Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

తగ్గిన పంట... ధరల మంట

* ప్రమాదంలో ఆహార భద్రత
వర్షాలు సమృద్ధిగా కురిసినా ఈ ఏడాది పంటల దిగుబడుల అంచనాలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌ ముగిసినా ఆశించిన స్థాయిలో పంటలు విపణికి రాలేదు. ఉల్లిగడ్డల ధరలు మళ్ళీ మండుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో రెండు నెలలుగా కూరగాయలు, ఆహారోత్పత్తుల ధరలు పెరుగుతున్నాయి. పంట దిగుబడులు తగ్గడమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఇప్పుడు రబీలో దిగుబడులు పెరుగుతాయా అన్నదీ సందేహమే. సీజన్‌ మొదలై రెండు నెలలు దాటినా ఆహార ధాన్యాల పంటలు పుంజుకోలేదు. వానకాలంలో సాగుచేసిన పత్తి పంట విస్తీర్ణం భారీ స్థాయిలో పెరగడం వల్ల ఆ పొలాల్లో ఇప్పుడు రెండో పంట వేయడానికి అవకాశం లేకుండా పోయింది. తెలంగాణలో ఏటేటా రెండో పంట సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తున్నట్లు అర్థ గణాంకశాఖ తాజా నివేదికలో వెల్లడించింది.

దక్కని ఉపశమనం
భారత్‌లో పంట దిగుబడులు ఘనంగా పెరుగుతున్నాయన్న ప్రచారాన్ని మండుతున్న ధరలు ప్రశ్నార్థకంగా మారుస్తున్నాయి. నిరుడు (2016-17) దేశ చరిత్రలోనే రికార్డుస్థాయిలో 11.01 కోట్ల టన్నుల బియ్యం పండినట్లు కేంద్రం వెల్లడించింది. అయినా, బియ్యం ధర ఎక్కడా తగ్గకపోగా మరింత పెరిగింది. నిరుపేదలకు రేషన్‌ కార్డులపై కిలో బియ్యం రూపాయికే ఇస్తున్నట్లు తెలుగు ప్రభుత్వాలు చెబుతున్నాయి. కార్డులు లేనివారు బహిరంగ విపణిలో కిలోకు రూ.50 దాకా వెచ్చిస్తున్నారు. ఇక ప్రపంచంలోనే అత్యధికంగా చక్కెర ఉత్పత్తి చేసే దేశాల్లో మనది రెండోస్థానమని ఘనంగా చెప్పుకొంటాం. ధర మాత్రం నానాటికీ పెరుగుతోంది. ఏడాదిలో సగం రోజులు కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పంటలన్నీ సక్రమంగా పండుతూ దిగుబడులు పెరుగుతుంటే, ఆహారోత్పత్తుల ధరలెందుకు తగ్గడంలేదన్న ప్రశ్నకు ఎవరి వద్దా సమాధానం లేదు. వ్యాపార సూత్రం ప్రకారం ఉత్పత్తి పెరిగితే గిరాకీ, ధర పడిపోవాలి. కానీ అలా జరగడం లేదు. ధరలు ఇంతగా మండుతుంటే సామాన్యులకు పోషకాహారం అందుబాటు సమస్యాత్మకమే అవుతుంది. ఉల్లిగడ్డ, టొమాటో ధరలు భయపెడుతున్నాయి. ఉల్లిగడ్డ ధర నియంత్రణ కోసం ఎగుమతులపై కేంద్ర సర్కారు ఇటీవల మరిన్ని ఆంక్షలు విధించింది. గత జులైలో టన్ను ఉల్లిగడ్డల కనీస ఎగుమతి ధర(ఎంఈపీ) 186 డాలర్లు ఉండగా ఇప్పుడు 850 డాలర్లకు పెంచింది. దీనివల్ల ఆసియా దేశాలకు ఎగుమతులు బాగా తగ్గాయి. అయినా భారతదేశంలో చిల్లర ధర పెద్దగా తగ్గడంలేదు. గత వేసవిలో ఉల్లి సాగు, దిగుబడులు పడిపోవడమే ఇందుకు ప్రధాన కారణమని ‘జాతీయ ఉద్యాన పరిశోధన-అభివృద్ధి సంస్థ’ తాజాగా వెల్లడించింది. గతేడాది వేసవి పంట దిగుబడి 75 లక్షల టన్నులు. ఈ ఏడాది అందులో 25 శాతం వరకు తగ్గినట్లు తాజా అంచనా. దిగుబడులు పెరిగిఉంటే ఇప్పుడు చిల్లర ధరలు నియంత్రణలో ఉండేవి. పంట దిగుబడి తగ్గడం వల్లే కేంద్రం ఎగుమతి ధరను పెంచింది. మరోవైపు పాకిస్థాన్‌లోనూ ఉల్లి ఎగుమతులపై నిషేధం విధించినంత స్థాయిలో ఆంక్షలు అమలవుతున్నాయి. భారత్‌, పాక్‌ల నుంచి ఎగుమతులు తగ్గిపోవడంతో మలేసియా, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌ తదితర ఆసియా దేశాల్లో చిల్లర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బంగ్లాదేశ్‌లో రికార్డు స్థాయిలో కిలో ఉల్లి ధర 100 టాకాలకు (78 రూపాయలకు) చేరింది. నిరుడు భారత వ్యాపారులు 24 లక్షల టన్నుల ఉల్లిగడ్డలను విదేశాలకు ఎగుమతి చేశారు. మరోవైపు మే నుంచి వేసవి పంట సాగు తగ్గడంతో దేశంలో కొరత క్రమంగా అధికమవుతోంది. 2015-16తో పోలిస్తే 2016-17లో దేశవ్యాప్తంగా 7.87 లక్షల టన్నుల ఉల్లిగడ్డల అధిక దిగుబడి వచ్చింది. ధరలు పడిపోవడంతో రైతులు నిరాశకు గురై ఈసారి సాగు తగ్గించారు. ఇప్పుడు ధరల మంట పెరిగి సామాన్యులు అల్లాడుతున్నారు.

