Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

సాయానికొచ్చేలా వ్యవసాయం!

రుణ మాఫీ.. సబ్సిడీలు.. గిట్టుబాటు ధరలపై హామీలు.. ఇవేవీ అన్నదాతల ఆత్మహత్యలను ఆపలేకపోతున్నాయి. మూల కారణం ఏమిటో గుర్తించకుండా సమస్యకు పరిష్కారం కనిపెట్టలేం. వ్యవసాయ రంగంలో ఒక సమగ్రమైన విధానాన్ని పాటించకపోతే ఎన్ని తాత్కాలిక ఉపశమన చర్యలు చేపట్టినా ప్రయోజనం ఉండదు.

భారతదేశ జనాభాలో సగం కంటే ఎక్కువ మంది ఇప్పటికీ తమ జీవనోపాధి కోసం వ్యవసాయంతోపాటు దాని అనుబంధ రంగాలైన ఉద్యానవనాల సాగు, పశుపోషణ మొదలైనవాటిపై ఆధారపడుతున్నారు. పశ్చిమ దేశాలతో పోలిస్తే మన దేశంలో వ్యవసాయమే ఉపాధిగా ఉన్నవారి సంఖ్య అధికం. కానీ, ఆధునిక ఆర్థిక వ్యవస్థలో జాతీయ ఆదాయంలో వ్యవసాయం వాటా తగ్గిపోతోంది. ఫలితంగా వ్యవసాయంపై ఆధారపడే జనాభా ఎక్కువ, దానిపై వస్తున్న ఆదాయం తక్కువై వ్యవసాయం నష్టదాయకమైన ఆర్థిక కార్యకలాపంగా మారింది.
¤ గత మూడు పంచవర్ష ప్రణాళికల్లోనూ వ్యవసాయ రంగంలో నిర్దేశిత వృద్ధి రేటైన 4 శాతం లక్ష్యాన్ని చేరలేకపోయాం. ఫలితంగా వ్యవసాయంపై ఆధారపడిన జనాభా ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తోంది.
¤ వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు మాత్రం మెరుగవుతోంది. పదో ప్రణాళిక కాలంలో కేవలం 2.2 శాతంగా నమోదైన వ్యవసాయ వార్షిక వృద్ధిరేటు 11 వ ప్రణాళికలో 3.3 శాతం ఉందని 12 వ ప్రణాళిక పత్రం పేర్కొంది. అయితే, ఇది నిర్దేశిత లక్ష్యాల కంటే తక్కువే.
¤ గ్రామీణ పేదరికం తగ్గి, ఆదాయాలు పెరిగాయి. కానీ గ్రామీణ, పట్టణ ప్రాంతాల మధ్య అభివృద్ధి అంతరాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి. వ్యవసాయ రంగంలో అభివృద్ధి ఆశించిన స్థాయిలో లేక అది సృష్టించే ఉపాధి అవకాశాలు తక్కువగా ఉండటమే దీనికి కారణం. వ్యవసాయేతర గ్రామీణ ఉపాధి అవకాశాలు పెరగకపోవడం కూడా మరో కారణం.
¤ హరిత విప్లవ సమయంలో ఆహారోత్పత్తి గణనీయంగా పెరిగింది. కానీ తదనంతర కాలంలో ఇందులో వృద్ధి రేటు నిలిచిపోయింది. ఫలితంగా తలసరి ఆహారోత్పత్తి రేటు కూడా ఆశించిన స్థాయిలో పెరగలేదు. వ్యవసాయ అనుబంధ రంగాలు విస్తరించినా వ్యవసాయ వృద్ధిరేటులో మాత్రం ఆశించిన స్థాయిలో పెరుగుదల నమోదు కాలేదు.
¤ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కొరత, తక్కువ ఉత్పాదకత, క్షేత్రస్థాయి ప్రణాళికల్లో లోపాలు, మార్కెటింగ్ సదుపాయాలు, వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో లేకపోవడం, నీటి కొరత లాంటి సమస్యలు వ్యవసాయ రంగాన్ని వేధిస్తున్నాయి.

