Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

కల్లోలంలో పల్లెసీమలు

* బాసట కొరవడిన గ్రామీణ ఆర్థికం

దేశ గ్రామీణ ఆర్థిక వ్యవస్థ గతి తప్పుతోంది. వ్యవసాయ అనుబంధ రంగాలతో ముడివడిన వృత్తులు, సేవలు క్రమంగా బలహీనపడుతున్నాయి. పల్లె ఆర్థికం పట్టు తప్పడానికి కారణాలనేకం. నగర ప్రాంతాల్లో మౌలిక సౌకర్యాల అభివృద్ధిపైనే మోదీ ప్రభుత్వం పూర్తిగా దృష్టి కేంద్రీకరించింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమం ఏ దశలోనూ సరిగ్గా అమలు కావడం లేదు. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) రూపకల్పనలో కొన్ని మౌలిక లోపాలతోపాటు, క్షేత్రస్థాయిలో దాని అమలు అస్తవ్యస్తంగా ఉండటంతో గ్రామీణ వస్తు పంపిణీ వ్యవస్థలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పెద్దనోట్ల రద్దు ప్రభావం వల్ల పల్లెపట్టుల చేతుల్లో ఇప్పటికీ డబ్బు ఆడటం లేదు. బ్యాంకింగ్‌ రంగం కుదుపుల్లోనే కొనసాగుతోంది. ఈ పరిస్థితుల్లో ఆర్థిక పునరుజ్జీవం సాధించేశామంటూ ప్రభుత్వం చేసే ఏ ప్రకటనకూ హేతుబద్ధత లేదనే చెప్పాలి. ఆర్థిక వ్యవస్థ ప్రస్థానిస్తున్న తీరుతెన్నులు మార్చకపోతే గ్రామీణుల జీవన ప్రమాణాలు కొడిగడుతూనే ఉంటాయి. గ్రామీణ కుటుంబాలమీద ఆర్థిక భారం ఇనుమడిస్తూ ఉంటుంది. ఒకవైపు నిరుద్యోగిత పెరుగుతుంటే- మరోవంక వృద్ధి రేటు పైకి ఎగబాకే వైపరీత్యం అలాగే కొనసాగుతుంది! ఇదే పరిస్థితి కొనసాగితే స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు ఎంత పెరిగినా ఉపయోగం లేదు. ఒకవైపు అసమానతలు భయపెడుతూ విస్తరిస్తున్న పరిస్థితుల్లో- వృద్ధిరేట్లు దేశాన్ని కాపాడలేవు!

