Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

ఉత్పాదకత పెంచే సాగు వ్యూహమే కరవు

* రైతు రెట్టింపు ఆదాయానికి అడ్డంకులు

దేశంలో పంటల సాగుకు సంబంధించిన కార్యాచరణ సక్రమంగా లేదు. సీజన్‌కు ముందు ప్రణాళికలను ప్రకటిస్తున్నారు తప్ప, సరైన వ్యూహాలను రచించడం లేదు. ఫలితంగా ఉత్పత్తి లక్ష్యాలను ఒక్కో సీజన్‌లో అందుకోగలుగుతున్నా సగటు ఉత్పాదకతను మాత్రం పెంచుకోలేకపోతున్నాం. ఉత్పాదకత పెంచాలంటే అధికోత్పత్తులు అందించే సరికొత్త వంగడాలు వెలుగు చూడాలి. పంటల సరళిలోనూ మార్పులు అవసరం. చిన్న కమతాల్లో పంటల సాగు, మెరుగుపడని పరిశోధనల కారణంగా సగటు ఉత్పాదకత ఆశించిన రీతిలో పెరగడం లేదు.

పలు పంటల ఉత్పత్తిలో భారత్‌ ప్రపంచంలో అగ్రస్థానంలో ఉంది. సాగుయోగ్యమైన భూమిలో 45.3 శాతానికే నీటి వసతి ఉంది. దేశంలో సాగు యోగ్యమైన భూమి 87.1 శాతం. ఇది అమెరికాలో 37.5 శాతం, చైనాలో 22 శాతంగా ఉంది. మనకంటే 40 లక్షల హెక్టార్ల సాగుకు అనువైన భూమి అమెరికాలో తక్కువగా ఉన్నా సగటు ఉత్పాదకత విషయంలో ఆ దేశం కంటే దిగువన ఉన్నాం. చైనా మనకంటే మూడు రెట్లు అధికంగా ఉత్పత్తి చేస్తోంది. భారత్‌ కన్నా వ్యవసాయ యోగ్యమైన భూమి నైజీరియాలో అయిదు రెట్లు తక్కువగా ఉన్నా ఉత్పాదకత విషయంలో ఆ దేశం కేవలం ఒక మెట్టు మాత్రమే మనకంటే తక్కువన ఉండటం గమనార్హం. వ్యవసాయోత్పాదకతలో భారత్‌ అట్టడుగున ఉంది. ఈ విషయాన్ని ఇటీవల రాజ్యసభలో కేంద్ర వ్యవసాయశాఖ మంత్రే స్వయంగా అంగీకరించారు.

కష్టనష్టాలకు ఎదురొడ్డి...
అధికోత్పత్తుల సాధనతో పాటు రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయాలనే ప్రభుత్వ లక్ష్యాలను అందుకునే చర్యలు కనిపించడం లేదు. దేశంలో సుమారు ఏడు కోట్ల హెక్టార్ల బంజరు భూములున్నా వాటిని సాగులోకి తీసుకువచ్చే ప్రయత్నంలో పురోగతి లోపించింది. మన రైతులు ప్రపంచంలో ఎవరికీ తీసిపోరు. పంటల సాగులో ఎన్ని కష్టాలు ఎదురొచ్చినా, వరస నష్టాలు వెంటాడినా నేల తల్లిపై మమకారంతో సాగు కొనసాగించే పట్టు వదలని విక్రమార్కులు వారు. అనిశ్చిత వాతావరణ పరిస్థితులు, విపత్తులు, అప్పులకు వడ్డీలు, కుటుంబ ఖర్చులు, శుభకార్యాలు, పిల్లల చదువులు... ఇలా లెక్క చూస్తే రైతు కుటుంబాలు వ్యవసాయమంటేనే భయపడే పరిస్థితి నెలకొంది. అల్పాదాయాలతో రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతూ క్రమంగా సేద్యం నుంచి వైదొలగుతున్నారు. ఆదాయం క్షీణించడానికి, పంటల ఉత్పాదకత అత్యల్పంగా ఉండటానికి కారణాలున్నాయి. గ్రామాల్లోని పరిస్థితులు రైతుల్ని దెబ్బతీస్తున్నాయి. పంటల సాగుకు సంబంధించి ఏయే నేలలకు ఎలాంటి ఎరువులు వాడాలో చెప్పేవారు లేరు. చీడపీడలు నివారణకు తగిన సలహాలు ఇచ్చేవారూ కరవే. పరపతి సదుపాయాలు అందుబాటులో లేక అధిక వడ్డీలకు అప్పులు తీసుకురావాల్సి వస్తోంది. భూభౌతిక పరిస్థితులు క్షీణించడంతో చాలా వరకు పంట పొలాలు పనికిరాకుండా పోతున్నాయి.