నీటిపారుదల..
¤ అధిక ద్రవ్యోల్బణం వల్ల వ్యవసాయ రంగంలో కూడా ఉత్పత్తి ఖర్చులు గణనీయంగా పెరిగాయి. ఉపాధి హామీ పథకం అమలయ్యాక గ్రామీణ ప్రాంతాల్లో శ్రామికులకు గిరాకీ పెరిగింది. వేతనాలు కూడా పెరిగాయి. ఇది భూమిలేని పేదలకు సామాజిక భద్రతను కల్పించినా వ్యవసాయ ఆర్థిక వ్యవస్థలో ప్రతికూలత చూపింది. అందుకే ఎంపిక చేసిన పద్ధతుల్లో వ్యవసాయాన్ని, ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానిస్తున్నారు.
¤ ప్రణాళికా సంఘం అంచనాల ప్రకారం వ్యవసాయ యోగ్యమైన మొత్తం భూమిలో 42 శాతానికి మాత్రమే నీటిపారుదల సౌకర్యం ఉంది. ఉత్పాదకత పెరుగుదలకు నీటివసతి చాలా ముఖ్యం. ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల నేపథ్యాలను గమనిస్తే ఎక్కువగా మెట్ట ప్రాంత, కౌలు రైతులు, వాణిజ్య పంటలను సాగు చేసేవారే ఎక్కువగా కనిపిస్తారు.
¤ రైతు ఆత్మహత్యలను నివారించాలంటే నీటిపారుదల వసతిని కల్పించడం కీలకం. వికేంద్రీకృతమైన చిన్ననీటిపారుదల, మధ్యతరహా ప్రాజెక్టులపై దృష్టి కేంద్రీకరించాలి. తక్కువ ఖర్చుతో వీలైనంత త్వరలో ఉపయోగంలోకి వచ్చే నీటివనరుల పథకాలపై దృష్టిసారించాలి.
¤ దేశంలోని చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాల వినియోగం గణనీయంగా పెరిగింది. దీంతో వాటి నాణ్యత, లభ్యత ప్రమాదంలో పడ్డాయి. ఈ సమస్యను పరిష్కరించాలంటే ఉపరితల జలాల వినియోగ సామర్థ్యాన్ని పెంచాలి. వర్షపు నీటిని పరిరక్షించే వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవాలి. భూగర్భ జలాలను పెంపొందించే కార్యక్రమాలకు తోడ్పాటు అవసరం. మెట్టప్రాంత వ్యవసాయంపై మరింత పరిశోధన జరగాలి.

