Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

మార్కెట్‌ మాయను ఛేదిస్తేనే మేలు

* ఒప్పంద సేద్యంపై కొత్త చట్టం

నేడు దేశంలో అనేక సంస్థలు రైతులతో ఒప్పంద సేద్యం చేయిస్తున్నా, అది పరస్పర నమ్మకంమీదే జరుగుతోంది తప్ప చట్టపరమైన ప్రాతిపదిక లేదు. దాంతో ప్రభుత్వానికి ఈ తరహా సేద్యంపై నియంత్రణ కొరవడి రైతుకు తీవ్రనష్టం వాటిల్లుతోంది. కాంట్రాక్టు కుదుర్చుకున్న సంస్థ అనుకున్న సమయానికి నిర్ణయించిన ధరకు పంట కొనకపోతే న్యాయం కోసం రైతు కోర్టుకు వెళ్లలేకపోతున్నాడు. పరిస్థితిని చక్కదిద్దడానికి నిరుడు డిసెంబరు 24న కేంద్ర ప్రభుత్వం ఆదర్శ ఒప్పంద సేద్యం (ప్రోత్సాహం, అభివృద్ధి) ముసాయిదా చట్టం (2018) రూపొందించింది. ధరల్లో విపరీతమైన వ్యత్యాసాల వల్ల రైతులు నష్టపోకుండా చూడటం ఈ ముసాయిదా చట్ట లక్ష్యం. ఆహారశుద్ధి సంస్థలు వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానంలో, మౌలిక వసతుల కల్పనలో భారీగా పెట్టుబడి పెట్టేలా ఈ చట్టం ప్రోత్సహిస్తుంది. దీన్ని అమలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదే. ముసాయిదాపై అభిప్రాయాలు చెప్పి, సలహాలు సూచనలు ఇవ్వాల్సిందిగా రైతులు, రైతు సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వాలను కేంద్రం కోరింది. స్వచ్ఛంద సంస్థలు, ఒప్పంద సేద్య సంస్థలు, సంబంధిత కంపెనీలతోపాటు సాధారణ ప్రజల అభిప్రాయాలనూ కేంద్ర వ్యవసాయ శాఖ ఆహ్వానించింది.

