Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

నాణ్యమైన విత్తుకు ఏదీ పూచీకత్తు?

* నకిలీలతో నష్టపోతున్న రైతన్న
కొత్త ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభమైన తొలి నెలలోనే నాసిరకం, నకిలీ విత్తనాలు రైతులను నట్టేట ముంచుతున్నాయి. త్వరలో నూతన విత్తన చట్టం తెస్తామని కేంద్ర ప్రభుత్వం ఇటీవల వెల్లడించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమూ విత్తన చట్టం తెచ్చేందుకు ముసాయిదా సిద్ధం చేస్తోంది. దశాబ్దాల క్రితం నాటి అవసరాల మేరకు 51ఏళ్ల క్రితం రూపొందించిన జాతీయ విత్తన చట్టం, పదిహేనేళ్ల కిందట పట్టాలకెక్కిన జాతీయ విత్తన విధానం ప్రస్తుతం రైతులోకం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఏ రకంగానూ అక్కరకు రావడం లేదు. ఆనాటి చట్టాలు ఇప్పటి రైతుల కష్టాలను, అవసరాలను తీర్చలేకపోతున్నాయి. మరోవంక దేశవ్యాప్తంగా విత్తన కంపెనీల అడ్డగోలు విన్యాసాల బారినపడి అన్నదాతలు కుదేలవుతున్నారు. ఏటా రబీ, ఖరీఫ్‌ సీజన్లు అన్నదాతకు అప్పులు మిగులుస్తున్నాయి. రైతన్న అంతకంతకూ చితికిపోతున్నా పదునైన విత్తన చట్టం మాత్రం సాకారం కాని ఆదర్శంగానే ఉండటం బాధాకరం.

నియంత్రణ లేకనే కష్టాలు...
ఉభయ తెలుగు రాష్ట్రాల్లో పేరున్న కంపెనీలు విక్రయించే విత్తనాల్లోనూ కొన్ని సందర్భాల్లో కల్తీలు ఉంటుండటం ఆందోళన కలిగిస్తోంది. రైతులు పండించే విత్తన పంటల నుంచే కంపెనీలన్నీ విత్తనాలు తయారు చేస్తున్నాయి. వందల కోట్ల రూపాయల వ్యాపార సామ్రాజ్యాలను నిర్మించుకుంటున్నాయి. వివిధ ఐరోపా దేశాల్లో విత్తన కంపెనీలు తాము తయారుచేసే విత్తనాలకు ప్రభుత్వ ఏజెన్సీనుంచి ‘ధ్రువీకరణ పత్రం’(సర్టిఫికేషన్‌) తప్పనిసరిగా పొంది తీరాలి. కానీ భారత్‌లో పరిస్థితి ఇందుకు భిన్నం. తాము తయారు చేసిన విత్తనాలు నాణ్యమైనవే అని కంపెనీలు సొంతంగా ధృవీకరించుకుని ‘ట్రూత్‌ఫుల్‌ లేబుల్‌’ అతికించి విక్రయించుకునే అవకాశాన్ని చట్టమే వాటికి కల్పిస్తోంది. ఈ రకంగా ‘ట్రూత్‌ఫుల్‌ లేబుల్‌’ అతికించి అమ్ముతున్నవాటిలోనే నాసిరకం విత్తనాలు ఉండటంతో రైతులు దారుణంగా నష్టపోతున్నారు. మన దేశ విత్తన వ్యాపారంలో వివిధ పార్టీలకు చెందిన ఎంపీలు, మంత్రులు మొదలు సర్పంచులదాకా ప్రజాప్రతినిధులెందరో భాగస్వాములుగా ఉన్నారు. అందుకే కంపెనీలన్నీ విత్తన నాణ్యతను మరీ తేలిగ్గా తీసుకుంటున్నాయి. ఈ విత్తన పంటలను చాలా జాగ్రత్తగా పండించాల్సి ఉంటుంది. కానీ ఈ జాగ్రత్తలేవీ కంపెనీలు తీసుకోవడం లేదు. సాధారణంగా రైతులు పండించి మార్కెట్లలో అమ్మే ధాన్యాన్నే ప్యాకెట్లలో నింపి ట్రూత్‌ఫుల్‌ లేబుల్‌ అతికించి నాణ్యమైన విత్తనాలంటూ విక్రయించి మోసం చేస్తున్నారు. చైనా, ఐరోపా దేశాల్లో ఈ తరహా మోసాలకు ఆస్కారమే లేదు. భారత్‌లో