పరిశోధనలు పెరగాలి..
¤ వ్యవసాయ పరిశోధనలో కూడా కొన్ని పంటలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. ఉదాహరణకు వర్షాధార పంటలు, పప్పుదినుసులు, నూనె గింజలు మొదలైన వాటిపై సరైన పరిశోధన జరగడం లేదు.
¤ 1990 వ దశకం నుంచి పప్పుదినుసుల తలసరి అందుబాటు స్థిరంగా ఉంది. అంటే ఈ రంగంలో ఉత్పాదకత, దిగుబడులు పెరగాల్సిన ఆవశ్యకతను అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికీ మన దేశం నూనె గింజల కోసం దిగుమతులపై ఆధారపడాల్సి వస్తోంది. రైతుల ఆదాయాలను పెంచేందుకు, స్వావలంబన సాధించేందుకు పంటల దిగుబడులే కీలకం. ఈ దిశగా చర్యలు చేపట్టాల్సి ఉంది.
¤ వాతావరణ మార్పుల కారణంగా మెట్టప్రాంత వ్యవసాయం అధిక ఒత్తిడికి గురవుతోంది. దీన్ని తట్టుకుని అధిక దిగుబడులు సాధించే దిశగా శాస్త్రీయ ఆవిష్కరణలను ప్రోత్సహించాలి.
¤ వ్యవసాయం, దాని అనుబంధ రంగాల నుంచి వస్తున్న మొత్తం ఆదాయంలో కేవలం 0.6 శాతం మాత్రమే వ్యవసాయ పరిశోధనపై వెచ్చిస్తున్నాం. పరిశోధనా వ్యయం పెరిగితేనే వ్యవసాయ రంగంలో నూతన ఆవిష్కరణలకు మార్గం సుగమం అవుతుంది.
¤ వ్యవసాయ శాస్త్ర పరిశోధనలో మానవ వనరుల కొరత అధికం. దీన్ని అధిగమించేందుకు ఈ రంగంలో ఆకర్షణీయమైన అవకాశాలను కల్పించాలి. మనం అభివృద్ధి చేసే వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానం- స్థానికంగా ఉన్న క్షేత్రస్థాయి అవసరాలకు అనుగుణంగా, గ్రామీణ వనరుల అభివృద్ధితో మిళితం కావాలి. చిన్న సన్నకారు రైతుల ప్రయోజనాలు పరిరక్షించేదిగా ఉండాలి. రైతుల స్పందన తెలుసుకోవాలి. రైతులకు, శాస్త్రవేత్తలకు మధ్య సమన్వయ వ్యవస్థ ఉంటేనే క్షేత్రస్థాయి అవసరాలను దృష్టిలో ఉంచుకుని వ్యవసాయ శాస్త్ర పరిశోధనలు చేపట్టడానికి వీలుంటుంది.
¤ వ్యవసాయ వృద్ధిరేటును పెంచాలన్నా, ప్రాంతీయ అసమానతలను తొలగించాలన్నా వర్షాధారిత వ్యవసాయంపై శ్రద్ధ చూపడం అవసరం. భారతదేశ మొత్తం భూభాగంలో సుమారు 62 శాతం ఈ తరహాలోకే వస్తుంది. దేశంలో అత్యధిక పేదరికం ఉన్న ప్రాంతం కూడా వర్షాధార వ్యవసాయ ప్రాంతమే. అందుకే శాస్త్ర పరిశోధన, విస్తరణ, నీటిపారుదల లాంటి మౌలిక వసతుల కల్పన లాంటి కార్యక్రమాలను వర్షాదార వ్యవసాయం ఉన్న ప్రాంతాల్లో అధికంగా చేపట్టాలి.
¤ వ్యవసాయరంగంలో కౌలు విధానం పెరుగుతోంది. ఫలితంగా కౌలుదారుల పరిరక్షణ కీలకాంశంగా మారింది. పెరుగుతున్న కౌలు, ఉత్పత్తి ఖర్చులు కౌలు రైతులను కుంగదీస్తున్నాయి. చట్టబద్ధ రక్షణ, గుర్తింపు కొరవడటంతో ప్రభుత్వం అందించే రుణాలు, సబ్సిడీలు, నష్టపరిహారాలు కౌలుదారులకు దక్కడం లేదు. వ్యవసాయంలో సంక్షోభాన్ని నివారించాలంటే సమగ్ర కౌలుదారీ రక్షణ తప్పనిసరి.

ఇవి అత్యవసరం..
¤ సమగ్రమైన వ్యవసాయ అభివృద్ధి వ్యూహంలో ఉండాల్సిన కీలకాంశాలు... నీటి సౌకర్యాల కల్పన, పరిశోధన విస్తరణ, సేవల అందుబాటు, క్షేత్రస్థాయి అవసరాలకు అనుగుణంగా నవీన ఆవిష్కరణలు, చిన్న సన్నకారు రైతులపై శ్రద్ధ, వర్షాధార వ్యవసాయానికి ప్రోత్సాహం, విత్తనాలు, ఎరువులు మొదలైన వాటి నాణ్యత, సకాలంలో లభ్యత, మార్కెటింగ్ సదుపాయాల విస్తరణ, భూసార పరిరక్షణ, నిల్వ సామర్థ్యం పెంపు, కోత అనంతర నష్టాల తగ్గింపు, మెరుగైన నీటి యాజమాన్య, సస్యరక్షణ పద్ధతులు మొదలైనవి.
¤ వీటితోపాటు భూగర్భ జలాల పరిరక్షణ, అభివృద్ధి, సేంద్రీయ వ్యవసాయానికి ప్రోత్సాహం, ధాన్యానికి మద్దతు ధర లభించేలా హామీ లాంటి అంశాలపై కూడా దృష్టి కేంద్రీకరించాలి.
¤ వ్యవసాయేతర గ్రామీణ ఉపాధి అవకాశాలను పెంపొందించాలి. సరఫరా వ్యవస్థలను మెరుగుపర్చాలి. వ్యవసాయాధారిత, ఆహోరోత్పత్తి పరిశ్రమలకు ప్రోత్సాహాన్నివ్వడం ద్వారా అన్నదాతలకు అదనపు ఆదాయాన్ని కల్పించవచ్చు.
¤ పశుపోషణ, చేపల పెంపకం లాంటి అనుబంధ రంగాలను అభివృద్ధి చేస్తే ఆదాయ అస్థిరత ముప్పు నుంచి రైతులను కాపాడొచ్చు.
¤ రైతులకు అనుకూలంగా వ్యవసాయ ధరల విధానాన్ని రూపొందించి అమలు చేయాలి. మెరుగైన, శాస్త్రీయమైన పంట మార్పిడి విధానం, నీటివినియోగ పద్ధతులు, భూసార పరిరక్షణా పద్ధతులను అమలు చేయాలి.
¤ ఆహార వినిమయ పద్ధతుల్లో కూడా వైవిధ్యాన్ని సాధించాలి. బహుళ పంటల వ్యవసాయ విధానాన్ని అమలు చేయాలి. ఇది వ్యవసాయ సుస్థిరతకు దోహదం చేస్తుంది.
¤ వాతావరణ మార్పు వ్యవసాయ రంగంలో కొత్త సవాళ్లను సృష్టిస్తోంది. ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (FAO) అధ్యయనాల ప్రకారం రాత్రిపూట ఉష్ణోగ్రతలు పెరగడం పంట దిగుబడులను దెబ్బతీస్తోంది.
¤ కరవు, వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాలు వ్యవసాయ ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తున్నాయి. వాతావరణ మార్పుల ఫలితంగా రుతుపవనాల ఆగమనం, తీరుతెన్నుల్లో అస్థిరత చోటుచేసుకుంది. ఈ పరిస్థితులన్నింటినీ అధిగమించేలా సుస్థిర వ్యవసాయ అభివృద్ధి వ్యూహాలను రచించి అమలు చేయాలి.

