Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

తీరు మారితే లాభాల పంట

* సేద్యానికి సాంకేతిక సొబగులు

సంప్రదాయ వ్యవసాయం దశాబ్దకాలం నుంచి కొత్తరూపు సంతరించుకుంటోంది. డిజిటల్‌ విప్లవం సేద్యరంగానికి కొత్త సొబగులు అద్దుతోంది. ఎకరా రెండెకరాలున్న రైతులకే కాదు- పదెకరాల జరీబు భూములున్న ఆసాములకూ సేద్యం భారంగా పరిణమిస్తున్న రోజులివి. మారుతున్న కాలానికి తగ్గట్లు పంటల సాగులో కొత్త పోకడలు అందిపుచ్చుకోలేకపోవడం ఇందుకు ఒక కారణం. సేద్యసంక్షోభానికి దారితీస్తున్న సమస్యలకు పరిష్కారాలు వెతకలేకపోవడం మరొకటి. ఫలితంగా వ్యవసాయం నుంచి వైదొలగుతున్నవారి సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. ఒకనాటి సంక్రాంతి వాతావరణం పల్లెల్లో నేడు కనిపించడం లేదు. అదే సమయంలో సరికొత్త తరం సేద్యరంగం వైపు అడుగులేస్తోంది. ఆధునిక పోకడలు అనుసరిస్తూ సంప్రదాయ సాగు రూపురేఖలను వీరు మార్చేస్తున్నారు. వాణిజ్య ప్రయోజనాలను జోడిస్తున్నారు. గ్రామీణ రైతుల కష్టాలకు తమవైన పరిష్కారాలు కొన్నింటిని సూచిస్తున్నారు.

అంకురిస్తున్న ఆశలు
ేద్యరంగాన్ని సంక్షోభం పట్టిపీడిస్తున్న తరుణంలో వ్యవసాయంలో నవకల్పనలు ఊపందుకుంటున్నాయి. సాంకేతిక పద్ధతులు అనుసరిస్తున్న నవతరం రైతులు విప్లవాత్మక ఫలితాలు అందుకుంటున్నారు. సంప్రదాయ సేద్యంలోనూ ప్రణాళిక, మార్కెట్‌ నైపుణ్యంతో మెరుగైన ఫలితాలు అందుకుంటున్నవారూ లేకపోలేదు. పాత విధానాలతో మొక్కుబడిగా సేద్యం సాగిస్తున్నవారు మాత్రం వ్యవసాయం అంటేనే విరక్తి పెంచుకుంటున్నారు. నాసిరకం ఉత్పాదకాలు, అందని పంటరుణాలు, పెరిగిన పెట్టుబడులు, మార్కెట్లలో దోపిడి వంటి కారణాల వల్ల సేద్యంలో వారికి గిట్టుబాటు గగనమవుతోంది. ఒకవైపు అంతరిక్షంలో అసాధ్యాలను సుసాధ్యం చేస్తున్న రోజుల్లో నేటికీ గ్రామాల్లో ఎడ్లబండ్ల సేద్యం సాగుతుండటం దేశ ఆర్థిక వ్యవస్థకు క్షేమకరం కాదు. గ్రామీణ, పట్టణ జనాభా మధ్య ఆదాయ అసమానతలు పెచ్చరిల్లుతున్నాయి. ప్రభుత్వాలు చేపడుతున్న తూతూమంత్రం చర్యలు వ్యవసాయ సమాజాన్ని సరైన దిశలో నడిపించలేకపోతున్నాయి. అంతరాలను తగ్గించలేకపోతున్నాయి. కానీ, సాంకేతిక విప్లవాలను సేద్యరంగమూ క్రమక్రమంగా స్వాగతిస్తోంది. నైపుణ్యాలను అందిపుచ్చుకొంటున్నవారు లాభపడుతున్నారు. సంప్రదాయ పద్ధతులు అనుసరిస్తున్న నిరక్షరాస్యులైన రైతులు స్థానిక విపణి చట్రంలో పడి నలిగిపోతున్నారు. లాభసాటి సేద్యానికి పంట ఎంపిక నుంచి మార్కెట్‌చేసే వరకు ఒక ప్రణాళిక అవసరం. ఎగుమతులపై దృష్టి నిలపడం, సాధ్యమైనంత వరకు సాగు సమయంలోనే పంట విక్రయానికి చొరవ చూపడం, సరికొత్త పంటల ఎంపిక, సేంద్రియ సాగు పద్ధతుల ఆచరణ.

