Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

విపత్తులను కాచుకొనే విత్తనాలేవీ?

* పరిశోధనల్లో జాప్యంతో రైతాంగానికి నష్టం

దేశవ్యాప్తంగా ఏటా ఏదో ఒక ప్రాంతంలో వరద, కరవుల వంటి ప్రకృతి విపత్తులు సంభవిస్తుండటం పరిపాటిగా మారుతోంది. దుర్భిక్ష పరిస్థితులు తాండవిస్తూ పంటలు సాగుచేయలేని దుస్థితి ఎదురవుతోంది. భారీవర్షాలు, వరదలతో పంటలు రోజుల తరబడి నీట మునిగి పెనునష్టం వాటిల్లుతోంది. ఈ పరిస్థితులను తట్టుకుని మంచి దిగుబడులు ఇచ్చే వంగడాల రూపకల్పన ఆవశ్యకత పెరిగింది.

పంటకు ప్రాణాధారం నీరు. సకాలంలో తగిన మోతాదులో నీరందించకపోతే అది దిగుబడుల్ని ప్రభావితం చేస్తుంది. బెట్ట పరిస్థితులు ఏర్పడినా, మొక్కల మొదళ్లలో నీరు ఉరకెత్తే స్థితి వచ్చినా, వరి వంటి పంటలు ఎక్కువ కాలం నీట మునిగిఉన్నా దిగుబడులు పడిపోతాయి. దేశంలోని ప్రధానమైన 15 వ్యవసాయ వాతావరణ మండలాల్లో పరిస్థితులు ఎప్పుడూ ఒకేలా ఉండవు. వైవిధ్యంగా ఉన్న వాతావరణ మండలాల ఆధారంగా అక్కడ పండించే పంటలను గుర్తించడంతోపాటు ఆయా ప్రాంతాల్లోని నేలల భౌతిక పరిస్థితులకు తగ్గ విత్తనాలను రూపొందించాల్సి ఉంటుంది. ఒక పంట ఎక్కడైనా పండించవచ్చు. కానీ వాటి అనుకూలతలకు భిన్నమైన పరిస్థితుల్లో పండిస్తే మాత్రం అత్యల్ప దిగుబడుల్ని ఇస్తుంది. ఉదాహరణకు ఆపిల్‌ పంట ఎక్కడైనా పండించవచ్చు. అత్యంత శీతల ప్రాంతాల్లోనే అది మంచి దిగుబడులు ఇస్తుంది. అందువల్లే వ్యవసాయ పరిశోధనలు స్థానిక పరిస్థితులకు (లొకేషన్‌ స్పెసిఫిక్‌) అనుగుణంగా జరగాల్సిన అవసరముంది. వాతావరణ పరిస్థితులకు తగ్గరీతిలో విత్తనాలు, సాగు పద్ధతులను రూపొందించాల్సి ఉంటుంది.

