Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

వ్యవసాయానికి ఊతమేదీ?

* కర్షకుడికి నిరాశ మిగిల్చిన కేంద్ర బడ్జెట్‌

దేశ ఆర్థిక వ్యవస్థ వృద్ధికి ప్రాణాధారమైన వ్యవసాయ రంగంలో వృద్ధి క్రమంగా తగ్గుతున్న పరిస్థితుల్లో ప్రభుత్వం నూతన సంస్కరణలతో ముందుకొస్తుందని ఆశించిన వారికి కేంద్ర బడ్జెట్‌ నిరాశనే మిగిల్చింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో వ్యవసాయ రంగం వాటా ఏటా తగ్గుతూ ఇప్పుడు 14.4 శాతానికి చేరింది. మున్ముందు ఈ వాటా మరింత క్షీణించే పరిస్థితులే కనిపిస్తున్నాయి. ఇది ఆందోళన కలిగిస్తోంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయ రంగంలో వృద్ధి 2.9 శాతం పెరిగింది. ఈ వృద్ధి అంతకు ముందు రెండేళ్లతో పోలిస్తే చాలా తక్కువన్నది చేదునిజం. యాభై శాతానికి పైగా జనాభా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న భారతావనిలో జీడీపీలో సేద్యం వాటా భారీగా కోసుకుపోతుండటం ఆందోళన కలిగిస్తున్న పరిణామం. దేశంలోని దాదాపు 14.4 కోట్లమంది రైతుల్లో 86.2 శాతం చిన్న, సన్నకారు రైతులు ఉన్నారు. కానీ వీరి చేతిలో ఉన్న సాగుభూమి చాలా తక్కువ. దేశవ్యాప్తంగా ఉన్న సాగు భూమిలో వీరు కేవలం 47.4 శాతం విస్తీర్ణంలో మాత్రమే వ్యవసాయం చేస్తున్నారు. మిగతా 13.8 శాతం రైతుల చేతిలో 52.6 శాతం భూమి ఉంది. అత్యధిక సంఖ్యలో రైతులు అతి తక్కువ విస్తీర్ణంలో సాగు చేయడం కలవరపరిచే విషయం. మరోవంక రైతుల్లో మహిళల సంఖ్య ఏటా పెరుగుతోంది. ఆ సంఖ్య ప్రస్తుతం 13.9 శాతానికి చేరడం ఆసక్తికరమైన విషయం. ఇది సానుకూల పరిణామం. సేద్య రంగంలో వస్తున్న ఈ కీలక మార్పులపై ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ సమర్పించిన బడ్జెట్లో కనీస ప్రస్తావన సైతం లేకపోవడం గమనార్హం.

సాగునీటి వృథాతో సమస్యలు
తక్కువ వనరులతో అధిక దిగుబడి సాధించే పంటలపైనే రైతులు దృష్టి సారించాల్సిన అవసరాన్ని ఆర్థిక సర్వే నొక్కి చెబుతోంది. ఎకరం నేలలో ఎంత ఎక్కువ పండిస్తున్నాం అనే కాకుండా, ఒక లీటరు నీటితో ఎంత దిగుబడి సాధిస్తున్నామన్నదీ ముఖ్యమే! దిగుబడి సాధనలో తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నాలుగో స్థానంలో ఉండగా- సాగునీటి వినియోగం విషయంలో మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే ఉభయ రాష్ట్రాలు అట్టడుగున ఉండటం ఆందోళన కలిగిస్తున్న విషయం. ఈ లోపాన్ని సరిదిద్దుకోకపోతే భవిష్యత్తులో సాగునీటి సమస్య మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉంది. సాగునీరు అందుబాటులో లేకపోవడం ఒక సమస్య అయితే- ఉన్న నీటిని సమర్థంగా ఉపయోగించుకోలేకపోవడం ప్రస్తుతం తెలుగురైతులు ఎదుర్కోంటున్న అతిపెద్ద సమస్య. ముఖ్యంగా ప్రాజెక్టుల కింద సాగుతున్న సేద్యంలో నీటి వృథా ఎక్కువగా ఉంటోంది. రైతులు సైతం అత్యధిక నీరు అవసరపడే పంటలవైపే మొగ్గుచూపుతుండటం గమనార్హం. చాలా సందర్భాల్లో సాగు నీటిని వృథా పోనిస్తున్న దాఖలాలూ ఉన్నాయి. దేశంలో అందుబాటులో ఉన్న నీటిలో 89 శాతాన్ని మాత్రమే సేద్యానికి ఉపయోగిస్తున్నారు. అందులో 60 శాతాన్ని వరి, చెరకు పండించేందుకే వినియోగిస్తున్నారు. ఈ పంటలను పండించడానికి ఎక్కువ నీరు అవసరం. పొలాలకు నిండా నీరు పెట్టే విధానానికి స్వస్తి పలికి, సాగునీటిని ఆచితూచి వినియోగించే తుంపర సేద్యం లేదా ‘హోస్‌ రీల్‌’ విధానాలను అందిపుచ్చుకుంటే 60 శాతానికి పైగా నీటిని ఆదా చేయవచ్చు. తుంపర సేద్యం వల్ల చీడపీడల బెడద తగ్గుతుంది.