సామాన్యులను బెంబేలెత్తించేలా ప్రపంచవ్యాప్తంగా నిత్యావసర ఆహారోత్పత్తుల ధరలు మండిపోతున్నాయి. అంతర్జాతీయ సంస్థల అంచనాల ప్రకారం, పశ్చిమ దేశాల ప్రజల మాదిరిగా హైదరాబాద్‌లో ఒక వ్యక్తి సమగ్ర పోషకాహారం తినాలంటే ప్రస్తుత ధరల ప్రకారం రోజుకు రూ.242 ఖర్చుపెట్టాలని తేలింది. ఆసియా దేశాల ఆహార అలవాట్ల ప్రకారం ఆ వ్యయం రూ.176. ఆ ఆహారం తీసుకుంటేనే రోజుకు మనిషికి అవసరమైన 2,400 కిలోకేలరీల శక్తి శరీరానికి అందుతుంది. ఇంత ఖర్చు చేయగల ఆర్థిక శక్తి తెలుగు రాష్ట్రాల్లో సగానికి పైగా ప్రజలకు లేదు. ప్రపంచవ్యాప్తంగా ఆకలితో అలమటిస్తూ, పోషకాహార లోపంతో బాధపడుతున్న ప్రజల సంఖ్య 2016లో 81.50 కోట్లకు చేరిందని ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్‌ఏఓ) వెల్లడించింది. మరోవైపు, కోసుకుపోతున్న పంట దిగుబడులు ప్రపంచ ఆహార భద్రతపై ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ప్రపంచంలో అన్నార్తులు 1990లో 84.20 కోట్ల మేర ఉండేవారు. 2015నాటికి వారి సంఖ్యను సగానికి అంటే 42.10 కోట్లకు తగ్గించాలని 1996లో రోమ్‌లో ప్రపంచ దేశాలు తీర్మానించాయి. 2000లో ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశమూ ఇదే ప్రతిజ్ఞ చేసింది. గడువు ముగిసి రెండేళ్లయినా పోషకాహార లోపాలతో బాధపడుతున్నవారి సంఖ్య పెద్దగా తగ్గలేదు. తాజా పరిణామాల వల్ల ఈ ఏడాది వీరి సంఖ్య వంద కోట్లు దాటవచ్చన్న అంచనాలూ ఆందోళన కలిగిస్తున్నాయి.

