నా రెట్టింపు దిగుబడులు ఇచ్చాయి. 1964-65లో 1.23 కోట్ల టన్నుల గోధుమలు పండించిన భారత్‌, నేడు 9.66 కోట్ల టన్నుల గోధుమలను ఉత్పత్తి చేయగల స్థాయికి చేరింది. అందులో కల్యాణసోన, సోనాలిక లాంటి అభివృద్ధి పరచిన పొట్టి గోధుమ రకాలదే ప్రముఖ పాత్ర. వరి విషయంలోనూ ఐఆర్‌-8, ఐఆర్‌-64 వంటి స్వదేశీ రకాల ద్వారా తక్కువ దిగుబడులే సాధ్యమయ్యేవి. వాటిలోకి తైచుంగ్‌ నెటివ్‌ జన్యువులను ప్రవేశపెట్టడం ద్వారా అధిక దిగుబడులు సాధించగలిగారు. 1960లో భారతీయ రైతులు 3.5 కోట్ల టన్నుల మేర ధాన్యం పండించారు. ఆధునిక రకాల పుణ్యమా అని నిరుడు ధాన్యం దిగుబడులు 10.9 కోట్ల టన్నులకు పెరిగాయి. ఇది వ్యవసాయ పద్ధతుల్లో వచ్చిన మార్పులు, విత్తనాల జన్యు పరివర్తన వల్ల ఒనగూడిన సానుకూల పరిణామం. నేడు ప్రపంచంలో అత్యధికంగా చక్కెర ఉత్పత్తి చేసే దేశంగా, పత్తి విస్తారంగా పండించి ప్రపంచంలో నలుమూలలకు ఎగుమతి చేయగలదిగా భారత్‌ గుర్తింపు పొందింది. అభివృద్ధి పరచిన కొత్తతరం విత్తనాలు లేకుండా ఇది సాధ్యమయ్యేది పని కాదు!

మనదేశంలో సంకర విత్తనాల ద్వారా అధిక లబ్ధి పొందింది పత్తితోనే. అయిదో దశకంలో 30లక్షల బేళ్ల పత్తి ఉత్పత్తి చేసిన భారత్‌ 2015-16కు, 3.40 కోట్ల బేళ్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించుకుంది. దిగుమతుల బెడద వదలి, ఎగుమతులు చేసే స్థాయికి ఎదిగి ప్రపంచ పత్తి విపణిలో ప్రముఖ స్థానం ఆక్రమించింది. సంకర విత్తనాల ప్రభావం దీనికి ప్రధాన కారణం. అలాగే ఎకరానికి 1950లో రెండు, మూడు బస్తాలకు మించి పండని సజ్జ, జొన్న, మొక్కజొన్న లాంటి తృణ ధాన్యాలు నేడు టన్నుల్లో పండటానికి సంకర రకాలే కారణం. ఉద్యాన పంటల్లో మామిడి, నిమ్మ, అరటి ఉత్పత్తుల్లో అగ్రగామి భారత్‌. అయినా ఆశించినంత అభివృద్ధి ఈ రంగంలో రాకపోవడానికి ముఖ్యకారణం- ఇవి మొక్కల ద్వారా ప్రవర్ధనం జరిగే పంటలు కావడమే! మొక్కలు, అంట్ల తయారీలో సరైన పర్యవేక్షణ లేక ఈ పంటల్లో జన్యు అభివృద్ధి ఆశించిన రీతిలో జరగలేదు. ఒకే జాతిలో జన్యువైవిధ్యం కొట్టొచ్చినట్లు ఇప్పటికీ కనిపిస్తూనే ఉంది. అరటి పంటలో ‘టిష్యూకల్చర్‌’ ద్వారా దీన్ని కొంతమేర అధిగమించగలిగాం. ఈ పద్ధతిలో మేలైన ఓ తల్లిమొక్క నుంచి, వేల సంఖ్యలో మొక్కలను తయారు చేయవచ్చు. సరైన పర్యవేక్షణ కొరవడి ఆశించిన పురోగతి ఇందులోనూ సాధించలేకపోయాం. నేటికీ భారతదేశమే ఈ పంటలకు పెన్నిధి. కొబ్బరి హైబ్రిడ్‌లు గత రెండు, మూడు దశాబ్దాల్లో ప్రాచుర్యం పొందాయి. కొబ్బరి దిగుబడులు పెరగడానికి సంకర మొక్కలు, వాటి జన్యు సంపద ఎంతగానో ఉపయోగపడ్డాయి.

మనదేశ వ్యవసాయంలో యాంత్రీకరణ అంత వేగంగా జరగలేదన్నది నిష్ఠురసత్యం. జన్యుమార్పిడి పత్తి దేశంలో మారుమూల ప్రాంతాలకూ విస్తరించింది. ప్రస్తుతం పత్తి సాగులో 90శాతం వరకు జన్యుమార్పిడి, సంకర పరచిన రకాలే ఉన్నాయి. అమెరికా మినహా మరే దేశమూ జన్యుమార్పిడి రకానికి ఇంతగా పట్టం కట్టలేదు. దీనికి ముఖ్యంగా పత్తికి ప్రధాన శత్రువైన శనగపచ్చ పురుగును అదుపు చెయ్యగల బీటీ రకం రైతులకు పెన్నిధిలా కలిసి వచ్చింది. బీటీ విత్తనాలు దేశంలో విరివిగా దొరకడమూ మరో కారణం. సాగు దిగుబడుల పెంపుదలలో విత్తనాల ప్రాముఖ్యతను భారత ప్రభుత్వం 50 ఏళ్ల క్రితమే గుర్తించి జాతీయ విత్తన సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థతో పాటు రాష్ట్రాల్లోనూ విత్తనాభివృద్ధి సంస్థలు వెలిశాయి. ఆహార ధాన్యాల్లో విత్తనాలను సమకూర్చేందుకు గ్రామీణ విత్తనోత్పత్తి కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వాలు ప్రోత్సహించాయి. అయినా నేటికీ నమ్మకమైన విత్తనాల లభ్యత రైతులకు ఎండమావిగానే మిగిలిపోయింది. విత్తనంతోనే పంట దిగుబడులు పెరుగుతాయి. అంతటి ప్రాధాన్యంగల విత్తన నాణ్యత, ఉత్పత్తి పెంపుదల కోసం జరగాల్సిన కృషిని దేశంలో వేగిరపరచాల్సి ఉంది. రైతులకు నమ్మకమైన జన్యు స్పచ్ఛతగల విత్తనాలు లభ్యమయ్యేలా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఆలోచనలు సాగించాలి. అప్పుడే విత్తనాభివృద్ధి ద్వారా వ్యవసాయ దిగుబడులు ద్విగుణీకృతమవుతాయి. రైతుల రాబడులు రెట్టింపవుతాయి. భారతీయ సేద్యం కళకళ లాడుతుంది.

- డాక్టర్‌ మొవ్వ రామారావు
Posted on 13-06-2017