Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

నేల విడిచి సాగు?

ఏనాడో 1871లో బ్రిటిష్‌ జమానాలోనే వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి నిమిత్తం కేంద్రస్థాయిలో మంత్రిత్వ విభాగం ఏర్పాటైంది మొదలు, స్వాతంత్య్రానంతరం ఏడు దశాబ్దాల కాలంలో సేద్య రంగ సముద్ధరణ కోసమంటూ ఎన్నెన్ని కమిటీలు కొలువుతీరాయో, అవి ఎన్ని సూచనలు దయచేశాయో లెక్కేలేదు. పాత నివేదికల బూజు దులిపి ఆచరణ సాధ్యమైన సిఫార్సుల సత్వర అమలుకు సిద్ధపడేకన్నా కొత్త కమిటీలతో సరికొత్త కోలాటమంటేనే పాలకశ్రేణులకు మోజు! దేశ వ్యవసాయ రంగంలో వ్యవస్థాగత సంస్కరణలు తీసుకురావడానికి ఉన్నతాధికార కార్యదళా (టాస్క్‌ఫోర్స్‌)న్ని ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ గత నెలలో జరిగిన నీతి ఆయోగ్‌ పాలక మండలి భేటీలో ప్రకటించారు. అందుకు అనుగుణంగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ సారథ్యంలో కర్ణాటక, హరియాణా, అరుణాచల్‌ ప్రదేశ్‌, గుజరాత్‌, యూపీ ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర వ్యవసాయ మంత్రి సభ్యులుగా ‘టాస్క్‌ఫోర్స్‌’ నియామకం పూర్తి అయిందిప్పుడు! రోజువారీ పరిపాలన వ్యవహారాలు, రాజకీయ వ్యాపకాల్లో తలమునకలయ్యే ముఖ్యమంత్రులు ‘వ్యవసాయరంగ రూపాంతరీకరణ’పై ఏపాటి దృష్టి సారించగలరో అందరికీ తెలుసు! 2022 నాటికి రైతుల ఆదాయాలు రెట్టింపు చెయ్యడం మొదలు, వ్యవసాయ ఉత్పాదనల మార్కెటింగ్‌లో మార్పులు, కాంట్రాక్ట్‌ సేద్య విధివిధానాలు, ప్రైవేటు పెట్టుబడుల ఆకర్షణకు అనుసరణీయ మార్గాలు వంటి వాటన్నింటినీ సిద్ధంచేసి, ఆయా సంస్కరణల్ని రాష్ట్రాలు అమలుచేసే కాలానుగుణ ప్రణాళిక పద్ధతుల్ని సైతం ఫడణవీస్‌ కార్యదళం సన్నద్ధం చేయాల్సి ఉంటుంది. నేటికీ 54 శాతం జనావళికి జీవనాధారమైన వ్యవసాయాన్ని కొత్తపుంతలు తొక్కించాలన్న సంకల్పం ఏ మాత్రం వంక పెట్టలేనిదే అయినా, అన్ని రకాలుగా మంచి చెడులు బేరీజు వేసి సాగించాల్సిన మహాక్రతువును సేద్యరంగ ఉద్దండులకు కాకుండా ముఖ్యమంత్రులకు అప్పగించడమే విడ్డూరంగా ఉంది!