నిత్యావసరాలైన ఆహారోత్పత్తులను కనీస ధరలకు అందించడానికి అనేక మార్గాలున్నాయి. పంట అధికంగా వచ్చినప్పుడు వాటిని మద్దతు ధరకు కొని శాస్త్రీయంగా నిల్వ చేయడం ప్రధాన పరిష్కార మార్గం. దేశంలోకెల్లా అత్యధికంగా టొమాటోలు పండించే తెలుగు రాష్ట్రాల్లో ఈ పంటను కనీసం వారం, పది రోజుల పాటు నిల్వ చేసుకునే సౌకర్యాలు లేవు. వాటి నుంచి విలువ ఆధారిత ఉత్పత్తులు తయారు చేయడానికీ ఎలాంటి సదుపాయాలు లేవు. ఉల్లిగడ్డలను మహారాష్ట్రలో వ్యాపారులు ఆరేడు నెలలు నిల్వ చేసి మార్కెట్‌ ధరలను శాసిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కనీసం కొంత పంటనైనా నిల్వ చేసే గిడ్డంగులు నిర్మించాలి. దక్షిణ కొరియా, నెదర్లాండ్స్‌ వంటి దేశాల్లో 90 శాతం పంటల శుద్ధి-నిల్వకు సదుపాయాలున్నాయి. భారతదేశంలో పట్టుమని 10 శాతం పంటలకైనా అలాంటి ఏర్పాట్లు లేకపోవడంతో వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టించి ధరల మంటను రాజేస్తున్నారు. ఇది అంతిమంగా సామాన్యుల పోషకాహారంపై ప్రభావం చూపుతోంది.

తృణధాన్యాలకు ప్రాధాన్యం
సరైన ఆహారం కొని తినలేని పేదలు, దిగువ మధ్యతరగతి ప్రజలు అధికంగా ఉన్న దేశం మనది. పండ్లు, కూరగాయలు అపారంగా పండించే అనువైన వాతావరణం, సారవంతమైన నేలలున్నా కనీస దిగుబడులు లేక కిలో వంద రూపాయలకు కొని తినాల్సి వస్తోంది. ఇలాంటి సమస్యల నుంచి బయట పడటానికి మార్గాలను అన్వేషించాలి. రూపాయికి కిలో బియ్యం ఇవ్వగానే ప్రజలంతా పోషకాహారం తింటున్నారనే అపోహల నుంచి బయటపడాలి. బియ్యం ఇచ్చినంత మాత్రాన సగటు మనిషికి సగం పోషకాలైనా అందవు. పోషకాహార లోపాలకు ఆహారోత్పత్తుల కొరతతో పాటు, మండుతున్న ధరలూ కారణమేనని పలు అధ్యయనాలు ఘోషిస్తున్నాయి. సులువుగా పండే సజ్జలు, రాగులు, జొన్నలు, కొర్రలు వంటి తృణధాన్యాలను పండించడానికి రైతులను ప్రోత్సహించాలి. వాటిని తక్కువ ధరలకు ప్రజలకు అందజేయాలి. తృణ ధాన్యాలను రైతుల నుంచి స్వయంగా సేకరించి పౌరసరఫరా వ్యవస్థల ద్వారా ప్రజలకు అందజేస్తున్న కర్ణాటక ప్రభుత్వ విధానం దేశానికే ఆదర్శప్రాయం. ఆహార ధాన్యాల పంటల సాగు, దిగుబడులు పెంచడానికి పాలకులకు ముందుచూపు అవసరం. ఈ ఏడాది వాన కాలంలో తెలుగు రాష్ట్రాల్లో 50 లక్షల ఎకరాలకు పైగా విస్తీర్ణంలో విషపూరిత బీటీ పత్తిని సాగు చేశారు. దీనివల్ల వానకాలంలోనే కాకుండా, ఇప్పుడు రబీలోనూ ఆహార పంటలు సాగు చేయడానికి భూములు తగ్గిపోయాయి. ఇలాంటి వాణిజ్య పంటలవైపు రైతులు మరలకుండా ఉండాలంటే, ఆహార పంటలకు గిట్టుబాటు ధరలు దక్కుతాయన్న భరోసా వారికి ప్రభుత్వాలు కల్పించాలి. ఉల్లిగడ్డలు, టమాటాలు, పండ్లు వంటి కనీస ఆహారోత్పత్తులైనా సామాన్యులు కొనలేనంతగా ధరలు మండుతున్నంత కాలం, పోషకాహార సమస్యలతో ప్రజలు తల్లడిల్లుతారన్నది నిష్ఠుర సత్యం. ఇలాంటి సమస్యల నుంచి ప్రజలను గట్టెక్కించేందుకు దూరదృష్టితో ప్రణాళికలను రచించుకోవాలి. అవి కొరవడినంతకాలం ఆరోగ్యకరమైన మానవ వనరులు; ఆర్థిక, ఆహార భద్రత సుదూర స్వప్నాలుగానే మిగిలిపోతాయి!

- మంగమూరి శ్రీనివాస్‌
Posted on 12-12-2017