Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

సేద్యానికి యంత్ర సాయం

* వ్యవసాయం వరస మారాలి
దేశ జనాభా, వ్యవసాయ భూముల విస్తీర్ణంలో ప్రపంచంలో భారతదేశం రెండోస్థానంలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పంటలన్నింటినీ ఏదో ఒక ప్రాంతంలో పండించగల అవకాశం ఉండటం మనదేశ విశిష్టత. అన్ని రకాల పంట కాలాలు, వాతావరణ వైవిధ్యాలు ఉండటం మరో విశేషం. వ్యవసాయ అనుబంధ రంగాలనే ఉపాధి మార్గంగా ఎంచుకొని జీవించేవారు దేశ జనాభాలో సగానికి మించి ఉన్నారు. వారిలో రెక్కల కష్టంతో సాగు చేస్తున్నవారే ఎక్కువ. చౌకగా పనివారు దొరుకుతారన్న అపప్రద మనదేశంపై ఉంది. మానవ వనరుల ద్వారానే అధికంగా సేద్య పనులు నిర్వహిస్తుండటమే అందుకు కారణం. అందుకే ఇక్కడి వ్యవసాయ స్థితిగతులను ఇతర దేశాలు వింతగా పరికిస్తుంటాయి. అనేక దేశాల్లో సేద్యపనులు చాలావరకు యంత్రాల ద్వారానే నిర్వహిస్తుంటారు. పాతకాలపు విధానాలవల్ల దేశీయ వ్యవసాయ పనుల్లో ఆలస్యం చోటుచేసుకుంటోంది. పనితనంలో స్థిరత్వం లోపిస్తోంది. ఉదాహరణకు వర్షాధారపు పంటల్లో, నేలలో తేమ ఉండగానే విత్తు నాటాలి. తేమ తగ్గాక విత్తిన పైర్లలో మొలక లోపిస్తుంది. మొక్కల సాంద్రత తగ్గి దిగుబడులు పడిపోతుంది.

సులభ శైలి
పర్యావరణంలో వస్తున్న మార్పుల వల్ల సేద్య స్థితిగతులూ క్రమం తప్పుతున్నాయి. మానవ శ్రమకు అధిక చెల్లింపులు అవసరం అవుతున్నాయి. వ్యవసాయ కూలీల సంఖ్య తగ్గిపోయి, సకాలంలో సేద్య పనులు మొదలుకావడం లేదు. సేద్య వ్యయాలు పెచ్చరిల్లి రాబడులు కుదించుకుపోతున్న దురవస్థ నేడు రైతులను ఆలోచనలో పడేస్తోంది. గిట్టుబాటుకాని సేద్యానికి స్వస్తి పలికి గ్రామీణ యువత ఇతర వృత్తి వ్యాపకాల వైపు మళ్లుతోంది. ఈ పరిణామాలు దేశ వ్యవసాయ రంగం పాలిట శాపాలవుతున్నాయి. అవకాశం ఉన్న రైతులు వ్యవసాయాన్ని కౌలుదారులకు అప్పగించి, ఇతర పనులు చేపడుతున్నారు. కొందరు పెద్ద రైతులు యాంత్రిక వ్యవసాయానికి మారిపోయారు. వూరికి ఒక ట్రాక్టర్‌ ఉన్న రోజులు గతించాయి. ప్రతి వూరిలో పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, టిల్లర్లు వచ్చేశాయి. వ్యవసాయ కార్యక్రమాల్లో బరువైన పనులు యంత్రాల ద్వారానే సాగిస్తున్నారు. చేలలో అరకలకు బదులు ట్రాక్టర్‌ దున్నకాలు, ‘సీడ్‌ డ్రిల్‌’లు సామాన్య దృశ్యమయ్యాయి. మాగాణి చేలలో కోత, నూర్పిడి యంత్రాలు ప్రవేశించాయి. వ్యవసాయ పనుల్లో 45 శాతం యాంత్రీకరణ జరగ్గా, మిగిలినవాటిలో యంత్రాల వినియోగం తప్పనిసరిగా మారింది.
దేశంలో చిన్న కమతాల సంఖ్యే అధికం. ఇక రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులు, అవకాశాల్లో తేడాలు ఉన్నాయి. దీనివల్ల యాంత్రీకరణ వేగం ఒక్కో రాష్ట్రంలో ఒక్కో విధంగా ఉంటోంది. యాంత్రీకరణలో పంజాబ్‌, హరియాణా రాష్ట్రాలు వేగంగా దూసుకెళ్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాలు, దక్షిణాదిలో అదంతగా విస్తరించలేదు. వ్యవసాయ యంత్రాల్లో ఎక్కువగా వినియోగిస్తున్నవి ట్రాక్టర్లే. వీటి తయారీ మనదేశంలో అధికంగానే ఉంది. భారత్‌ నుంచి ఆఫ్రికా, ఇతర ఆసియా దేశాలకూ ట్రాక్టర్లు ఎగుమతి అవుతున్నాయి. ట్రాక్టర్ల తరవాతి స్థానం ‘పవర్‌ టిల్లర్ల’ది! ఉద్యాన పంటలు, అంతర సేద్యం, చిన్న చిన్న బరువు వస్తువులను తీసుకెళ్లడానికి వీటిని వాడుతున్నారు. ప్రస్తుతం రోటోవేటర్లు, విత్తనం వేసే పరికరాలు, కోత యంత్రాల వినియోగం వూపందుకుంటోంది.

