Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

అత్యాశల పల్లకీలో పత్తిరైతు

దేశవ్యాప్తంగా ఖరీఫ్‌ పంటల సాగు జోరందుకుంది. గతేడాది పత్తికి ధర ఆశాజనకంగా ఉండటంతో ఆహార ధాన్యాల పంటసాగును మించి పత్తి సాగు విస్తీర్ణం 10 నుంచి 15 శాతం వరకూ అధికం కావచ్చని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం అంచనా వేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే 60 లక్షల ఎకరాలకు చేరవచ్చని అంటున్నారు. సాగునీటి వసతి ఉన్నచోటే కాకుండా, వర్షాధార భూముల్లోనూ పత్తి సాగుకు తెలుగు రాష్ట్రాల రైతులు మొగ్గుచూపుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ ఏడాది పత్తి దిగుబడులు ఆరు శాతం వరకూ పెరగవచ్చని ‘ప్రపంచ పత్తి సలహా కమిటీ (ఐకాక్‌)’ తాజా నివేదికలో ప్రకటించింది. దీనివల్ల సమీప భవిష్యత్తులో ధరల్లో మార్పు ఉండకపోవచ్చని అంచనా. ‘జన్యుమార్పిడి (జీఎం)’ విత్తనాల ప్రచారమూ సాగు విస్తీర్ణం పెరుగుదలకు కారణం. కలుపు మొక్కలను చంపే విషపూరిత రసాయన మందులను తట్టుకునే (హెచ్‌టీ) పత్తి విత్తనాలను దేశంలో అనుమతి లేకుండా విచ్చలవిడిగా అమ్మడమూ పత్తి సాగు పెరగడానికి మరో ప్రధాన కారణం. ప్రస్తుతం ఖరీఫ్‌ సీజన్‌ ఆరంభంలో ఈ పంటపై రైతులకు వ్యవసాయ పరిశోధన సంస్థల నుంచి గాని, ప్రభుత్వాల నుంచిగాని సరైన సలహాలు, మార్గదర్శకత్వం లేకపోవడం వల్ల వారికి ఇష్టమైనంత విస్తీర్ణంలో విత్తుతున్నారు.

విచ్చలవిడిగా పెట్టుబడులు
పత్తి సాగు నిజానికి జూదంలా మారింది. నిరుడు ఖరీఫ్‌లో దేశవ్యాప్తంగా 3.86 కోట్ల హెక్టార్లలో వరి సాగుచేస్తే 1.22 కోట్ల హెక్టార్లలో పత్తి వేశారు. వరి, పప్పు ధాన్యాల వంటి ఆహార పంటలకన్నా చాలా ఎక్కువ పెట్టుబడి వ్యయంతో పత్తి పంటను రైతులు సాగుచేస్తున్నారు. మార్కెట్‌ ధరలు ఏమాత్రం పతనమైనా ఒక్కో రైతు లక్షలాది రూపాయల అప్పుల్లో కూరుకుపోయి, ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. రైతు ఆత్మహత్యల్లో విదర్భ మొదలుకుని తెలుగు రాష్ట్రాల వరకూ పత్తి సాగుచేసినవారే అధికంగా ఉండటానికి, ఇందులో ఎదురయ్యే అధిక నష్టాలే కారణమని రైతుసంఘాల అధ్యయనాల్లో తేలింది. తెలంగాణలో క్వింటాలు వరి ధాన్యం పండించాలంటే రూ.2,433 ఖర్చవుతోంది. క్వింటాలు పత్తి పండాలంటే అదే రైతు ఈ సీజన్‌లో రూ.9,532 పెట్టుబడి పెట్టాల్సివస్తోంది. ఈ వ్యయాన్ని పరిగణనలోకి తీసుకునే కొత్త మద్దతు ధర ప్రకటించాలని కేంద్రానికి తెలంగాణ వ్యవసాయశాఖ నివేదించింది. ప్రస్తుతం పత్తి మద్దతు ధర రూ.5,450 మాత్రమే. రైతులు విత్తుతున్న పత్తి విత్తనాలు మొలకెత్తి వచ్చే నవంబరులో పంట విపణికి వచ్చే సమయానికి సైతం మార్కెట్‌ ధర గరిష్ఠంగా రూ.5,800 వరకే ఉండవచ్చని ప్రొఫెసర్‌ జయశంకర్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయంలోని మార్కెట్‌ ఇంటెలిజెన్స్‌ విభాగం ముందస్తు అంచనాల్లో ప్రకటించింది. అంటే పంట సాగువ్యయంకన్నా తక్కువ ధర వస్తుంది. పైగా జూన్‌ ఆరంభంలోనే పత్తి విత్తడానికి అనుకూలం. ఈ నెల మొత్తం సరైన వర్షాలు లేక విత్తేందుకు వాతావరణం అనుకూలించలేదు. గతేడాది దేశంలో మూడోవంతు ప్రాంతంలో కరవు పరిస్థితుల వల్ల పత్తి దిగుబడి పడిపోయింది. తొలుత 3.73 కోట్ల బేళ్ల పత్తి దిగుబడి వస్తుందని ‘భారత పత్తి సమాఖ్య (ఐసీఎఫ్‌)’ అంచనా వేసింది. అందులో 60 లక్షల బేళ్ల వరకూ దిగుబడి తగ్గినట్లు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా గతేడాది 8.20 కోట్ల ఎకరాల్లో పత్తి సాగుచేయగా, 11.89 కోట్ల బేళ్ల పత్తి దిగుబడి వచ్చింది. గతేడాది పత్తి అధికంగా సాగుచేసే దేశాల్లో బ్రెజిల్‌, పాకిస్థాన్‌ తప్ప మిగతా అన్ని దేశాల్లో దిగుబడి తగ్గింది. ఇండియాలోనే అత్యధికంగా 12.7 శాతం దిగుబడి తగ్గడం వల్ల గతేడాది ఎక్కువ మంది రైతులకు మద్దతు ధర లభించింది. అదే ఊపు ఈ ఏడాదీ కొనసాగుతుందనే ఆశాభావంతో ఇప్పుడు ఎక్కువ శాతం రైతులు ఈ పంట సాగుకు మొగ్గు చూపుతున్నారు. భారత దేశంలో 2017-18లో పత్తి దేశీయ వినియోగం 3.15 కోట్ల బేళ్లని ‘జాతీయ పత్తి సలహా మండలి (క్యాబ్‌)’ తెలిపింది. ప్రస్తుతం సాగుచేస్తున్న విస్తీర్ణంలోనే పత్తి పంట ఉత్పాదకత పెంచాలని కేంద్రం ‘రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన (ఆర్కేవీవై)’ పథకం కింద నిధులిస్తోంది.

