Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

కౌలుదారిలో కడగండ్ల సేద్యం

* ప్రభుత్వసాయం ఎండమావి కారాదు

కౌలుదారీతనం భారతదేశ వ్యవసాయంలో అనాదిగా అంతర్భాగం. గడచిన దశాబ్దకాలంగా కౌలుభూమి, కౌలు రైతుల శాతం దేశవ్యాప్తంగా, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో పెరిగిపోతోంది. నేటికీ చట్టప్రకారం గుర్తింపుపొందని కౌలురైతులు, వ్యవసాయ అభివృద్ధికి ప్రభుత్వం అందించే సాయం, రాయితీలు పొందలేకపోతున్నారు. వ్యవసాయ సంక్షోభ దుష్ప్రభావం మొదట కౌలురైతు మీదే పడుతోంది. రైతు ఆత్మహత్యల్లో అధికవాటా వీరిదే. అయినప్పటికీ దేశ, రాష్ట్రస్థాయి వ్యవసాయ అభివృద్ధి నమూనాల్లో వారికి సముచిత స్థానం దక్కడం లేదు. ఇటీవల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్రసర్వేలో కౌలు రైతును చేర్చలేదు. అసలే వ్యవసాయం లాభసాటిగాలేని స్థితిలో, కౌలురైతుకు గుర్తింపులేక, ప్రభుత్వ సాయం అందకపోవడం మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టే
స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో జమీందారీ భూస్వామ్యం నెలకొని ఉన్నప్పుడు భూసంస్కరణలు చేపట్టారు. కౌలుదారీ సంస్కరణలు వాటిలో భాగం. వాటిని అనుసరించి ‘దున్నేవాడికే భూమి’ నినాదంతో కౌలు రైతుకు యాజమాన్య హక్కులు కల్పించడంతోపాటు కౌలు కాలం, ధరలపై ఆంక్షలు విధించారు. వాటిలో భాగంగానే తెలంగాణ ప్రాంత వ్యవసాయ కౌలుదారీ చట్టం (1950) ప్రకారం కొన్ని మినహాయింపులతో కౌలును నిషేధించారు. నిర్ణీత కుటుంబ కమతం (ప్రాంతీయ పరిస్థితులను బట్టి ఆరు నుంచి 72 ఎకరాలు)కన్నా మూడురెట్లు ఎక్కువ భూమి ఉన్నవారు, సాగు చేసుకోలేని అంగవికలురు, మానసిక వికలాంగులు, భర్త చనిపోయిన స్త్రీలు, చిన్న పిల్లలు, దేశరక్షణ దళాల్లో పనిచేసే సైనికులు (జిల్లా కలెక్టర్‌ అనుమతితో) మాత్రమే భూమిని కౌలుకు ఇవ్వవచ్చు. కౌలు ఒప్పంద పత్రాన్ని తప్పనిసరిగా తహశీల్దారుకు సమర్పించాలి. ఆంధ్ర ప్రాంత కౌలుదారీ చట్టం 1956 ప్రకారం వ్యవసాయ భూమి కౌలుపై ప్రత్యక్షంగా నిషేధంలేనప్పటికీ, కొన్ని పరోక్ష ఆంక్షలు విధించారు. కౌలు ఒప్పందం కనీసం ఆరేళ్లు ఉండి, విధిగా నమోదు(రిజిస్టర్‌) చెయ్యాలి. గడువు పూర్తయ్యాక యజమాని తమ సొంత సాగుకోసం భూమిని తీసుకోవాలంటే, మొత్తం కౌలు భూమిలో సగభాగం కౌలుదారుకు సాగుకోసం విడవాలి. చట్టప్రకారం కౌలువల్ల యాజమాన్య హక్కుల విషయంలో ఇబ్బందులు తలెత్తుతుండటంతో అధిక శాతం యజమానులు రాతపూర్వక కౌలు ఒప్పందాలవైపు మొగ్గు చూపడంలేదు. ఎక్కువ శాతం నోటిమాటపైనే సాగుతున్నాయి. ఫలితంగా కౌలురైతులు ప్రభుత్వసాయం, రాయితీలు పొందలేక వ్యవసాయంలో అధిక పెట్టుబడి వల్ల నష్టాలపాలవుతున్నారు.

