Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

అన్నదాతకు అందని మద్దతు

* పడిపోతున్న పంట ధరలు

మద్దతు ధరలకు వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరితో రైతులు నష్టపోతున్నారు. అక్టోబరు నుంచి మరుసటి ఏడాది సెప్టెంబరు వరకూ ‘కొత్త మార్కెటింగ్‌ సంవత్సరం’గా కేంద్రం పరిగణిస్తోంది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ధరల పతనం కొనసాగుతోంది. అధిక వర్షాల కారణంగా పంటలు దెబ్బతిని నాణ్యత లోపించిందంటూ వ్యాపారులు ధరలు తెగ్గోస్తున్నారు. పంటలను మద్దతు ధరలకు కొనేందుకు కేంద్రం అమలు చేస్తున్న ప్రధానమంత్రి అన్నదాత ఆయ్‌ సంరక్షణ యోజన (పీఎం-ఆశ) కింద రైతులకు భరోసా కరవైంది. దేశ వ్యాప్తంగా గల 22 వేల గ్రామీణ వ్యవసాయ మార్కెట్ల స్థాయి పెంచుతామని ఈ పథకం కింద రెండేళ్ల క్రితం ఇచ్చిన హామీలేమీ ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదు.

నిధులు కొరవడి సమస్యలు
కేంద్ర, రాష్ట్ర బడ్జెట్లలో పంటల కొనుగోలుకు సంబంధించిన ‘మార్కెట్‌ ధరల స్థిరీకరణ నిధి’కి పెద్దగా కేటాయింపులు లేవు. జూన్‌లో సాగు చేసిన కొత్త పంటలు సెప్టెంబరు నుంచే మార్కెట్లకు వస్తున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌ పంటలకు మద్దతు ధర ఎంత ఇవ్వాలనేది ఏటా జూన్‌లోనే కేంద్రం ప్రకటిస్తోంది. కానీ ఇలా ప్రకటించే కొత్త ధరలను అక్టోబరు ఒకటి నుంచి ప్రారంభమయ్యే కొత్త మార్కెటింగ్‌ ఏడాది నుంచే ఇవ్వాలని నిబంధన విధించింది. సెప్టెంబరు నుంచి కొత్త పంటలు వస్తున్నందున వాటికి కూడా కొత్త మద్దతు ధరలనే వర్తింపజేయాలని తెలంగాణ ప్రభుత్వం గతంలో కేంద్రానికి లేఖ రాసినా స్పందన లేదు. గతేడాదిలోనూ పలు రాష్ట్రాల్లో అత్యధిక పంటలకు మద్దతు ధర దక్కలేదని‘భారత వ్యవసాయ వ్యయ, ధరల కమిషన్‌’ (సీఏసీపీ) తాజా నివేదికలో పేర్కొంది. పత్తి, నూనెగింజలు, మొక్కజొన్న తదితర పంటలకు ‘ధరల్లో వ్యత్యాసాన్ని చెల్లించే పథకం’(పీడీపీఎస్‌) అమలు చేయాలని కేంద్రానికి సిఫార్సు చేసింది. ఈ పథకాన్ని 2017లోనే మధ్యప్రదేశ్‌ ప్రభుత్వం ‘భవంతర్‌ భుగ్టాన్‌ యోజన’(బీబీవై) పేరుతో కొన్ని పంటలకు ప్రయోగాత్మకంగా అమలుచేసి ఆపివేసింది. రైతు పంటను మార్కెట్‌లో అమ్మినప్పుడు వచ్చిన ధర, కేంద్ర ప్రకటించిన మద్దతు ధరకన్నా తక్కువగా ఉంటే ఈ రెండింటి మధ్య వ్యత్యాసాన్ని చెల్లించాలనేది పీడీపీఎస్‌ విధానం. కానీ మధ్యప్రదేశ్‌లో వ్యాపారులు రైతులను మోసం చేసి బీబీవై పథకాన్ని పక్కదారి పట్టించారు. ఆ నేపథ్యంలో బీబీవై విధానంలో మార్పులు చేసి పీడీపీఎస్‌ రూపంలో ఈ ఏడాది నుంచి అమలుచేస్తే మేలన్నది సీఏసీపీ సిఫార్సు. గడచిన నాలుగైదేళ్లలో ఒక పంటకు వచ్చిన సగటు ధరను ప్రామాణికంగా తీసుకుని దానికి, ఈ ఏడాది మద్దతు ధరకు మధ్య వ్యత్యాసం ఉంటే ఆ సొమ్మును రైతుకు పీడీపీఎస్‌ కింద చెల్లించాలని కమిషన్‌ స్పష్టం చేసింది. ఇలాంటివేమీ అమల్లోకి రాకుండానే ప్రస్తుత మార్కెటింగ్‌ ఏడాదిలో పంటల అమ్మకాలు సాగుతున్నాయి. మద్దతు ధరలు ప్రకటించే కేంద్రమే వాటిని కొనాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. కొన్ని పంటలనే కొంటామని, అవీ ఒక రాష్ట్రంలో ఆహారధాన్యాలు, నూనెగింజలు, పప్పుధాన్యాలను ఒక్కో పంట మొత్తం దిగుబడిలో 25 శాతమే కొంటామని కేంద్రం స్పష్టం చేసింది. గతంలో 40 నుంచి 50 శాతం వరకూ కొనేది. ఈ ఏడాది నుంచి 25 శాతమే కొంటామని రాష్ట్రాలకు తెలిపింది. కనీసం 40 శాతమైనా కొనకపోతే రైతులకు అన్యాయం జరుగుతుందని, పైగా తమ వద్ద నిధులు లేవని, వాటిని సమకూరిస్తేనే అదనంగా కొనగలమని పలు రాష్ట్రాలు