Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

నషాళానికెక్కిన ఉల్లిఘాటు

* చుక్కలనంటుతున్న ధర

దేశవ్యాప్తంగా ఉల్లి ధరలకు రెక్కలొచ్చాయి. గతంలో ఎన్నడూలేని రీతిలో వీటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. వినియోగదారులను వెతలకు గురి చేస్తున్నాయి. ప్రభుత్వాలకు చికాకు కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లాలో, కర్ణాటక, మహారాష్ట్రల్లో ఈ పంట అధికంగా పండుతుంది. కర్నూలు ఉల్లి కన్నా మహారాష్ట్ర ఉల్లి నాణ్యమైనది. కర్నూలు పంట ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. మహారాష్ట్రలో పండింది నాలుగైదు నెలల వరకు నిల్వ ఉంటుంది. అందుకే మహారాష్ట్ర పంటకు మంచి ధర లభిస్తుంది. ఆంధ్రప్రదేశ్‌లోని ఇతర ప్రాంతాలకు ఎక్కువగా కర్నూలుజిల్లా నుంచే ఉల్లి సరఫరా అవుతుంది. ఈ ఏడాది అధిక వర్షాల వల్ల పంట దెబ్బతింది. ఫలితంగా నిరుటితో పోలిస్తే దిగుబడి బాగా తగ్గింది. కర్నూలు నుంచి తాడేపల్లిగూడెం విపణికి నిరుడు 55,330 మెట్రిక్‌ టన్నుల పంట రాగా, ఈ ఏడాది నవంబరు వరకు 28,566 మెట్రిక్‌ టన్నులే వచ్చింది. ఏదైనా వస్తువు సరఫరా తగ్గితే, దాని ధర పెరగడం సహజం. ప్రస్తుతం ఉల్లి విషయంలో దేశవ్యాప్తంగా జరిగింది ఇదే. 1980, 1998, 2010లలో ఉత్పత్తి తగ్గి, ధరలు విపరీతంగా పెరిగాయి. ఉల్లికి ప్రత్యామ్నాయం వేరొకటి లేదు. దీని ధర పెరిగినా గిరాకీ పెద్దగా తగ్గదు. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఎంతో కొంత కొనాల్సిందే. పూర్తిగా మానేసే పరిస్థితి ఉండదు. దీన్ని అవకాశంగా తీసుకుని వ్యాపారులు ధర పెంచేస్తున్నారు.

ఏటా పంట చేతికందే ఒకటి రెండు నెలల ముందు ధరలు పెరగడం సహజం. ఈ ఏడాది ధరల పెరుగుదల మూడు నాలుగు నెలలు ముందుగానే ప్రారంభమైంది. ప్రభుత్వాలకు ముందుచూపు లేకపోవడమే ఇందుకు కారణమని చెప్పకతప్పదు. దేశంలో ఉల్లి దిగుమతి చేసుకోవడానికి ప్రైవేటు వ్యాపారులకు అనుమతి లేదు. కేంద్రమే విదేశాల నుంచి నేరుగా దిగుమతి చేసుకుంటుంది. ఈ పని ముందుగా చేయకుండా ప్రతిసారి సమస్య తలెత్తినప్పుడు హడావుడిగా స్పందించడం ఆనవాయితీగా మారింది. పంట చేతికి రానున్న దశలో దిగుమతి చేసుకోవాలని కేంద్రం నిర్ణయించింది. ఈ బాధ్యతను అనుభవంలేని ‘మెటల్స్‌ అండ్‌ మినరల్‌ ట్రేడింగ్‌ కార్పొరేషన్‌(ఎమ్‌ఎమ్‌టీసీ)’కి అప్పగించింది. వాస్తవానికి ఉల్లి దిగుమతి వల్ల ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువగా ఉంటుంది. దిగుమతి చేసుకునే ఉల్లి ఇక్కడికి వచ్చేసరికి దేశీయ పంట చేతికి వస్తుంది. దీంతో ధర పడిపోయి ఇక్కడి రైతులు నష్టాలపాలవుతారు. ఉల్లి కొరత ఏర్పడటం, ధరలు ఆకాశాన్నంటడంతో దిగుమతి చేసుకునేందుకు ప్రభుత్వం ఈజిప్టు, టర్కీ తదితర దేశాలను సంప్రతించింది. ఎమ్‌ఎమ్‌టీసీ ప్రభుత్వ నిబంధనలను పాటించి, దిగుమతి చేసుకోవాలి. ఆ మేరకు అంతర్జాతీయ టెండర్లు పిలవాలి. ఈ ప్రక్రియ పూర్తికావడానికి, దిగుమతి చేసుకునే ఉల్లి దేశంలోకి రావడానికి కనీసం అయిదారు వారాలైనా పడుతుంది. విదేశాల నుంచి ఓడరేవులకు, అక్కడి నుంచి వినియోగదారులకు చేరేసరికి సమయం పడుతుంది. ఓడరేవుల నుంచి వచ్చే ఉల్లిని వివిధ నగరాలకు తరలించి, అక్కడి గిడ్డంగుల్లో నిల్వచేయాలి. ఎమ్‌ఎమ్‌టీసీకి సొంత గిడ్డంగులు లేనందువల్ల అద్దె గిడ్డంగులను వెతుక్కోవాలి. ఆ తరవాత టోకు వ్యాపారులకు అమ్మడానికి నిబంధనల మేరకు టెండర్లు పిలవాలి. టోకు వ్యాపారులు చిలర్ల వ్యాపారులకు అమ్మాలి. వారు వినియోగదారులకు విక్రయించాలి. దిగుమతి చేసుకునే ఉల్లితో ఇంకో సమస్య ఉంది. డిసెంబరు నెలాఖరుకు భారత్‌లోనూ పంట అందుబాటులోకి వస్తుంది. అప్పుడు దిగుమతి చేసుకున్న ఉల్లిని ఎవరూ కొనరు. విదేశీ ఉల్లికన్నా దేశీయ ఉల్లి నాణ్యతే బాగా ఉండటం ఇందుకు కారణం. విదేశీ ఉల్లి గడ్డలు తెల్లగా, పెద్దవిగా ఉంటాయి. దేశీయ ఉల్లిపాయలు చిన్నవిగా, ఘాటుగా ఉంటాయి. ప్రతి వంటలోనూ ఉల్లి వాడే అలవాటు ఉండటంవల్ల వినియోగదారులు దేశీయ ఉల్లి వైపే మొగ్గుచూపుతారు.