పెట్టుబడులు లేని ప్రకృతి వ్యవసాయానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు కనిపిస్తోంది. దానివల్ల వ్యవసాయంలో రసాయనాల వాడకం ఉండదని, సహజ వనరుల రక్షణ సాధ్యపడుతుందన్నది ప్రభుత్వ వాదన. ప్రస్తుతం దేశంలో 1.60 లక్షల మంది రైతులు ఈ పద్ధతిలో వ్యవసాయం సాగిస్తున్నట్లు ఆర్థిక సర్వే వెల్లడించింది. రైతులకు సరైన సలహాలు ఇచ్చేందుకు అనువుగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగంలోకి తీసుకురావాలని, మార్కెట్లో ధరలు, ఇతర విషయాలను రైతులకు సకాలంలో మొబైల్‌ ద్వారా అందించాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. ఇది ఆహ్వానించదగ్గదే అయినప్పటికీ ఏ మేరకు సమర్థంగా ఆచరించగలరన్నది ప్రశ్నార్థకమే! రైతుల పంటకు మంచి ధర దొరకడానికి అవసరమైన సదుపాయాలు సమకూర్చాలని ఆర్థిక సర్వేలో పేర్కొన్నారు. వ్యవసాయ అనుబంధ రంగాలను పటిష్ఠంగా తీర్చిదిద్ది- పాడి, కోళ్ళు, మేకలు, చేపల పెంపకం వంటి రంగాలకు దన్నుగా నిలవాలని స్పష్టం చేశారు. ఇవన్నీ ఆచరణలో అందిపుచ్చుకోవాల్సిన ఆదర్శాలే. అయితే ఆ దిశగా వేగంగా అడుగులు పడినప్పుడే సత్ఫలితాలు సాకారమవుతాయి.

రైతులకు ప్రత్యక్షంగా అక్కరకొచ్చే అంశాలేవీ బడ్జెట్లో ప్రస్తావనకు రాలేదు. గడచిన రెండేళ్లలో పప్పుదినుసుల ఉత్పత్తి పెంచినందుకు రైతులకు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ధన్యవాదాలు తెలిపారు. మున్ముందు రైతులు నూనెగింజల ఉత్పత్తిని పెంచాలని, దీనివల్ల దిగుమతుల భారం తగ్గుతుందని ఆమె పేర్కొన్నారు. గతానుభవాలను తరచి చూస్తే- పప్పుదినుసులు అధికంగా పండించిన రైతులు ధరలు పడిపోవడంవల్ల నష్టపోయిన విషయం తెలిసిందే. నూనెగింజలకు సంబంధించి దిగుబడులను పెంచినప్పటికీ, వాటి ధరలు పడిపోతే రైతులకు దిక్కెవరన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది. ధరలు పడిపోయినప్పుడు ప్రభుత్వం రైతులను ఆదుకునేందుకు ముందుకు రావడం లేదు. తాత్కాలిక చర్యలతోనే సరిపెడుతోంది. ఫిబ్రవరిలో సమర్పించిన మధ్యంతర బడ్జెట్లో ఆరు వేల రూపాయల సాయం ప్రకటించడం ఒక్కటే రైతులకు ప్రభుత్వం నేరుగా చేకూర్చిన లబ్ధి. ఇందుకోసం ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ పథకం ప్రారంభించి రూ.75,000 కోట్లు కేటాయించారు. నిజానికి వ్యవసాయ రంగం మౌలిక మార్పుల కోసం ఎదురు చూస్తోంది. కంటితుడుపు చర్యలతో కర్షకుల కష్టాలను తీర్చలేమన్నది పాలకులకు తెలియనిది కాదు. పునాది స్థాయిలో మార్పులు సాకారం కానంతకాలం రైతు పరిస్థితిలో చెప్పుకోదగిన మార్పులు రావన్నది చేదునిజం!

పెట్టుబడులు లేని ప్రకృతి వ్యవసాయం ద్వారా అన్నదాతలు తమ ఆదాయం రెట్టింపు చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. దీని సాధ్యాసాధ్యాలు, లాభనష్టాలను శాస్త్రీయంగా మదింపు వేయాల్సిన అవసరం ఉంది. కేవలం ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో అక్కడక్కడ మాత్రమే ఈ విధానం అమలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా రైతులంతా ఈ పద్ధతికి మారాలని సలహా ఇవ్వడానికంటే ముందు ప్రభుత్వం దీనిపై శాస్త్రీయ విశ్లేషణ చేయించడం అవసరం. విశ్లేషణలో వెల్లడైన ఫలితాల మేరకు ముందుకు సాగాలి తప్ప హడావిడిగా ముందుకు వెళితే సానుకూల ఫలితాలు సమకూరవు.

