Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

వంటకు విదేశీ నూనెల మంట

* వంటనూనెల దిగుమతుల వ్యయం రూ.75 వేల కోట్లు

* విదేశీ రైతుల చేతికి ధారగా దేశీయ నిధులు

* దేశంలో నూనెగింజల పంటల సాగు తగ్గుదల

విదేశాల్లో అక్కడి ప్రభుత్వాలు తీసుకుంటున్న చిన్నపాటి విధానపరమైన నిర్ణయాలు భారత ప్రజల ఇంటి వంటగదుల్లో మంటలు రాజేస్తున్నాయి. ఇండొనేసియా, మలేసియా దేశాల్లో జీవ ఇంధనం వినియోగాన్ని 10 శాతం అదనంగా పెంచాలన్న నిర్ణయం మనదేశ వంటనూనెల ధరలను భగ్గుమనిపించాయి. నాలుగు నెలల వ్యవధిలోనే అంతర్జాతీయ మార్కెట్‌లో పామాయిల్‌ ధర క్వింటాలుకు రూ.5,445 నుంచి రూ.6,914కు పెరిగింది. లీటరు పామాయిల్‌ ధర రూ.85కి ఎగబాకింది. పేదలు, సామాన్యులు ఎక్కువగా వాడుతున్న వంటనూనె ఇదే. వేరుసెనగ, సోయాచిక్కుడు, ఆవ, పొద్దుతిరుగుడు వంటి నూనెల ధరలకూ రెక్కలొచ్చాయి. పత్తి గింజల నూనె ధర సైతం మండుతోంది. నూనెగింజల పంట సాగు విషయంలో రైతులకు ప్రోత్సాహకాలు ఇవ్వడానికి నిధులు లేవంటున్న ప్రభుత్వాలు, మరోవైపు విదేశాల నుంచి నూనెల దిగుమతి కోసం ఏటా రూ.75 వేలకోట్లను ధారపోస్తున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రతి రైతు కుటుంబ బ్యాంకు ఖాతాలో ఆరు వేల రూపాయల చొప్పున వేయడానికి ఉద్దేశించిన ‘ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి’(పీఎం కిసాన్‌)కి కేంద్ర బడ్జెట్‌లో రూ.75 వేల కోట్లు కేటాయించారు. మరోవైపు విదేశాల నుంచి వంటనూనెల దిగుమతికి నిరుడు రూ.75 వేలకోట్లు చెల్లించారు. ఈ ఏడాది చెల్లింపులు ఇప్పటికే రూ.80 వేల కోట్లు దాటినా ఆశ్చర్యం లేదు. ఎక్కడో సుదూరాన ఉన్న దక్షిణ అమెరికా ఖండంలో ఉన్న అర్జెంటీనా, బ్రెజిల్‌ మొదలుకుని రొమేనియా, రష్యా, ఉక్రెయిన్‌, మలేసియా, ఇండొనేసియా, సౌదీ అరేబియాల నుంచి గత నవంబరులో మనదేశం 10.96 లక్షల టన్నుల వంటనూనెలను దిగుమతి చేసుకుంది. ఎడారి దేశమైన సౌదీ అరేబియా నుంచీ ఒక్క నెలలోనే 11 వేల టన్నుల సోయా నూనె తెప్పించారు.

