Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

నైపుణ్యాలకు సానతో లాభాల సాగు

* వ్యాపార దృక్పథంతో రైతేరాజు

రైతులు ఎంత కష్టపడటానికైనా సదా సిద్ధంగా ఉంటారు. అయితే సమస్యలపై అవగాహన, నైపుణ్యాలను అందిపుచ్చుకొనే అవకాశాలు వారికి లేకపోవడమే పెద్ద లోటు. సేద్యంలో నిలదొక్కుకోలేకపోవడం, కొత్తదనాన్ని స్వీకరించడంలో తడబాటు, మార్కెట్‌ దోపిడి, పరిశోధన ఫలాలు పొలాలకు చేరని వైనం తదితర సమస్యలు అన్నదాతల పురోగతికి ప్రతిబంధకంగా మారుతున్నాయి. దశాబ్దాలు గడుస్తున్నా పరిస్థితుల్లో మార్పు లేకపోవడంతో వారు కడగండ్ల పాలవుతున్నారు. వ్యవసాయంలో నైపుణ్యాలు పెంచుకునేలా తగిన శిక్షణ అందించడంతోపాటు సేద్యాన్ని పరిశ్రమగా మార్చేందుకు పూనుకొంటే అన్నదాతల పరిస్థితిలో మార్పు వస్తుంది.

