Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

దొడ్డిదారిన జన్యుమార్పిడి

* విత్తన నియంత్రణ వ్యవస్థకు పురుగు

దేశంలో విత్తన నియంత్రణ వ్యవస్థల ఉనికినే సవాలు చేసే స్థాయికి జన్యుమార్పిడి(జీఎం) విత్తనాలు పొలాల్లో అక్రమంగా అల్లుకుపోతున్నాయి. మొన్నటివరకు అనుమతి ఉన్న జీఎం విత్తనాల వల్లే దేశ రైతాంగానికి, సేద్యానికి, ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లుతోందన్న తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ప్రస్తుతం అనుమతి లేకుండానే జీఎం విత్తనాలు రైతుల పొలాల్లో సాగవుతున్నాయి. వాటినెలా నియంత్రించాలో తెలియక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిక్కులు చూస్తున్నాయి. తాజాగా ఉభయ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు మూడోతరం(బీజీ-3) బీటీ పత్తి విత్తనాల అక్రమ సాగును నిరోధించాలని కేంద్రాన్ని కోరడమే ఇందుకు నిదర్శనం. వీటికి అడ్డుకట్ట వేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం సైతం రాష్ట్రాలను ఆదేశించింది. ఎలాంటి అనుమతులూ లేకుండానే దేశంలో 35 లక్షల ఎకరాల్లో బీజీ-3 పత్తి విత్తనాలు ఈ ఏడాది రైతులతో ప్రైవేటు విత్తన కంపెనీలు సాగు చేయించాయని సాక్షాత్తు జాతీయ విత్తన సంఘమే స్పష్టం చేయడం గమనార్హం. భారత వ్యవసాయరంగం భవిష్యత్తు ప్రమాదంలో పడిందనడానికిది దాఖలా. కేవలం పత్తితోనే ఆగిందా లేక ఆవాలు, వంగ, మొక్కజొన్న వంటి ఆహార పంటల జీఎం విత్తనాలను సైతం దేశంలో అక్రమంగా సాగుచేయిస్తున్నారా అన్నది గుర్తించడానికి అవకాశాలు లేవు. నాణ్యత లేని నాసిరకం, నకిలీ విత్తనాలను కొని పంటలు పండక రైతులు నష్టాల బారినపడి సతమతమవుతున్నారన్న అంశమే ఇంతకాలం బయటి ప్రపంచానికి తెలుసు. కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల జారీచేసిన ఆదేశాలు జన్యు మార్పిడి విత్తన మాఫియా సామ్రాజ్య ఉనికిని బట్టబయలు చేశాయి. ఇప్పటికే రెండో తరం జన్యుమార్పిడి పంటల సాగుకు కేంద్రం అనుమతించిన విధానాలను పార్లమెంటరీ స్థాయీసంఘం తప్పుపట్టిన నేపథ్యంలో తాజా పరిణామాలు పంట పొలాల్లో కొత్త సంక్షోభాన్ని రగిలిస్తున్నాయి.

