Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

సమూల మార్పులతో సాగు బాగు

* ప్రభుత్వాలకు సవాలుగా వ్యవసాయ రంగం
* సమగ్ర విధానం-విప్లవాత్మక మార్పులు అనివార్యం
* పరిశ్రమగా సేద్యం... సాంకేతికతకు ప్రాధాన్యం

తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు వ్యవసాయరంగానికి పెద్దపీట వేస్తున్నట్లు పలుమార్లు ప్రకటించాయి. 2019-20 ఆంధ్రప్రదేశ్‌ బడ్జెట్లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు రూ.28,866 కోట్లు కేటాయించారు. నిరుటితో పోలిస్తే వ్యవసాయ, సహకార మార్కెటింగ్‌కు 81.51 శాతం, పశుసంవర్ధక, మత్స్య శాఖలకు 9.71 శాతం చొప్పున ప్రభుత్వం కేటాయింపులు పెంచింది. తెలంగాణలో ఈ ఏడాది ప్రవేశపెట్టిన అనామతు బడ్జెట్లో వ్యవసాయ రంగానికి రూ.20,017 కోట్లు కేటాయించారు. అంతకుముందు ఏడాది ఈ రంగానికి కేటాయించింది రూ.15,788 కోట్లు. రాష్ట్రంలో ఆహార పంటల ఉత్పాదకతను, రైతు ఆదాయాన్ని పెంచడమే లక్ష్యమని పలుమార్లు ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రకటించారు. రైతుకు తక్షణం చేయూత ఇచ్చేందుకు రైతుబంధు పథకం కింద ఎకరానికి ఒక్కో పంటకాలానికి రూ.5,000 ఇస్తున్నారు. రుణమాఫీ పథకాన్ని అమలు చేస్తున్నారు.

బడ్జెట్లలో నిధుల కేటాయింపులవల్ల ఎక్కువగా ఆ సంవత్సరానికి సరిపడా అవసరాలు తీరవచ్చు. దీర్ఘకాలంగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు ఏం చేయాలన్నది మాత్రం మూలాలకు వెళ్లి ఆలోచించాలి. సాగు సంక్షోభ పరిస్థితుల్లో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాల ముందు వ్యవసాయ రంగం సవాలుగా నిలిచింది. ఆహార భద్రత, గ్రామీణ సమగ్ర వికాసం, రైతు ఆర్థిక పురోగతికి మూలసూత్రం- వ్యవసాయ రంగ అభివృద్ధి. సాగుకు ప్రభుత్వాలు పెద్దపీట వేసినప్పుడే ఆర్థిక సమతుల్యత సాధ్యమవుతుందన్నది నిర్వివాదం. సంవత్సరాలుగా ఇస్తున్న రుణమాఫీలు, సబ్సిడీలు రైతును ఆర్థికంగా దిగజార్చాయే తప్ప, వారికి పెద్దగా ఉపయోగపడలేదు. ఈ రంగంలో ఇప్పుడు విప్లవాత్మక మార్పులు రావాలి. వ్యవసాయం ఒక పరిశ్రమగా మారాలి. కేంద్ర విధానాలకన్నా, రాష్ట్రాలు తీసుకునే చర్యలే వ్యవసాయ రంగ పురోగతిని వేగవంతం చేయగలవు.

నూనె గింజలకు ప్రోత్సాహం
వరిసాగు తగ్గిస్తే నీటి వినియోగం తక్కువవుతుంది. నారు పోసే బదులు నేరుగా విత్తనాలు నాటే పద్ధతి అవలంబించవచ్చు. దీనివల్ల రైతుల లాభాలు పెరుగుతాయి. సార్వా, దాళ్వాల్లో పప్పుదినుసుల సాగు పెంచాలి. నూనె గింజ పంటలు ఎక్కువగా పండించడం; వేరుశనగ, సోయా, నువ్వులను ఎక్కువగా ప్రోత్సహించడం ఆవశ్యకం. కూరగాయల సాగు పెంచడానికి అన్ని సదుపాయాలతో ప్రత్యేక జోన్లు ఏర్పాటు చెయ్యాలి. మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరగాలి. పత్తిని దానికి అనువైన భూముల్లో పండిస్తేనే రైతుకు మంచి లాభాలనిస్తుంది. నీటి పారుదల, భూసారం తక్కువగా ఉన్న భూములను పత్తి పంటకు వినియోగించకూడదు. నాణ్యమైన పశుమేత పంటలపై దృష్టి కేంద్రీకరిస్తే పాల ఉత్పత్తి పెంచవచ్చు. రాష్ట్ర స్థాయిలో నిపుణులతో ఒక సంస్థను ఏర్పాటు చేసి, ఏ పంట ఎంత భూమిలో పండించాలనేది ప్రతి ఏటా నిర్ధారించి, రైతులకు సలహా ఇచ్చే బాధ్యతను ఆ సంస్థకు అప్పగించాలి. మన రాష్ట్రాల్లో వాణిజ్యపరంగా రైతులకు లాభదాయకంగా ఉండే పంటలు పండించి, ఆ పరిశ్రమలు నెలకొల్పగలిగే విధంగా వ్యాపారవేత్తలను ప్రోత్సహించాలి. ఈ వ్యాపారాలకు అనువైన ప్రత్యేక విధానాలను అమలుచేసినప్పుడే ఇది సంభవం.