వ్యవసాయం వెలుగులీనాలి
భారత ఆర్థిక వ్యవస్థకు ఇప్పటికీ పల్లెలే ప్రాణాధారాలు. ఆరో దశకం(1960లు)నుంచీ పల్లెల ద్వారా దేశ ఆర్థికానికి నికరంగా దఖలుపడుతున్న మొత్తం తగ్గుతున్నప్పటికీ- వ్యవసాయ ఆధారిత రంగాల ప్రభావం మాత్రం క్రమంగా పెరుగుతోంది. జాతీయ నమూనా సర్వే సంస్థ అంచనాల ప్రకారం భారత్‌లో 57.8 శాతం గ్రామీణ కుటుంబాలు వ్యవసాయ, సంబంధిత రంగాల్లో పనిచేస్తున్నారు. వ్యవసాయేతర కార్యకలాపాలవైపు అనేకుల దృష్టి మరలుతున్న మాట నిజమే. అయితే ఈ కార్యకలాపాలు విజయవంతంగా అమలు కావాలంటే గ్రామాల్లో సేద్యం బాగుండాలి. వ్యవసాయం నుంచి చక్కటి ఆదాయం పొందుతూ వస్తు, సేవలను ఇబ్బంది లేకుండా కొనుగోలు చేయగల వాతావరణం ఏర్పడాలి. జాతీయ ఆదాయంలో గ్రామీణ ఆర్థికం వాటా 46 శాతమే. కాగా దేశంలోని 68.8 శాతం మందికి పల్లెలే ఆధారభూతంగా నిలుస్తుండటం గమనార్హం. దేశంలో 2011-12 మధ్యకాలంలో తయారీ రంగంలో జరిగిన ఉత్పత్తిలో 51.3 శాతం గ్రామాలనుంచే వచ్చినట్లు ‘నీతి ఆయోగ్‌’ అధ్యయన పత్రం ఒకటి ఇటీవల వెల్లడించింది. భారత కార్మిక శక్తిలో 72.4 శాతం గ్రామాల్లోనే నివసిస్తున్నారు. 1970-71 మధ్యకాలంలో జాతీయ ఆదాయంలో వ్యవసాయం వాటా 62.4 శాతం కాగా, 84.1 శాతం కార్మికశక్తి అప్పట్లో పల్లెల్లో నివసించింది. జీఎస్‌టీ లోపాల కారణంగా సంఘటిత రంగం సమస్యల పాలైంది. లావాదేవీల ఖర్చు ఉన్నపళంగా పెరిగిపోయింది. చిన్న కంపెనీలకు సంబంధించినంతవరకూ వ్యాపార, వాణిజ్యాల నిర్వహణ వ్యయమూ ఇనుమడించింది. జీఎస్‌టీ అమలు గ్రామీణ కుటుంబాల జీవికను ఒడుదొడుకుల పాలు చేసింది. మరోవంక అసంఘటిత రంగానికి తలెత్తిన సమస్యల గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచిది. జీఎస్‌టీ పెంచడంవల్ల టెలిఫోన్‌ బిల్లులు, బీమా చెల్లింపులు, డీటీహెచ్‌ రీఛార్జీలు, టికెట్ల కొనుగోళ్లు వంటి వందలాది నిత్యావసర సేవలు భారమయ్యాయి. మధ్యతరగతి, పేద ప్రజానీకంపై ఒత్తిడి తీవ్రమైంది. గడచిన రెండేళ్లుగా గ్రామీణ భారతం వివిధ సమస్యల బారినపడి కుములుతోంది. వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఒక్కసారిగా కుప్పకూలిపోవడం, రైతన్నలకు ప్రభుత్వ మద్దతు కొరవడటం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న అత్యంత ప్రధానమైన సమస్య. ఆరుగాలం కష్టపడి పండించిన పంటకు తగిన ధర రాక రైతన్న పూర్తిగా డీలాపడిపోయిన సమయాల్లో- తీరిగ్గా రంగంలోకి దిగి ప్రభుత్వ సంస్థలు కంటితుడుపు మద్దతుధరలు ప్రకటించి వారిని ఆదుకునేందుకు చేసిన ప్రయత్నాలు