తప్పు ఎవరిది?
దేశంలో జన్యుమార్పిడి చేసిన బీటీ పత్తి విత్తనాలను పదిహేనేళ్ల క్రితం అమెరికాకు చెందిన మోన్‌శాంటో కంపెనీ తెచ్చిన దగ్గరి నుంచి అనేక వివాదాలు తలెత్తుతున్నాయి. తొలుత పచ్చపురుగును తట్టుకుంటుందని బీజీ-1 రకం పత్తి విత్తనాలను 2002 నుంచి అమ్మకం ప్రారంభించారు. దీనికి తెగుళ్లను తట్టుకునే స్థాయి తగ్గుతుందని చెప్పి, బీజీ-2 రకం పత్తి విత్తులను ఆ కంపెనీ భారతదేశంలో అమ్ముతూ కొన్ని వందల కోట్ల రూపాయలను ఇప్పటికే రాయల్టీగా ఎగరేసుకుపోయింది. ఇదంతా గడచిన పదిహేనేళ్లుగా నడుస్తున్న చరిత్ర. ఈ విత్తనాలపై జరుగుతున్న విపరీతమైన ప్రచారం కారణంగా- దేశంలో ఆహార పంటలను కబళించి విషపూరిత బీటీ పత్తి పంట మూడు కోట్ల ఎకరాలు దాటిపోయింది. మూడేళ్లుగా బీజీ-2 రకం విత్తనాలతో సాగుచేస్తున్న పత్తి పంటకు గులాబీ రంగు పురుగు, ఇతర తెగుళ్లు విపరీతంగా సోకుతున్నందువల్ల సరైన దిగుబడి రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మరోవైపు అయిదారేళ్లుగా దేశంలో కూలీల వ్యయం అంతకంతకూ పెరుగుతోంది. కలుపు నివారణకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశంలో అన్ని రకాల పంటల్లో కలుపును పూర్తిగా నివారించగలిగితే రైతులకు అదనంగా లక్ష కోట్ల రూపాయలకుపైగా ఆదాయం వస్తుందని ‘జాతీయ కలుపు మొక్కల పరిశోధన కేంద్రం’ 2007లో తెలిపింది. పత్తి పంటలో కలుపు కారణంగా 47.7 శాతం వరకు ఉత్పాదకత తగ్గుతోందని ‘భారత వ్యవసాయ పరిశోధన మండలి’ 2009లో వెల్లడించింది. హెక్టారు విస్తీర్ణం కలిగిన పత్తి చేనులో కలుపు తీయించడానికి ఏడాదిలో రైతు సగటున ఎనిమిదివేల రూపాయల దాకా ఖర్చుపెట్టాల్సి వస్తోందని ‘జాతీయ వ్యవసాయ పరిశోధన, నిర్వహణ అకాడమీ’ 2011లో నివేదించింది. ఈ మూడు కేంద్ర ప్రభుత్వ జాతీయ సంస్థలు కలుపు సమస్యపై ఇచ్చిన లెక్కలను బహుళజాతి విత్తన, పురుగుమందుల సంస్థలు పరిగణనలోకి తీసుకున్నాయి. కూలీలతో పైర్లలో కలుపు తీయించకుండా నేరుగా విషపూరిత రసాయనాలు చల్లితే కలుపు మొక్కలు చనిపోయే పద్ధతులను విపణిలోకి తెచ్చాయి. తెలుగు రాష్ట్రాల్లో గడచిన రెండేళ్లుగా ‘గ్లైఫోసెట్‌’ అనే పేరు గల విషపూరిత రసాయనాన్ని పొలాల్లో చల్లితే ఎటువంటి కలుపు మొక్కలైనా మాడి చనిపోతున్నాయి. పత్తి మొక్కలు మాత్రం ఆ విష రసాయనాన్ని తట్టుకుని బతుకుతున్నాయి. దీనిపై గుజరాత్‌, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల వ్యవసాయ విశ్వవిద్యాలయాల శాస్త్రవేత్తలు; జాతీయ పత్తి సంస్థ పరిశోధకులు పొలాలకెళ్లి ఆరాతీస్తే గ్లైఫోసెట్‌ను తట్టుకుని బతుకుతున్న పత్తి మొక్కలు కొత్తరకం బీజీ-3 వంగడాలని తాజాగా నిర్ధారణ అయింది. జాతీయ పత్తి సంస్థ ఇచ్చిన నివేదిక ఆధారంగా అనుమతి లేకుండా ఈ విత్తనాలు విపణిలోకి ఎలా వచ్చాయి, అందుకు బాధ్యులైనవారిని గుర్తించి శిక్షించడానికి సీబీఐ విచారణ జరిపించాలని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని ప్రత్యేకంగా కోరింది. ఈ విత్తనాలు మార్కెట్‌లోకి ఎలా వచ్చాయో చెప్పాలని పలు విత్తన సంస్థలకు నోటీసులు సైతం జారీచేసింది.