పెరుగుతున్న విస్తీర్ణం
సాగునీటి పారుదల ప్రాంతాల్లోని యజమాని రైతులు 1970, 80ల్లో హరితవిప్లవం వల్ల లబ్ధి పొంది, ఆపై అధిక లాభసాటైన వ్యవసాయేతర రంగాలకు వలసపోయారు. సేద్యరంగం నష్టదాయకం కావడంవల్ల అనేకమంది రైతులు సాగును వదిలి ఇతర రంగాలకు మళ్ళుతున్నారు. రైతుబిడ్డలు కొందరు ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. యాజమాన్య హక్కులు వదులుకోకుండా వారు తమ భూములను కౌలుకు ఇస్తున్నారు. వాటి ధరలు నిరంతరం పెరుగుతున్నాయి. వ్యవసాయ ఆదాయానికి పన్ను మినహాయింపు తదితర కారణాల వల్ల కొంతమంది సంపన్నులు స్థిరాస్తులుగా వ్యవసాయ భూములను కొనుగోలు చేసి కౌలుకిస్తున్నారు. గ్రామాల్లో చిన్న, సన్నకారు రైతులు, భూమిలేని వ్యవసాయ కూలీలు, పేదలు వ్యవసాయమే దిక్కుగా ఆ భూములను కౌలుకు తీసుకొని సాగుచేస్తున్నారు. తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా కౌలుసాగు వృద్ధికి దారితీస్తున్న పరిణామాలివి. జాతీయ నమూనా సర్వే సంస్థ (ఎన్‌ఎస్‌ఎస్‌ఓ) గణాంకాల ప్రకారం 2002-’2012 మధ్యకాలంలో, దేశంలో కౌలుభూమి మొత్తం సాగుభూమిలో 6.8 శాతం నుంచి 10.3 శాతానికి పెరిగింది. కౌలురైతులు 12.5 శాతం నుంచి 15.6 శాతానికి వృద్ధి చెందారు. దేశవ్యాప్తంగా తెలుగు రాష్ట్రాల్లోనే ఈ పెరుగుదల అధికంగా నమోదైంది. కౌలుభూమి ఆంధ్రప్రదేశ్‌లో 15 శాతం నుంచి 35 శాతానికి, తెలంగాణలో మూడు నుంచి 15 శాతానికి చేరింది. తెలుగు రాష్ట్రాల్లో కౌలుభూమి 30 నుంచి 50 శాతానికి పైబడే ఉంటుందన్నది మరో పరిశీలన. వాస్తవ కౌలులో ఎక్కువ శాతం భూయజమానుల వ్యతిరేకతవల్ల అధికారికంగా నమోదు కావడంలేదు. స్వల్పకాలానికి కౌలుకు ఇచ్చే భూమిశాతమూ ఎక్కువే. కౌలు రైతుల్లో అధిక శాతం చిన్న, సన్నకారు రైతులే. వీరిలో చాలామంది సొంతభూమి లేనివారు, ఎస్‌సీ కులాలకు చెందినవారు. అత్యధిక శాతం కౌలు ఒప్పందాలు నికరకౌలు రకాలే. దీనివల్ల అంతకుముందున్న భాగస్వామ్య కౌలుకు భిన్నంగా, మొత్తంసాగు అనిశ్చితిని కౌలురైతే భరించాలి. తెలుగు రాష్ట్రాల్లో కౌలుధర సగటున ఎకరాకు పంటకు రూ.8,000గా ఉంది. ప్రభుత్వం అన్ని రూపాల్లో అందించే సాగురాయితీ ఎకరాకు రూ.5,000 నుంచి రూ.6,000 వరకు (పంట రుణవడ్డీ రూ.3,000 నుంచి రూ.4,000, విత్తనాలు-ఎరువులకు రూ.2,000 నుంచి రూ.3,000, ఇతరాలు రూ.500) ఉంటుంది. దీనిప్రకారం యజమాని, రైతుతో పోలిస్తే కౌలురైతుకు ఎకరా సాగుకు సగటున రూ. 13,000లకు పైగా అదనపు ఖర్చు వల్ల వ్యవసాయం గిట్టుబాటు కావడంలేదు.

