Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

పాడి రైతు ఇంట సిరులపంట

ప్రపంచీకరణలో భాగంగా మిగతా రంగాల మాదిరిగా పాడి రంగంలోనూ కార్పొరేట్‌ సంస్థల ఆధిపత్యం నానాటికీ పెరిగిపోతోంది. కదలడానికి వీలులేని ప్రదేశాల్లో వందలకొద్దీ పశువులను కర్మాగార పరిశ్రమ స్థాయిలో పెంచుతున్నారు. పశువుల ఆరోగ్యానికి హానికరమైన హార్మోన్లు, ఆంటీబయాటిక్స్‌ను వాటి శరీరాల్లోకి చొప్పిస్తున్నారు. తద్వారా పాల దిగుబడి పెంచుకొంటున్నారు. అలా తీసిన పాలను ఆధునిక యంత్రాల ద్వారా శీతలీకరించి, 'ఫారం ఫ్రెష్‌' పేరిట అమ్ముకోవడానికి కొన్ని డెయిరీ సంస్థలు ముందుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతాంగం- ఒకటి, రెండు పశువులను పెంచుకొంటూ వాటిపై ఆధారపడి జీవనం సాగించాలనుకుంటే- అది నేలవిడిచి సాము చేసినట్లే! ఇది పోటీ ప్రపంచం. దీనిలో నిలబడటానికి సాధారణ పాడి రైతు కూడా కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవరచుకోవాలి. ఇందుకు 'డెయిరీ హబ్‌' అనే పద్ధతి వారికి బాగా ఉపయోగపడుతుంది.

మెరుగైన ఆదాయమార్గం

అధిక శాతం చిన్న, సన్నకారు రైతు కుటుంబాలకు పాడి ఆదాయం చాలా కీలకం. ముఖ్యంగా మెట్ట ప్రాంతాల్లో పాడి ప్రాముఖ్యం మరింత ఎక్కువ. పలు జిల్లాల్లో ఒకటి లేదా రెండు ఆవులపై బతికే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. రెండు గేదెల పాడిపైనా ఆధారపడుతున్న కుటుంబాలకు లెక్కలేదు. ఈ పశువుల సరాసరి పాల దిగుబడి రోజుకు అయిదారు లీటర్లే ఉంటుంది. పాడి ఆదాయం ఆశించిన మేర పెరగకపోవడానికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. తగినన్ని పశువుల్ని పెంచే ఆర్థిక సామర్థ్యం లేకపోవడం అందులో మొదటి కారణం. అవగాహన లేమి రెండోది! పోటీ మార్కెట్లలో నిలదొక్కుకోవడానికి ప్రభుత్వ, ప్రైవేటు డెయిరీలు తమ దృష్టిని పాల సేకరణపై నిలుపుతున్నాయి. చిన్న, సన్నకారు పాడిరైతుకు పశువులకొట్టం స్థాయిలో నిర్వహణ సామర్థ్యాలు పెంచడానికి అవి ప్రాధాన్యం ఇవ్వడం లేదు. జాతీయ పాడి అభివృద్ధి మండలి(ఎన్‌డీడీబీ) సైతం పదేళ్లుగా మార్కెటింగ్‌ వ్యవస్థపైనే దృష్టిసారిస్తోంది. సాంకేతిక, యాజమాన్య వ్యవస్థలకు అనుగుణంగా మారగలిగినప్పుడే ఎవరైనా ఏ రంగంలోనైనా నిలదొక్కుకోగలుగుతారు. పాడి రైతూ అందుకు మినహాయింపు కాదు.

