Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

విత్తు కాదు... విపత్తు!

* కొరగాని చట్టంతో రైతాంగానికి కష్టాలు
* నాణ్యమైన విత్తనాలకు లేదు భరోసా
* రైతు నష్టపోతే పరిహారం పూజ్యం
* జన్యుమార్పిడి విత్తనాల అక్రమ విక్రయాలు, సాగు
* చట్టుబండలవుతున్న చట్టాలు

కొత్త ఖరీఫ్‌ సీజన్‌ మొదలైంది. నిండు వర్షాలు పడాల్సిన తొలకరి వేళలో వేసవిని తలపించేలా మండుటెండలు అన్నదాతలను నిరాశకు గురిచేశాయి. దాదాపు రెండు వారాలు ఆలస్యంగా ఎట్టకేలకు రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను పలకరించాయి. అడపా దడపా పడుతున్న తేలికపాటి వర్షాల తరవాత ఏదోలా దుక్కి దున్నుదామంటే, నాణ్యమైన విత్తుపై రైతులకు భరోసా కరవైంది. భారతదేశంలో సాగుకు అనుమతి లేని జన్యుమార్పిడి(జీఎం) హెచ్‌టీ పత్తి విత్తనాలను రైతులకు యథేచ్ఛగా అమ్మేస్తున్నారు. వాటిని కొని రైతులు సాగుచేయడం అక్రమమని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పదేపదే చెబుతున్నా ఎవరూ వినడం లేదు. వీటిని ఎందుకు అనుమతించరని తాజాగా మహా రాష్ట్రలోని అకోట్‌లో రైతులు ఏకంగా నిరసనలకు దిగారు. జన్యుమార్పిడి వంగ విత్తనాలకు దేశంలో అనుమతి లేకున్నా హరియాణాలో సాగైనట్లు ఇటీవల బయటపడింది. అనుమతి లేకుండా పండిస్తున్న వంకాయలు మన ఆహారంలో భాగమవుతున్నాయి. ఇలాగే జీఎం సోయాచిక్కుడునూ అనుమతి లేకున్నా, రహస్యంగా సాగు చేయిస్తున్నారనే వాదనలు వినిపిస్తున్నాయి. పంటల సాగులో కష్ట నష్టాలతో బలహీనపడుతున్న అన్నదాతలను ఆదుకోవాల్సిన భారత విత్తన చట్టం అత్యంత బలహీనంగా ఉంది.

పుచ్చుపట్టిన వ్యవస్థలు
దేశంలో విత్తన పరిశ్రమ అభివృద్ధి చెందుతున్నంత వేగంగా రైతులుగాని, వ్యవసాయరంగం గాని ప్రగతి సాధిస్తున్న దాఖలాలు లేవు. దేశంలో మొత్తం విత్తన వ్యాపార విలువ 2010-17 మధ్యకాలంలో 17 శాతం వృద్ధిరేటుతో దాదాపు రూ.25 వేలకోట్లకు చేరింది. మరో అయిదేళ్ల(2018-23)లో ఇది ఏకంగా రూ.55 వేలకోట్లకు చేరుతుందని, సంచిత వార్షిక వృద్ధిరేటు 14 శాతానికి పైగా ఉండవచ్చని ఓ అధ్యయనంలో తేలింది. ఈ స్థాయి వృద్ధిరేటు వ్యవసాయంలో కనుచూపు మేరలో కానరావడం లేదు. ప్రపంచవ్యాప్తంగా జీఎం విత్తనాల వ్యాపారాన్ని విస్తరింపజేస్తున్న బహుళజాతి సంస్థలకు భారత రైతులు, ఇక్కడి వ్యవసాయం కాసులు కురిపించే కల్పవృక్షంలా మారాయి. ఇక్కడ చట్టాలేమీ పనిచేయవు, ఉన్నతస్థాయి నుంచి గ్రామస్థాయి దాకా లంచాలిస్తే అందరూ మిన్నకుండిపోతారు. తనిఖీ వ్యవస్థల్లో డొల్లతనం, అక్రమాలకు పాల్పడినా శిక్షలూ తక్కువే పడేలా విత్తన చట్టం సుతిమెత్తగా ఉండటంతో విత్తన విక్రయాల్లో అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. యూపీఏ ప్రభుత్వ హయాములో పార్లమెంటు ఆమోదం పొందకుండా కొన్ని అదృశ్య శక్తులు కొత్త విత్తన చట్టాన్ని తొక్కిపెట్టాయి. తిరిగి ఎన్డీఏ ఏలుబడికొచ్చి అయిదేళ్లు దాటినా ఆ చట్టానికి మోక్షం లేకపోవడం గమనార్హం.

ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ)తో చేసుకున్న అరడజను ఒప్పందాల ప్రకారం మనదేశంలో మొక్కల రకాలు, వంగడాలు, రైతుల హక్కులకు పక్కా రక్షణ ఉంది. ఇందుకోసమే 2001లో ‘మొక్కల రకాలు, రైతుల హక్కుల పరిరక్షణ’(పీపీవీఎఫ్‌ఆర్‌) చట్టాన్ని కేంద్రం తెచ్చింది. ఈ చట్టప్రకారమే పీపీవీఎఫ్‌ఆర్‌ మండలిని 2005 నవంబర్‌ 11న కేంద్రం ఏర్పాటు చేసింది. దేశంలో కొత్త వంగడాల అభివృద్ధిని ప్రోత్సహిస్తూ రైతుల హక్కులు, మొక్కల రకాలను కాపాడేందుకు పక్కా వ్యవస్థను ఏర్పాటు చేయాలనేది మండలి లక్ష్యం. కొత్త వంగడాలను అభివృద్ధి చేసేందుకు అవసరమైన మొక్కల జన్యువనరులను పరిరక్షించి అభివృద్ధి చేయడంలో రైతుల హక్కులను గుర్తించి వాటిని కాపాడాలనేది ఈ మండలికి అప్పగించిన మరో కీలక బాధ్యత. ఇది ఏర్పాటై ఒకటిన్నర దశాబ్దం అవుతున్నా వ్యవసాయాధికారులకే దీని గురించి సరిగ్గా తెలియకపోవడం మరో విషాదం. ఇతర దేశాల కంపెనీలు తెచ్చే కొత్త వంగడాలను మనదేశ రైతులకు వాణిజ్యపరంగా అమ్మాలంటే ఎంత సుంకం సదరు కంపెనీకి ఇవ్వాలనే అంశంలో పీపీవీఎఫ్‌ఆర్‌ మండలి నిర్ణయించాలి. ఈ అనుమతి ఇచ్చే సమయంలో రైతుల హక్కులను కాపాడేలా మండలి నిర్ణయం తీసుకోవాలి. పీపీవీఎఫ్‌ఆర్‌ మండలి అనుమతి పొందకుండా కేంద్ర ప్రభుత్వ అనుమతులతో పత్తి విత్తనాలను అమ్ముతున్నారు. ఇప్పుడిక బీటీ-3 పత్తి విత్తనాలను అక్రమంగా దేశంలో కొందరు వ్యాపారులు అమ్మేస్తున్నారు. వీటినే కలుపు మొక్కలను చంపే రసాయన మందు ‘గ్లైఫోసెట్‌’ను తట్టుకునే(హెర్బిసైడ్‌ టాలరెంట్‌-హెచ్‌టీ) పత్తి విత్తనాలనీ పిలుస్తున్నారు. ఈ మందును పొలంలో చల్లితే బీటీ-3 పత్తి మొక్కలు తప్ప మిగతావన్నీ మాడిపోతాయి. ఈ విషపూరిత రసాయనాన్ని చల్లినందుకు తనకు క్యాన్సర్‌ వచ్చిందని ఓ వ్యక్తి అమెరికాలో కోర్టుకెక్కితే అది నిజమేనని తేల్చి భారీగా పరిహారం ఇప్పించింది. అదే బీటీ-3 పత్తి విత్తనాలు నాటి, విచ్చలవిడిగా గ్లైఫోసెట్‌ను చల్లుతున్న భారత రైతులకు క్యాన్సర్‌ వస్తే కాపాడేదెవరనే ప్రశ్నలకు సమాధానం దొరకదు. ఈ విత్తనాలను వాణిజ్యపరంగా అమ్మేందుకు భారత ప్రభుత్వం ఏ కంపెనీకీ అనుమతి ఇవ్వలేదు. వీటిని అమ్మకుండా, సాగుచేయనీయకుండా అడ్డుకోవాలని కేంద్రం అన్ని రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నా క్షేత్రస్థాయిలో ఎక్కడా అవి ఆగడం లేదు. తెలంగాణ వ్యవసాయ, పోలీసు అధికారులతో కార్యదళం ఏర్పాటుచేసి గ్రామాల్లో అక్రమ విత్తనాల కోసం గాలిస్తుంటే కుప్పలు తెప్పలుగా అవి బయటపడుతున్నాయి. మిగతా పంటల వంగడాల్లో నాసిరకాల వల్ల రైతులు నష్టపోతున్నారు. సోయాచిక్కుడు విత్తనాలు తెలంగాణలో దొరక్క ఇతర రాష్ట్రాల ప్రైవేటు వ్యాపారులు విక్రయిస్తున్నవే దిక్కవుతున్నాయి. సదరు వ్యాపారులు నిజంగానే ఆ విత్తన పంటలను శాస్త్రీయ పద్ధతుల్లో ఉత్పత్తి చేశారా అనే దానిపై విచారణ చేయిస్తే గుట్టు రట్టవుతుంది. దేశంలో విత్తన వ్యాపారం ఎవరైనా చేయగలిగినంత సులువైపోయింది. కొందరు వ్యాపారులు విపణులకు వచ్చే సాధారణ వేరుసెనగ, సోయా వంటి పంటలను కొని ‘నాణ్యమైన విత్తనం’ అనే లేబుల్‌ అంటించి రైతులకు అమ్మేయడం సర్వసాధారణమైంది.