కొరగానివిగా మిగిలిపోయాయి. ఉత్పత్తి వ్యయాలు ఏమాత్రం తగ్గడం లేదు. కానీ, వ్యవసాయ ఉత్పత్తుల ధరలు మాత్రం దారుణంగా కోసుకుపోతున్నాయి. దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. రైతులకు ఖర్చుపెట్టడానికి రూపాయి కూడా దొరకని దురవస్థ తలెత్తుతుంది. గడచిన రెండేళ్లుగా దేశంలో కొనుగోలు శక్తి కొరవడి రైతన్నలు నానా బాధలూ అనుభవిస్తున్నారు. అభద్ర వాతావరణంలో వారు కొట్టుమిట్టాడుతున్నారు. వస్తుసేవల కొనుగోలుకు అవసరమైన సంపాదన కొరవడితే రైతులు చేతులు ముడుచుకుని ఇంట్లో కూర్చుంటారు. ఏమీ కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో కలోగంజో తాగి బతుకులు ఈడుస్తారు. దానివల్ల ఆర్థిక వ్యవస్థలో స్తబ్దత ఏర్పడుతుంది. ఇందుకు ఓ ఉదాహరణ చూద్దాం. దేశంలో వ్యవసాయ ట్రాక్టర్లలో సమస్యలు తలెత్తితే వాటిని బాగుచేసే దుకాణాలు, ట్రాక్టర్లకు సంబంధించిన విడిభాగాలను విక్రయించే వ్యవస్థలు కొంతకాలంగా మూతపడుతున్నాయి. వ్యవసాయ వస్తూత్పత్తుల ధరలు దారుణంగా పడిపోవడంతో రైతులు దాదాపుగా అన్ని రకాల అదనపు కొనుగోళ్లూ నిలిపివేశారు. పులిమీద పుట్రలా జీఎస్‌టీ రావడంతో వాణిజ్య లావాదేవీల్లో గందరగోళం తలెత్తింది. ఈ రెండు సమస్యలూ వ్యవసాయ ట్రాక్టర్ల విడిభాగాల విక్రేతలను, వాటి మరమ్మతులు చేసుకొంటూ పొట్టపోసుకొనే వర్గాన్నీ బాగా దెబ్బతీశాయి. తరచిచూస్తే ఇలాంటి దాఖలాలు అనేకం దర్శనమిస్తాయి. నేడు గ్రామీణ ఆర్థికవ్యవస్థ కుప్పకూలిపోవడానికి ఇవన్నీ కారణాలే.
పెట్రోలు, డీజిల్‌లపై రాయితీ తొలగించడంతో గడచిన రెండేళ్లుగా పల్లెపట్టుల ఆర్థిక వ్యవస్థ కొత్త సమస్యల్లో కూరుకుపోతోంది. సబ్సిడీ తీసేయడంతో డీజిల్‌ ధరలు ఏమాత్రం పెరిగినా అసంఘటిత రంగానికి చెందిన వినియోగదారులపైనా, చిన్న వ్యాపారాలు చేసుకునేవారిపైనా భారం పడుతోంది. పెట్రోలు, కూరగాయల ధరలు పెరిగితే వారానికి, నెలకు ఓసారి వినియోగదారులపై పన్నుల మోత మోపినట్లుగా అవుతోంది. పెట్రో ధరల పెరుగుదల ప్రభుత్వానికి, పెట్రోలియం కంపెనీలకు తప్ప ప్రజలకు మేలు చేసే వ్యవహారం కాదు. 2017 అక్టోబరు నుంచి డీజిల్‌ ధర లీటరుకు సగటున నాలుగు నుంచి అయిదు రూపాయల మేర పెరిగింది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ(ఎమ్‌జీఎన్‌ఆర్‌ఈజీ) కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేయాలన్న ఆలోచనే ప్రభుత్వానికి లేకుండా పోయింది. దాంతో ఎంజీఎన్‌ఆర్‌ఈజీ కార్డులు ఉన్న 44శాతం గ్రామీణుల ఆదాయాలపై ప్రతికూల ప్రభావం పడింది.