కౌలురైతులకు వ్యవస్థాగత పంటరుణం, బీమా, విపత్తు, పంట నష్టపరిహారం, విత్తనాలు, ఎరువులు అందించడానికి దేశంలోనే మొదటసారి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో భూమి గుర్తింపు సాగుదారుల చట్టం (2011) తీసుకువచ్చారు. అదంత ఆశాజనకంగా లేదు. కౌలురైతు బ్యాంకు రుణం పొందాలంటే భూయజమాని నుంచి రాతపూర్వక ఒప్పంద పత్రంతోపాటు వ్యవసాయ అధికారితో రుణ అర్హతాపత్రం లేక సాగు ధ్రువీకరణ పత్రం పొందాలి. ప్రస్తుత కౌలుదారీచట్టం ప్రకారం రిజిస్టర్‌ అయిన కౌలుభూములపై కౌలుదారులకు హక్కు ఉండటంవల్ల, భూయజమానులు రాతపూర్వకంగా చట్టబద్ధ కౌలుకు ఒప్పుకోకపోవడంవల్ల కౌలుదారులు రుణఅర్హత పత్రాలు పొందలేకపోతున్నారు. వ్యవసాయ అధికారులు ఇచ్చే సాగు ధ్రువీకరణ పత్రం ద్వారా ఎలాంటి స్థిరాస్తిపూర్వక హామీ లేకపోవడంవల్ల, కొన్ని సందర్భాల్లో యజమాని అప్పటికే ఆ భూమిపై రుణం పొంది ఉండటంవల్ల బ్యాంకు అధికారులు కౌలురైతుకు పంటరుణం ఇవ్వడానికి ముందుకు రావడంలేదు. తెలుగు రాష్ట్రాల్లో నేటికీ మూడోవంతుకన్నా తక్కువ కౌలురైతులు గుర్తింపు పత్రాలు కలిగి ఉండగా, కేవలం 10 శాతానికే బ్యాంకు రుణం ఎకరాకు సగటున రూ.5,000కన్నా తక్కువే లభిస్తుంది. ఇక ఇతర ప్రభుత్వ రాయితీలూ అందడంలేదు.కౌలురైతుల సమస్యల పరిష్కారానికి దేశ, రాష్ట్ర స్థాయుల్లో కొన్ని చర్యలు చేపడుతున్నప్పటికీ అవి ఆశించిన స్థాయిలో ముందుకు సాగడంలేదు. నీతి ఆయోగ్‌ ప్రొఫెసర్‌ టి.హక్‌ నేతృత్వంలో నియమించిన కమిటీ, దేశంలో వ్యవసాయభూమి కౌలులో సమత్వం, సమర్ధత లక్ష్యంగా రాష్ట్రాలకు ఆదర్శ కౌలుదారీ చట్టం (2016) ప్రతిపాదించి కౌలు చట్టబద్ధీకరణ, సరళీకరణలకు పూనుకొంది. దీని ప్రకారం కౌలు వల్ల భూమిపై యజమాని హక్కులకు ఎలాంటి ప్రమాదం ఉండదు. ఒప్పందాన్ని రాతపూర్వకంగా నమోదు చెయ్యడం వల్ల కౌలుదారు బ్యాంకు రుణం, ఇతర ప్రభుత్వ రాయితీలు పొందవచ్చు. ఇది కౌలురైతులకు మేలు చేసేదే. కానీ, కౌలు కనీస సమయం, ధరలపై మునుపటి ఆంక్షలను పూర్తిగా సడలించి మార్కెట్‌ ప్రకారం యజమాని కౌలుదారులే నిర్ణయించుకోవాలనే సవరణ వల్ల పేద కౌలుదారులకు లాభం చేకూరదు.

