Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

విత్తుల్లేని వ్యవసాయం!

దీర్ఘకాల వృద్ధి ఫలాలను కాంక్షించిన కేంద్ర బడ్జెట్‌... తయారీ, మౌలిక వసతుల కల్పనను స్మరించింది. జనాకర్షణను విస్మరించడంతో పాటు కీలక రంగమైన వ్యవసాయాన్నీ అది ఉపేక్షించింది. నాలుగు శాతం వృద్ధిరేటు లక్ష్యంగా పెట్టుకున్నామన్న జైట్లీ బడ్జెట్‌- దీని సాధనకు అనుసరించాల్సిన వ్యూహాన్ని గాలికొదిలేసింది. మన రైతులకున్న సామర్థ్యాన్ని కీర్తిస్తూ, వారి జేబులు నింపడానికి అవకాశాలు దండిగా ఉన్నాయంది. కానీ ఉత్పత్తి, ఉత్పాదకతలు పెంచడం ద్వారా రైతు ఆదాయాన్ని సుస్థిరం చేసేందుకు అదనంగా ఏం చేయనుందో బడ్జెట్‌ నిర్దిష్టంగా చెప్పలేకపోయింది. గ్రామీణ భారతంలో నైపుణ్యాలు పెంచేందుకు, యువతకు దిశానిర్దేశం చేసేందుకు శ్రద్ధపెట్టిన ప్రభుత్వం, వ్యవసాయాభివృద్ధి పట్ల స్పృహ ఉందని చెబుతూనే ఇప్పటికిప్పుడు ఈ రంగాన్ని సమూలంగా మార్చే మంత్రదండం తమ వద్ద లేదని అంగీకరించింది!

కష్టాలు అనేకం

సంస్కరణల ఫలాలు రైతులకు అందాలంటే వాటిని ప్రభుత్వాలు అంతే చిత్తశుద్ధితో అమలుచేయాలి. నిజానికి దశాబ్దాలు గడుస్తున్నా సగటు రైతుల్ని సగౌరవంగా నిలబెట్టే పనిని ఏ ప్రభుత్వాలూ చేయలేకపోయాయి. బడ్జెట్లలో సాగుదార్ల సంక్షేమానికి మొండిచేయి చూపటం పరిపాటవుతోంది. దశాబ్ద కాలపు యూపీఏ పాలనలో రైతు ఆత్మహత్యలు అత్యధిక స్థాయికి చేరాయి. పెట్టుబడి ఖర్చుకు ప్రతిఫలాలకు ఎలాంటి పొంతన లేని సేద్యంతో సగటు రైతుకు నేడు సాగులో నిలదొక్కుకోవడమే జీవన్మరణ సమస్యగా మారింది. ఈ తరుణంలో లాభసాటి వ్యవసాయానికి పెద్దపీట వేస్తామన్న మోదీ ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్‌ ప్రవేశపెట్టింది. ఎన్నో సవాళ్లను దృష్టిలో పెట్టుకుని రూపొందించిన ఈ బడ్జెట్లో భవిష్యత్తును అందంగా ఆవిష్కరించగలిగినా, వాస్తవాలను విస్మరించింది. వ్యవసాయాభివృద్ధిని ప్రస్తావిస్తూనే ఆర్థిక వ్యవస్థను నిలబెట్టే కృషికి పెద్దపీట వేసింది. కొన్ని అంశాల్లో కీలకమైన మార్పులకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా నీటిపారుదల రంగంలో నిధుల్లేక దశాబ్దాలుగా సాగునీటి ప్రాజెక్టులెన్నో నిలిచిపోయాయి. వీటిని పూర్తిచేయాలంటే నిధుల అందుబాటు పెద్ద సమస్య. దీనికై జైట్లీ తరుణోపాయం చూపించారు. గతంలో అనుమతి ఇవ్వని నీటిపారుదల 'బాండ్ల' జారీకి పచ్చజెండా చూపారు. ఈ బాండ్ల ద్వారా సేకరించిన నిధుల్ని వాడే విధివిధానాలు స్పష్టం చేయాల్సిన అవసరముంది. వీటిని రైతుల్నుంచి నీటి తీరువా లేదా మరో రూపంలో తిరిగి వసూలు చేస్తే- మళ్లీ ఆ భారాన్ని వారే భరించాల్సి ఉంటుందన్న స్పృహ పాలకులకు అవసరం. 'ఫార్వార్డ్‌ మార్కెట్‌ కమిషన్‌'ను 'సెబి'లో కలిపేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. దీనివల్ల ఆహార ధాన్యాల 'స్పెక్యులేషన్‌' చాలావరకు నియంత్రణలో ఉండే అవకాశముంది. కొన్నేళ్లుగా కోరుతున్నా ఈసారి జైట్లీ దీన్ని సాకారం చేశారు. ఇందువల్ల మార్కెట్‌ శక్తుల దోపిడిని కొంతవరకు నియంత్రించవచ్చు.