ఏడాది మొత్తానికి కలిపి 3.43 కోట్ల క్వింటాళ్ల విత్తనాలు అవసరమని అంచనా. దేశంలో వివిధ రకాల ప్రభుత్వ సంస్థలు, ఏజెన్సీలు, ప్రైవేటు విత్తన కంపెనీలు కలిసి ఏటా దాదాపు 3.50 కోట్ల క్వింటాళ్ల విత్తనాలు తయారుచేస్తున్నట్లు అధికారిక అంచనా. అంటే రైతుల అవసరాలకు సరిపోగా ఇంకా సుమారు ఏడు లక్షల క్వింటాళ్ల వరకూ మిగిలే ఉంటాయన్నమాట. కానీ ఓ అధ్యయనం ప్రకారం చాలామంది రైతులు తాము సొంతంగా పొలాల్లో పండించుకున్న పంటల నుంచి సిద్ధం చేసుకున్న విత్తనాలనే తరవాతి పంటలకు వినియోగిస్తున్నారు. దేశవ్యాప్తంగా పంటలకు ఉపయోగిస్తున్న విత్తనాల్లో సగానికి పైగా రైతులు ఇలా సొంతంగా సిద్ధం చేసుకున్నవే ఉంటున్నాయని, వారు చాలావరకు బయటి కంపెనీల వద్ద కొనడం లేదని ఓ అంచనా! ఈ అంచనా ప్రాతిపదికన దేశంలోని అన్ని కంపెనీలు, సంస్థలు ఉత్పత్తి చేసే మూడున్నర కోట్ల క్వింటాళ్లలో సుమారు రెండు కోట్లవరకూ మిగిలిపోవాలి. మరి ఇలా మిగులుతున్న విత్తనాలు ఎక్కడికి వెళుతున్నట్లు? భారత్‌నుంచి విదేశాలకూ విత్తన ఎగుమతులు చెప్పుకోదగ్గ స్థాయిలో గొప్పగా ఏమీ లేవు. కిందటి ఆర్థిక సంవత్సరం భారత్‌నుంచి పండ్లు, కూరగాయల పంటల విత్తనాల పేరిట కేవలం 709 టన్నులు మాత్రమే ఎగుమతి అయినట్లు ‘భారత వ్యవసాయ శుద్ధి, ఎగుమతుల అభివృద్ధి మండలి’(అపెడా) తాజా నివేదిక చెబుతోంది. అంతకుముందు ఏడాది(2015-16) చేసిన 11,679 టన్నుల ఎగుమతితో పోలిస్తే నిరుడు ఈ ఎగుమతులు కళ్లు బైర్లుకమ్మే స్థాయికి పడిపోయాయి.
భారత్‌లో విత్తనాలపై నిర్దిష్ట నియంత్రణ వ్యవస్థలే లేవు. ఏ దశలోనూ నిబంధనలకు తలొగ్గి విత్తనాలు విక్రయిస్తున్న వ్యవస్థలు కనిపించవు. విత్తనాల ఉత్పత్తి దశలోనే కంపెనీల తీరుతెన్నులను వెయ్యికళ్లతో గమనించి, దారితప్పినవాటి తాట తీసే యంత్రాంగం మన దేశంలో లేదు. నాణ్యమైన విత్తనాల పేరిట ఏ కంపెనీ అయినా నాసిరకం ఉత్పత్తులను అంటగడితే ఏం చేయాలన్న విషయంలోనూ నిర్దిష్ట దిశానిర్దేశాలు కనిపించవు. పత్తి, మిరప వంటి విత్తన పంటలను పండించినప్పుడు ఏదోస్థాయిలో కొంత నాసిరకం సరకు రావడం జరుగుతోంది. ఈ తాలు సరకును సాధారణ పంటగా బయట విక్రయిస్తున్నారా లేక విత్తనాల పేరిట ప్యాక్‌ చేసి అమ్ముతున్నారా అన్న విషయాలను నిగ్గుతేల్చే యంత్రాంగమే కనిపించడం లేదు. మామూలు సరకును విత్తనాలుగా విక్రయిస్తే తనిఖీ చేసి పట్టుకునే వారే లేరు. విత్తనాలను ప్రయోగశాలలో పరీక్షించి, ప్యాక్‌ చేసిన తరవాత వాటిని ఆరునెలల్లోగా అమ్మాలని గడువు తేదీ ముద్రించాలి. ఆ గడువు దాటితే వాటిని బయటికి తీసి మళ్లీ ప్రయోగశాలలో పరీక్షించాల్సి ఉంటుంది. వాటిలో మొలకశాతం ఎంత అన్న విషయాన్ని క్షుణ్నంగా పరిశీలించి తిరిగి విక్రయించడానికి గనుక అవి వీలుగా ఉంటే ఆ మేరకు వ్యవసాయశాఖ అనుమతి పొందాలి. విత్తన