పెరుగుతున్న దాణా, పచ్చిమేత ఖర్చులకు దీటుగా డెయిరీ సంస్థలు చెల్లించే ధరలు ఉండటం లేదు. దీంతో కేరళ (కొచ్చి, వయనాడు), కర్ణాటక (ఉత్తర కన్నడ) ప్రాంతాల్లో కొంతమంది ఔత్సాహిక రైతులు చొరవ తీసుకుని 10-12మంది సభ్యులతో బృందాలుగా ఏర్పడి, సమష్టిగా పాడి నిర్వహణకు నడుంకట్టారు. పాడి రంగంలో చిన్నరైతును ప్రోత్సహించడానికి ఇతర రాష్ట్రాల్లోనూ ప్రయత్నాలు జరుగుతున్నాయి. వాటిలో చెప్పుకోదగింది గుజరాత్‌. దేశంలోకెల్లా వినూత్నమైన ఈ పథకానికి సబర్కాంత జిల్లాలో అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాలతో శ్రీకారం చుట్టారు. కేంద్ర పథకమైన రాష్ట్రీయ కృషివికాస్‌ యోజన(ఆర్‌కేవీవై)లో తమవంతు వాటాను తమకు అనువైన రీతిలో వినియోగించుకొనే విషయంలో కేంద్రాన్ని ఒప్పించారు. 2008-09 నుంచి 2011-12 మధ్యలో సబర్కాంతలోని అకోదర గ్రామంలో 90మంది పాడి రైతులు 600 పశువులను పెంచడానికి 36 పశు సంరక్షణ శాలలు(హాస్టళ్లు) నిర్మించారు. ఇందుకు రూ.5.84కోట్లు ఖర్చయ్యాయి. ఆర్‌కేవీవై నుంచి రూ.4.34కోట్లు, డీఆర్‌డీఏ నుంచి రూ.50లక్షలు, గుజరాత్‌ ఇంధన అభివృద్ధి సంస్థ నుంచి రూ.49లక్షలు, రాష్ట్ర పశుగణాభివృద్ధి శాఖ నుంచి లక్ష రూపాయలు సేకరించారు. 90మంది రైతులు రూ.50లక్షలు సమకూర్చారు. ఎటువంటి అంటువ్యాధులు రాకుండా పరిశుభ్రమైన గాలి, వెలుతురు ఉండేలా ఈ హాస్టళ్లు నిర్మించారు. ఒక్కోదానికి లక్ష లీటర్ల సామర్థ్యం ఉన్న నీళ్ల ట్యాంక్‌, సంపు (8,000లీటర్లు) నిర్మించారు. పశువుకు కావలసిన పచ్చిమేత, ఎండుగడ్డి సమష్టిగా పండించి, దాణాను అందరూ కలిసి కొనేలా ఏర్పాటు చేశారు. పశు సంరక్షణ శాల నిర్వహణకయ్యే ఖర్చులకోసం గోబర్‌ గ్యాస్‌, వర్మి కంపోస్టు తయారీ అమ్మకాలు చేపట్టారు. హాస్టలు నిర్వహణ బాధ్యత రైతులదే. మహిళలకూ కనీసం మూడోవంతు భాగస్వామ్యం కల్పించారు. ఏడాదికల్లా వీరు తమ ఆదాయంలో 20శాతం వృద్ధి సాధించారు. ప్రయోగం విజయవంతం కావడంతో ఈ తరహా పశుశాలలను గుజరాత్‌లోని మరో అయిదు జిల్లాల్లో ఏర్పాటు చేస్తున్నారు. పారిశుద్ధ్య చర్యలతో సంరక్షణ శాలలను పరిశుభ్రంగా ఉంచుతారు. వైద్య పర్యవేక్షణ నిర్వహిస్తారు. దాణా, పచ్చిమేత వాడకం, యంత్రంతో పాలు పితకటం, తిరిగి ఆ పాలను నాలుగు డిగ్రీల సెల్సియస్‌ వద్ద శీతలీకరించి కలిసికట్టుగా అమ్ముకోవడం వంటివి సాగిస్తారు. ఈవిధంగా కొట్టాల్లో పాడి దిగుబడి 30శాతం పెరిగిందని అధ్యయనంలో తేలింది.