ఉమ్మడి మార్కెట్లపై పట్టు?

వ్యవసాయ మార్కెట్‌ కమిటీల చట్టంలో మార్పులు తెచ్చి, రాష్ట్రాల అంగీకారం లేకపోయినా కేంద్రం వీటిని సవరిస్తామని చెబుతోంది. వ్యవసాయోత్పత్తులకు జాతీయ స్థాయిలో ఉమ్మడి మార్కెట్లు ఉండాలని కేంద్రం అభిలషిస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధరలకు ప్రైవేటు వ్యక్తులు కొనుగోళ్లు చేపట్టే వ్యవస్థ ఇది. రైతులకు ఇష్టానుసారం ధరలు అంటగట్టరనే విషయంలో ప్రభుత్వం ఎటువంటి భరోసా ఇస్తుందన్నదే ఇక్కడ ప్రశ్న. పైగా వీరు నిల్వలను కప్పిపుచ్చి భవిష్యత్తు ధరలను ప్రభావితం చేసే ప్రమాదం లేకపోలేదు. దేశవ్యాప్తంగా ఏకీకృత మార్కెట్‌ వ్యవస్థను ఏర్పాటుచేయాలనే ఆలోచన మంచిదే కానీ, దీన్ని అమలు చేసేముందు విధి విధానాలను సక్రమంగా నిర్వచించకపోతే అవి రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తాయి. రైతు ప్రయోజనాలను కాపాడే నియంత్రణలు విధించడంతో పాటు ఇందులో ఇమిడి ఉన్న రవాణా, మౌలిక సదుపాయాలు, కంప్యూటర్‌ అనుసంధానం... వీటన్నింటితోపాటు మార్పులు తెస్తేనే అన్నదాతకు మేలు ఒనగూరుతుంది. రైతుకు మంచి ధరలు రానప్పుడు తన ఉత్పత్తిని నిల్వ చేసుకుని ధరలు పెరిగినప్పుడు విక్రయించుకోగలిగితేనే సేద్యం లాభసాటి అవుతుంది. వ్యవసాయోత్పత్తుల నిల్వకు సరైన గోదాముల సదుపాయాలు లేక, దేశంలో ఏటా రూ.44 వేలకోట్ల విలువైన ఆహార ధాన్యాలు, పండ్లు, కూరగాయలు వృథా అవుతున్నాయి. దేశంలో ప్రస్తుత అవసరాలను దృష్టిలో పెట్టుకుంటే, ఇప్పుడు అందుబాటులో ఉన్న గోదాములకు రెట్టింపు నిర్మించాల్సిన అవసరం ఉంది.