రైతులతో పంటలవారీగా సంఘాలు ఏర్పరచాలి. దీనివల్ల సమస్యలను స్పష్టంగా తెలుసుకోవచ్చు. రైతుల అభిప్రాయాలకూ గుర్తింపు లభిస్తుంది. ఈ సంఘాలు రాజకీయాలకు అతీతంగా ఉండాలి. భూమిని, నీటిని తగు మోతాదులో వాడేందుకు అనువుగా నాణ్యమైన విత్తనాల కోసం పరిశోధనలు పెంచాలి. ముఖ్యంగా నీటికొరత వల్ల తక్కువ నత్రజనితో పంటలు పండించే సాంకేతికత, కలుపు మొక్కలు నిర్మూలించే పద్ధతులు జన్యు మార్పిడి ద్వారా సాధ్యమవుతాయి. విత్తన పరిశ్రమ అభివృద్ధి కోసం ‘సీడ్‌ వ్యాలీ’ని స్థాపించి, దాని ద్వారా పరిశ్రమకు కావలసిన సాయం అందించాలి. వివిధ పంటల్లో కొత్త సాగుబడి పద్ధతుల మీద పరిశోధన చేసి, వాటిని రైతులకు అందించే పని వ్యవసాయ విశ్వవిద్యాలయాలకు అప్పగించాలి. ఈ పద్ధతుల వల్ల నిర్దిష్ట విస్తీర్ణంలో మొక్కల సంఖ్య పెంచడానికి, కలుపు మెక్కల నివారణకు, కొత్త సస్యరక్షణ పద్ధతులు అవలంబించడానికి అవకాశాలు పెరుగుతాయి. తద్వారా పంటల దిగుబడులు, రైతులకు లాభాలు పెంచడానికి అవకాశం కలుగుతుంది. తుంపర, బిందు సేద్య విధానాల ద్వారా నీటి దుబారా తగ్గించవచ్చు. ‘వాటర్‌ షెడ్‌’ అభివృద్ధి పథకాలను వర్షాధార ప్రదేశాల్లో తప్పనిసరి ప్రాజెక్టులుగా చేయాలి. తద్వారా భూమిలో నీటిమట్టం పెరుగుతుంది.

ఎగుమతులకు పెద్దపీట
వ్యవసాయ పట్టభద్రులు, డిప్లొమా చేసినవారిని గ్రామాల్లో వ్యవసాయ సేవా కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు ప్రోత్సహించాలి. ఈ కేంద్రాల్లో సాంకేతిక సలహాలు, పొలంలో ఉపయోగించే భారీ యంత్రాలను సులభంగా అద్దెకిచ్చే ఏర్పాట్లు, వివిధ వ్యవసాయ పనులను డబ్బు తీసుకుని చేయించిపెట్టే సదుపాయాలు ఉండాలి. విత్తనాలు, ఎరువులు, కీటనాశక మందులు అమ్మడం; బ్యాంకులు, బీమా సంస్థలు, అంతర్జాల సేవలను రైతుకు అందించడం; ఉత్పత్తిని విక్రయించడంలో సహాయపడటం వ్యవసాయాభివృద్ధికి సోపానాలవుతాయి. వ్యవసాయోత్పత్తుల అమ్మకంలో సమగ్ర మార్పులు చేసి, కొనుగోళ్లలో ప్రైవేటు రంగానికి చోటు కల్పించి, ఎగుమతులకు ప్రోత్సాహమివ్వాలి. రాష్ట్రంలో అన్ని మార్కెట్‌ యార్డులను కేంద్ర ప్రభుత్వ ‘ఈనాం’ కార్యక్రమం పరిధిలోకి తేవాలి. వ్యవసాయ రంగంలో సాంకేతిక మార్పులు అందించగలిగే అంకుర సంస్థలకు ప్రోత్సాహం కల్పించాలి. ఇందుకోసం రూ.100 కోట్ల నిధిని ఏర్పాటు చెయ్యాలి. గ్రామస్థాయిలో సేకరించిన వివరాలను ‘బిగ్‌డేటా’గా అనుసంధానించే సంస్థను ఏర్పాటు చేసి, దానివల్ల రైతులకు లాభం చేకూరేలా చూడాలి.

రైతులకు ఒక్క పంటమీదే ఆధారపడకుండా ఇతర అనుబంధ వృత్తులు, పరిశ్రమల ద్వారా తమ ఆర్థిక స్థితిగతులు మెరుగుపరుచుకునే అవకాశం కల్పించాలి. కోళ్ళు, చేపలు, రొయ్యలు, పశువుల పెంపకం లేదా ఇంట్లో చిన్న వస్తువులు తయారు చేయడంలో శిక్షణ ఇవ్వాలి. ప్రభుత్వ విధానం అందుకు అనుగుణంగా ఉండాలి. బ్యాంకులకు నష్టం లేకుండా వాటితో ఒప్పందం కుదుర్చుకుని రుణ సదుపాయాలు సమృద్ధిగా అందుబాటులోకి తేగలిగితే రైతు మీద భారం తగ్గి వారి మనోస్థైర్యం ఇనుమడిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాల్లో వ్యవసాయాభివృద్ధికి దృఢ సంకల్పం ఉండగానే సరిపోదు- సమగ్ర అవగాహనా అవసరం!