ఆదుకునే కొత్త రకాలు
వరి పంట ఎక్కువ కాలం నీటి ముంపు తట్టుకోలేదు. పైరు చివరి కొనలతో సహా పూర్తిగా నీట మునిగితే ఆయా రకాలను బట్టి సుమారు మూడు నుంచి 12 రోజుల్లో అది చీకిపోతుంది. అప్పుడు దాన్ని తొలగించి మరో పంట విత్తుకోవడం మినహా మరో మార్గం ఉండకపోవచ్చు. అందువల్లే పంటలు నీట మునిగినా పాడవకుండా తట్టుకోగలిగే విత్తన రకాలు రైతులకు అందుబాటులో ఉంచాల్సిన అవసరముంది. ఈ దిశగా 2006లో ‘స్వర’్ణ వరి రకాన్ని ఉపయోగించి ‘స్వర్ణ సబ్‌ 1’ అనే కొత్త రకాన్ని ఫిలిప్పీన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. వరదల్లో వరిచేలు పూర్తిగా మునిగినా పైరు చీకి, కుళ్లిపోని ఈ రకం విత్తనాలను పెద్దయెత్తున ఉత్పత్తి చేసి కోస్తాంధ్ర రైతులకు అందిస్తామని అప్పట్లో వ్యవసాయశాఖ ప్రకటించింది. అయితే ఇది ఆశించిన ఫలితాలు అందించలేక విఫలమైంది. స్వర్ణసబ్‌ 1 రకం పైరు నాటిన 25 రోజుల్లోపే తట్టుకోగలుగుతుందని తరవాత క్షేత్రస్థాయి పరిశీలనల్లో నిరూపితమైంది. పిలక చేశాక పంట మునిగితే మాత్రం అది తట్టుకోలేకపోవడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లోని ఉభయ గోదావరి, శ్రీకాకుళం, కృష్ణా జిల్లాల్లోని కొంత భాగంలోని సుమారు మూడు లక్షల ఎకరాల్లో వరి పంటకు ముంపు సమస్య ఉంది. వరదల వల్ల పంట పూర్తిగా నీటమునిగితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న రకాల్లో కొన్ని మూడు రోజులపాటు తట్టుకోగలవు. అయితే ఎం.టి.యు.-1064, 1140 వరి రకాలు మాత్రం పంట ఏ దశలో మునిగినా 12 రోజుల వరకు తట్టుకోగలవు. ప్రస్తుతం ముంపు అవకాశం ఉండే ప్రాంతాల్లో 1064 రకాన్ని అధికంగా రైతులు సాగు చేస్తున్నారు.

గోధుమ పంట శీతల ప్రాంతాల్లో బాగా పండుతుంది. అధిక వేడిని, కరవును తట్టుకోలేదు. బెట్ట పరిస్థితులు ఏర్పడిన సందర్భాల్లో పంటను కాపాడుకునేందుకు పరిశోధనలు సాగాలి. వాటిని తట్టుకునే వంగడాలను రైతులకు అందించాలి. భారీ వర్షాలు కురిసినప్పుడు ఆముదం, సోయా, పొద్దుతిరుగుడు, పత్తి వంటి పంటలకు మొక్కల మొదళ్ల దగ్గర నీరు నిలిస్తే వేరుకుళ్లుతో ఆయా పంటలు దెబ్బతినే ప్రమాదముంది. ఆరబెట్టుకున్న మిరప అకాల వర్షాలకు తడిసి బూజు పడుతుంది. ఈ బూజు ద్వారా అఫ్లోటాక్సిన్‌ వృద్ధి చెంది నాణ్యతను దెబ్బతీస్తుంది. పంటల్లో తరచుగా తలెత్తే చీడపీడలను నివారించేందుకు రైతులు పెద్దయెత్తున ఖర్చు పెట్టాల్సి వస్తోంది. వీటిని నియంత్రించే పరిశోధనలు మందగించాయి. మేధాసంపత్తి కలిగిన శాస్త్రవేత్తలు ఉన్నా తగిన నిధులు కేటాయించడంలో కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోంది. పరిశోధనల లోపం కారణంగా కొన్ని పంటల ఉనికి ప్రశ్నార్థకమయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మినుములో పల్లాకు తెగులు (ఎల్లో మొజాయిక్‌) కారణంగా కోస్తాంధ్రలో దీని సాగు విస్తీర్ణం 90 శాతం క్షీణించింది. కొబ్బరిలో ఇరియోఫిడ్‌నల్లి చేసే నష్టం అంతా ఇంతా కాదు. మొక్కజొన్నలో కత్తెర పురుగు, పత్తిలో గులాబి రంగు పురుగు విధ్వంసం సృష్టిస్తున్నాయి. గడచిన రెండు దశాబ్దాల్లో మంచి పంట పండిందని రైతులు సంతోషపడిన కాలం ఆరేళ్లయినా లేదంటే అన్నదాతల పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

