Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

పొలాల్లో అంకురిస్తున్న అద్భుతాలు

* ఇజ్రాయెల్‌ నేర్పుతున్న పాఠాలు

సృజనాత్మక ఆలోచనలకు పెట్టింది పేరైన ఇజ్రాయెల్‌- అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించి వ్యవసాయ రంగంలో అనూహ్య విజయాల్ని అందుకుంటోంది. ఎలాంటి సహజ వనరులూ అందుబాటులో లేని స్థితిలోనూ వైజ్ఞానిక ప్రతిభతో యావత్‌ ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేస్తోంది. పుష్కలమైన వనరులుండి వ్యవసాయరంగంలో పురోగమిస్తున్నా, రైతుల ఆత్మహత్యల్ని నివారించలేని దుస్థితిలో భారత్‌ ఉంది. ఇజ్రాయెల్‌కు అవసరాల నుంచే ఆలోచనలు మొదలయ్యాయి. సంకల్ప బలంతోనే ప్రగతి సాకారమైంది. ఆ దేశం సేద్యంలో వినూత్న ఆవిష్కరణలకు, అంకుర పరిశ్రమలకు వేదికగా నిలిచింది. ఎదురయ్యే ప్రతి సమస్యకూ పరిష్కారాన్ని కనుగొంటోంది. మన పరిస్థితి వేరు! వ్యవసాయంలో ఎన్నో అంకుర సంస్థలు(స్టార్టప్స్‌) ఏర్పాటైనా, అవి సగటు రైతుకు దిశానిర్దేశం చేసే స్థితికి ఇంకా ఎదగలేదు. అందుకు ఎన్నో ప్రతిబంధకాలు ఉన్నాయి...
బ్రిటిష్‌ వలస పాలన నుంచి స్వాతంత్య్రం పొందిన భారత్‌, ఇజ్రాయెల్‌ రెండూ- నిత్యం సమస్యలతో సతమతమవుతున్నాయి. అవి చుట్టూ శత్రువులతో అప్రకటిత యుద్ధం చేస్తున్నాయి. ఇంచుమించు ఒకేసారి స్వాతంత్య్రం పొందిన ఈ దేశాలు తమకున్న అవకాశాల్ని గుర్తించి నేడు ప్రపంచ శక్తులుగా ఎదుగుతున్నాయి. భారత్‌లో ఒక జిల్లా అంత విస్తీర్ణమైనా లేని ఇజ్రాయెల్‌, తన మేధతో సృజనాత్మక ఆవిష్కరణలతో వ్యవసాయం, నీటిపారుదల రంగాల్లో అమేయశక్తిగా ఆవిర్భవించింది. విద్యావంతులైన ఇజ్రాయెల్‌ రైతులు సహకార సంఘాలుగా ఏర్పడి తమకేం కావాలో తెలుసుకొని ప్రపంచ విపణులను అందుకోగలుగుతున్నారు. జనాభాలో మూడోవంతు నిరక్షరాస్యులైన భారతీయ రైతులు నీరు, విత్తనాలు, ఎరువులు అందక మార్కెట్లలో అడుగడుగునా దోపిడికి గురవుతున్నారు. రాజకీయ జోక్యం, దళారుల ప్రమేయం కారణంగా దగా పడుతున్నారు. ఇజ్రాయెల్‌ పరిశోధక సంస్థలతో పాటు అంకుర సంస్థలు నవ్య సాంకేతిక ఆవిష్కారాలతో వ్యవసాయాన్ని ప్రపంచానికి ఒక ఉదాహరణగా మార్చేశాయి. అందుకు వారు పడిన కష్టం ఇంతా అంతా కాదు. రాళ్లు, రప్పలు, కొండలు, గుట్టలతో నిండిన నేలల్ని సుసంపన్నంగా మార్చిన వారి సంకల్పం ముందు సమస్యలు తోకముడిచాయి.