స్వదేశీ నూనెలపై దుష్ప్రచారం
మూడు దశాబ్దాలుగా బహుళజాతి సంస్థలు చేస్తున్న ప్రచారం వల్ల వంటనూనెల వినియోగంలో మార్పులొస్తున్నాయి. ఒకప్పుడు వేరుసెనగ, కొబ్బరి, నువ్వులు, ఆవ నూనెలతో పాటు స్వచ్ఛమైన నెయ్యిని దేశంలో అధికంగా వాడేవారు. వాటివల్ల ఆరోగ్యానికి, గుండెకు చేటు అనే విస్తృత ప్రచారం వల్ల విదేశాల్లో అధికంగా పండే సోయాచిక్కుడు, ఆయిల్‌పాం, పొద్దుతిరుగుడు నూనెల వినియోగం దేశంలో పెరిగింది. ఉదాహరణకు గత నూనెల ఏడాది(2018 నవంబరు నుంచి 2019 అక్టోబరు) వరకూ 1.49 కోట్ల టన్నుల వంటనూనెలను దిగుమతి చేసుకున్నారు. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇది నాలుగు లక్షల టన్నులు అదనం. మొత్తంగా దిగుమతైన నూనెల్లో 98 శాతం(1.47 కోట్ల టన్నులు) పామాయిల్‌, పొద్దుతిరుగుడు, సోయా నూనెలే కావడం గమనార్హం. భారత ప్రజలు అనాదిగా వాడే సంప్రదాయ వంటనూనెల వాటా గణనీయంగా తగ్గిపోయింది. జన్యుమార్పిడితో దూది దిగుబడి పెంచేందుకు విదేశీ బహుళజాతి సంస్థ మన విపణిలోకి తెచ్చిన బీటీ పత్తి గింజల నుంచి వంటనూనె తయారీ ఏకంగా 12 లక్షల టన్నులకు చేరింది. ఇవే బీటీ పత్తి గింజలను కనీసం దూదిపంటగా సాగుచేయడానికి సైతం ఐరోపా సమాఖ్య (ఈయూ) దేశాలు అనుమతించడం లేదు. రెండు దశాబ్దాలుగా మనదేశంలో మాత్రం అవి భారీగా సాగవుతున్నాయి. అంతేకాదు, అదే పత్తి పంట నుంచి తీస్తున్న గింజలతో తయారైన నూనె మన ఆహారంలోకి వచ్చేస్తోంది. బీటీ పత్తి గింజల నూనె ప్లాంట్లు గుజరాత్‌లో అధికంగా ఉన్నాయి. వీటినే ఆధునాతన యంత్రాలతో తెలంగాణలో ఏర్పాటు చేయడానికి పత్తి మిల్లుల వ్యాపారులు ముందుకొచ్చారు. ఆహార శుద్ధి కింద పారిశ్రామిక రాయితీలు ఇవ్వాలని రాష్ట్రప్రభుత్వాన్ని కోరారు. వంటనూనెల కొరత తీవ్రంగా ఉండటంతో ఏదో ఒక నూనెతో ప్రజలూ సరిపెట్టుకొంటున్నారు. గతంలో పంటల సాగుకు బీటీ వంగ, ఆవ గింజల అమ్మకాలను అనుమతించేందుకు కేంద్రం ప్రయత్నిస్తే దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది. కానీ, బీటీ పత్తి నుంచి తయారుచేస్తున్న నూనె వినియోగం విస్తరిస్తుండటం వంట నూనెల కొరత తీవ్రతకు నిదర్శనం. రసాయనాలతో శుద్ధి చేసిన(రిఫైన్డ్‌) వంటనూనెలు గుండెకు మంచివనే ప్రచారం అధికంగా ఉంది. దీనివల్లనే నిరుడు 27.30 లక్షల టన్నుల రిఫైన్డ్‌ నూనెలను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నారు. వేరుసెనగ నూనెలో కొవ్వు ఎక్కువగా ఉందని, అది గుండెకు మంచిది కాదనే ప్రచారం వల్ల మనదేశంలో పండే నాణ్యమైన పల్లీలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నారు. దేశంలో గతేడాది కోటి ఎకరాల్లో వేరుసెనగ పంట సాగవగా 27.33 లక్షల టన్నుల పల్లీల దిగుబడి వచ్చింది. అందులో కేవలం 13.46 శాతమే(3.68 లక్షల టన్నుల పల్లీలే) నూనె తయారీకి గానుగాడినట్లు భారత నూనె మిల్లుల సంఘం తాజా నివేదికలో వెల్లడించింది. విదేశాలకు 3.15 లక్షల టన్నుల పల్లీలను ఎగుమతి చేశారు. నూనెగా పనికి రావన్న మన పల్లీలనే నాణ్యమైనవంటూ విదేశాలు ఎగబడి కొంటున్నాయి. దీనికి భిన్నంగా మనదేశంలో కోటీ రెండు లక్షల టన్నులు పండిన సోయాచిక్కుడు పంటలో 86.80 లక్షల టన్నులు వంటనూనె తయారీకి గానుగాడారు. ఇంత భారీగా సోయాపండినా ఎక్కడో సుదూరాన ఉన్న అర్జెంటీనా, బ్రెజిల్‌ నుంచి 31 లక్షల టన్నుల సోయా నూనెను దిగుమతి చేసుకున్నారు.