ఏటా ఒక ప్రణాళిక ప్రకారం వాస్తవ అవసరాల ప్రాతిపదికన ఆయా ప్రాంతాల్లో వీటిని నిర్మించాల్సి ఉన్నా ప్రభుత్వం ఈ బడ్జెట్లో ఈ అంశాన్ని పూర్తిగా విస్మరించింది. వీటికితోడు గోదాముల నిర్వహణ సేవలపై విధిస్తున్న సేవా పన్నులకు ఈ బడ్జెట్లో మినహాయింపులు ఇస్తారని ఆశించినా అదీ సాకారం కాలేదు. ఇదే జరిగితే ప్రైవేటు రంగంలో మరిన్ని పెట్టుబడులకు అవకాశముంటుంది. తద్వారా గోదాముల నిర్మాణంలో వేగవంతమైన పురోగతి సాధ్యపడేది. 2015-'16 సంవత్సరానికి రూ.8.5లక్షల కోట్ల వ్యవసాయ రుణాలను అందిస్తామనే లక్ష్యాన్ని ప్రభుత్వం బడ్జెట్లో ప్రకటించింది. ఇది గతేడాది కంటే రూ.50 లక్షలు అదనం. అన్ని రకాల రుణాలను వ్యవసాయంకింద చూపిస్తూ రైతుల్ని వంచిస్తున్నారు. నిజానికి ఈ రుణాల్లో రైతులకు అందుతున్నవెన్ని, పుస్తక సర్దుబాట్లుగా ఉన్నవెన్ని? రైతుకు అందిస్తున్న పరపతిలో పంట రుణాల కంటే దీర్ఘకాలిక వ్యవసాయ రుణాలే అధికంగా ఉంటున్నాయన్న సంగతిని, ముఖ్యంగా అవి పెద్ద రైతులకే చెందుతున్నాయన్న వాస్తవాల్ని బ్యాంకులు కాదనగలవా? ఈ పరిస్థితులు మారాలి. దేశంలోని 14.5కోట్ల మంది రైతుల్లో ఏడు కోట్లమందికైనా బ్యాంకు రుణాలు అందడం లేదు. వాస్తవంగా సాగుచేస్తున్నవారిలో 25శాతం రైతులకు సైతం పంట రుణాలు అందడం లేదని ప్రభుత్వాలే నియమించిన పలు కమిటీలు స్పష్టంచేశాయి. ఈ పరిస్థితిలో మార్పులు తెచ్చి చిన్న కమతాల సాగుదార్లకు సక్రమంగా పంట రుణాలు అందేలా రుణ వితరణను మరింత సులభతరం చేయాల్సిన అవసరముంది.

అర్థంలేని నిబంధనలొద్దు

అన్ని వర్గాల శ్రేయాన్ని కాంక్షించి గ్రామీణ భారతాన్ని సుసంపన్నం చేసేలా, సంపద సృష్టిని పెంచడంపై మోదీ ప్రభుత్వం దృష్టిపెట్టింది. ముఖ్యంగా సబ్సిడీల పెంపుతో ఆహార భద్రత, గ్రామీణ ఆరోగ్యం, బీమా సేవల పరిధిని పెంచి నిరుపేదల సంక్షేమానికి సమాయత్తమవుతోంది. దేశంలో ఏ వ్యక్తీ అనారోగ్యం, వృద్ధాప్యం వల్ల ఇబ్బందులు పడకుండా ఆర్థిక భరోసా ఇచ్చే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టనుండటం వల్ల గ్రామీణ పేదలకు లాభం చేకూరనుంది. ఇదే సమయంలో గ్రామీణ యువతలో వృత్తి నైపుణ్యాలు పెంచేందుకు, నిరుద్యోగ యువతకు ఉపకార వేతనాలు అందించేందుకు రూ.1500 కోట్లతో 'దీనదయాళ్‌ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్‌ యోజన'కు శ్రీకారం చుట్టింది. అలానే పరిశుభ్ర భారత్‌ కోసం మోదీ తపిస్తున్న 'స్వచ్ఛభారత్‌'పై ఈ బడ్జెట్‌ ప్రధానంగా చూపు సారించింది. గ్రామీణ ప్రాంతాల్లోని 59కోట్ల ప్రజలకు సురక్షిత తాగునీటిని అందించడంతో పాటు వారిని బహిరంగ మల విసర్జన నుంచి దూరం చేసి వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మించేలా అవగాహన పెంపొందించటంపై మోదీ ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి నిలిపింది. ప్రతి గ్రామానికీ విద్యుత్తు, ప్రతి ఒక్కరికీ ఉపాధి, సొంతిల్లు నిర్మించేందుకు జాతీయ గ్రామీణాభివృద్ధి బ్యాంకు (నాబార్డు) ద్వారా 'గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నిధి'కి రూ.25,000కోట్లు కేటాయించడం మంచి నిర్ణయం.