నిబంధనలకు పదును
విత్తన చట్టాన్ని తక్షణం పార్లమెంటుతో ఆమోదింపజేసి అమలులోకి తేవాలి. ఈ చట్టానికి పదును లేనంతకాలం నాసిరకం, అక్రమ విత్తనాలను అరికట్టడం అసాధ్యం. కొన్ని సంస్థల మేలు కోసం కోట్లాది మంది రైతుల జీవితాలతో చెలగాటమాటే విధానాలు ఇకనైనా మారాలి. వాస్తవానికి మనదేశంలో ప్రైవేటు విత్తన సంస్థలకన్నా ప్రభుత్వ వ్యవసాయ పరిశోధన సంస్థల్లోనే మేధావులైన వ్యవసాయ శాస్త్రవేత్తలున్నారు. పత్తి తప్ప మిగతా పంటల్లో అధికంగా సాగవుతున్న వంగడాల్లో అత్యధిక శాతం ప్రభుత్వ వ్యవసాయ పరిశోధన సంస్థల నుంచి బయటికి తెచ్చినవే. ఇంకా అనేక వందల కొత్త వంగడాలను ఈ సంస్థలు విడుదల చేసినా పొలాల్లోకి సాగులోకి రావడంలేదు. అవి బాగా పండుతాయని రైతులకు చెప్పే వ్యవసాయ విస్తరణ వ్యవస్థలు సరిగ్గా లేకపోవడమే అందుకు కారణం. అంతంతమాత్రంగా పండే తమ వంగడాల గురించి ప్రైవేటు విత్తన కంపెనీలు విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నాయి. వాటికన్నా బాగా పండే విత్తనాలు ప్రభుత్వ సంస్థల వద్ద ఉన్నా వాటికి ప్రచారం చేయడం గాని, రైతులతో సాగుచేయించే ప్రోత్సాహం గాని క్షేత్రస్థాయిలో లేదు. పరిశోధన సంస్థలకు, రైతులకు మధ్య విత్తన ధ్రువీకరణ సంస్థలు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థలు, రాష్ట్ర వ్యవసాయశాఖలు వారధిలా ఉండాలి. కొత్త వంగడాలను విపణిలోకి విడుదల చేసేముందు ఇటీవలి కాలంలో కొందరు వ్యవసాయ శాస్త్రవేత్తలు పూర్తిస్థాయి సాంకేతిక నియమాలన్నీ పాటించడం లేదు. అరకొర పరిజ్ఞానంతో హడావుడిగా కొత్త వంగడాలు విడుదల చేస్తున్నారు. దీనివల్లనే వారు పరిశోధన సంస్థల్లో అద్భుతంగా పండాయని చెప్పి విడుదల చేసిన అనేక వంగడాలు సాధారణ రైతుల పొలాల్లో వెలవెలాబోతున్నాయి. వ్యవసాయ విశ్వవిద్యాలయాలు విడుదలచేసే కొత్త వంగడాలను రైతులు కొనకపోవడానికి అవి పొలాల్లో సరైన ఫలితాలను ఇవ్వకపోవడమే కారణం. దీనికి సమాధానం చెప్పేందుకు శాస్త్రవేత్తలు కొన్ని గ్రామాలను ఎంపిక చేసి అక్కడి రైతుల పొలాల్లో నేరుగా ఆ విత్తనాలనే సాగుచేయించాలి. వాటి గొప్పతనాన్ని రైతులకు ప్రత్యక్షంగా చూపాలి. విత్తన పరిశోధనల్లో అనేక అవినీతి, అక్రమాలు సాగుతున్నాయి. ప్రభుత్వ సంస్థల్లో ఏదైనా కొత్త వంగడం వస్తోందంటే ఆ సమాచారాన్ని కొందరు ముందే ప్రైవేటు సంస్థలకు చేరవేస్తున్నారు. ప్రతీ వ్యవసాయ శాస్త్రవేత్త జవాబుదారీతనంతో పనిచేయాలి. స్వల్పస్థాయిలో ఉండే సొంత లాభాలకు, స్వార్థంతో అమ్ముడుపోతే దేశ ఆహార భద్రతకు తూట్లు పొడిచినవారవుతారు. కరవు, వరదలు, అధిక ఉష్ణోగ్రతలు వంటి వాతావరణ మార్పులను తట్టుకుని పండే మేలైన వంగడాలు ఇప్పుడు దేశానికే కాదు- ప్రపంచ రైతాంగానికీ అవసరం. విపత్తులను తట్టుకుని పండే కొత్త వంగడాన్ని పరిశోధించి బయటకు తెస్తే కొనడానికి మన రైతులే కాదు, పలు దేశాలు బారులు తీరుతున్నాయి. కేవలం పచ్చపురుగును తట్టుకునే శక్తి ఉందనే గుణాన్ని చూపి బీటీ పత్తి విత్తనాలను ప్రపంచవ్యాప్తంగా అమ్ముతూ అమెరికా కంపెనీ వేల కోట్ల రూపాయలను పోగేసుకుంటోంది. ఆ స్థాయి వంగడాలను మన వ్యవసాయ పరిశోధకులు తెస్తేనే మన ఆహార భద్రతకు పూచీకత్తు లభిస్తుంది. లేకపోతే మన రైతుల కష్టమంతా బహుళజాతి కంపెనీల చేతుల్లో ధారపోయకతప్పదు. పంట సాగుకు కీలకమైన మేలైన బీజాన్ని అందించడంలో విఫలమైనంత కాలం రైతుల సంక్షేమం పేరిట ఎన్ని వేలకోట్ల రూపాయలను రాయితీలుగా గుమ్మరించినా ఒరిగేదేమీ ఉండదు!