కూలి పనులే ప్రధాన ఉపాధి
స్వాతంత్య్రానంతరం కాలం గడిచేకొద్దీ భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సమీకరణల్లో ఆసక్తికర మార్పులు చోటు చేసుకున్నాయి. మొత్తం కార్మిక శక్తిలో 1951తో పోలిస్తే వ్యవసాయ కూలీలు ప్రస్తుతం 30శాతం మేర పెరిగారు. మరోవంక రైతుల సంఖ్య సగానికి సగం కోసుకుపోయింది. 1951లో 9.72 కోట్లుగా ఉన్న వ్యవసాయ కార్మికుల సంఖ్య 2011నాటికి 26.31 కోట్లకు పెరిగింది (11.88 కోట్లమంది రైతులు, 14.43 కోట్ల మంది కార్మికులు). వ్యవసాయ, అసంఘటిత రంగాల్లో పనిచేస్తున్న కార్మికుల శాతం పల్లెల్లో అత్యధికంగా ఉంది.

పన్ను రాయితీలతో సాంత్వన
ఆర్థిక వ్యవస్థ అతలాకుతలమై పల్లెపట్టులు తల్లడిల్లుతుంటే వాటిని ఆదుకునేందుకు, రైతులకు సాంత్వన చేకూర్చేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి క్రియాశీల చర్యలూ చేపట్టలేదు. ఎంతసేపటికీ నగరాల్లో మౌలిక సౌకర్యాలు వృద్ధి చేయడంమీదే మోదీ సర్కారు దృష్టిపెట్టి పనిచేసింది. ఆకర్షణీయ నగరాల కోసం నిధులు కేటాయించింది. నూతన నౌకాశ్రయాల ఏర్పాటుకు ప్రణాళికలు రూపొందించింది. కానీ దేశంలో అత్యధిక ప్రజానీకం నివసించే పల్లెసీమలను మాత్రం పట్టనట్లుగా వదిలేసింది. ప్రస్తుతం రగులుతున్న సమస్య పరిష్కారంపై శ్రద్ధపెట్టాల్సిన ప్రభుత్వం- భవిష్యత్తులో ఆశల స్వర్గాలు నిర్మిస్తానంటూ వాగ్దానాలు చేయడం మొదలుపెట్టింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఏ కార్యక్రమమూ గ్రామీణుల ఆదాయాలను పెంచలేకపోయింది. ఈ ఏడాది ఖరీఫ్‌నుంచి కనీస మద్దతు ధర చెల్లించి పంటలను కొనుగోలు చేస్తామని ప్రభుత్వం వాగ్దానం చేసింది. తాజా నివేదికల ప్రకారం ఈ వాగ్దానాన్ని నెరవేర్చేందుకు ప్రభుత్వం రూ.80వేల కోట్లు కేటాయించాల్సి ఉంటుంది. ఆ స్థాయిలో నిధుల సమీకరణకు కేంద్ర సర్కారు ఏ మేరకు సంసిద్ధంగా ఉందన్నది వెల్లడి కావాల్సి ఉంది. 2022లోగా దేశంలో రైతుల ఆదాయాలను రెట్టింపు చేసే విషయంలో అధ్యయనం కోసం నియమించిన కమిటీ అంచనాల ప్రకారం- ఆ లక్ష్య సాధనకు ప్రభుత్వం ఆరు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గుమ్మరించాల్సి ఉంటుంది. రైతులు పండించిన ఖరీఫ్‌ పంటను కనీస మద్దతు ధర చెల్లించి కొనుగోలు చేస్తామన్న ప్రతిపాదనను ప్రభుత్వం 2017 అక్టోబరు నుంచి అమలు చేసి ఉంటే, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఎంతో మేలు జరిగి ఉండేది. రైతుల ఆదాయాలు పెరిగి, కొనుగోళ్లకు చురుకుపుట్టి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కొత్తపుంతలు తొక్కేది. వస్తు సేవల పన్నును ప్రభుత్వం మరింత సరళీకరించాల్సి ఉంది. సేవలపై జీఎస్‌టీ రేట్లను 12శాతానికి కోత కోయడం తక్షణావసరం. దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి కొంతమేర కోతపడవచ్చు. కానీ, ఒకవైపు పరిశ్రమలకు వేర్వేరు పన్ను రాయితీలు ప్రకటిస్తూ ప్రభుత్వం- మధ్యతరగతి కుటుంబాల జీవనాన్ని ఇబ్బందుల్లోకి నెడుతోంది. జీఎస్‌టీలో సేవలపై పన్ను తగ్గించి మధ్యతరగతికి, ముఖ్యంగా గ్రామీణవాసులకు ఊతంగా నిలిస్తే- కొనుగోళ్ల పెరుగుదలకు, ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికి, తద్వారా ప్రభుత్వానికి పన్నుల రూపంలో మరింత ఆదాయం సమకూర్చుకోవడానికి వీలు దొరుకుతుంది. పెట్రోలియం ఉత్పత్తులపై పన్నులు తగ్గించడం- ప్రభుత్వం దృష్టిసారించాల్సిన మరో ముఖ్యాంశం. పెట్రోలియం ఉత్పత్తులపై పన్నుల్లో తన వాటాను తగ్గించుకోవడానికి బదులు కేంద్ర ప్రభుత్వం- జీఎస్‌టీ కింద వాటిని కొనుగోలు చేయాలని రాష్ట్రాలపై ఒత్తిడి తీసుకురావడం ఆశ్చర్యకరం! పెట్రోలియం ఉత్పత్తులపై పన్నుల్లో కేంద్రం తన వాటాను వదలుకుంటే దానివల్ల దేశంలోని మధ్య, దిగువ మధ్య తరగతి ప్రజానీకానికి ఎనలేని ఊరట దక్కుతుంది. ఇప్పటికైనా తక్షణ దిద్దుబాటు చర్యలపై ప్రభుత్వం శ్రద్ధపెట్టకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ మరిన్ని సమస్యల్లోకి కూరుకుపోయే ప్రమాదం ఉంది. దేశ ఆర్థికం కుంగితే తిరిగి అది కోలుకోవడానికి దీర్ఘకాలం పడుతుందన్న విషయాన్ని ప్రభుత్వం గుర్తించాలి!

- సాయి ప్రకృత్‌
Posted on 10-03-2018