పశు సంరక్షణ శాలల ప్రయోగ విధానాన్ని స్ఫూర్తిగా తీసుకుని, మరొక్క అడుగు ముందుకు వేసి వినియోగదారుడికి హాని కలిగించే ధాతువులు లేని ఆర్గానిక్‌ పాలు అందించే ఉద్దేశంతో కర్ణాటకలోని హసన్‌, తుముకూరుల్లో డాక్టర్‌ జీఎన్‌ఎస్‌ రెడ్డి అనే పశువైద్యులు 'అక్షయ కల్ప' అనే సంస్థను రెండేళ్ల క్రితం స్థాపించారు. ఒక్కో డెయిరీ కేంద్రంలో ఆరేడు మంది రైతులకు చెందిన 25 పశువులను ఒక కొట్టంగా ఏర్పరచారు. అలాంటి 300 కొట్టాలను ఒక గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా సుమారు 7,500 పశువులకు మేలిరకం పాడి యాజమాన్య సేవలందించడం ఈ సంస్థ లక్ష్యం. తక్కువ వ్యయంతో అధునాతన పశుశాల, పచ్చిమేత కత్తిరించే యంత్రాలతోపాటు గంటన్నర వ్యవధిలో 25 పశువుల నుంచి పాలు తీయడం, పాలను వెంటనే శీతలీకరించడం, ఈ విధంగా ఉత్పత్తిచేసే పాలను 'ఆర్గానిక్‌ పాలు'గా స్థానిక విపణుల్లో మంచి ధరలకు అమ్ముకోవడం 'అక్షయకల్ప' ఉద్దేశ్యం. దీనిలో భాగంగానే పశువుల పేడ, మూత్రాలను సేకరించి బయోగ్యాస్‌ ఉత్పత్తిచేసి, తద్వారా డెయిరీకి, నాలుగైదు ఎకరాలు పశుమేత సాగుకు నీరు అందిస్తున్నారు. పాతిక ఆవుల సామర్థ్యం కలిగిన ఒక్కో కేంద్రం స్థాపించడానికి, పశువుల ధరతో కలిపి సుమారు రూ.24లక్షలు అవసరం అవుతాయి. ఒక్కో కేంద్రం కనీసం సగటున రోజుకు 250నుంచి 275 లీటర్ల పాలు ఉత్పత్తి చేస్తుంది. అన్ని ఖర్చులు పోగా, ఒక్కో పశువుపై నెలకు కనీస నికరలాభం రూ.3,400 రైతుకు మిగులుతుంది. వర్మి కంపోస్టు(వానపాముల ఎరువు), ఆవు మూత్రంతో జీవామృతంవంటి క్రిమిసంహారక, ఎరువుల రకాలనూ ఉత్పత్తి చేసుకోవచ్చు. ఈ ప్రాజెక్టు మొదటి సంవత్సరమే అంచనాలను మించి విజయాలను సాధించింది. ఆర్గానిక్‌ పాల ప్రాజెక్టుగా వీటిని గుర్తించి, బ్యాంకులు రుణ సదుపాయాలు కల్పించాయి.

ప్రభుత్వ చొరవే ప్రధానం

దేశంలో పాలు, పాల పదార్థాలకు పెరుగుతున్న గిరాకీకి తగ్గట్టు పాడి ఉత్పత్తిని ఏటా ఎనిమిది శాతం పెంచాలని ప్రస్తుత పంచవర్ష ప్రణాళికలో లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే రీతిలో, సంక్షోభంలో కూరుకుపోయిన చిన్నరైతును ఆర్థికంగా గట్టెక్కించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు పాడిరంగానికి మరింత ప్రాధాన్యం ఇవ్వాలి. డెయిరీ హబ్‌ పద్ధతి నుంచి మన రైతుకు అనువుగా ఉండే అంశాలను పరిశీలనలోకి తీసుకుంటే మంచిది. అప్పుడే ఒకటి, రెండు పశువుల రైతులకు మేలు జరిగే అవకాశముంది. వీటితోపాటు రైతులు తమంతట తామే పశుగ్రాసం కోసం తగినంత భూమిని సమకూర్చుకోలేకపోతే, ఒక్కొక్క పాడి కేంద్రానికి నాలుగైదు ఎకరాల పొలం పంచాయతీల ద్వారాగాని, ప్రైవేటు వ్యక్తుల ద్వారా గాని ప్రభుత్వమే లీజుకు ఇప్పించే చొరవ తీసుకోవాలి. స్వయంసహాయక సంఘాల నిర్వహణ కార్యక్రమంలో నేర్చుకున్న యాజమాన్య నైపుణ్యాలతో నేటి గ్రామీణ మహిళ ఇటువంటి పశు సంరక్షణ శాలలను సులభంగా నిర్వహించవచ్చు. ఆమెకు కావలసినదంతా కొంత పెట్టుబడి సాయం, ప్రభుత్వ ప్రోత్సాహం. ఈ 'డెయిరీ హబ్‌' పద్ధతిలో ఒకటి రెండు పాడి పశువులపై ఆధారపడుతున్న లక్షల కుటుంబాలు తమ ఆదాయాన్ని కొంతైనా పెంచుకోగలుగుతాయి.

(రచయిత - పరిటాల పురుషోత్తం)
(రచయిత- జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ విశ్రాంత ఆచార్యులు)
Posted on 10-01-2015