ఇటీవల దిల్లీలో జరిగిన జాతీయ వ్యవసాయ సదస్సులో కేంద్రానికి స్పష్టం చేశాయి. దిగుబడిలో 25 శాతమే కొంటే మిగతాదంతా వ్యాపారులు కొనాల్సిందే. వారికిష్టమైన ధరలకే కొంటున్నా రైతులు గానీ, రాష్ట్ర ప్రభుత్వాలు గానీ చేయగలిగిందేమీ లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవాలని రాజకీయంగా బలమైన నిర్ణయం తీసుకుంటే తప్ప అదనంగా పంటలను కొనుగోలు చేసే పరిస్థితి లేదు. ఉదాహరణకు తెలంగాణలో పెసలు, మినుము, సోయాచిక్కుడు, కంది, వేరుసెనగ, మొక్కజొన్న, జొన్న పంటలను కేంద్రం కొనే 25 శాతం కాకుండా అదనంగా మరో 15 శాతం కొనాలంటే తెలంగాణ ప్రభుత్వమే సొంతంగా రూ.2,902 కోట్లు వెచ్చించాలని రాష్ట్ర మార్కెటింగ్‌ శాఖ అధ్యయనంలో గుర్తించారు. తెలంగాణ బడ్జెట్‌లో పంటల కొనుగోలుకు నిధులేమీ కేటాయించలేదు. మరి ఇన్ని నిధులు ఇప్పటికిప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడి నుంచి సమకూర్చుకోవాలనేది కీలకప్రశ్నగా మారింది. పంటల కొనుగోలులో కేంద్రం విధించిన కఠిన నిబంధనలు అమలు చేయలేక రాష్ట్రాలు చేతులెత్తేస్తున్నాయి. ఉదాహరణకు జొన్న, మొక్కజొన్నలను ఆహార పంటలుగా గుర్తించి వాటికి మద్దతు ధరలను కేంద్రం ఏటా ప్రకటిస్తోంది. కానీ వీటిని కేంద్రం అన్ని రాష్ట్రాల్లో కొనడం లేదు. నిత్యావసర సరకుల కోటా విధానంలో జొన్న, మొక్కజొన్నను రేషన్‌కార్డులపై ప్రజలకు విక్రయించే విధానం ఉన్న రాష్ట్రాల్లోనే కొంటామనే నిబంధన విధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ విధానం లేకపోవడంతో ఒక్క గింజను కూడా కేంద్రం కొనడం లేదు. వీటిని రైతుల నుంచి కనీసం క్వింటా కొనాలన్నా రాష్ట్ర ప్రభుత్వాలు సొంతంగా నిధులివ్వాలి. మిగతా పంటలకున్న 25 శాతం కొనుగోలు విధానంలోనైనా వీటిని కేంద్రం కొంటే తమకు కొంత వెసులుబాటుగా ఉంటుందనేది రాష్ట్రాల వాదన. కానీ కేంద్రం ససేమిరా అనడంతో తెలుగు రాష్ట్రాలే పూర్తిగా కొనాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఎగుమతులు పెంచితేనే గిట్టుబాటు ధర
దేశంలో ఆహారధాన్యాల దిగుబడులు రికార్డుస్థాయిలో పెరిగాయి. అదే సమయంలో రైతులకు సరైన ధరలు లభించడం లేదు. వ్యవసాయోత్పత్తుల ప్రపంచ ఎగుమతుల్లో భారత్‌ వాటా 2017లో 2.3 శాతమని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటీఓ) వెల్లడించింది. ఇతర దేశాల నుంచి భారత్‌కు సేద్య ఉత్పత్తుల దిగుమతులు 1.9 శాతమున్నాయి. భారత పంటలకు ప్రపంచ మార్కెట్‌లో డిమాండు ఉంది. దాన్ని ఇక్కడి రైతులకు ఆదాయ వనరుగా మార్చేలా పంటల కొనుగోలు విధానాలుండాలి. ఆహార శుద్ధి, నిల్వ సదుపాయలు పెరగనంత కాలం గిట్టుబాటు ధరలు లభించడం కష్టమని అనేక దేశాల అనుభవాలు చెబుతున్నాయి. ఆస్ట్రేలియా, చిలీ నుంచి భారత్‌కు యాపిల్‌పండ్లు వస్తున్నాయి. మనదేశంలో కశ్మీర్‌ మొదలుకుని అనేక రాష్ట్రాల్లో ఈ పంట సాగుకు అనుకూల వాతావరణమున్నా నాణ్యత, దిగుబడులు పెరగడం లేదు. పక్కనే ఉన్న చైనా నుంచి డ్రాగన్‌ లిచీ పండ్లు వస్తున్నాయి. అదే చైనా పాలు దొరక్క న్యూజిలాండ్‌ నుంచి తెచ్చుకుంటోంది. మనపక్కనే ఉన్న శ్రీలంక, చైనా వంటి దేశాలకు పాలు ఎగుమతి చేసినా రైతులకు ఆదాయం పెరుగుతుంది. ఇలా చుట్టుపక్కల దేశాల ఆహారవసరాలు తీర్చేస్థాయిలో ఎగుమతులు పెంచినా మన రైతులకు ఆదాయం ఇనుమడించే అవకాశాలున్నాయి. అందుకు తగిన విధానాలు, కార్యాచరణ లేనంతకాలం వ్యాపారుల జేబులు నింపడమే సరిపోతుంది. అప్పులు తెస్తేనే ఎరువులు, విత్తనాలు, మద్దతు ధరలు ఇవ్వగలమనే విధానాలు కొనసాగినంత కాలం బాగుపడేది వ్యాపారులు, బ్యాంకులే. మునిగేది ప్రభుత్వ సంస్థలు, రైతులే!