సలహా వ్యవస్థలు అవసరం
అన్నదాతకు వ్యవసాయ, సాంకేతిక సలహాలిచ్చే వ్యవస్థను సంపూర్ణంగా సంస్కరించాలి. కాల్‌సెంటర్‌, చరవాణి, అంతర్జాలాల ద్వారా సలహా ఇచ్చే వ్యవస్థలను స్థాపించాలి. ఫొటోలు, వీడియోల ద్వారా కూడా సలహాలివ్వాలి. అర్హులైన శాస్త్రవేత్తలను ఈ వ్యవస్థలో భాగస్వాములుగా చేస్తే రైతులకు నాణ్యమైన సమాచారం లభిస్తుంది. ద్రాక్ష వంటి పంటల్లో ఉన్న హేతుబద్ధ పద్ధతి అన్ని పంటలకూ విస్తరించవచ్చు. దీనివల్ల ఫలితాలమీద దృష్టి ఉంచే వ్యవస్థ ఏర్పడుతుంది. రాష్ట్రాల్లో ఉన్న కృషి విజ్ఞాన కేంద్రాలు ఈ పనికి బాగా ఉపయోగపడతాయి. ఆరోగ్యరంగంలో ‘108’ లాగా వ్యవసాయ రంగంలో ఒక సంచార సలహా పథకం మొదలుపెట్టవచ్చు. రైతు వీరికి ఫోన్‌ చేస్తే తక్షణం ఈ వాహనం పొలానికి చేరుకునేలా వ్యవసాయ ఆంబులెన్స్‌లను ఏర్పాటు చేయాలి. అందులో సలహాదారులతో పాటు, నేల సార పరీక్ష వ్యవసాయ ఉత్పత్తి నాణ్యత పరీక్ష చేసే ప్రయోగశాలలు అందుబాటులో ఉండాలి. ప్రతి రైతు పొలంలో నేలసారాన్ని పరీక్ష చేసి కంప్యూటరీకరించాలి.

సమగ్ర విధానమేదీ?
రాష్ట్రానికి ఒక సమగ్ర వ్యవసాయ విధానాన్ని రూపొందించి ప్రకటించాలి. దీనిపై అన్ని రాజకీయ పార్టీల మధ్య ఒక అవగాహన కల్పిస్తే అందరికీ పథకం పట్ల స్పష్టత వస్తుంది. ముఖ్యమంత్రి నేతృత్వంలో రాష్ట్ర స్థాయి వ్యవసాయ మండలి ఏర్పాటు అవసరం. దీనిలో శాస్త్రవేత్తలు, వ్యవసాయ ఆర్థికరంగ నిపుణులు, సంబంధిత మంత్రులు సభ్యులుగా ఉండాలి. సేద్యం, రైతు సంబంధిత విధి విధానాలకు దిశానిర్దేశం చెయ్యాలి. ఈ మండలి నిర్ణయాలను అన్ని జిల్లాల్లో పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో అధికారుల కమిటీని నియమించాలి. మన రాష్ట్రాల్లో ఏ పంటలు పండించాలి, ఏ పంటలకు సంబంధించి ఇతర రాష్ట్రాలతో పోటీపడగల సమర్థత ఉంది, దేశంలో ఏ పంటలకు గిరాకీ-సరఫరాల మధ్య ఎక్కువ అంతరం ఉంది... తదితరాలను దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవడం శ్రేయస్కరం.

నిల్వలో ఆధునిక పద్ధతులు
వ్యవసాయోత్పత్తుల నిల్వ వ్యవస్థలను ప్రైవేటు రంగంలో నెలకొల్పాలి. విస్తరిస్తున్న చిల్లర వర్తకం, ఆహారశుద్ధి రంగాలకు ఉపయోగపడేలా అవసరమైన ఆధునిక సరఫరా పద్ధతులు, సాంకేతికతను ఉపయోగించడం ప్రయోజనకరం. ఉత్పత్తిని పొలాల్లోనే నిల్వ చేసే విధానాలు రావాలి. ఇందుకోసం సాధారణ, శీతల గిడ్డంగులు అవసరం. ‘సైలో’ (భారీయెత్తున ధాన్యం నిల్వకు ఉపకరించే వ్యవస్థ)లలో నిల్వ చేయడం ఉత్తమం. దీనివల్ల నిల్వలో వ్యవసాయ ఉత్పత్తులు పాడైపోవటం బాగా తగ్గిపోతుంది. నిల్వ ఉంచిన ఉత్పత్తిపై రుణ సదుపాయం ఏర్పాటు చేయవచ్చు.- విన్నకోట రామచంద్ర కౌండిన్య
(రచయిత- వ్యవసాయ రంగ నిపుణులు)
Posted on 17-07-2019