ప్రస్తుత రబీ సీజన్‌ గత అక్టోబరులో మొదలవగా డిసెంబరు ఆఖరునాటికి దేశవ్యాప్తంగా నూనెగింజల పంటల సాగు 1.85 కోట్ల ఎకరాలకు చేరింది. గతేడాది ఇదే కాలవ్యవధిలో ఇంతకన్నా మరో లక్షన్నర ఎకరాలు అదనంగా సాగయింది. ఇప్పటికే ఏపీ, తెలంగాణ సహా పలు రాష్ట్రాల్లో ఈ పంటల రబీ సాగు సమయం దాటిపోయింది. దేశంలో వంటనూనెల ఉత్పత్తి 2022 నాటికి రెట్టింపు చేయాలని 2018లో వ్యవసాయ శాఖ లక్ష్యాన్ని నిర్దేశించింది. కానీ, రెండో ఏడాదిలోనే పంటల సాగు విస్తీర్ణం తగ్గడం గమనార్హం. దేశంలో నూనెగింజల పంటల సాగు పెంపుపై సరైన వ్యూహం కొరవడింది. మొత్తం సాధారణ విస్తీర్ణం 2.60 కోట్ల హెక్టార్లుంటే ఇందులో 72 శాతం భూమి వర్షాధారమే. పైగా ప్రజల అవసరాలకు అనుగుణంగా ప్రాంతాలవారీగా పంటల సాగు లేకపోవడం అతి పెద్ద సమస్యగా మారింది. తెలంగాణలో ఏడు లక్షల ఎకరాల్లో ఆయిల్‌పాం తోటల పెంపకానికి అనుమతి అడిగితే రెండేళ్లుగా ఇవ్వడం లేదని రాష్ట్ర ఉద్యానశాఖ వాపోవడం విధారపరమైన లోపాలకు నిదర్శనం. గత పదేళ్ల వ్యవధిలో దేశంలో వంటనూనెల దిగుమతులు ఏకంగా 174 శాతం పెరగడం గమనార్హం. నూనెగింజల పంటల మిషన్‌ను జాతీయస్థాయిలో ప్రత్యేకంగా కేంద్రం అమలుచేస్తూ నిధులిస్తున్నా పెద్దగా ఫలితాలు రావడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఈ పంటలవైపు మళ్లించడంలో ఘోరంగా విఫలమవుతున్నాయి. ప్రస్తుతం దేశంలో పండే పంటల నుంచి ఏటా 73.10 లక్షల టన్నుల వంటనూనెలు ఉత్పత్తవుతున్నాయి. 2022-23 నాటికి ఇది 1.36 కోట్ల టన్నులకు పెంచాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం తలసరి వినియోగం 19 కిలోలుండగా, అప్పటికి 22 కిలోలకు చేరుతుందని అంచనా. ఈ డిమాండు తీరాలంటే దేశంలో నూనెగింజల పంటల దిగుబడి ప్రస్తుతం ఉన్న 3.10 కోట్ల టన్నులకు అదనంగా 50 శాతం పెరగాలి. అందుకోసం పంటల సాగు విస్తీర్ణం 3.10 కోట్ల హెక్టార్లకు చేరాలి.

రైతుకు ప్రోత్సాహం అవసరం
తొమ్మిది రకాల సాధారణ నూనెగింజల పంటల నుంచే దిగుబడి, ఉత్పత్తి పెంచడం కష్టమవుతుండటంతో, వరి తవుడు, కొబ్బరి, పత్తిగింజలు వంటివాటి నుంచీ నూనెల ఉత్పత్తిని 2022 నాటికి 52.20 లక్షల టన్నులకు పెంచాలని నిర్ణయించారు. ఈ లక్ష్యాలను చేరుకోగలిగితే ప్రస్తుతం 64 శాతమున్న దిగుమతులను 15 శాతానికి తగ్గించడం సాధ్యమవుతుంది. దానివల్ల దాదాపు రూ.50 వేలకోట్లు మిగులుతాయని అంచనా. పంటల సాగు విస్తీర్ణం పెంపుదలకు రైతులను ప్రోత్సహించాలి. మద్దతు ధరకు పంటల కొనుగోలుకు ‘బైబ్యాక్‌’ ఒప్పందాలను ప్రభుత్వం రాసి ఇస్తే వారిలో సాగుపై ఆసక్తి ఇనుమడిస్తుంది. వర్షాధార భూముల్లోనే వీటిని అధికంగా వేస్తున్నందువల్ల ప్రకతి వైపరీత్యాల సమయంలో ఈ పంటల రైతులు ఎక్కువగా నష్టపోతున్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు ఉచితంగా ఇచ్చి పరిశోధనా కేంద్రాలకు సాగుపై పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలి. దేశంలోనే అత్యంత నాణ్యమైన వేరుసెనగ పంటను తెలుగు రైతులు పండిస్తున్నందువల్ల ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి తలసరి వంటనూనెల వినియోగం 45 శాతం పెరుగుతుందని అంచనా. మరోవైపు దేశంలో పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చడానికి విదేశాల నుంచి ప్రస్తుతమున్న కోటిన్నర టన్నుల నూనెల దిగుమతి 2.50 కోట్ల టన్నులకు చేరుతుందన్న అంచనాలు ఉన్నాయి. ప్రజల కొనుగోలు శక్తి ఇనుమడిస్తుంటే వంటనూనెల డిమాండు పైకి ఎగబాకుతుంది. ఈ సానుకూలతలను ప్రభుత్వాలు అందిపుచ్చుకోవాలి. దేశంలో నూనెపంటల సాగును విరివిగా పెంచాలి. అధునాతన మిల్లులు ఏర్పాటుచేసి నేరుగా రైతుల నుంచి పంటలు కొనే ఏర్పాటుచేయాలి. రిఫైన్డ్‌ నూనెల దిగుమతులను పూర్తిగా నిషేధించాలి. నూనెగింజలు పండే భూముల్లో ఇతర పంటల సాగును నిలువరించాలి. ఈ తరహా చర్యలు తీసుకోకుండా, మాటలతో కాలం వెళ్లదీస్తే దేశ ప్రజల ఆర్థిక, ఆరోగ్య, ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది!

- మంగమూరి శ్రీనివాస్‌
Posted on 07-01-2020