ఉత్పత్తిని రెట్టింపు చేసే సాంకేతిక అద్భుతాల అనుసరణ... వంటి చర్యలు సేద్యాన్ని కొత్తపుంతలు తొక్కిస్తున్నాయి. సేద్యరంగంలో అనుభవంలేని విద్యావంతులు సైతం చొరవగా ఈ రంగంలోకి అడుగుపెడుతున్నారు. కార్పొరేట్‌ తరహా పద్ధతులతో ఎగుమతి ఆధారిత వ్యవసాయం చేస్తున్నారు. ఎక్కడో సుదూర ప్రాంతంలో ఇంటి వద్ద కూర్చొని చేనుకు నీరు పెట్టగలగడం, పంటకు ఆశించిన చీడపీడలను ఫొటో తీసి పంపితే పరిష్కారాలను ఫోన్‌లోనే చూసుకునే సౌలభ్యం ఏర్పడటం, ఆన్‌లైన్‌లోనే పంటలను విక్రయించుకునే వెసులుబాటు ఉండటం, మంచి ధర పలికే సమీప మార్కెట్ల వివరాలు లభిస్తుండటం... ఇలా సేద్యం సాంకేతికత వైపు సాగుతోంది. నేలకు తగ్గ పంటల ఎంపిక, మొక్కల సంరక్షణ, పంట ఎదుగుదలను డ్రోన్ల సాయంతో వీక్షించి పర్యవేక్షించడం, మొక్కల అణువణువునూ విశ్లేషించే సాంకేతిక అద్భుతాల సమాహారంగా అంకుర పరిశ్రమలు నేడు వ్యవసాయ గతిని మార్చేస్తున్నాయి. విత్తనం వేసింది మొదలు కోత కోసే వరకు ఆయా పంటల్లో దశలవారీగా సమాచార సేకరణ, విశ్లేషణలకు డ్రోన్లు వాడుతున్నారు. చీడపీడలను పక్కాగా గుర్తించి, పురుగుమందుల పిచికారీని డ్రోన్ల ద్వారానే చేపట్టే కృషిని పలు అంకుర సంస్థలతో పాటు ఇక్రిశాట్‌ కూడా చేపట్టింది. మరెన్నో అంకురాలు వాణిజ్య సరళిలో కార్పొరేట్‌సేద్యం చేస్తున్న కంపెనీలకు తోడ్పాటు అందిస్తున్నాయి. వాతావరణ మార్పులను విశ్లేషించి- ఏ పంటకు ఎలాంటి తెగుళ్లు రావచ్చో ముందే రైతులకు సూచనలు అందిస్తున్నాయి. ఉపగ్రహ సమాచారం ఆధారంగా ప్రతి మీటరు భూమిని స్పష్టంగా చూసే చిత్రాలతో నేలపై పంటల స్థితిగతుల్ని విశ్లేషించడం, వాతావరణ పరిస్థితుల ఆధారంగా పంట దిగుబడి అంచనాల సమాచారాన్ని సైతం చెప్పగలగడం మరో అద్భుతం. భారత్‌లోనూ కొన్ని పంటల బీమా సంస్థలు ఇలాంటి ఉపగ్రహ డేటా సాయంతోనే తాము బీమా చేసిన పొలాలను పర్యవేక్షిస్తుండటం గమనార్హం. భారత్‌లో ఐటీసీ కియోస్క్‌ల ద్వారా పంటల సమాచారం, వాతావరణ సూచనలు, ధరల వివరాలు అందిస్తోంది. దేశంలో నాలుగు వేల వరకు రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు నడుస్తున్నాయన్నది ఒక అంచనా. ఇవన్నీ కార్పొరేట్‌ సంస్థల ఛత్రం కింద తమ వాణిజ్య పరిధిని పెంచుకుంటున్నాయి. అనేక అంకుర సంస్థలు పలు రకాలుగా రైతులకు సాంకేతిక పరిజ్ఞాన బదిలీకి తోడ్పడుతున్నాయి. ఇలాంటి ఈ-విస్తరణ విధానాల వల్ల రైతులకు మున్ముందు మరెంతో మేలు జరుగుతుంది. ఈ సాంకేతిక పరిజ్ఞానంతోనే సహజ వనరులు, సాగుభూమి అందుబాటులో లేని దేశాలు సైతం సేద్యంలో విప్లవాత్మక మార్గాలను ఎంచుకున్నాయి. హైడ్రోపోనిక్స్‌, వర్టికల్‌ పంటల సాగుతో సాధారణ పద్ధతిలో పండించే ఉత్పత్తికి మూడు రెట్లు అధికంగా పండిస్తూ ఆహార కొరత డిమాండును తీర్చడమే కాకుండా- మిగులు ఆహారోత్పత్తులను ఎగుమతి చేస్తూ లాభపడుతున్నాయి. ఇజ్రాయెల్‌, జపాన్‌, చైనా, స్పెయిన్‌, స్వీడన్‌, అమెరికా వంటి దేశాలు అత్యాధునిక సాగు పద్ధతులు, వ్యూహాలను అనుసరిస్తూ కొన్ని రెట్ల అధిక దిగుబడుల్ని సొంతం చేసుకుంటున్నాయి. దేశంలో పుష్కలమైన సహజ వనరులు ఉన్నప్పటికీ, పంటల సాగులో అధికోత్పత్తులు సాధించడంలో మనం ఎందుకు వెనకంజలో ఉన్నామనే ప్రశ్నకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమాధానం చెప్పలేకపోతున్నాయి. కార్పొరేట్‌ సేద్యంలో సాధ్యమవుతున్నది చిన్న రైతుల విషయంలో ఎందుకు కుదరడం లేదన్నది చాలామందిలో మెదిలే సందేహం. సాంకేతిక పరిజ్ఞానం బదిలీకి అధిక మొత్తం పెట్టుబడులు అవసరం. అంతటి అధిక మొత్తాలను బడుగు రైతులు భరించే స్థితిలో లేకపోవడం వెనకబాటుకు కారణం కావచ్చు. కానీ, ఉత్పత్తిని పెంచుకునే పద్ధతులు, మార్కెట్‌ నైపుణ్యాల విషయంలో పాలకులు బడుగు రైతాంగానికి కనీస అవగాహన కల్పించలేకపోవడం శోచనీయం.