కఠోర శ్రమతో ముందడుగు
నీరే లేని ఎడారుల్లో పంటలు పండించడమే అసాధ్యం. చిన్నచిన్న పీపాల్లో నీరు తెచ్చి మొక్కల ప్రాణం నిలుపుతూ ఇజ్రాయెల్‌ రైతులు సాగించిన ప్రయాణం, చుక్క చుక్కనూ ఒడిసిపట్టే సాంకేతికతను సాధించేవరకూ వెళ్లింది. అంతటితో ఆగలేదు. ప్రతి చుక్క నీటితో పాటు- మానవ శ్రమ అవసరం లేకుండా పంటకు ఎరువులు, సూక్ష్మపోషకాలను ఎలా అందించాలో ఆలోచించారు. ఏదో ఒక సమయంలో అందించడంతో సరిపెట్టకుండా... కంప్యూటర్‌ ఆధారంగా పంటకు ఎప్పుడు, ఏ సమయంలో ఎంత మొత్తంలో అందించాలో లెక్కగట్టి ఆ ప్రకారం అందించే సాంకేతికతపై పట్టు సాధించారు. గంటకు 8 నుంచి 16 లీటర్ల నీటిని మొక్కకు కల్పించే స్థాయి నుంచి, నేడు గంటకు లీటరు కన్నా తక్కువ నీటిని అందించేంత నవీన సాంకేతికతను అభివృద్ధిచేశారు. ఇలా సమర్థ నీటియాజమాన్యం దిశగా ఎంతో పురోగతి సాధ్యపడింది. హరిత పందిళ్లలో ఉష్ణోగ్రతల్ని తగ్గించడం ఖర్చుతో కూడిన పని.వారు వివిధ ఉష్ణోగ్రతల్లో మాత్రమే పెరిగేవాటిని ఈ పందిళ్లలో నియంత్రిత వాతావరణ పరిస్థితుల మధ్య పండించడం ఆరంభించారు. ఇలా బహుముఖంగా విస్తరించిన ఆలోచనలకు అక్కడ ప్రభుత్వపరంగా తోడ్పాటు లభిస్తోంది.వివిధ పద్ధతులతో అతి తక్కువ విస్తీర్ణంలో అత్యల్ప నీటి వాడకం ద్వారా అత్యధిక దిగుబడుల్ని అక్కడి రైతులు సొంతం చేసుకుంటున్నారు.
వ్యవసాయం, అనుబంధ రంగాల్లో నవకల్పనలకు ఇజ్రాయెల్‌ అంకుర సంస్థలు తమ వంతు చేయూతనిస్తున్నాయి. ప్రతి పనిలో సాంకేతికతకు నగిషీలు చెక్కుతూనే ఉన్నారు. ఒక సమస్యకు పరిష్కారం లభించగానే వారు మిన్నకుండిపోవడం లేదు. మరింత సులభమార్గాలు అన్వేషించడంపైనే దృష్టి పెడుతున్నారు. సేద్యంలో ఎదురయ్యే ప్రతి సవాలునూ స్వీకరించి ముందుకు సాగుతున్నారు. అత్యల్ప జల లభ్యత ఉన్న ఆ దేశానికి పారిశ్రామిక, వ్యవసాయ, గృహ అవసరాలకు నీటి వాడకం కష్టతరమైంది. వాడేసిన నీటిని పునర్వినియోగించుకోవడంతో పాటు మధ్యదరా సముద్ర ఉప్పునీటిని సైతం మంచినీటిగా మార్చే సాంకేతికతను ఇజ్రాయెల్‌ సాధించింది. సముద్రనీటిని మంచినీటిగా మార్చే సాంకేతిక పరిజ్ఞానంలో ప్రపంచ దేశాల కంటే ముందుంది. ప్రపంచంలో వ్యర్థజలాల్ని 75 శాతం పునర్వినియోగిస్తున్న దేశంగా ఇజ్రాయెల్‌ అగ్రస్థానంలో ఉంది. కేవలం 12 శాతం వినియోగంతో స్పెయిన్‌ది రెండో స్థానం. ఇలా ఉప్పు నీటిని తాగునీటిగా మార్చే సాంకేతికతను ప్రపంచానికి అందిస్తున్న ఇజ్రాయెల్‌- 40కి పైగా దేశాల్లో 360 వరకు ఉప్పునీటి శుద్ధిప్లాంట్లను ఏర్పాటుచేసింది. ఇదంతా ఆ దేశ సాంకేతికతకు ప్రతీక. అక్కడ వ్యవసాయాన్ని ఎంచుకున్నవారు కొందరు. అందులో సాంకేతిక నైపుణ్యానికి పదునుపెట్టేవారు