ఆలోచనాసరళి మారాలి
దేశంలో 58 శాతం ప్రజలు వ్యవసాయరంగంపై ఆధారపడి ఉన్నా వారిలో 80 శాతం సన్న, చిన్నకారు రైతులే. సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల నుంచి ఆధునిక సాంకతికతను అందుకుంటున్నప్పటికీ, ఆ దిశగా అడుగులు వేగంగా పడటం లేదు. ఇందుకు ప్రభుత్వాల చొరవ కొంత లోపమైతే, ఆ సాంకేతికతను అందిపుచ్చుకొనే శక్తియుక్తులు లేకపోవడం, నిరక్షరాస్యత ఇతర కారణాలు. అయినప్పటికీ ఏమీ చదువుకోని కొందరు రైతులు సాధిస్తున్న విజయాలు ఎందరికో స్ఫూర్తినిస్తున్నాయి. పెద్దగా చదువుకోకపోయినా కొత్త వంగడాలు, పరిశోధనల ఫలితాల ఆధారంగా పంటలను ప్రయోగాత్మకంగా పండిస్తున్న రైతులు ఎందరో ఉన్నారు. ఏ పద్ధతుల్ని అనుసరించాలి, ఎలా అమ్ముకోవాలి వంటి అంశాల్లో చాలామంది రైతులకు స్పష్టత లేదు. ఎప్పుడు ఏ పంటకు ధర ఉంటుందో ఏ సమయంలో పడిపోతుందో తెలియని పరిస్థితులు వారిని గందరగోళపరుస్తున్నాయి. అందరికీ ఉండేది ఆ నేల మాత్రమే. అందులో ఒకరు వైవిధ్యంగా సాగుతూ లాభాల బాట పడుతుంటే, మరికొందరు నష్టాల పాలవుతున్నారు. అతి తక్కువ వర్షపాత ప్రాంతాల్లోనూ పలువురు అద్భుతాలు ఆవిష్కరిస్తున్నారు. వనరులను సమర్థంగా వినియోగించుకుంటూ తక్కువ ఖర్చుతో ఆదాయాలు పెంపొందించుకుంటున్నారు. ఆ కొద్దిమంది తమ నైపుణ్యాలకు పదును పెడుతున్నారు. లీటరు పాలకు రూ.45 కూడా దక్కించుకోలేని రైతులు ఉన్నారు. పూర్తిగా సేంద్రియ మేత, దాణాను పశువులకు అందించి, ఉత్పత్తి చేసిన పాలు అంటూ అధిక ధరకు విక్రయిస్తున్నవారూ ఉన్నారు. సేద్యం, పశుపోషణలను వ్యాపార దృక్పథంతో చేయడంలోనే కిటుకు ఉంది. అందువల్ల రైతులూ వ్యాపారుల్లా మారాల్సిన అవసరం ఉంది. ఇందుకు వ్యవసాయాన్ని ఒక పరిశ్రమగా మార్చుకోవాలి. పంట పండించే దగ్గర నుంచి మార్కెట్‌కు తీసుకెళ్లే వరకు ప్రణాళిక ప్రకారం ముందుకుపోవడం వల్ల సేద్యం లాభసాటిగా మారుతుంది. రైతుల్ని ఈ దిశగా నడిపించేందుకు దిశానిర్దేశం చేసే వ్యవస్థలే కరవయ్యాయి.
కొందరు రైతులు పెట్టుబడిని డీలర్ల దగ్గరే పొందుతుండటం వల్ల పంటను వాళ్లిచ్చిన ధరకే తెగనమ్ముకోవాల్సి వస్తోంది. ఈ దుస్థితికి కారణం ప్రతి రైతుకూ రుణాలు అందకపోవడమే. దేశంలో నూటికి 29 శాతం రైతులకు సంస్థాగత పరపతి సౌకర్యం అందడం లేదన్నది నిష్ఠురసత్యం. ఏటా రూ.12 లక్షల కోట్ల రుణాలు ఇస్తున్నామంటున్న కేంద్ర ప్రభుత్వం, వీటిలో పుస్తక సర్దుబాట్ల శాతమెంతో, కర్రు కదిలించేవాడికి ఎంత రుణాలు అందుతున్నాయన్న వివరాలతో శ్వేతపత్రం విడుదల చేస్తే లెక్కల గొప్పలు తేలతాయి. రుణాలే కాదు పంటల సాగులో రైతుకు భరోసా ఇచ్చే ఏ ఉత్పాదకాలనూ సక్రమంగా అందించలేకపోవడం ప్రభుత్వాల వైఫల్యమే. తొలి తరం రైతులకు సమీప పట్టణాలకు వెళ్లి పంట