ఫలితాలు రాని ప్రయత్నాలు
2016లో ఆంధ్రప్రదేశ్‌లో సమ్మిళిత సుస్థిర వ్యవసాయ అభివృద్ధికోసం వేసిన ప్రొఫెసర్‌ రాధాకృష్ణ కమిషన్‌ సైతం మారిన పరిస్థితుల్లో, భూయాజమాన్య హక్కులకు భంగం వాటిల్లకుండా భూకమత గరిష్ఠ పరిమితికి లోబడి కౌలుదారీ చట్టాన్ని సవరించాలని ప్రతిపాదించింది. అయినప్పటికీ ఎలాంటి ముందడుగూ పడలేదు. తెలంగాణలోనూ ఇలాంటి జాడలులేవు. కౌలురైతులను సంయుక్త విధేయత సమూహాలుగా ఏర్పరచి రుణాలివ్వాలని రిజర్వు బ్యాంకు వ్యాపార బ్యాంకులను ఆదేశించినప్పటికీ పరిస్థితిలో మార్పురాలేదు. 2017లో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మొత్తం వ్యవసాయ స్వల్పకాలిక రుణాల్లో 10 శాతం కౌలురైతులకు ఇవ్వాలని నిర్ణయించినా, క్షేత్రస్థాయిలో పెద్దగా మార్పులు రాలేదు. తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన ఎకరాకు ఎనిమిది వేల రూపాయల పెట్టుబడి సాయం నేటి వ్యవసాయ రంగ సంక్షోభంవల్ల కష్టనష్టాల్లో చిక్కుకున్న రైతన్నలకు పెద్ద వూరటే. భూమి సాగుకు ముందస్తు సాయమందిస్తే, సాగుచేసే రైతు పెట్టుబడికి ఇబ్బందిపడక, పంట బాగా పండించి అప్పులపాలవకుండా ఉంటారన్నది దీని ఉద్దేశం. కనుక దాన్ని భూ సాగుదారుకే ఇవ్వాలి. అప్పుడే ఆ సాయానికి ప్రతిఫలం దక్కుతుంది. ‘దున్నేవాడికే భూమి’ అమలు చేయలేకపోయినా కనీసం ‘దున్నేవాడికే ప్రభుత్వ సాయం’ అయినా అమలు చెయ్యాలి. ప్రస్తుతం కౌలుచట్ట ప్రకారం యజమాని, కౌలురైతుకు రాతపూర్వక ఒప్పంద పత్రం ఇవ్వడంలేదు. అందువల్ల, భూయజమాని హక్కులకు భంగంలేని విధంగా పాతచట్టానికి తెలుగు రాష్ట్రాలు సవరణ చేయాలి. కౌలురైతులకు గుర్తింపు కల్పించి వ్యవస్థాగత పంట రుణం, బీమా, విపత్తు, సహాయం, విత్తనం, ఎరువుల వంటివాటికి ప్రభుత్వం అందించే సాయాన్ని నేరుగా అందజెయ్యాలి. దీంతోపాటు, స్వీయ సాగుదారుణ్ని కౌలురైతుగా గుర్తించి, రాతపూర్వక కౌలు ఒప్పందం తప్పనిసరి చేయాలి. బ్యాంకు రుణాలు ఇతర అన్నిరకాల ప్రభుత్వసాయం, రాయితీలకు దాన్ని అనుమతించేలా కౌలుచట్టం ఉండాలి. అందులో కనీస కౌలుకాలం మూడు లేక నాలుగేళ్లుగా, కౌలుధర 20 నుంచి 30 శాతం ఉత్పత్తి విలువగా నిర్ణయించాలి. కేరళలోని ‘కుడుంభశ్రీ’ పథకం మాదిరిగా భూమిలేని కౌలురైతులను సంఘాలుగా ఏర్పరచి, ప్రభుత్వ సహాయంతో సహకార వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. అప్పుడే చట్టం ఆశించిన విధంగా కౌలురైతుల విషయంలో సమత్వం, సామర్థ్యం సాధించవచ్చు. ప్రస్తుత ఆర్థిక విధానాల ఫలితంగా భవిష్యత్తులో వ్యవసాయం కౌలురైతుపైనే ఆధారపడవచ్చు. అందువల్ల ప్రభుత్వాలు కౌలురైతును చట్టప్రకారం గుర్తించాలి. భూయాజమాన్య రైతులకిచ్చే అన్ని రకాల సాయం, రాయితీలు అందించి ఆదుకోవాలి. లేకపోతే మొత్తం వ్యవసాయరంగం మనుగడ, దేశ ఆహార భద్రత ప్రమాదంలో పడతాయి!

- డాక్టర్‌ చీరాల శంకర్‌రావు
(రచయిత- సామాజిక అభివృద్ధి సంస్థ (సీఎస్‌డీ),
హైదరాబాద్‌లో సహాయ ఆచార్యులు)
Posted on 05-12-2017