మరికొందరు. భూమిపై ప్రభుత్వానికే హక్కు ఉండటంతో, వాటిని లీజుకు తీసుకున్న సహకార సంస్థల (కిబుట్జ్‌, మెషావ్‌) సభ్యులైన రైతులకు పరిశోధన ఫలితాలు నేరుగా అందుతాయి. ఇజ్రాయెల్‌ వ్యవసాయ పరిశోధనలకు కీలక కేంద్రమైన వాల్కని సెంటర్‌తో పాటు బెన్‌గురియన్‌, హీబ్రూ విశ్వవిద్యాలయాల కృషి అపారం. దాని ఆధారంగా, కంపెనీలు ఆ సాంకేతికతను రైతుల పొలాల్లో ఆచరించి చూపుతున్నాయి. ఫలితాల్ని విశ్లేషించి, సంతృప్తికరం అనిపించాక వాటికి వాణిజ్య ప్రయోజనం కల్పిస్తారు. ఇందుకు ఆయా సంస్థలు విశ్వవిద్యాలయాలకు తగిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. వీటిని దేశీయంగా, అంతర్జాతీయంగా ఇజ్రాయెల్‌ కంపెనీలు రైతులకు అందిస్తున్నాయి. అక్కడి రైతులు, వ్యవసాయ పరిశోధకులు, అధికారులు పలు వాణిజ్య కంపెనీలతో కలిసి పనిచేస్తున్నారు. వీరందరి కృషి ఫలితంగా వెలుగు చూసిన సాంకేతికత ద్వారా ఎల్లలెరుగని ఫలితాలను అందుకుంటున్నారు. భారీ స్థాయిలో ఆదాయాన్ని పొందుతున్నారు.
వ్యవసాయ రంగానికి చెందిన అంకుర సంస్థలు మనదేశంలో 15 ఏళ్లనుంచే ఆరంభమైనా, వాటిలో చాలావరకు తమ పనితీరుతో వాణిజ్యపరంగా ఎదుగుతున్నాయే తప్ప సగటు రైతులకు మేలు చేసే రీతిలో లేవు. ఎన్నో వ్యవసాయ సంస్థలు ఆవిష్కరణలతో రైతులకు చేయూతనందిస్తున్నాయి.హైదరాబాద్‌తో పాటు పుణె, సూరత్‌, చండీగఢ్‌, బెంగళూరు, ముంబయి, చెన్నై, నాసిక్‌, జామ్‌నగర్‌, దిల్లీ, నోయిడా, కోల్‌కతా, జబల్‌పూర్‌, నాగ్‌పూర్‌ కేంద్రాలుగా భారత్‌లో పలు వ్యవసాయ కంపెనీలు, అంకుర సంస్థలు సేద్యం, అనుబంధ రంగాల్లో రైతులకు తోడ్పడుతున్నాయి. చిన్నరైతులకు సేద్యంలో ఖర్చును తగ్గించడం, తక్కువ ఖర్చుకే యంత్రాలు అందించడం, వ్యవసాయోత్పదకాల సరఫరా, సాగు సలహాలు తదితర అంశాల్లో సేవలను అందిస్తున్నాయి. వీటికితోడు ఎందరో ఔత్సాహికులు, పరిశోధకులు రైతులకు సేద్యంలో ఎదురయ్యే ఇబ్బందులకు తమ సృజనలతో తగిన పరిష్కారాలను చూపుతున్నారు. చిన్న రైతుకు చేయూతనిచ్చే ఇలాంటి ఆవిష్కరణలకు ఎలాంటి ప్రోత్సాహం లేకపోగా- పెద్దపెద్ద అంకుర సంస్థలు, వ్యవసాయ కంపెనీలు ఎదుగుతున్నాయే తప్ప వాటి పనితీరు వల్ల... నిరక్షరాస్యులైన భారతీయ రైతుల ఆదాయాల్ని పెంపొందించడం లేదు. ఇజ్రాయెల్‌ నుంచి మనం ఎన్నో పాఠాలు నేర్వాల్సిన అవసరం ఉంది. మరోవైపు దేశంలో నేడు హరిత పందిళ్లలో సాగు వూపందుకుంటోంది. ‘ఫర్టిగేషన్‌’ ఉపయోగం పల్లెలకూ విస్తరిస్తోంది. మొత్తం వ్యవసాయంలో వీటి శాతం బహు స్వల్పమే. వ్యవసాయ సాంకేతిక సృజనలకు స్పందన పెరుగుతోంది. అవి అంకుర సంస్థలుగా రూపాంతరం చెందితే, వాణిజ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి.