విక్రయించుకునే చొరవ సైతం లోపించింది. ఇందుకు అనేక కారణాలు ఉండొచ్చు. కానీ నమ్మకం పునాదిగా గ్రామాల్లో అన్నీ జరిగిపోతుంటాయి. తెలివిమీరిన కొందరు వ్యాపారులు దివాలా తీసినట్లు భ్రమింపజేసి రైతులకు లక్షలకు లక్షలు ఎగనామం పెట్టిన సందర్భాలూ ఎన్నో! ఇలాంటి రైతులు ఆధునిక సేద్యాన్ని ఒంటపట్టించుకోవడంలో ఇంకా వెనకబాటులోనే ఉన్నారు. మరోవైపు సేద్యం పట్ల ఆసక్తితో ఉన్నతోద్యోగాలు వదులుకుని, ఆధునిక పద్ధతుల్లో సేద్యం చేస్తున్న యువకులూ ఉన్నారు. నైపుణ్యంతో వీరంతా అద్భుతాలు ఆవిష్కరిస్తున్నారు. కేవలం డబ్బుతో పొలాలు కొనేసి నష్టాలు తట్టుకోలేక సేద్యాన్ని వదిలేస్తున్నవారూ ఉన్నారు. ప్రభుత్వ యంత్రాంగ వైఫల్యాలు ఇక్కడ తోసిపుచ్చలేనివి. ఉదాహరణకు దేశంలో శెనగ సాగుకు ప్రసిద్ధి చెందిన ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, ప్రకాశం జిల్లాలు, సోయా సాగుకు పేరుగాంచిన తెలంగాణలోని ఆదిలాబాద్‌ జిల్లాల్లోని పంటంతా మహారాష్ట్ర మిల్లులకు వెళుతోంది. అక్కడి నుంచి పప్పు, పిండి, ఇతర ఉత్పత్తులుగా మారుతుంది. ఆ ఉత్పత్తులను మళ్ళీ మనమే కొంటున్నాం. ఈ పరిశ్రమలను స్థానికంగా ఏర్పాటు చేస్తే యువకులకు ఉపాధితోపాటు రైతులకు లాభసాటి ధరలు లభిస్తాయి. ఈ దిశగా దృష్టి పెట్టకపోవడం ప్రభుత్వాల వైఫల్యం.
వ్యవసాయ అనుబంధ రంగాల్లో రైతులకు నైపుణ్యాలను పెంపొందించేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు సాగాల్సిన అవసరముంది. వ్యవసాయం, అనుబంధ రంగాల ద్వారా ఉత్పత్తి చేస్తున్న వస్తువులకు ఆదాయం రావాలంటే కొంచెం శ్రమ, మరికొంత తెలివితేటలు అవసరం. ప్రస్తుతం మార్కెట్లో ప్రాసెసింగ్‌ ఆహార ఉత్పత్తులను తయారు చేస్తున్న అన్ని కంపెనీలు వ్యవసాయం చేయలేవని గుర్తించాలి. ఇవి రైతుల నుంచి ముడి ఉత్పత్తులు సేకరించి, వాటికి విలువ జోడించి వ్యాపారం చేసుకుంటున్నాయి. అందువల్ల ఇటువంటి యూనిట్లు ఏర్పాటు చేస్తే పలువురికి ఉపాధి, రైతులకు ఆదాయం లభిస్తుంది. వడ్లను బియ్యం రూపంలో, పప్పుధాన్యాలను పప్పు, పిండిగా, నూనెగింజలను గానుగాడించి నూనెగా విక్రయించుకోగలిగితే మంచి ధరలు వస్తాయి. ఇలా ఉత్పత్తికి విలువ జోడించడం పెరిగే కొద్దీ గిట్టుబాటు ధరలు లభిస్తాయి. ఉప ఉత్పత్తుల తయారీతో ఆదాయం పెరుగుతుంది. వ్యవసాయానికి విలువ జోడింపు పరిశ్రమల ఏర్పాటు అవసరం ఉంది. దేశంలో మొత్తం వ్యవసాయోత్పత్తుల్లో ఏడు శాతమైనా ఆహారశుద్ధికి వినియోగించడం లేదు. స్థానిక అవసరాలు పోను మిగిలిన వాటికి విలువ జోడిస్తే రైతుకు మంచి ధరలు, పలువురికి ఉపాధి, అదనపు ఆదాయానికి అవకాశాలుంటాయి. ఈ పరిశ్రమలను ఆయా పంటలు బాగా పండించే ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం లాభదాయకం.