అపనమ్మకాలకు మూలం
రైతుకు, సంస్థలకు మధ్య కుదిరే ఒప్పందాలకు చట్టపరమైన పునాది లేకపోవడం అపనమ్మకాలకు తావిస్తోంది. అయితే ఒప్పంద వ్యవసాయం వల్ల పంటల విస్తీర్ణం పెరిగి, రైతులకు ఆదాయాలు, కంపెనీలకు లాభాలు హెచ్చి మొత్తం గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వూపు వస్తుంది కాబట్టి దాన్ని తప్పక ప్రోత్సహించాల్సిందే. దళారులు, వడ్డీ వ్యాపారుల చేతిలో రైతులు మోసపోకుండా నివారించడానికి కాంట్రాక్టు సేద్యం తోడ్పడగలదు. ఇందులోనూ ఎన్నో లొసుగులు ఉన్నాయి. పలు సందర్భాల్లో ఒకే ఒప్పంద సంస్థ వందలు, వేలమంది రైతుల ఉత్పత్తిని కొనుగోలు చేస్తోంది. రైతులకు మార్కెట్‌ గురించి సరైన సమాచారం లేకపోవడం వల్ల బాగా నష్టపోతున్నారు. ఆ సమాచారాన్ని గుప్పిట్లో పెట్టుకున్న ఒప్పంద సంస్థ లాభాలు మూటగట్టుకుంటోంది. అలాగే ముందు ఒప్పుకొన్న ధరకన్నా విపణి ధర ఎక్కువున్నా, తక్కువున్నా ఒప్పందాన్ని ఉల్లంఘించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఒప్పంద సంస్థలతోపాటు రైతులూ ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడుతుంటారు. అలాంటప్పుడు ఉభయుల మధ్య కుదిరిన ఒప్పందాన్ని కచ్చితంగా అమలు చేయించే చట్టమేదీ లేదు. ప్రభుత్వ నియంత్రణా లేదు. దీనివల్ల తరచూ కాంట్రాక్టు సేద్యం విఫలమవుతోంది. చాలా సందర్భాల్లో ఒప్పంద సంస్థ ముందు ఒప్పుకొన్న ధరకన్నా విపణి ధర తక్కువగా ఉంటే ఏదో వంకపెట్టి పంట కొనకుండా ఎగవేస్తుంది. ఇది చిత్తూరు జిల్లా టమాటా రైతులకు అనుభవమే. కృష్ణా, ప్రకాశం, ఖమ్మం జిల్లాల్లో సుబాబుల్‌ రైతులకు బకాయిలు చెల్లించడంలో ఒప్పంద సంస్థలు విపరీతంగా ఆలస్యం చేస్తున్నాయి. ప్రస్తుతం కుదురుతున్న కాంట్రాక్టుల్లో అత్యధికం ఒప్పంద సంస్థకే అనుకూలంగా ఉంటూ రైతు ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయి. ఒకవేళ ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట దెబ్బతింటే నష్టమంతా రైతులే భరించాలి తప్ప ఒప్పంద సంస్థ పైసా నష్టం భరించదు. ఒప్పంద సంస్థలు ఎప్పుడంటే అప్పుడు ఒప్పంద ధర మార్చేసే వెసులుబాటును అట్టిపెట్టుకుని రైతుకు మాత్రం ఆ సౌలభ్యం లేకుండా చేస్తాయి. మార్కెట్‌ ధర కన్నా బాగా తక్కువకు కొని సొమ్ము చేసుకోవాలని చూస్తాయి. చిత్తూరు జిల్లాలో ఘెర్కిన్‌ (చిట్టి దోసకాయల) సాగుదారులకు ఇది బాగా అనుభవం. తమిళనాడులో బ్రాయిలర్‌ కోళ్ల పెంపకందారులనూ ఒప్పంద సంస్థలు ముప్పుతిప్పలు పెడుతుంటాయి. బకాయిలను 60 రోజుల ఆలస్యంగా చెల్లించడం ఈ సంస్థలకు ఆనవాయితీ. ఒప్పందం ప్రకారం నిర్దిష్ట సంఖ్యలో కోళ్లను పెంచాల్సి ఉంటుంది కాబట్టి రైతులు అందుకోసం భారీ పెట్టుబడి పెడతారు. తీరా సరకు కొనే సమయం వచ్చేసరికి ఒప్పంద సంస్థలు ధరల్లో మాయాజాలానికి పాల్పడతాయి. రైతులు మాత్రం ఒప్పందం నుంచి తప్పించుకోలేరు. కొంతమంది మోసగాళ్లయితే పంట కొనాల్సిన సమయానికి పత్తా లేకుండా పోతారు. ఈ పరిస్థితిలో అనేక కాంట్రాక్టు సేద్య ప్రాజెక్టులు విఫలమయ్యాయంటే ఆశ్చర్యమేముంది? రైతులు, ప్రాయోజక సంస్థలకు మధ్య కుదిరే ఒప్పందాలను సాధికారంగా నమోదు చేసే సదుపాయం లేకపోవడంతో ప్రభుత్వమూ జోక్యం చేసుకోలేకపోతోంది. ఈ లోపాలను సరిదిద్దడానికి కొత్త చట్టాన్ని ప్రతిపాదిస్తోంది.
ప్రతిపాదిత చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పంద సేద్య ప్రోత్సాహం, అభివృద్ధి ప్రాధికార సంస్థలను ఏర్పరుస్తాయి. ప్రాయోజక సంస్థలకు, రైతులకు మధ్య కుదిరే కాంట్రాక్టులను నమోదు చేసి, సక్రమంగా అమలయ్యేలా చూడటానికి జిల్లా, మండల, బ్లాకు స్థాయుల్లో ప్రత్యేక సంఘాలను నెలకొల్పుతారు. వ్యవసాయ, ఉద్యానవన, పశు సంవర్థక, మార్కెటింగ్‌, గ్రామీణాభివృద్ధి, సహకార తదితర శాఖలకు చెందిన అధికారులతో రాష్ట్ర ప్రభుత్వం ఈ సంఘాలను ఏర్పాటు చేస్తుంది. వ్యవసాయోత్పత్తుల మార్కెటింగ్‌ కమిటీల (మండీల) పరిధిలోకి ఒప్పంద సేద్యం రాదు. ప్రతిపాదిత ఒప్పందంలో ముఖ్యాంశం ఇదే. మండీలు దళారుల ఇష్టారాజ్యాలుగా మారి రైతుల పొట్ట కొడుతున్నాయనే ఆరోపణల మధ్య ఇది ఎంతో ప్రాముఖ్యం సంతరించుకొంటోంది.