పత్తి పంట రైతులకన్నా విత్తన సంస్థలకు కాసులు పూయించే కల్పవృక్షంలా మారింది. ఎకరా పత్తి సాగుకు రెండు ప్యాకెట్ల బీటీ పత్తి విత్తనాలు కావాలి. 450 గ్రాముల విత్తనాలుండే ఒక్కో ప్యాకెట్‌ ధర రూ.730గా కేంద్రం నిర్ణయించింది. ప్రస్తుత ఖరీఫ్‌లో 3.20 కోట్ల ఎకరాల్లో పత్తి నాటేందుకు అవసరమైన విత్తనాలు కొనేందుకు కంపెనీలకు రైతులు రూ.5,000 కోట్లకు పైగా చెల్లించాలి. దేశీయ విత్తన పరిశ్రమ మొత్తం వార్షిక టర్నోవర్‌లో అయిదోవంతు వాటా పత్తి విత్తనాలదే అంటే ఇదెంత ముఖ్యమైందో అర్థం చేసుకోవాలి. బహుళజాతి విత్తన సంస్థలు ఈ వ్యాపారాన్ని సొమ్ము చేసుకునేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. దేశంలో అక్రమంగా జీఎం విత్తనాలను సాగుచేయించడం వెనకా రైతులను, దేశ ఆదాయాన్ని కొల్లగొట్టే కుట్రలున్నాయి. 2005 నుంచి 2013 దాకా హెచ్‌టీ పత్తి విత్తనాలు క్షేత్రస్థాయి ప్రయోగాలకు అనుమతించారు. వాటి వాణిజ్య అమ్మకాలకు దరఖాస్తు చేసిన బహుళజాతి సంస్థ కేంద్రం అనుమతి రాకముందే దరఖాస్తును వెనక్కి తీసేసుకుంది. ఈ తతంగం ముగిసిన మూడేళ్ల తరవాత ఇవే హెచ్‌టీ విత్తనాలను విచ్చలవిడిగా దేశంలో రైతులకు అమ్ముతున్నారు. అమ్ముతున్న కంపెనీలేవి, అవెలా దేశంలోకి వచ్చాయనేది తేల్చేందుకు సీబీఐతో విచారణ చేయించాలని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరినా ఇంతవరకూ స్పందన లేదు. మహారాష్ట్రలో హెచ్‌టీ పత్తి విత్తనాలు సాగుచేశారని రైతులపై కేసులు పెట్టారు. ఏపీలో 13 కంపెనీల లైసెన్సులూ రద్దుచేశారు. అయినా ఈ సీజన్‌లోనూ హరియాణా, గుజరాత్‌ల నుంచి మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాల వరకూ ఈ అక్రమ విత్తనాల అమ్మకాలు, సాగు విపరీతంగా పెరుగుతున్నాయి. తెలంగాణ వ్యవసాయశాఖ గత నెలరోజుల్లో జరిపిన దాడుల్లో పట్టుబడిన విత్తనాల్లో హెచ్‌టీ పత్తి ఉన్నట్లు ప్రయోగశాలల పరీక్షల్లో నిర్ధారించారు. రైతులు వీటిని కొంటున్నందున ఎలాగైనా ఇక భారత ప్రభుత్వం దిగివచ్చి, అమ్మకాలకు అధికారిక ముద్ర వేస్తుందనే ఉద్దేశంతో విత్తన కంపెనీలు ఈ అక్రమ అమ్మకాల వ్యూహంతో క్రమంగా ఉచ్చు బిగిస్తున్నాయి. హెచ్‌టీ పత్తి విత్తనాలకు అనుమతి ఎందుకు ఇవ్వరని ప్రశ్నిస్తూ రైతులతో కంపెనీలు మహారాష్ట్రలో ధర్నాలు చేయించాయి. ఇదంతా కంపెనీల ఎత్తుగడేనని రైతుసంఘాలు చేస్తున్న ఆరోపణల్లో నిజం లేకపోలేదు. జీఎం, హెచ్‌టీ విత్తనాలు నిజంగా రైతులకు, పర్యావరణానికి మేలు చేసేవే అయితే శాస్త్ర, సాంకేతికంగా అత్యంత అభివృద్ధి చెందిన ఐరోపా దేశాలు వాటిని ఎందుకు అనుమతించడం లేదన్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక బహుళజాతి కంపెనీలు నీళ్లు నములుతున్నాయి.