దిద్దుకోవాల్సిన లోపాలు
* వ్యవసాయోత్పాదకాలను సకాలంలో అందించే వ్యవస్థ లేకపోవడం
* ఉత్పత్తుల నాణ్యతపై రైతుల్లో అవగాహన లోపం
* లోపభూయిష్ఠమైన విస్తరణ యంత్రాంగం
* సంస్థాగత పరపతి లోపించడం
* నాణ్యమైన ముడిపదార్ధాలు వాడకపోవడం
* మార్కెట్‌ శక్తుల ప్రాబల్యం
* గిట్టుబాటు ధరలు లభించకపోవడం
* సురక్షితమైన ప్యాకింగ్‌ వస్తువులు వినియోగించకపోవడం
* పంపిణీ పద్ధతులు సక్రమంగా లేకపోవడం
* రసాయన అవశేషాలపై లోపించిన అవగాహన
* మార్కెట్‌ నైపుణ్యం లేకపోవడం
* శాస్త్రీయ నిల్వ వసతులు లేకపోవడం శ్రమకు

శ్రమకు బుద్ధి జోడింపు
రైతులిప్పుడు శ్రమకు బుద్ధిని జోడించాల్సిన అవసరముంది. మార్కెట్‌ తెలివిడిని పెంచుకోవాలి. విలువ జోడింపు అవకాశాలను సమర్థంగా ఉపయోగించుకోగలిగితే స్థిర ఆదాయాలు అందించడంతో పాటు ఎగుమతులు, ఆదాయం పెరిగే అవకాశముంది. ప్రభుత్వాలు చొరవ చూపి అధికంగా పంటలు పండిస్తున్న ప్రాంతాలను వ్యవసాయ ఎగుమతి జోన్లుగా ప్రకటించి, ఆహారశుద్ధి పరిశ్రమల స్థాపనతో పాటు ప్రోత్సాహకాలు అందిస్తే సేద్యంపై ఆధారపడిన మూడోవంతు జనాభాకు స్థిరమైన ఆదాయాలు అంది సంతోషంగా జీవిస్తారు. ఇక్కడ కొన్ని లోపాలూ ఉన్నాయి. వాటిని అధిగమించేందుకు ప్రభుత్వాల స్థాయిలో చేయాల్సింది ఎంతో ఉంది. ఉత్పత్తి, పంపిణీ, మార్కెటింగ్‌, విలువ జోడింపు అంశాలను ప్రాతిపదికగా తీసుకుని నైపుణ్యాభివృద్ధికి పాటుపడాలి. ఈ దిశగా వ్యవసాయ విద్య పాఠ్యాంశాల్లో కొన్ని మార్పులు తేవాలి. క్షేత్రస్థాయిలో రైతుల కష్టనష్టాలకు తగిన పరిష్కారాలు చూపేలా వ్యవసాయ విద్య ఉండాలి. దీనిపై రైతులకు విస్తృత శిక్షణ, అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. వ్యవసాయంలోని సాధక బాధకాలనూ వివరించాలి. పరిమిత వనరులతో అధిక దిగుబడులను ఎలా పెంచుకోవాలి, మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని పంటలను ఎలా ఎంచుకోవాలో తెలియజేయాలి. పరిస్థితులకు తగ్గట్లు సేద్య విధానాల్లో మార్పులు, పంటల మార్పిడి, మిశ్రమ పంటల సాగు, మార్కెట్‌, ఎగుమతి ఆధారిత వ్యవసాయంలో మెలకువలు నేర్పించాలి. వ్యవసాయ విశ్వవిద్యాలయ విద్యార్థులకు అందించే క్షేత్రశిక్షణ తరహాలోనే రైతులూ నైపుణ్యాలు పెంచుకునేందుకు శిక్షణ అందించాలి. ఇటీవల పలు వ్యవసాయాంశాలపై దూరవిద్య కోర్సులను అందిస్తున్నారు. మార్కెటింగ్‌లో నైపుణ్యాలు పెంపొందించేలా వీటిని విస్తృతం చేయాలి. ఎగుమతి ఆధారిత పంటల సాగు, పాటించాల్సిన ప్రమాణాలు, పంటల ఎంపికతోపాటు గిట్టుబాటు ధరలు పొందేలా ఎలాంటి వ్యూహాలను అనుసరించాలి తదితర అంశాలపై శిక్షణ ఇస్తే సేద్యాన్ని లాభసాటిగా మార్చుకునే అవకాశముంది.
ప్రభుత్వాలు విస్మరించిన పెద్ద లోపం మార్కెట్‌ సంస్కరణలు. ఉత్పత్తికి తగ్గ ధర అందించడమే కాదు, కనీసం ప్రకటిత ధరనూ రైతులు దక్కించుకోలేని దీనస్థితిలో ఉన్నారు. పాలకుల వైఫల్యానికి ఇది పరాకాష్ఠ. వీటిని సరిచేయడంతోపాటు నైపుణ్య శిక్షణ, ఆహారశుద్ధి లక్ష్యాలుగా రైతుల్ని తీర్చిదిద్దాలి. పంట కోత అనంతర సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించేందుకు మైసూరులోని కేంద్ర ఆహార పరిశోధన అభివృద్ధి సంస్ధ (సీఎఫ్‌టీఆర్‌ఐ), కేంద్ర పొగాకు పరిశోధనా సంస్ధ (సీటీఆర్‌ఐ), జాతీయ పరిశోధన అభివృద్ధి సంస్ధ (ఎన్‌ఆర్‌డీసీ) సంసిద్ధంగా ఉన్నాయి. వాణిజ్య సరళిలో చిన్నతరహా యూనిట్ల నుంచి పెద్ద పరిశ్రమలను స్థాపించి ఆహారశుద్ధికి కొత్త రూపు కల్పించేందుకు ఇవి తోడ్పడుతున్నాయి. ప్రాజెక్టులు ఏర్పాటు చేయాలనుకునే ఔత్సాహికులకు శిక్షణ, సాంకేతిక సహకారం అందించడంతో పాటు, ప్రాజెక్టు నివేదికలూ అందించేందుకు ఇవి ముందుకొస్తున్నాయి. కావలసిందల్లా ప్రభుత్వ చొరవ, తోడ్పాటు మాత్రమే. రైతుల ఆదాయాలు పెంచాలంటే ముందుగా ప్రభుత్వాలు పంటకు లాభసాటి ధర అందించాలి. అదే సమయంలో వారికి మార్కెటింగ్‌ నైపుణ్యాలను పెంచడంపైనా దృష్టి పెట్టాలి. అప్పుడే రైతు రాజు కాగలడు!

- అమిర్నేని హరికృష్ణ
Posted on 14-08-2018