దేశంలో 32.9 కోట్ల హెక్టార్ల భూమి సాగుయోగ్యం కాకపోవడం వల్ల ఏటా 33 నుంచి 67 శాతం ఉత్పత్తికి నష్టం వాటిల్లుతోంది. నిస్సారమైన నేలల నుంచి ఉత్పత్తి ఆశించినంతగా రావడం లేదు. ఆధునిక సాంకేతికత అందుబాటులో లేక చిన్న సన్నకారు రైతులు అధికోత్పత్తుల్ని సాధించలేకపోతున్నారు. అధికశాతం నిరక్షరాస్యులు కావడంతో ఆధునిక సాగు పద్ధతులు వారికి తెలియక, అధిక దిగుబడినిచ్చే వంగడాలు వాడలేక ఎక్కువమంది రైతులు సాధారణ ఉత్పత్తులనే పొందాల్సి వస్తోంది. సకాలంలో వానలు పడకపోవడం, నీటి వసతి లేకపోవడం, మందులు ఖరీదు కావడంతో ఖర్చులు భారీగా పెరిగి నికరాదాయం తరిగిపోతోంది. ఫలసాయానికి, పెట్టుబడికి అంతరం ఉంటుండటంతో అప్పులపాలవుతున్నారు. పండించిన పంటను అమ్ముకునే క్రమంలోనూ మార్కెట్‌ శక్తుల మోసాలకు గురై నష్టపోవలసి వస్తోంది. ఈ పరిస్థితులన్నీ రైతులకు సేద్యాన్ని భారంగా మార్చేస్తున్నాయి. వీరి సంక్షేమం కోసం నియమించిన కమిషన్ల సిఫార్సుల్ని ప్రభుత్వాలు చెత్తబుట్టలో వేశాయి. స్వామినాథన్‌ కమిషన్‌ నివేదికే ఇందుకు నిదర్శనం. అడుగడుగునా మోసపూరిత శక్తులు దోపిడి చేస్తున్న తీరుతో సాగుదారులు దిలాసాగా సేద్యం చేయలేకపోతున్నారు. ఉత్పత్తులకు మంచి ధరలు దక్కకపోవడం, సేద్యానికి అనుబంధంగా పాడిపరిశ్రమను ప్రోత్సహించలేకపోవడం, విలువ జోడింపు అవకాశాలను కుటీర పరిశ్రమ స్థాయికి తీసుకెళ్లకపోవడం వల్ల నష్టాలు వెంటాడుతున్నాయి. అధిక భాగం రైతుల్లోనూ నిస్తేజం ఆవహిస్తోంది. ఎవరి విత్తనాలను వాళ్లు సేకరించి పెట్టుకునే స్థాయి నుంచి వాటి కోసం కంపెనీలపై ఆధారపడటం ఆరంభమైంది. యంత్రాల వాడకం ఆశించిన రీతిలో పెరగనప్పటికీ, అదే స్థాయిలో వీటి కారణంగా శ్రామికులు ఇతర రంగాలకు తరలిపోయారు. ఫలితంగా సేద్యానికి కూలీల అందుబాటు తగ్గి రైతుకు పెట్టుబడి ఖర్చులు విపరీతంగా పెరిగాయి. ఇది వారి ఆదాయాలపై పెను ప్రభావం చూపుతోంది. ఇలా ఎన్నో కారణాలతో సగటు రైతులు చాలీచాలని అదాయాలతో సేద్యం నుంచి వైదొలగే పరిస్థితి వస్తోంది. సాగుదారుల కష్టాలను ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం వల్ల ప్రతి విషయంలో దళారుల ప్రమేయం పెరిగింది. రైతు సంక్షేమ పథకాలూ పక్కదారి పట్టాయి. సేద్యరంగం పురోగమించినంతగా దీనిపై ఆధారపడి జీవిస్తున్నవారి పరిస్థితిలో మార్పు రాలేదు. జీవన ప్రమాణాలు మెరుగుపడలేదు. దేశ ఆర్థిక వ్యవస్థకు ఇరుసు లాంటి సేద్యరంగంలో ప్రగతి ఆశించినంత లేకపోవడంతో ఈ రంగంలో వృద్ధిరేటు మందగించింది. 1951లో అనుబంధ రంగాలు మినహా వ్యవసాయంపై ఆధారపడ్డ జనాభా 69.7 శాతం ఉండగా, 2011 నాటికి 54.6 శాతానికి క్షీణించింది. వ్యవసాయం నుంచి సేవా, పారిశ్రామిక రంగాలకు వలసలు పెరిగాయి. వాతావరణ పరిస్థితులు ఏటికేడూ మారుతున్నాయి. వర్షపాతం సమతూకంగా ఉండటం లేదు. ఇది ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. పరిశోధనలు కొత్తపుంతలు తొక్కుతున్నా ఆయా పంటల్లో సగటు ఉత్పాదకతలో ఆశించిన పురోగతి సాధ్యపడలేదు. హరిత విప్లవంతో వరి దిగుబడి పెరిగిందని భావిస్తున్నాం. కానీ హెక్టారు వరి సగటు ఉత్పాదకత ఈజిప్టులో 9.8 టన్నులుంటే ప్రపంచ వరి ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్న భారత్‌లో అది 3.6 టన్నులు మాత్రమే కావడం గమనార్హం. వియత్నాం (5.7), ఇండొనేసియా (5.3) బంగ్లాదేశ్‌ (4.5)లు మనకంటే ఎంతో ముందున్నాయి. చైనా సగటు పత్తి ఉత్పాదకత హెక్టారుకు 11.1 టన్నులుంటే మనదేశంలో 4.6 టన్నులు మాత్రమే. గోధుమ ఉత్పాదకత ఇంగ్లాండులో 7.7 టన్నులుండగా, భారత్‌లో 3.1 టన్నులు, మొక్కజొన్నలో అమెరికా 10.5 టన్నుల ఉత్పాదకత హెక్టారుకు సాధిస్తుంటే భారత్‌ 2.5 టన్నులకే పరిమితమైంది.