అదే సమయంలో నాబార్డు ద్వారా భూమిలేని రైతులకు ముఖ్యంగా కౌలుదార్లకు పరపతి సాయం అందేలా చేస్తే దేశంలో కోట్లాది రైతులకు ప్రయోజనాలు అందుతాయి. ఉపాధి హామీని వదలబోమంటూనే మరిన్ని నిధులిచ్చి పనుల్లో నాణ్యత పెంచేలా చూస్తామన్న ప్రభుత్వం- పేదలకు దన్ను ఇచ్చి, గ్రామీణ నిరుద్యోగాన్ని నిర్మూలిస్తామని పేర్కొంది. అయితే దీన్ని వ్యవసాయంతో అనుసంధానించడాన్ని విస్మరించింది. దేశంలో చాలా ప్రాంతాల్లో కూలీలు దొరక్క, యాంత్రికీకరణ గ్రామస్థాయికి విస్తరించక సాగు ఖర్చులు పెంచు కుంటున్న రైతులకు ఇది అశనిపాతం. పంట ఆదాయ బీమా పథకాన్ని దేశంలో ఎంపికచేసిన జిల్లాల్లో అమలు చేయనున్నట్టు ప్రభుత్వం బడ్జెట్‌కు ముందే ప్రకటించింది. 20 రాష్ట్రాలు ఇప్పటికే సమ్మతి తెలియజేసిన ఈ పథకం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని ప్రభుత్వం చెబుతోంది. సరాసరి వచ్చే దిగుబడి ఆదాయానికి బీమా చేయించుకుంటే పంట నష్టం జరిగినప్పుడు వాస్తవ మొత్తం అందించే ఈ పథకం వల్ల రైతులకు మంచి ప్రయోజనం ఉంటుంది. పంట నష్టం లెక్కింపులో ఇప్పటివరకు అమలుచేసిన అర్థంలేని నిబంధనలను తొలగించకపోతే ఈ కొత్త పథకమూ కొరగాకుండా పోతుంది.

రైతు హితం మరిస్తే...!

దేశంలో నేటికీ ప్రత్యక్షంగా, పరోక్షంగా 58శాతం ప్రజలు వ్యవసాయ రంగంపై ఆధారపడి ఉన్నారు. స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో సుమారు 14శాతం వాటా కలిగిన వ్యవసాయ రంగానికి ఆ మేరకు సముచిత కేటాయింపులు అవసరం. నేటికీ 80శాతానికి పైగా గ్రామీణ భారతం వ్యవసాయం, అనుబంధ రంగాలపైనే ఆధారపడి ఉంది. ఈ రంగాలు ఇతోధికంగా వృద్ధి చెందగలిగితే దేశం పురోగతి సాధిస్తుంది. దేశ ఆర్థికవృద్ధికి చోదకశక్తులుగా పరిశ్రమలు, వ్యవసాయరంగాన్ని జోడుగుర్రాల్లా పరుగుపెట్టించాల్సిన ప్రభుత్వాలు సేద్యరంగం పట్ల మాత్రం దయ చూపటంలేదు. ధరల స్థిరీకరణ చర్యలు, 'కిసాన్‌ టీవీ' వంటి అంశాలనూ ఈ బడ్జెట్‌ మర్చిపోయింది. ఆహారశుద్ధి రంగంపై ప్రభుత్వం ఎక్కువ శ్రద్ధ పెట్టాల్సి ఉంది. ప్రత్యేక పన్ను రాయితీలను మరింతగా పెంచి ఉంటే యువ పారిశ్రామికవేత్తలు ఈ రంగంపై బాగా దృష్టి పెట్టడానికి అవకాశముంది. ఆహార సరఫరా, విలువ జోడింపులో పెట్టుబడులు పెరుగుతున్న కొద్దీ అవి రైతులకు స్థిరమైన ధరలు రావడానికి, ఎగుమతులు పెరగడానికి దారితీస్తాయి. ఈ విషయంలో స్పష్టమైన దృష్టి లోపించింది. ప్రత్యేక ఆర్థిక మండళ్లలాగా ప్రత్యేక వ్యవసాయ మండళ్లను ఏర్పాటుచేసి వ్యవసాయోత్పత్తుల ఉత్పత్తి, ఉత్పాదకత, ఎగుమతుల పెంపునకు ప్రత్యేక కార్యాచరణపై దృష్టి సారించి ఉంటే 'ప్రతి బొట్టుకూ మంచి పంట' దక్కడానికి ఆస్కారం ఉండేది. ఈ దిశగా కేంద్ర ప్రభుత్వం మునుముందైనా రైతుహితంపై చూపు కేంద్రీకరించాలి. మొత్తంగా గ్రామీణ భారత రూపురేఖలు మార్చడం, తయారీ, మౌలిక రంగాలపైనే సమగ్ర దృక్పథాన్ని ఆవిష్కరించిన మోదీ ప్రభుత్వం- సాగుదార్లను మెప్పించలేకపోయింది!

(రచయిత - అమిర్నేని హరికృష్ణ)
Posted on 03-03-2015