​​​​​​​పలు రకాల ఉష్ణోగ్రతల్ని తట్టుకుని మంచి దిగుబడులు అందించే వంగడాల రూపకల్పన దిశగా అనేక దేశాలు ఇప్పటికే ముందడుగు వేశాయి. ముంపు, కరవును అధిగమించి దిగుబడులు అందించే వరి రకాలను చైనా, జపాన్‌ సాగు చేస్తున్నాయి. ఇవన్నీ నియంత్రిత ఉష్ణోగ్రతల వద్ద విజయవంతం అయ్యాయి. క్షేత్రస్థాయిలో ఆశించినంతగా ఫలితాలు అందించలేదనేది మన శాస్త్రవేత్తల వాదన. ఈ విషయంలో ఇజ్రాయెల్‌ శాస్త్రవేత్తలు మరో అడుగు ముందుకేశారు. కరవును తట్టుకోగలిగే సోయాలోని జన్యువును తీసి, మొక్కజొన్న, వడ్ల గింజల్లో ప్రవేశపెట్టారు. కరవు ప్రాంత రైతులకు మేలు చేసేలా ఈ జన్యువును టీకాల రూపంలో ఇవ్వడం ద్వారా ఒక తరం వరకు విత్తనాలు పనిచేసే సాంకేతికతను వారు సాధించారు. మన దేశంలోనూ ఇలాంటి కృషి జరుగుతోందని కేంద్రం ఇటీవల ప్రకటించింది. భారత వ్యవసాయ పరిశోధన సంస్ధ (ఐకార్‌) ఆధ్వర్యంలో వ్యవసాయంలో వాతావరణ పరిస్థితుల్ని తట్టుకునేలా సృజనాత్మక ఆవిష్కరణలు చేసే జాతీయ ప్రాజెక్టు ‘నిక్రా’ కింద పలు పంటలపై ముమ్మరంగా పరిశోధనలు సాగుతున్నాయి. దీనిలో భాగంగా వరి, గోధుమ, మొక్కజొన్న, వేరుసెనగ, సెనగ, బంగాళదుంప, టమాటో వంటి పంటల్లో పలు వాతావరణ పరిస్థితులు తట్టుకునేలా సరికొత్త వంగడాలను రూపొందిస్తున్నారు. అధిక వేడి, కరవు పరిస్థితుల్ని తట్టుకునేలా గోధుమపైనా, ఎక్కువ కాలం వరద నీటిలో మునిగి ఉన్నా పాడవని వరి వంగడాలను, కరవు పరిస్థితుల్ని తట్టుకునే పప్పుధాన్యాల రకాలను, అధిక వేడి, నీరు నిలిచినా వేరుకుళ్లు రాకుండా తట్టుకునే టమాటో వంగడాలను తరచుగా విపత్తులకు గురయ్యే 151 జిల్లాల్లో అమలు చేయనున్నట్లు ఇటీవల కేంద్రమంత్రి ప్రకాష్‌ జావడేకర్‌ రాజ్యసభలో ప్రకటించారు.

‘నిక్రా’ ప్రాజెక్టులో భాగంగా స్వర్ణ వరి రకంపై మారుటేరులోనూ మూడేళ్లుగా పరిశోధనలు సాగుతున్నాయి. ముంపు, చౌడును తట్టుకోగలగడం, గాలులకు పడిపోకుండా వరి పంట నిలవగలదా అనే అంశాలపై ఈ పరిశోధనలు సాగుతున్నాయి. వీటి ఫలితాలు వెలుగు చూడాలంటే రెండేళ్లకు పైగా పట్టవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ పరిధిలోని పాలెంలో ‘నిక్రా’ కింద గ్రీన్‌హౌస్‌ వాయువులను తగ్గించడంపై, ఆముదం, మొక్కజొన్న, కంది పంటల్లో కరవును తట్టుకునే రకాలపైనా పరిశోధనలు జరుగుతున్నాయి. ‘నిక్రా’ ప్రాజెక్టు కింద కటక్‌, రాయపూర్‌, ఐఆర్‌ఏ న్యూదిల్లీ, కోయంబత్తూరు, బెంగళూరుల్లో, కేంద్రీయ మెట్ట పంటల పరిశోధన సంస్ధ (హైదరాబాద్‌)లో పరిశోధనలు సాగుతున్నాయి. ఐకార్‌ పరిధిలో గతంలోనూ ఇటువంటి ప్రయత్నాలు జరిగినా వరిలో 1064 వంటి కొన్ని రకాలను మాత్రమే రైతులకు అందించగలిగారు.