విపణి విధానాల్లో మార్పులు
తెలుగు రాష్ట్రాల్లో ఉత్పాదకత అధికంగా నమోదయ్యే కొన్ని పంట ప్రాంతాలున్నాయి. వాటిని గుర్తించి, క్లస్టర్లుగా విభజించి అక్కడి రైతుల్ని ప్రోత్సహించాలి. వినియోగదారులు, రైతుల్ని అనుసంధానించాలి. ముఖ్యంగా పట్టణ ప్రజలు చొరవ చూపి తమ అవసరాలకు తగ్గట్లు ఉత్పత్తి చేసేలా రైతులతో ఒప్పందాలు చేసుకోవాలి. రైతులు సైతం పట్టణాలు, నగరాల్లోని నివాస సముదాయాల సంఘాలను సంప్రతించి, వారి అవసరాలను అనుగుణంగా బియ్యం, కూరగాయలు, చిరుధాన్యాలు, పప్పులు, పండ్లు సరఫరా చేయగలిగితే- శ్రమఫలానికి గిట్టుబాటు దక్కకపోవడమన్న ప్రశ్నే తలెత్తదు. పంటల సాగుపై ఆధారపడిన రైతులు తప్ప, ఈ మార్గాన్ని ఎంచుకున్నవారంతా లాభపడుతున్నారు. అన్నదాతలు మేలుకోవాల్సిన తరుణమిది. ఉత్పత్తిదారుల్ని మార్కెట్లతో అనుసంధించేలా అంకుర సంస్థలు తోడ్పడాలి. ఇప్పటికే దేశంలో పలు అంకుర సంస్థలు తమ పరిధిలోని రైతుల్ని ఈ కోణంలో వాణిజ్యపరంగా సిద్ధం చేస్తున్నాయి. రైతుల ఆదాయం పెంపుదలకు వినూత్న ఆలోచనలను ప్రోత్సహించే దిశగా పరిశోధన సంస్థలూ తమవంతు కృషి చేస్తున్నాయి. జాతీయ వ్యవసాయ పరిశోధన, నిర్వహణ సంస్థ (నార్మ్‌) ‘అగ్రి ఉడాన్‌’ పేరిట సరికొత్త ఆలోచనలను ఆహ్వానిస్తోంది. రైతుల ఆదాయం దేశవ్యాప్తంగా ఇనుమడింపజేయడమే దీని ఉద్దేశం. అంకుర సంస్థలను ఏర్పాటు భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐకార్‌) సహకారంతో నార్మ్‌ నూతన ఆవిష్కరణలకు కార్యరూపం ఇచ్చేందుకు కృషి చేస్తోంది. అంకురాల ఏర్పాటుతో వ్యవసాయ వాణిజ్యవేత్తలు రైతుల ఉత్పత్తులను ప్రపంచ మార్కెట్లతో అనుసంధానించే వీలు కలుగుతుంది. పరోక్షంగా రైతులకు మంచి ధరలు దక్కే అవకాశముంది. గ్రామాల్లోని యువతకు శిక్షణ ఇచ్చి, వ్యవసాయ నిపుణులుగా తీర్చిదిద్దేలా ఐకార్‌ పలు కోర్సులనూ అందిస్తోంది. అంకుర సంస్థల ఉపాయాలు, వాటి తోడ్పాటు అందిపుచ్చుకొంటే అన్నదాతలు లాభపడతారు. ముఖ్యంగా శిక్షణ పొందిన యువత గ్రామాల్లో సేద్యం సహా మార్కెటింగ్‌లోనూ దిశానిర్దేశం చేయగలిగితే రైతుకు రెట్టింపు ఆదాయాలు అందుతాయి. రైతులు పండించే పంటలకు అక్కడే విలువ జోడింపు చేయగలిగితే- స్థిరమైన ధరలూ దక్కుతాయి. వరి ప్రధానంగా పండించే తెలుగు రాష్ట్రాల్లో రైస్‌ఫ్లేక్స్‌, ఉప్పుడు రవ్వ, బొంబాయి రవ్వ, బియ్యపు పిండి వంటి ఆహార పదార్థాలకు స్థానికంగానే మంచి గిరాకీ ఉంటుంది. మేలు రకాలను బ్రాండ్‌ పేరుతో సూపర్‌ మార్కెట్లకు తరలించే యోచనా చేయవచ్చు. ప్రభుత్వమే వీటిని చేపట్టగలిగితే తెలుగు రాష్ట్రాలకున్న రేషన్‌ డీలర్ల వ్యవస్థలను ‘రెడీమేడ్‌ మార్కెట్లు’గా తీర్చిదిద్దవచ్చు. ఇతర రకాల పంటల్లోనూ విలువ జోడించడం, సమీప పట్టణ ప్రాంతాల గృహ సముదాయాలకు విక్రయించుకునే నైపుణ్యం పెంచుకుంటే ఎక్కడికక్కడ సంపద సృష్టి సాకారమవుతుంది. ఈ విధానాలు గ్రామీణ పేదరికం తగ్గించడానికి తోడ్పడతాయి. సాంకేతిక మార్పులను అందిపుచ్చుకొనేలా రైతుల్లో మార్పు తీసుకురాగలిగితే ఒకప్పటి లాగా సంక్రాంతి రైతుల పండుగగా కొత్త వన్నెలీనుతుంది!