ఉల్లిగడ్డల ఉత్పత్తిలో చైనా తరవాత భారత్‌ రెండోస్థానంలో ఉంది. దేశవ్యాప్తంగా ఏటా సుమారు 1.70 కోట్ల టన్నుల ఉల్లిగడ్డలు పండుతాయని అంచనా. దళారులు, అధికారులు కుమ్మక్కై అటు రైతులను, ఇటు వినియోగదారులను దోచేస్తున్నారు. భారత్‌లో టోకు వ్యాపారులు 500 క్వింటాళ్లు, చిల్లర వ్యాపారులు 100 క్వింటాళ్ల వరకే నిల్వ చేసుకునేందుకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఇతర దేశాల నుంచి అత్యవసరంగా దిగుమతులు చేసుకోవాలని నిర్ణయించింది. రాష్ట్ర ప్రభుత్వాలూ తమ వంతుగా రాయితీపై విక్రయించడం ప్రారంభించాయి. మరోపక్క రాష్ట్రాలు తాము వినియోగదారులకు ఇస్తున్న రాయితీలో కొంతభాగం కేంద్రం భరించాలని కోరుతున్నాయి. కొనే పరిస్థితి లేకుండా వినియోగదారులకు, దిగుబడులు తగ్గి రైతులకు ఉల్లి కన్నీరు పెట్టిస్తోంది. అదే సమయంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కొన్ని రాష్ట్రాల్లో మంచి ధర పలకడంతో రైతులు హర్షం ప్రకటిస్తున్నారు. వారి కళ్ళల్లో సంతోషం కనిపిస్తోంది.

గిట్టుబాటు ధర లేని కారణంగా కర్నూలు విపణిలో గత ఏడాది ఒక ఉల్లి రైతు పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. పశ్చిమ్‌ బంగలో ఉల్లిపాయలు చోరీకి గురయ్యాయి. మధ్యప్రదేశ్‌లో దాదాపు ఆరు క్వింటాళ్ల పంటను అపహరించుకుపోయారు. ధరలు పెరగడంవల్ల ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. గిట్టుబాటు ధర లభించకపోడంతో గతంలో పంటను నడిరోడ్డుపై పారేసిన ఉదంతాలెన్నో ఉన్నాయి. కేవలం ఉల్లి ధర పెరుగుదల కారణంగానే ప్రభుత్వాలు కుప్పకూలిన సందర్భాలు గతంలో ఉన్నాయి. పాలకులు ఇలాంటి అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోవాలి. కొరత ఏర్పడినప్పుడు హడావుడిగా రంగంలోకి దిగి తాత్కాలిక చర్యలు చేపట్టినంత మాత్రాన ప్రయోజనం ఉండదు. సమస్యను ముందుగానే గుర్తించి శాశ్వత నివారణ చర్యలు చేపట్టాలి. వినియోగదారులకు సరసమైన, రైతులకు గిట్టుబాటు ధరలను అందించే లక్ష్యంతో పని చేయాలి. అప్పుడే ఉభయులకూ మేలు జరుగుతుంది!

- డాక్టర్‌ కేతిరెడ్డి కరుణానిధి
(రచయిత- అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో వాణిజ్య విభాగ ఆచార్యులు)
Posted on 14-12-2019