చిన్నరైతుకు పెద్ద భరోసా
చిన్న రైతులను ఒప్పంద సేద్యంలో పటిష్ఠ భాగస్వాములను చేస్తే నేడు భారత వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. రుణాలిచ్చే సంస్థలు, బీమా కంపెనీలు, విస్తరణ యంత్రాంగం చిన్న రైతును నిర్లక్ష్యం చేస్తున్నాయని విమర్శలు రావడం తెలిసిందే. కాంట్రాక్టు సేద్యం వీటికి పరిష్కారం చూపగలుగుతుంది. పెద్ద కంపెనీలతో భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నప్పుడు చిన్న రైతులకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, సమాచారం, పంటను మంచి ధరకు విపణిలో విక్రయించే వెసులుబాటు, సులభ షరతులపై రుణాలు లభిస్తాయి. లావాదేవీల ఖర్చు తగ్గుతుంది. కంపెనీల యాజమాన్య నైపుణ్యాలతో వారు లబ్ధి పొందగలుగుతారు. చిన్న రైతులకు సేద్యంలో ఆధునిక మెలకువలు అలవడి సామర్థ్యం పెరుగుతుంది. పెట్టుబడులు, గిట్టుబాటు ధరలు అందడంతో నష్టభయం తగ్గుతుంది. కాంట్రాక్టు సంస్థలు రైతులకు మేలైన ఎరువులు, విత్తనాలు, క్రిమినాశనులు, విస్తరణ సేవలు అందేలా చూస్తాయి. పంటల నాణ్యతపై ఎప్పటికప్పుడు నిఘా వేస్తాయి. ఫలితంగా ఆహార శుద్ధి పరిశ్రమలు వృద్ధి చెంది విస్తరిస్తాయి. దాని వల్ల వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులూ ఇనుమడిస్తాయి. కాబట్టి ఒప్పంద సేద్యం సక్రమంగా జరిగితే రైతుల ఆదాయాలు పెరిగి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ వికసిస్తుంది. ఇటీవలి కాలంలో రైతుకు అధిక ఆదాయం తెచ్చిపెట్టే పండ్లు, పూలు, కూరగాయలు, గుడ్లు, మాంసం, చేపల ఉత్పత్తి వైపు మొగ్గు పెరిగింది. అయినా దేశంలో ఒప్పంద వ్యవసాయం గొప్పగా విజయవంతమైన దాఖలా లేదు. కాంట్రాక్టు సంస్థలకు, రైతులకు మధ్య నెలకొన్న అపనమ్మకాలే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. అలాగని అసలు విజయగాథలే లేవనికాదు. పెద్ద కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా మధ్యప్రదేశ్‌లో మిర్చి, కుసుమ పంటల సాగులో, తెలంగాణలో సంకర విత్తనాలు, మహారాష్ట్రలో ద్రాక్ష, అరటి పండ్ల సాగులో చిన్న రైతులు విజయాలు సాధించి ఆదాయాలు పెంచుకోగలిగారు.