ప్రధాని సారథ్యంలో ‘మండలి’తో మేలు
గ్రామీణ ప్రాంతాల్లో 1.25 లక్షల కిలోమీటర్ల రహదారుల కోసం రూ.80,250 కోట్లను మంత్రి నిర్మాలా సీతారామన్‌ బడ్జెట్‌లో ప్రతిపాదించారు. ఇది ఆహ్వానించదగ్గ ప్రతిపాదన. పల్లెలను నగరాలు, పట్టణాలతో అనుసంధానించే రహదారులు రైతులోకానికి ఎనలేని మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో 75,000 మందికి శిక్షణ ఇచ్చి వారి నైపుణ్యాలు పెంచి, చిన్న వ్యాపారాల నిర్వహణకు అనుగుణంగా వారిని తీర్చిదిద్దాలనే సంకల్పాన్ని సర్కారు ప్రకటించింది. ఈ వ్యాపారులు రైతులు పండించే పంటలను గ్రామీణ ప్రాంతాల్లోనే ప్రాసెసింగ్‌ చేసినట్లయితే- ఆ మేరకు పన్నులను తగ్గించే ప్రతిపాదన ముందుకు తీసుకురావడం ముదావహం. దీనివల్ల రైతులు పండించిన పంటకు అధిక ధర లభించే అవకాశాలు మెరుగుపడతాయి. దేశవ్యాప్తంగా పదివేల రైతు ఉత్పత్తిదారుల సంస్థలు ఏర్పాటు చేయించనున్నట్లు తెలిపారు. వీటివల్ల రైతుల సంఘటిత శక్తి పెరిగి లాభాలు పొందే అవకాశం ఉంటుంది. ‘ఈనామ్‌’ పద్ధతిని మెరుగ్గా ఉపయోగించుకుని రైతులు అధిక ధరలు పొందాలన్న ప్రభుత్వ సూచన స్వాగతించదగినదే. దేశంలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఈ విధానం అందుబాటులో ఉండటం గమనార్హం. దేశవ్యాప్తంగా ‘ఈనామ్‌’ విస్తరణపై ప్రభుత్వం నోరుమెదపలేదు. రైతుకు మంచి ధరలు రావాలంటే అన్ని రాష్ట్రాల్లో వ్యవసాయోత్పత్తి మార్కెటింగ్‌ కమిటీ చట్టాల్లో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా బడ్జెట్లో ఒక్క ప్రతిపాదనా లేకపోవడం నిరాశ కలిగించిన పరిణామం. ఒక వైపు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించాలని ఆర్థిక సర్వే పేర్కొంటుండగా- బడ్జెట్లో ఎరువులపై రాయితీని 14 శాతం పెంచి ఇందుకోసం రూ.79,996 కోట్లు కేటాయించడం గమనార్హం. కేంద్ర బడ్జెట్‌ను సమీక్షిస్తే వ్యవసాయ రంగానికి తగిన ప్రాధాన్యం దక్కలేదని అనిపిస్తోంది. ఉదాహరణకు జీఎస్‌టీ (వస్తు సేవల పన్ను) మండలి తరహాలో జాతీయ స్థాయిలో ‘వ్యవసాయ మండలి’ని ప్రధానమంత్రి అధ్యక్షతన ఏర్పాటు చేసినట్లయితే సేద్యానికి తిరుగులేని ప్రోత్సాహంగా ఉండేది. వ్యవసాయానికి సంబంధించి కేంద్రం పాత్ర పరిమితమే. అందువల్ల రాష్ట్రాలు, కేంద్రం కలిసి ఉమ్మడిగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఒక వేదికను ఏర్పాటు చేయడం అవసరం. ముఖ్యంగా విత్తన రంగ అభివృద్ధికి అవసరమైన పరిశోధనల కోసం ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో మరింత చొరవ ప్రదర్శించాల్సి ఉంది.

అందని రుణాలు... అన్నదాతల అగచాట్లు
పరపతి... రైతులు ఎదుర్కొంటున్న సమస్యల్లో కీలకమైనది. బ్యాంకుల నుంచి వారికి తగిన మేరకు రుణాలు ఇప్పటికీ అందడం లేదు. ఈ పరిస్థితిని మార్చే ప్రయత్నాలేవీ బడ్జెట్లో కనిపించలేదు. ఏటా రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ కార్యచరణ ప్రణాళికలు ఘనంగా ఉంటున్నా ఆచరణలోకి వచ్చేసరికి అన్నదాతకు అరకొర సాయమే అందుతోంది. మొత్తానికి బడ్జెట్లో రైతులకు మేలు కలిగించే ప్రతిపాదనలు పరిమితంగానే కనిపించాయి. దేశ వ్యవసాయ విధానాల్లో సమూల క్షాళనను లక్షిస్తూ కేంద్ర ప్రభుత్వం కొందరు ముఖ్యమంత్రులతో ఇటీవల ఒక కమిటీని ఏర్పాటు చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాలకు ప్రాతినిధ్యం లేదు. ఈ కమిటీని మరింత విస్తరించి- రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలకు నిర్మాణాత్మక పరిష్కారాలు అన్వేషించడం తక్షణావసరం!

- విన్నకోట రామచంద్ర కౌండిన్య
(రచయిత- వ్యవసాయరంగ నిపుణులు)
Posted on 08-07-2019