వ్యయ నియంత్రణ, సకాలంలో పనుల పూర్తి, సేద్య విధానాల్లో స్థిరత్వం తీసుకురావడానికి యంత్రాలు ఎంతగానో దోహదపడుతున్నాయి. పని భారం తగ్గింది. కూలీల వ్యయం కలిసివస్తోంది. దిగుబడుల వృద్ధీ సాధ్యపడుతోంది. అయితే యంత్రాల కొనుగోలు, నిర్వహణ వ్యయాలు చిన్న రైతులకు అందుబాటులో ఉండవు. అందువల్ల అక్కడక్కడ రైతులు సంఘాలుగా ఏర్పడి ఉమ్మడిగా వ్యవసాయ యంత్రాలను కొనుగోలు చేసుకుంటున్నారు. కొందరు అగ్రో ఇండస్ట్రీస్‌ కార్పొరేషన్‌కు బాడుగ చెల్లించి వినియోగించుకుంటున్నారు. ఇవి పరిమిత సంఖ్యలో ఉండటం వల్ల రైతులకు వెంటనే అందుబాటులోకి రాని పరిస్థితి ఉంది. ప్రతి గ్రామంలో పెద్దరైతులు తమ ట్రాక్టర్లను అద్దెకు ఇస్తున్నారు. ప్రభుత్వ రాయితీలు ఉన్నందువల్ల పరపతిగల రైతులు, ఉపాధి కోసం యువకులు వీటిని కొనుగోలు చేసి ఉపాధి మార్గంగా మలచుకుంటున్నారు.

జాతీయ ఆహార భద్రత పథకం కింద ఉత్పత్తులను పెంచేందుకు యాంత్రీకరణ తప్పనిసరి. అరకొర పద్ధతుల్లో వ్యవసాయం చేయడం ద్వారా ఆశించిన దిగుబడులు రావు. సరైన లోతులో గింజలు విత్తడం, పంటల నిర్వహణ సక్రమంగా జరిగితేనే అధిక దిగుబడులు వస్తాయి. ఉత్పత్తులు పెరిగితేనే దేశ అవసరాలు తీరి, ఎగుమతుల ద్వారా విదేశ మారక ద్రవ్యమూ ఆర్జించడానికి అవకాశం ఏర్పడుతుంది. దేశంలో ధరల స్థిరీకరణకూ బాటలు పడతాయి. దేశంలో వివిధ వాతావరణ పరిస్థితులు, పంటలకు అవసరమైన యంత్రాలను ప్రవేశపెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. వరిసాగుకు అవసరమైన యంత్రాలు మెట్టసాగుకు అనుకూలించవు. మెట్టసాగులోనూ పంటలవారీగా ప్రత్యేక యంత్రాలను ఏర్పచుకోవాలి. అప్పుడే వ్యవసాయంలో సంపూర్ణ యాంత్రీకరణ సాధ్యపడుతుంది. ఈ విషయంలో ఎక్కడికక్కడ గ్రామీణ సేద్య పరిశోధనలు వూపందుకోవాలి. స్థానిక అవసరాలకు తగిన విధంగా వ్యవసాయ యాంత్రీకరణ చోటుచేసుకోవడానికి ప్రభుత్వం యువ రైతాంగానికి తగిన ప్రోత్సాహకాలు అందజేయాలి.