పొదుపుగా నీటి వాడకం..
¤ సూక్ష్మసాగును ప్రోత్సహించడం ద్వారా అందుబాటులో ఉన్న తక్కువ నీటితోనే ఎక్కువ భూమిని సాగు చేయొచ్చు. నీటి వినియోగ పద్ధతుల్లో గణనీయమైన మార్పులు రావాలి.
¤ మనదేశ వ్యవసాయంలో నీటి వినియోగం అధికం. నీటి వనరుల పరిరక్షణ, అభివృద్ధి, శాస్త్రీయ పద్ధతుల వినియోగం, నీటివనరుల పథకాల్లో ప్రజల భాగస్వామ్యం మొదలైన అనేక అంశాలతో కూడిన సమగ్ర జలవిధానాన్ని అమలు చేయాలి.
¤ భూసార పరిరక్షణకు అధిక ప్రాధాన్యం కల్పించాలి. మితిమీరిన, అశాస్త్రీయ రీతిలో ఎరువులు, పురుగుమందుల వినియోగం వల్ల భూసారం క్షీణిస్తోంది. ఇది వ్యవసాయ ఉత్పాదకత మరింత తగ్గడానికి దారితీస్తోంది. సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడం ద్వారా భూసార పరిరక్షణకు చర్యలు తీసుకోవాలి. సారవంతమైన నేలలు బీడు భూములుగా మారకుండా చూడటంతోపాటు బీడు భూములను, వృథాగా పడి ఉన్న భూములను కూడా వినియోగంలోకి తీసుకురావాలి.

మితంగా ఎరువులు..
¤ అసంబద్ధమైన ఎరువుల ధరల విధానం, విస్తరణ సేవల లభ్యతలో పరిమితుల మూలంగా చాలాచోట్ల సూక్ష్మపోషకాల్లో సమతౌల్యం లోపించింది. ఇది కూడా భూసారాన్ని దెబ్బతీస్తోంది.
¤ ఎరువుల వినియోగంపై రైతుల్లో అవగాహన పెంచేలా చర్యలు తీసుకోవాలి.
¤ భూసార పునరుజ్జీవనం ద్వారా మాత్రమే అధిక వృద్ధి రేటును సాధించగలం. భూగర్భ జలాల కాలుష్యాన్ని కూడా నియంత్రించాలి.
¤ భూసారాన్ని పరిరక్షించడానికి రైతులు బహుళ పంటల విధానాన్ని అనుసరించేలా ప్రోత్సహించాలి.
¤ భూమి, నీరు లాంటి సహజ వనరుల లభ్యత స్థిరంగా ఉంటుంది. కాబట్టి ఉత్పాదకతను పెంచాలంటే సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి.
¤ సాగు పద్ధతుల్లో నూతన శాస్త్రీయ ఆవిష్కరణలను ప్రోత్సహించడం ద్వారా తక్కువ నీటితో అధిక దిగుబడి సాధించేలా కృషి చేయాలి.

(రచయిత - ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ )
Posted on 20-01-2015