విదేశాల నుంచి జీఎం విత్తనాలను తేవాలన్నా, ఇక్కడ ప్రయోగాత్మకంగా లేదా వాణిజ్యపరంగా సాగు చేయించాలన్నా కేంద్ర పర్యావరణ శాఖకు చెందిన ‘జెనెటిక్‌ ఇంజినీరింగ్‌ అప్రూవల్‌ కమిటీ’(జీఈఏసీ) అనుమతి ఇవ్వాలి. కానీ మోన్‌శాంటో కంపెనీ కలుపు మందులను తట్టుకునే బీజీ-2(రౌండప్‌ రడీ ఫ్లెక్స్‌-ఆర్‌ఆర్‌ఎఫ్‌) పత్తి విత్తనాలను 2006 నుంచి దేశంలోని 21 ప్రాంతాల్లో ప్రయోగాత్మకంగా సాగుచేయించి పరిశీలన జరిపింది. ఈ బీజీ-2-ఆర్‌ఆర్‌ఎఫ్‌నే కలుపును తట్టుకునే బీజీ-3 పేరుతో రైతులకు అక్రమంగా అమ్ముతున్నారు. ఈ విత్తనాల సాగువల్ల హెక్టారు పత్తి చేనులో రూ.5,842 నుంచి రూ.8,015 వరకు వ్యయం తగ్గినట్లు మోన్‌శాంటో సంస్థ చెబుతోంది. పైగా ఈ విత్తనాలను ఆస్ట్రేలియా, కొలంబియా, దక్షిణాఫ్రికా, మెక్సికో, బ్రెజిల్‌, అమెరికాల్లో సాగుకు అనుమతించారని; భారత్‌లో సైతం రైతులకోసం వాణిజ్య మార్కెట్‌లో అనుమతించాలని 2013 మార్చిలో భారత జీఈఏసీకి మోన్‌శాంటో తరఫున మహికో సంస్థ దరఖాస్తు చేసింది. దీనికి అనుమతులు త్వరగా రాలేదని, కాబట్టి సత్వరం అనుమతించాలని కోరుతూ 2014 ఆగస్టు 21న నాటి పర్యావరణ శాఖ మంత్రికి మరో లేఖ రాసింది. మరోవైపు దేశంలో ఆవాల పంటకు సంబంధించి జీఎం విత్తనాలకు అనుమతి ఇవ్వాలని దిల్లీ విశ్వవిద్యాలయం చేసుకున్న దరఖాస్తుపైనా వివాదం రాజుకుంది. 2017 వరకు జీఎం విత్తనాలపై ఎలాంటి చర్యలూ తీసుకోవద్దని సుప్రీంకోర్టు ఆంక్షలు విధించింది. ఈ నేపథ్యంలో జీఎం విత్తనాలకు లైసెన్సులు తప్పనిసరి చేస్తూ, అందుకు రుసుములు నిర్ణయించి, వాటిని నిత్యావసరాల చట్టం పరిధిలోకి తెస్తూ కేంద్రం మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇవి తమకు నష్టదాయకమంటూ మహికో సంస్థ, 2013 మార్చిలో బీజీ-2ఆర్‌ఆర్‌ఎఫ్‌ విత్తనాల వాణిజ్య అమ్మకాల అనుమతి కోరుతూ అడిగిన దరఖాస్తును ఉపసంహరించుకుంటున్నామని, తమ విత్తన సమాచారం మొత్తం వెనక్కి ఇవ్వాలని 2016 జులై ఎనిమిది జీఈఏసీకి మరో దరఖాస్తు సమర్పించింది. దాంతో 2016 ఆగస్టు 15నాటికి మొత్తం సమాచారాన్ని ఆ కంపెనీకి జీఈఏసీ వెనక్కి ఇచ్చేసింది. అక్కడితో వాణిజ్య అమ్మకాలకు అనుమతి ఇవ్వలేదని, ఇక భారతదేశంలోకి బీజీ-2 ఆర్‌ఆర్‌ఎఫ్‌ విత్తులు రావని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భావించాయి. విచిత్రంగా 2015నుంచి ఇదే రకం విత్తనాలు దేశంలో అక్రమంగా రైతుల పొలాల్లోకి రావడం మొదలై ఇప్పుడు 35 లక్షల ఎకరాలకు విస్తరించాయి. నిజంగా మోన్‌శాంటో సంస్థ 2006 నుంచి 2016 వరకు ప్రయోగాత్మకంగా సాగుచేసిన అన్ని విత్తనాలను వెనక్కి తీసేసుకుని ఉంటే, ఇప్పుడు మార్కెట్లో రైతులు అక్రమంగా సాగుచేస్తున్న కలుపు తట్టుకునే బీజీ-3 రకం విత్తనాలు ఎవరివన్నది నిగ్గుతేలాలి. ఇవి మోన్‌శాంటో కంపెనీవా కాదా అన్నది అదే కంపెనీని అధికారికంగా అడగాలని తెలంగాణ వ్యవసాయశాఖ, రాష్ట్ర విత్తన ధ్రువీకరణ సంస్థ కేంద్రానికి సూచించాయి. ఒకవేళ మోన్‌శాంటో ఒప్పుకొంటే అనుమతి లేకుండా, అక్రమంగా రైతులకు విత్తనాలను అమ్మినందుకు చట్టప్రకారం దానికి శిక్ష తప్పదు. అవి తమ విత్తనాలు కావని ఆ సంస్థ స్పష్టంగా చెబితే- అదే పరిజ్ఞానాన్ని భారత పత్తి సంస్థకు, వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు అందించి వాటిపై అధికారిక ముద్ర వేసి భారత ప్రభుత్వం సొంతం చేసుకోవాలని తెలంగాణ వ్యవసాయశాఖ సూచించింది.