గిట్టుబాటు ధర ప్రశ్నార్థకం
పత్తి సాగు విషయంలో రైతులను వ్యవసాయశాఖలు చైతన్యపరచాలి. దేశీయ సంకరజాతి విత్తనాలు సాగు చేసినా మంచి దిగుబడి వస్తుందనే అంశంపై పెద్దగా ప్రచారం లేదు. ఉదాహరణకు 2006-07లో జాతీయ స్థాయిలో సగటున 208 కిలోల పత్తి పంట పండితే, 2018-19లో 200 కిలోలే వచ్చిందని ‘భారత పత్తి సంస్థ (సీసీఐ)’ తాజా నివేదికలో స్పష్టీకరించింది. అంటే గత 13 ఏళ్లలో పంట ఉత్పాదకత ఎకరానికి ఎనిమిది కిలోలకు తగ్గిపోయింది. ప్రపంచంలో పత్తి ఉత్పాదకతలో భారత్‌ 35వ ర్యాంకులో ఉంది. పక్కనున్న చైనాలో ఎకరానికి గతేడాది 708 కిలోలు పత్తి పండితే మనదేశంలో 200 కిలోలు దాటలేదు. ఈక్వెడార్‌, సూడాన్‌ లాంటి అత్యంత పేద దేశాల్లో సైతం మనకన్నా చాలా ఎక్కువ ఉత్పాదకత వచ్చినట్లు అమెరికా వెల్లడించిన తాజా నివేదిక తేల్చింది. 2015-16లో వర్షాలులేక పత్తి ఎకరానికి 183 కిలోలే పండింది. ఈ పంటను రైతులు అధికంగా వర్షాధార భూముల్లోనే సాగుచేస్తున్నారు. వర్షాలు లేని ప్రాంతాల్లో ఎకరానికి కనీసం రెండు క్వింటాళ్లు కూడా పండటం లేదని సీసీఐ లెక్కలే చెబుతున్నాయి. ఎకరానికి కనీసం రూ.20 వేలకు తగ్గకుండా పెట్టుబడి పెట్టకపోతే పత్తి సాగు అసాధ్యం. లెక్కలింత కఠోర సత్యాలు ఆవిష్కరిస్తున్నా, ఇతర పంటలవైపు రైతులు మళ్లడం లేదు. పత్తి పండటానికి అనుకూలంగా లేని భూముల్లో ఎక్కువగా సాగుచేస్తున్నారు. ఏ రకం భూమి ఏ పంట సాగుకు అనుకూలమో ముందే పరిశీలించి అవే అక్కడ సాగుచేసేలా‘పంటల కాలనీలు’ ఏర్పాటుచేయాలని కేంద్రం అన్ని రాష్ట్రాలనూ ఆదేశించింది. అభివృద్ధి చెందిన దేశాల్లో పంటల కాలనీలతోనే అధిక దిగుబడి సాధిస్తున్నారు. అనుమతి లేని హెచ్‌టీ, జీఎం విత్తనాలు అమ్మేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. జాతీయ వ్యవసాయ పరిశోధన సంస్థల నుంచి సంకరజాతి విత్తనాలను రైతులకు అందుబాటులోకి తేవాలి. పత్తి పంట వేసే రైతుకు గిట్టుబాటు ధర వస్తుందనే భరోసా ప్రభుత్వం ఇవ్వాలి. ప్రపంచ మార్కెట్‌ అంచనాలు, దిగుబడులపై పక్కా శాస్త్రీయ సమాచారంతో రైతులను అప్రమత్తం చేయకుండా అలాగే వదిలేస్తే, తీరా పంట మార్కెట్‌కు వచ్చినప్పుడు ధరల్లేక రైతులు నష్టపోవడం ఖాయం!


- మంగమూరి శ్రీనివాస్‌
Posted on 10-07-2019