భూసారం నుంచే దిద్దుబాటు
పంట బాగా రావాటంటే నేట సారవంతంగా ఉండాలి. విత్తనం మంచిదై ఉండాలి. సకాలంలో విత్తాలి. తగిన నీరు అందించాలి. చీడపీడలను నియంత్రించాలి. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండాలి. సకాలంలో వానలు పడాలి. ఇవి అనుకూలించడంతో పాటు ఆయా నేలల స్వభావానికి తగిన వంగడాలను ఉపయోగించాలి. ఆ పంటను పండించే ప్రాంతమంతటా ఉత్పత్తి బాగా రావాలి. అప్పుడే సగటు ఉత్పాదకతలో పెరుగుదల కనిపిస్తుంది. వాస్తవానికి మన పరిశోధకులకు సత్తా ఉన్నా నిధుల లేమితో పరిశోధనలు పడకేస్తున్నాయి. భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్‌)లో ప్రపంచస్థాయి శాస్త్రవేత్తలు ఉన్నప్పటికీ, పరిశోధన కేంద్రం నుంచి పంట పొలాలకు, శాస్త్ర విజ్ఞానాన్ని చేరవేసే ప్రోత్సాహకాలే కరవవుతున్నాయి. ఫలితంగా ప్రభుత్వరంగంలో పరిశోధనలు నిస్తేజంగా మారాయి. పలు పంటల్లో పెచ్చరిల్లిన చీడపీడలను తట్టుకునే వంగడాలు వెలుగుచూడకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో ఆయా పంటల సాగు ప్రమాదంలో పడింది. కోస్తా నేలల కోసం రూపొందించిన వరి హైబ్రిడ్‌లు తెలంగాణకు పనికొస్తున్నాయి. తెలంగాణ వంగడాలు ఇతర ప్రాంతాల్లో సాగు చేస్తున్నారు. పరిశోధనలు స్థానిక పరిస్థితుల ఆధారంగా జరగకపోవడమే ఇందుకు కారణం. స్థానిక నేలలు, వాతావరణ పరిస్థితుల ఆధారంగా వంగడాలకు రూపకల్పన చేయడం ద్వారా అధిక దిగుబడులు పొందే అవకాశముంది. దేశంలో చాలా పరిశోధన కేంద్రాల్లో స్థానిక పరిస్థితులకు తగ్గ పరిశోధనలు, సాగు వ్యూహాలను అమలు చేయాల్సిన అవసరముంది. ప్రైవేటు రంగంలో పరిశోధనలు పురోగతిని అందుకుంటుంటే, ఐకార్‌ పరిధిలో నీరసించడం శోచనీయం. వివిధ పంటల్లో హెక్టారు సగటు ఉత్పాదకత పెంపొందించడం కోసం పరిశోధన రంగానికి జవసత్వాలు కల్పించడం ఎంత ముఖ్యమో రైతు సేద్యంలో నిలదొక్కుకునేలా సాగు వ్యూహాలను రచించడమూ అంతే ప్రధానం. అందుకు నేలల పరిస్థితుల్ని చక్కదిద్దడం నుంచి ఆరంభించి మార్కెట్‌ శక్తులకు అడ్డుకట్ట వేసి లాభసాటి ధరలు అందించే చర్యలు చేపట్టగలిగితేనే ఆదాయాలు బాగుంటాయి. పంటతో పాటు పాడి రంగాన్ని నమ్ముకుంటే రైతుల ఆర్థిక పరిస్థితి కొంతవరకైనా మెరుగుపడుతుంది. నేల నుంచి తీసుకోవడమే కాదు, దానికి తిరిగి ఇవ్వాలనే సూత్రాలకు అనుగుణంగా భూసారాన్ని పెంపొందించే చర్యలు చేపట్టాలి. నేల, నీరు, పరిశోధన, ఉత్పత్తి, మార్కెటింగ్‌లకు ప్రాధాన్యమిస్తూ సాగు రంగానికి కొత్త దశ దిశ కల్పించాలి. అప్పుడే సేద్యం లాభసాటి అవుతుంది!


- అమిర్నేని హరికృష్ణ
Posted on 15-07-2019