రాష్ట్రాలపై గురుతర బాధ్యత
కొత్త చట్టం సక్రమంగా అమలై రైతులకు గరిష్ఠ ప్రయోజనం సిద్ధించాలంటే పొలం, గ్రామం, పంచాయతీ, మార్కెట్‌ స్థాయుల్లో పంటల గ్రేడింగ్‌కు పటిష్ఠ యంత్రాంగాన్ని నెలకొల్పాలి. ఒప్పంద సంస్థలు, రైతుల మధ్య విభేదాలను 15 రోజుల్లో పరిష్కరించే ఏర్పాటు ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం సబ్‌ డివిజనల్‌ మేజిస్ట్రేట్‌ స్థాయి అధికారులను పరిష్కర్తలుగా నియమించాలి. ఆ అధికారి నిర్ణయం నచ్చనప్పుడు రైతుగాని, ఒప్పంద సంస్థగాని న్యాయం కోసం 30 రోజుల్లో ప్రాధికార సంస్థకు విజ్ఞాపన చేసుకోవచ్చు. ఉభయుల వాదనలు విన్న తరవాత పక్షం రోజుల్లో ప్రాధికార సంస్థ తీర్పు చెప్పాలి. అదే అంతిమ నిర్ణయం అవుతుంది. ఈ సంస్థకు సివిల్‌ కోర్టు ప్రతిపత్తి ఉంటుంది. సాధారణ సివిల్‌ కోర్టులు ఇక్కడ జోక్యం చేసుకోవడానికి వీల్లేదు. ప్రాధికార సంస్థ తీర్పును గౌరవించని రైతులు, ఒప్పంద సంస్థలు జరిమానాలు, నష్టపరిహారాలు చెల్లించక తప్పదు. నేడు దేశమంతటా పండ్లు, కూరగాయలు, సుబాబుల్‌, చెరకు వంటి పంటలను కాంట్రాక్టు పద్ధతిలో సాగు చేస్తున్న నేపథ్యంలో రైతులను మార్కెట్‌ ధరల మాయాజాలం నుంచి రక్షించే విధంగా కొత్త చట్టాన్ని రూపొందించి అమలు చేయాలి. ఒకవేళ విపణిలో ఏదైనా పంట ధర పతనమైతే నష్టాన్ని ప్రాయోజక సంస్థే భరించాలి. అనేక రాష్ట్రాలు ఆమోదించిన వ్యవసాయోత్పత్తుల మార్కెట్‌ కమిటీ(ఏపీఎమ్‌సీ) చట్టాల్లో కాంట్రాక్టు సేద్యాన్ని ప్రోత్సహించే నిబంధనలు ఉన్నా, కేంద్రం పూర్తిగా కొత్త చట్టాన్ని తీసుకురావాలని నిశ్చయించింది. ఒప్పంద సేద్య వివాదాల్లో ఏపీఎమ్‌సీలు మధ్యవర్తులుగా వ్యవహరించే అవకాశమివ్వరాదన్న ఉద్దేశంతో ఈ చట్టాన్ని తీసుకొస్తోంది.
దళారులు, వ్యాపారులు కుమ్మక్కై పంటలకు మార్కెట్‌ ధరలను తగ్గించేసి రైతు పొట్టకొడుతున్న సంగతి అందరికీ తెలుసు. ఈ అన్యాయాన్ని సరిదిద్దడానికి మార్కెట్‌ సంస్కరణలు తీసుకురావాలి. కాంట్రాక్టు సేద్య చట్టం చేసి చేతులు దులిపేసుకుంటే సరిపోదన్నది కొందరు నిపుణుల వాదన. రైతుకు గిట్టుబాటు ధరలు లభించేలా చూసే సంస్కరణలు అమలులోకి వస్తే ఒప్పంద సేద్యం దానంతట అదే వ్యాపిస్తుందని వారు అంటున్నారు. ఈ చట్టం విజయవంతమవుతుందా లేదా అన్నది రాష్ట్ర ప్రభుత్వాల నిబద్ధతపై ఆధారపడి ఉంటుంది. చట్టం గురించి రైతుల్లో అవగాహన, చైతన్యం పెంచడం, అందరికీ ఆమోదనీయమైన గ్రేడింగ్‌ పద్ధతిని చేపట్టడం, పంటల నిల్వ సౌకర్యాల విస్తరణ, రైతులు వడ్డీ వ్యాపారుల బారిన పడకుండా సకాలంలో వారికి సంస్థాగత రుణాలు అందించడం, వ్యాపారులు, దళారులు లాలూచీ పడి ధరలను కృత్రిమంగా తగ్గించకుండా జాగ్రత్త వహించడం- ఇవన్నీ రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించాల్సిన విధులు. రైతుల్లో సమష్టిగా బేరమాడే శక్తిని పెంపొందించడానికి సంస్థాగత ఏర్పాట్లు చేయాలి. ఒకటీ రెండు ఎకరాలు ఉన్న రైతులకు సహకార సేద్య ప్రయోజనాల గురించి వివరించాలి. రైతులను మొదట చిన్న చిన్న బృందాలుగా సమీకరించి, తరవాత వాటిని అనుసంధానిస్తూ సమష్టిగా పెద్ద బృందాలను నిర్మిస్తే వారికి బేరమాడే శక్తి పెరుగుతుంది. సంబంధిత ప్రభుత్వ విభాగాల అధికారులు కొత్త చట్టం అమలుకు చిత్తశుద్ధితో పనిచేసేట్లు చూడటం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతు కృషిని నిర్వహించాలి.

Posted on 24-01-2018