పంటల సాగు మొదలు వాటిని ప్యాక్‌ చేసి, గ్రామాల్లోని దుకాణాలకు పంపే వరకూ జరిగే మొత్తం ప్రక్రియపై ప్రభుత్వపరంగా సరైన తనిఖీ, పర్యవేక్షణ లేదు. అందుకే విత్తన కంపెనీలు ఇష్టారీతిన వ్యవహరిస్తున్నాయి. సరకు దుకాణాలకు వచ్చాక గ్రామస్థాయి వ్యవసాయాధికారులు మొక్కుబడిగా వెళ్లి కొన్ని ప్యాకెట్లు నమూనాగా తీసుకుంటున్నారు. వాటిని తీరిగ్గా ప్రయోగశాలలకు పంపితే వందలాది క్వింటాళ్ల సరకు నాసిరకంగా తేలుతోంది. అంతా అయిపోయాక స్పందిస్తున్న అధికారులు కొన్ని కంపెనీలపై కేసులు నమోదు చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రెండు వ్యవసాయ, మరో రెండు ఉద్యాన విశ్వవిద్యాలయాలున్నాయి. వీటిలో పెద్ద సంఖ్యలో శాస్త్రవేత్తలున్నారు. వీరందరినీ ఏటా ఖరీఫ్‌ సీజన్‌కు ముందు ఓ నెలరోజుల పాటు ప్రతీ విత్తన కంపెనీని క్షుణ్నంగా తనిఖీ చేసేందుకు పంపించాలి. అక్కడున్న వనరులేంటి, వాటికి నాణ్యమైన విత్తనాలు తెచ్చే సామర్థ్యముందా, వాస్తవానికి సదరు కంపెనీ చెప్పినట్లుగా అధిక దిగుబడి ఇచ్చే సామర్థ్యం దాని బ్రాండు విత్తనాలకు ఉందా- వంటి వివరాలను సహేతుకంగా పరిశీలించే అవకాశం ఇవ్వాలి. ఈ శాస్త్రవేత్తలు సమర్పించే నివేదికల ప్రాతిపదికన నాసిరకం విత్తనాల పేరిట సాగుతున్న అడ్డగోలు దందాను కట్టడి చేసే అవకాశం ఉంది.

చైనాలో ఉక్కుపాదం
అంతర్జాతీయ మార్కెట్లో విత్తన నాణ్యతకు ఎనలేని ప్రాధాన్యమిస్తారు. భారత్‌లో మూడున్నరకోట్ల క్వింటాళ్ల నాణ్యమైన విత్తనాలు ఉత్పత్తి చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ- అందులో నాలుగోవంతు అయినా అంతర్జాతీయ విపణిలో అమ్మలేకపోవడానికి నాణ్యతే ప్రధాన సమస్యగా ఉంటోంది. విత్తనాలు ఎలా ఉత్పత్తి చేస్తున్నారన్న దానిపై åదేశంలో పెద్దగా తనిఖీలు జరగడం లేదు. దీన్ని అలుసుగా తీసుకుని వివిధ కంపెనీలు పెద్దయెత్తున నకిలీ విత్తనాలను తయారుచేసి వాటిని రంగు రంగుల ప్యాకెట్లలో రైతులకు అంటగడుతున్నాయి. వారిని అడ్డంగా దోచుకుంటున్నాయి. ఈ ప్యాకెట్లను అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేసి విక్రయించడం అసాధ్యం. ఆయా దేశాల్లో కచ్చితంగా అమలవుతున్న కఠిన చట్టాలవల్ల విత్తన మోసాలు చిటికెలో బయటపడిపోతాయి. రైతులను మోసగిస్తున్నట్లు తెలిస్తే వెనకాముందూ చూడకుండా అక్కడి ప్రభుత్వాలు నకిలీగాళ్లను జైళ్ల్లలో పెట్టడం తథ్యం. భారత్‌తో పోలిస్తే చైనాలో వ్యవసాయ పరిమాణం, రైతుల సంఖ్య ఎక్కువ. ఆ దేశంలో వందశాతం అధిక దిగుబడినిచ్చే వంగడాలు రైతులకు పుష్కలంగా అందుబాటులో ఉంటున్నాయి. కానీ ఏ మూలకూడా అధిక దిగుబడి పేరుతో నాసిరకం విత్తనాలు విక్రయిస్తున్న కంపెనీలుగానీ, వ్యక్తులుగానీ అక్కడ కనిపించరు. ప్రభుత్వ నిబంధనలు, నియంత్రణలు అత్యంత కఠినంగా ఉండటమే ఇందుకు కారణం.