అంతిమ ప్రయోజనం వ్యాపారులకే
పంటలను మద్దతు ధరలకు కొనడం ద్వారా రైతులను ఆదుకుంటున్నామని ప్రభుత్వాలు ప్రచారం చేసుకుంటున్నాయి. కానీ ఇలా కొనే వాటిని సైతం వ్యాపారులకు మేలుచేసే తీరులోనే మళ్లీ మార్కెట్లలో అమ్మేస్తున్నారు. 2017లో రైతుల నుంచి క్వింటాకు రూ.5,450 చొప్పున మద్దతు ధర చెల్లించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కందులు కొన్నాయి. వాటిని ఆరునెలలకు పైగా అలాగే ఉంచి గతేడాది డిసెంబరులో కొత్త కందులు మార్కెట్‌కు వచ్చే సమయంలో వ్యాపారులకు క్వింటాను రూ.3,234కు అమ్మాయి. ఇవి మార్కెట్లకు వెల్లువెత్తడంతో 2018 ఖరీఫ్‌లో రైతులు మార్కెట్లకు తెచ్చిన కొత్త కందుల ధరలు పతనమయ్యాయి. రైతులను ఆదుకుంటామని మళ్లీ వాటిని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధరకు కొని నిల్వ పెట్టాయి. వీటిని ఇప్పుడు మళ్లీ వ్యాపారులకు అమ్మేందుకు టెండర్లు పిలుస్తున్నాయి. ఇవి తక్కువ ధరలకు బయటికి వస్తే ఈ సీజన్‌లో పండిస్తున్న కొత్త కందుల ధర పతనం కావడం తథ్యం. మళ్లీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మద్దతు ధరకు కొంటామని సిద్ధమవుతున్నాయి. రైతులకు మద్దతు ధర ఇవ్వకుండా నేరుగా వ్యాపారులు తక్కువకు కొనుక్కున్నా లాభం వారిదే. ఒకవేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల నుంచి మద్దతు ధరకు కొన్నా తిరిగి ఈ ప్రభుత్వాల నుంచి తక్కువ ధరకు టెండర్ల ద్వారా కొనుక్కుని లాభపడిందీ వ్యాపారులే. ఎటు నుంచి ఎటు కొన్నా చివరికి లాభాలు వ్యాపారులకే. మునిగేది ఇటు రైతులు లేదా అటు ప్రభుత్వాలు అనేతీరుగా విధానాలున్నాయి. ఈ పరిస్థితిని సరిదిద్ది గతేడాది ప్రభుత్వ సంస్థలు రైతుల నుంచి మద్దతు ధరలకు కొన్నవాటిని గోదాముల్లో పెట్టి ఈ ఏడాది కొత్త పంటలు మార్కెట్‌కు వచ్చే సమయంలో తక్కువ ధరలకు టెండర్ల ద్వారా అమ్మే విధానాలను ఆపివేయాలని సీఏసీపీ ఇటీవల కేంద్రానికి సిఫార్సు చేసింది.

- మంగమూరి శ్రీనివాస్
Posted on 21-11-2019