వ్యాపార దృక్పథంతో...
రైతులు తమ శ్రమకు బుద్ధిని జోడిస్తేనే మంచి ఫలితాలు దక్కుతాయి. స్థానిక అవసరాలకు తగినట్లు తమ ఉత్పత్తులకు వారు అదనపు విలువ జోడించగలగాలి. అలాంటి శాస్త్రీయ పరిజ్ఞానం పట్ల వారిలో అవగాహన పెంచగలవారే లేరు. ప్రభుత్వాలు ఈ బాధ్యత తీసుకోవాలి. రైతులు కూడా ముందుగా వినియోగదారుల అభిరుచుల్ని తెలుసుకోవాలి. సందర్భానికి తగ్గట్లు వినియోగదారులు ఇష్టపడే రూపంలో ఉత్పత్తులను అందజేయగలిగితే రెట్టింపు ధరలు అందుతాయి. 2022నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం సాకారం కావాలంటే ఈ తరహా ఎత్తుగడలే అనుసరణీయం. వ్యవసాయ వాణిజ్యాన్ని ఇతోధికంగా ప్రోత్సహించాలని, సంక్షేమ కార్యక్రమాల అమలు ఒక్కటే సరిపోదని కూడా కేంద్రం భావిస్తోంది. ఆ మేరకు తీసుకురాదగిన మార్పులపై యోచిస్తోంది. యువతకు శిక్షణతోపాటు వ్యవసాయ అంకుర సంస్థలను ఇతోధికంగా ప్రోత్సహిస్తోంది. అదే క్రమంలో ఈ-విస్తరణ సేవలను ప్రభుత్వాలు గ్రామస్థాయికి చేర్చగలిగితే అద్భుత ఫలితాలు అందివస్తాయి.

- అమిర్నేని హరికృష్ణ
Posted on 15-01-2020