వినియోగంపై నియంత్రణ కరవు
భారత్‌ వంటి పెద్ద దేశంలో ఏ గ్రామంలో ఏ రకం విత్తనాలను సాగుచేస్తున్నారు, వాటికి పర్యావరణ అనుమతి ఉందా, అవి నాణ్యమైనవేనా అని తనిఖీ చేసే వ్యవస్థలేవీ పక్కాగా లేకపోవడం బహుళజాతి సంస్థలకు వరంగా మారింది. విత్తన నాణ్యత పరీక్షలకు ప్రయోగశాలలు ఉండవు, నాణ్యత పరీక్షకు నిపుణులైన శాస్త్రవేత్తలు తగినంతమంది ప్రభుత్వ వ్యవస్థల్లో ఉండరు. నాసిరకం విత్తనాలు అమ్మే సంస్థలను పట్టుకునేందుకు పక్కా నియంత్రణ వ్యవస్థలు లేవు. ఒకవేళ పట్టుబడినా కంపెనీలను శిక్షించేందుకు బలమైన విత్తన చట్టం లేదు. ఈ సవాళ్లను ఎదుర్కోకుండా రైతులకు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా సీజన్‌కు ముందు అధికారులకు ఆదేశాలిస్తుంటాయి.

- మంగమూరి శ్రీనివాస్‌
Posted on 22-06-2019