అవగాహనతోనే ముందడుగు
ప్రకృతి విపత్తుల కారణంగా ఏటా భారీ నష్టం వాటిల్లుతున్నా వీటిని కనీస స్థాయికి పరిమితం చేసే దిశగా చర్యలు లోపిస్తున్నాయి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నా దాన్ని రైతులు ఉపయోగించుకునే స్థాయిలో లేకపోవడమే అసలు సమస్య. రైతులు సైతం అవగాహన లోపంతో వ్యవహరిస్తున్నతీరు వారికి నష్టాలు తెచ్చిపెడుతోంది. అదనులో వర్షాలు కురవనప్పుడు స్వల్పకాలంలో చేతికందే ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలి. ఇందుకు వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయశాఖలు ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక (కంటింజెన్సీ) గురించి జిల్లాలు, మండలాలవారీగా రైతులకు అవగాహన కల్పించాలి. ఈ విషయంలో వ్యవసాయ యంత్రాంగం వ్యవహరించే తీరు లోపభూయిష్ఠంగా ఉంది. రైతులు సైతం ఖరీఫ్‌ అదను దాటి నెలయినా వరిసాగుకే మొగ్గుచూపుతారు తప్ప- పంట విరామం తీసుకోరు. స్వల్పకాలిక రకాలనూ ఎంచుకోరు. అదనుతప్పి వేసే పంటల విషయంలో చీడపీడలు పెచ్చరిల్లే అవకాశాల వల్ల దిగుబడులు పడిపోతాయి. పైగా రబీ సీజన్‌ ఆలస్యమై రైతులు నష్టపోవాల్సి ఉంటుంది. ఈ విధంగా ఖరీఫ్‌సాగు ఆలస్యమైనప్పుడు ముందస్తు రబీ పంటల సాగుకు పూనుకోవాలి.

పంటకాలం గతి తప్పినప్పుడు పంటవేసి నష్టపోయేకన్నా అసలు వేయకపోవడమే మేలన్న సత్యాన్ని గ్రహించాలి. దేశంలో ఆయా వాతావరణ మండలాలవారీగా స్థానిక పరిస్థితులకు తగ్గ విత్తన రకాలపై విస్తృతంగా పరిశోధనలు సాగాల్సిన అవసరముంది. ఒక్కో కొత్త వంగడంపై పరిశోధన ఫలించి క్షేత్రస్థాయికి చేరాలంటే హీనపక్షం అయిదారేళ్లు పడుతుంది. వీటిని త్వరితంగా అందించాలంటే ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలో వెలుగుచూస్తున్న నాణ్యమైన వంగడాలను వేగంగా క్షేత్రస్థాయిలో రైతులకు అందించే కృషి ముమ్మరం కావాలి. అన్ని రకాల పంటల్లోనూ కరవు, ముంపు తట్టుకునే మేలురకం విత్తనాలను రైతులకు అందివ్వాలి. దీనివల్ల కోట్ల టన్నుల వ్యవసాయోత్పత్తులు ఆదా కావడంతో పాటు పెరిగే జనాభాకు ఆహార భద్రత అందించగలం. అంతకుమించి నష్టశాతం తగ్గి ఉత్పత్తి, ఉత్పాదకత పెరిగి రైతుల ఆదాయాలూ ఇనుమడించే అవకాశం ఉంది!

- అమిర్నేని హరికృష్ణ
Posted on 17-08-2019