ప్రమాదంలో రైతు భద్రత
దేశంలో విత్తన నాణ్యతపై రైతులకు భరోసా ఇవ్వడం ప్రభుత్వాలు, విత్తన సంస్థల బాధ్యత. దీన్ని విస్మరించి రైతులకు నష్టం కలిగించేవారికి కఠిన శిక్షలు పడేలా నియంత్రణ వ్యవస్థ ఉండాలి. చైనాలో నాణ్యతలేని, నకిలీ విత్తనాలు అమ్మేవారికి తీవ్ర శిక్షలు విధిస్తారు. నాసిరకం విత్తనాలవల్లే ఏటా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. బీజీ-3 పత్తి వంగడాలను కేంద్రం అనుమతించకపోయినా అవి లక్షలాది ఎకరాల్లో విస్తరించాయి. దీనివల్ల పర్యావరణానికి, పశుసంపదకు అపార నష్టాలు పొంచి ఉన్నాయన్న ఆందోళనలు మిన్నంటుతున్నాయి. వంగ, ఆవాలు, మొక్కజొన్న వంటి జీఎం విత్తనాలు దేశంలోకి అక్రమంగా వచ్చేస్తే ప్రజల ఆరోగ్యానికీ భద్రత కరవవుతుంది. దేశంలో సైన్స్‌ పట్టభద్రులే పురుగుమందుల విక్రయాలు నిర్వహించాలన్న చట్టాన్ని ఎవరూ ఖాతరు చేయకపోవడంపై ఇప్పటికైనా దృష్టి పెట్టాలి. కఠినమైన కొత్త చట్టం తీసుకువస్తామని కేంద్రం పదేళ్లుగా చెబుతోంది. ఆ ప్రతులేవీ పార్లమెంటు దాటి బయటకు రావడంలేదు. జీఎం, సంకరజాతి విత్తనాలు నాసిరకమైతే రైతులకు వాటిల్లే నష్టం అపారంగా ఉంటోంది. వీటికి పకడ్బందీగా అడ్డుకట్టవేసే వ్యవస్థలను ఏర్పాటు చేయాలి. ఇప్పటికే ఈ తరహా వ్యవస్థలు ఉన్నాయని అంటున్నారు. అదే నిజమైతే, బీజీ-3 విత్తులు రైతుల పొలాల్లోకి ఎలా చేరగలుగుతున్నాయన్న ప్రశ్నకు సమాధానం లేదు. ఇదొక పాఠం. జీఎం విత్తన నియంత్రణ వ్యవస్థకు మరింత పదును పెట్టాల్సి ఉంది. తెగుళ్లను తట్టుకుంటాయని చెప్పి రైతులకు బీటీ పత్తి విత్తనాలు విక్రయించారు. వాటిని సాగుచేస్తే గులాబీరంగు పురుగు సోకి దిగుబడి తగ్గిందని మహారాష్ట్ర ప్రభుత్వం విత్తన కంపెనీలకు నోటీసులిచ్చింది. ప్రస్తుతం అదే కంపెనీల నుంచి రైతులకు నష్టపరిహారం సైతం ఇప్పించాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు దేశానికే ఆదర్శప్రాయం. ప్రభుత్వాలు ఇలాంటి గట్టి చర్యలు తీసుకుంటాయనే సందేశం వెళితేనే కంపెనీల వెన్నులో వణుకు పుడుతుంది.

- మంగమూరి శ్రీనివాస్‌
Posted on 03-01-2018