ఇరవై ఎనిమిదేళ్ల ఆర్థిక సంస్కరణలు భారతీయ రైతుల బతుకుల్ని అక్షరాలా గాలిలో దీపాలుగా మార్చేశాయి. నష్టదాయక సేద్యం నిలువునా ముంచేస్తుంటే, సర్కారీ కనీస మద్దతు ధర క్రూరంగా అపహసిస్తుంటే, ఆ పాటి ధరా దక్కనిచ్చేది లేదని దళారులు దగా చేస్తుంటే- పొలమనే పద్మవ్యూహంలో చిక్కి మూడు లక్షలమందికి పైగా రైతులు నిహతులైన ఘోరకలి ప్రపంచంలోనే ఎక్కడా కనీవినీ ఎరుగనిది! ‘అన్నదాత’ అన్న తగరపు కిరీటాలు తగిలించకపోవచ్చుగాక- ఇజ్రాయెల్‌ మొదలు అగ్రరాజ్యం దాకా అన్ని దేశాలూ రైతుల ఆర్థిక ప్రయోజనాలు ఏ దశలోనూ తెగటారిపోకుండా సకల జాగ్రత్తలూ తీసుకొంటున్నాయి. అందుకు పూర్తి విరుద్ధంగా, దేశీయ రైతుల కష్టానికి దీటైన గిట్టుబాటు కల్పిస్తే, ధరోల్బణం కట్లు తెంచుకొంటుందన్న అసంబద్ధ వాదనలతో కేంద్రం పెడసరంగా స్పందిస్తోంది. వేలమంది రైతుల చావుడప్పుల ధ్వని గుండెల్ని మెలిపెట్టిన నేపథ్యంలో యూపీఏ ప్రభుత్వం నియమించిన డాక్టర్‌ స్వామినాథన్‌ కమిషన్‌- 2006 అక్టోబరు నాటికే సమగ్రంగా అయిదు నివేదికలు సమర్పించింది. సేద్యానికి అయ్యే వాస్తవిక వ్యయానికి అదనంగా 50 శాతం కలిపి గిట్టుబాటు ధర నిర్ధారించడంతో పాటు దాన్ని రైతుకు సక్రమంగా అందించాలన్న కీలక సూచనకు- కేంద్రంలో ప్రభుత్వాలు మారినా, పుష్కరకాలంగా మన్నన కొరవడింది. దాని వెన్నంటి కొలువుతీర్చిన భూపేందర్‌ సింగ్‌ హుడా కమిటీ- వ్యవసాయ ఖర్చులు ధరల సంఘం చేసే సేద్యవ్యయ నిర్ధారణ ప్రాతిపదికల్నే మార్చేయాలంటూ రైతులకు నాలుగు శాతం వడ్డీకే రుణాలందివ్వాలన్న సూచన సహా 150 సిఫార్సులతో 2010లోనే విపుల నివేదిక సమర్పించింది. వ్యవసాయ మార్కెట్ల సంస్కరణలపై రాష్ట్రాల ముఖ్యమంత్రుల కమిటీ సూచనలు 2014 జులైలోనే కేంద్రానికి అందాయి. రోజుకు రెండువేల మందికి పైగా రైతులు కాడీమేడీ వదిలేస్తున్న దుస్థితి, దేశ ఆహార భద్రతపైనే ప్రమాద ఘంటికలు మోగిస్తున్నా- ఇలా కమిటీలతో కాలయాపన, ఆలోచనాపరుల్లో నిర్వేదం రగిలిస్తోంది!

భారతీయ వ్యవసాయ వైకుంఠపాళిలో అతివృష్టి, అనావృష్టి చీడపీడల నుంచి, వడ్డీలతో నడ్డివిరిచే దా‘రుణ వసతి’ దాకా, దళారుల దగా నుంచి సర్కారీ ఉదాసీనత దాకా అన్నీ రైతుల కష్టాన్ని గుటుక్కుమనిపించే పెద్ద పాములే. వ్యవసాయ రంగ సముద్ధరణ అంటే సవిస్తృత వ్యూహంతో ఆ దురవస్థలన్నింటినీ దూరం చెయ్యాల్సిందే! అయిదేళ్ల వ్యవధిలో దేశీయంగా సాగు విస్తీర్ణం 60 లక్షల ఎకరాల మేర కుంచించుకుపోయిందని ఎనిమిది నెలల నాటి సేద్యగణన ఎలుగెత్తి చాటింది. రైతుల ఆదాయం రెట్టింపు చెయ్యడానికి కేంద్ర ప్రభుత్వం ఏడంచెల కార్యాచరణ వ్యూహాన్ని ప్రకటించినా, అందుకోసమే 2016 ఏప్రిల్‌లో ఏర్పాటైన ప్రత్యేక కమిటీ కార్యాచరణ ప్రణాళికను ప్రస్తావించినా- క్షేత్రస్థాయిలో అలముకున్న చీకట్లు మలిగి పోలేదనడానికి దాఖలా అది! తనవంతుగా నీతిఆయోగ్‌ వ్యవసాయ రంగంలో అభివృద్ధి పరంగా, సాంకేతికంగా, విధానాల రీత్యా అమలు కావాల్సిన నిర్దిష్ట చర్యలంటూ 2017 ఏప్రిల్‌లో త్రిముఖ వ్యూహాన్ని ప్రకటించింది. వాటన్నింటికీ తలమానికంగా రైతు జీవన భద్రతతో ముడివడితేనే పచ్చని సేద్యం సాధ్యపడుతుందన్న స్వామినాథన్‌ విపుల సూచనలు కేంద్రసర్కారుకు కరదీపిక కాగలుగుతాయి. 2015-’16 నాటికి వ్యవసాయరంగంలో లక్షా 78 వేల కోట్ల రూపాయలున్న ప్రభుత్వ ప్రైవేటు పెట్టుబడులు ఏడేళ్లలో రూ.4.86 లక్షల కోట్లకు చేరితే రైతుల ఆదాయాల్లో స్థిర పెరుగుదల ఉంటుందన్నది సర్కారీ కమిటీల లెక్క. రైతు గౌరవప్రద జీవనానికి భరోసా ఇచ్చే గిట్టుబాటు ధర కల్పించి, ‘జైకిసాన్‌’ స్ఫూర్తితో అన్నదాతకు అన్నిందాలా రక్షణఛత్రం పట్టగలిగితే- వ్యవసాయ రంగ ముఖచిత్రం మారిపోతుందన్నది పక్కా! నేల విడిచి విధాన సాగు- జాతి ఆహారభద్రతకు చేటు!

Posted on 04-07-2019