ప్రభుత్వాలే చొరవ చూపాలి
ప్రపంచ జనాభా ఆకలి అవసరాలు అంతకంతకు పెరుగుతున్నాయి. వాటిని తీర్చాలంటే పంటల దిగుబడులు 2050నాటికి ఇప్పుడున్న దానితో పోలిస్తే మరో 70 శాతంమేర పెరగాలని ‘భారత వ్యవసాయ పరిశోధన మండలి’(ఐసీఏఆర్‌) తాజాగా వెల్లడించింది. దేశ జనాభాకు ఏటా కోటిన్నర మంది అదనంగా జతపడుతున్నారు. ఇప్పుడున్న జనాభా ఆకలి తీర్చడానికే రైతన్నలు పండించే ఆహార ధాన్యాల పరిమాణం సరిపోవడం లేదు. కిలో టమాటాలను ప్రస్తుతం వంద రూపాయలకు విక్రయిస్తున్న దుస్థితి చూస్తున్నాం. రైతులకు సరైన ప్రోత్సాహం లేకనే పంట పండలేదని బోధపడుతుంది. కిలో నాణ్యమైన బహుళజాతి సంస్థల విత్తనాలను కొనాలంటే రూ.80 వేల దాకా ధర చెబుతున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడని పేద రైతులు అంత ధర పెట్టి విత్తనాలు కొనగలరా? ఒకవేళ అప్పులు చేసి కొనుగోలు చేసినా- కంపెనీలు చెబుతున్న స్థాయి నాణ్యత ఆ విత్తనాలకు ఉందని పూచీకత్తు ఇచ్చేవారే లేరు. నాసిరకం విత్తనాల పాలబడి రైతులు నష్టపోయారని తెలిసినా పరిహారం ఇప్పించే పరిస్థితి లేదు. ఇలాంటి దురవస్థ నుంచి రైతులను ఆదుకునేందుకు ఇకనైనా ప్రభుత్వాలు చొరవ చూపాలి. ఎప్పుడో 1966లో అప్పటి దేశ కాల, మాన పరిస్థితులకు అనుగుణంగా తెచ్చిన జాతీయ విత్తన చట్టం ఇప్పుడు పనికిరాని స్థితికి చేరింది. దాన్ని సమూలంగా మార్చి రైతుకు భరోసా ఇచ్చేలా కొత్త చట్టం తేవాలి. విత్తనాలతోపాటు, కొన్ని కంపెనీలు నేరుగా తమ నర్సరీల్లో విత్తనాలతో నారు పెంచి రైతులకు విక్రయిస్తున్నాయి. ఇది నాసిరకం అయితే రైతులకు నష్టం అపారంగా ఉంటోంది. మిరప, మామిడి, బత్తాయి, నిమ్మ వంటి పంటల నారు కొనుగోలు చేసి ఏడాది పొడవునా పెట్టుబడి పెట్టిన తరవాత- పూత, కాత రాక లక్షలాది రూపాయల పెట్టుబడి కోల్పోయి ఎన్నో రైతు కుటుంబాలు వీధిన పడుతున్నాయి. నర్సరీల్లో మంచి నారు పెంచుతున్నారా లేదా అని చూడాల్సిన బాధ్యతను సైతం శాస్త్రవేత్తలకు ఉద్యానశాఖకు అప్పగించాలి.
ఈ ఏడాది రైతులకు నాణ్యమైన విత్తనాలను రాయితీపై విక్రయించేందుకు రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ముందుకొచ్చాయి. ఆ మేరకు రాయితీ భారం భరించేందుకు రూ.500 కోట్ల దాకా తమ బడ్జెట్లలో కేటాయించాయి. ప్రైవేటు కంపెనీలు అమ్మే విత్తనాలను కొనేందుకు రైతులు సుమారు అయిదు వేల కోట్ల రూపాయల మేర ఖర్చు పెడుతున్నారు. దేశవ్యాప్తంగా ఈ వ్యాపార సామ్రాజ్యం ఇంతకు పదిరెట్లకు పైగా ఉంది. ఇంతటి ఆర్థిక సామ్రాజ్యాన్ని సరైన దారిలో నడపాలంటే రాజకీయంగా అంకితభావం, ధైర్యం పాలకుల్లో ఉండాలి. చట్టాన్ని నిజాయతీగా అమలుచేసే చిత్తశుద్ధి అధికారులకు ఉండాలి. ఇవేమీ లేకుండా రైతులను ఆదుకుంటామని ఎన్ని మాటలు చెప్పినా... అవన్నీ వృథాయే!

- మంగమూరి శ్రీనివాస్‌
Posted on 21-07-2017