ఆధునిక రీతులు
వానలు గతి తప్పుతున్నాయి. క్రమబద్ధంగా నదుల్లో జలాలు అందుబాటులోకి రావడం లేదు. మరోవైపు సాగునీటి అవసరాలు నానాటికీ పెరుగుతున్నాయి. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని, కాలంచెల్లిన నీటిపారుదల వ్యవస్థలకు తెరదించాలి. సూక్ష్మ సాగునీటి పరికరాల ద్వారా నీటి వినియోగ సామర్థ్యం పెంచుకోవాలి. ఆ దిశగా ఏర్పాట్లు జరుగుతున్నా, వాటి వేగం పెంచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వర్షాభావ పరిస్థితుల్లో ఆదుకునేలా పంటనీటి కుంటల సౌకర్యాలను రైతాంగం విస్తరించుకోవాలి.పూర్తిగా వాతావరణ పరిస్థితులపై ఆధారపడకుండా- హరిత గృహాలు(గ్రీన్‌హౌస్‌), నీడ ఏర్పాటు(షేడ్‌నెట్‌) ద్వారా అధిక విలువగల పంటలను సురక్షితంగా పండించుకోగల మార్గాలను అన్వేషించాలి. పంటలు నిరాటంకంగా పండినప్పుడే నిత్యావసరాల ధరలు సామాన్యుడికి అందుబాటులో ఉంటాయి.

కాలంతోపాటు మారితేనే వ్యవసాయంలో మనుగడ సాధ్యం. ప్రస్తుతం వ్యవసాయమే జీవనాధారంగా ఉన్న జనాభాలో కొందరు ఈ వృత్తిని వీడిపోతున్నారు. అయినా, పూర్తి ఉపాధి కల్పించే కల్పతరువుగా వ్యవసాయం నిలబడాలి. ఈ రంగంలో మిగిలినవారికైనా వ్యవసాయం గిట్టుబాటు కావాలి. శ్రమ, వ్యయభారాలు తగ్గి, ఉత్పాదకత పెరగాలి. కచ్చితమైన సేద్య విధానాలు(ప్రెసిషన్‌ ఫార్మింగ్‌) పాటించాలి. అందుకోసం వ్యవసాయ యాంత్రీకరణే సరైన దారి. యంత్ర సేద్యం సాకారం కావడానికి వ్యవసాయ ఇంజనీరింగ్‌ అభివృద్ధి చెంది, కొత్తపుంతలు తొక్కాలి. నిస్పృహకు లోనుకాకుండా గ్రామీణ యువత వైవిధ్యభరితమైన ఆలోచనలతో ఈ రంగంపై దృష్టి సారించాలి. విత్తు నుంచి గిడ్డంగుల్లో నిల్వ దాకా ఎక్కడికక్కడ స్థానికంగా ఉత్పత్తి ఖర్చులు అదుపుచేయగల సేద్య మార్గాలను వ్యవసాయ రంగంలోని గ్రామీణ యువత అన్వేషించాలి. అప్పుడే ఐటీ రంగంకన్నా మిన్నగా దేశంలో వ్యవసాయ రంగం పునర్వైభవాన్ని సంతరించుకుంటుంది!

- డాక్టర్‌ మొవ్వ రామారావు
Posted on 08-12-2017