పంట యాజమాన్యంలో దిట్ట
ఇజ్రాయెల్‌ వాతావరణంలో ఆపిల్స్‌ వంటివి పండించడం నిజంగా విస్తుగొలిపే అంశం. దాన్ని ఆ దేశం సాధించి చూపింది. అటువంటివి పండించాలంటే, వాటికి అవసరమైన వాతావరణ పరిస్థితుల్ని సృష్టించాలి. మేలైన పంట యాజమాన్యంతో అక్కడి రైతులు దీన్ని సమర్థంగా చేపట్టారు. విభిన్నంగా నీరు, ఎరువుల యాజమాన్యం వల్ల ఎడారుల్లోనూ ఆపిల్‌, అరటి వంటి పంటల సాగు సాధ్యమేనని చాటారు.

సమన్వయంతో పురోగతి
పదిహేను ఏళ్లనాడే కోయంబత్తూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం కొబ్బరిచెట్లు సులభంగా ఎక్కే పరికరాన్ని రూపొందించింది. ఇదే తరహాలో మరికొందరు ఔత్సాహికులూ తయారుచేశారు. నేటికీ వీటి లభ్యత చాలా తక్కువ. సగటు రైతు వాటిని సేద్యంలో వాడుకునేలా ప్రోత్సహించిన నాడు భారతీయ రైతులు ప్రపంచ మార్కెట్లను శాసించగలుగుతారు. భారతీయ యువజనులు అపార మేధస్సుకు, మన రైతులు కఠోర శ్రమకు ప్రతీకలుగా నిలుస్తారు. ఆ ప్రతిభకు సానపట్టే దిశగా అవకాశాలను అందిపుచ్చుకోవాలి. దేశీయంగా వ్యవసాయోత్పత్తుల్ని ఇబ్బడిముబ్బడిగా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం ఇజ్రాయెల్‌ సహకారం తీసుకుంటోంది. ఇందులో భాగంగా భారత్‌లోని 16 రాష్ట్రాల్లో 26 వ్యవసాయ నైపుణ్య కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. వీటిని వాణిజ్య సంస్థలుగా తీర్చిదిద్ది పంటల ఉత్పాదకతను పెంచాలని కేంద్రం భావిస్తోంది. ఇజ్రాయెల్‌కు చెందిన వ్యవసాయ, నీటిపారుదల రంగ నిపుణులు భారత్‌ను తరచుగా సందర్శిస్తూ తమ నైపుణ్యాలను రైతులకు అందిస్తున్నారు. భారత వ్యవసాయ మంత్రిత్వశాఖ సైతం ఇజ్రాయెల్‌ వ్యవసాయ, సహకారశాఖలతో సమన్వయంతో పనిచేస్తూ పరస్పరం లబ్ధి సాధిస్తోంది. రెండు దేశాల మధ్య దృఢతరమవుతున్న ఈ బంధం వ్యవసాయరంగ పురోగతికి తోడ్పడితే మన రైతులు బాగా లబ్ధిపొందుతారు. ఇజ్రాయెల్‌ తనకున్న సాంకేతికతను వ్యవసాయానికి వాడుతున్న స్థాయిలో, మనం ఖర్చుపెట్టే పరిస్థితి లేకపోవచ్చు. స్థానిక పరిస్థితులకు తగిన పంట ఉత్పాదకాలను అందించడంతోపాటు, లాభసాటి వ్యవసాయానికి ప్రభుత్వపరమైన చేయూత కావాలి. అప్పుడు రైతులు తమ కష్టంతో సత్ఫలితాలు సాధించగలుగుతారు. రాజకీయ జోక్యం లేకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంత చేయూతను రైతులకు అందించగలవా అన్నదే ప్రశ్న. ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ఇటీవల పేర్కొన్నట్లు- అక్కడి సాంకేతికత, భారత్‌ ప్రతిభ కలిస్తే అద్భుతాలు సృష్టించవచ్చు. ఇజ్రాయెల్‌ సాధించి చూపిందంటే- అది వారి జీవన్మరణ పోరాట ఫలితం. ఎంతో నేర్పు కలిగిన భారత రైతులకూ అంతే స్థాయిలో ప్రభుత్వ ప్రోత్సాహం, తోడ్పాటు సమకూరాలి!

- అమిర్నేని హరికృష్ణ
Posted on 21-01-2018