Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

చిరు సేద్యం... ఘన ప్రత్యామ్నాయం

* రైతులకిదే తరుణోపాయం
దేశంలో హరిత విప్లవం చూశాం. కానీ, పోషకాహార భద్రత నేటికీ అందని ద్రాక్షే అవుతోంది. ఏటా 20కోట్ల భారతీయులు ఆకలి, అర్ధాకలి, పోషకాహార లేమితో బాధపడుతున్నారని ఇటీవల విడుదల చేసిన 'ప్రపంచ ఆకలి సూచీ' నిర్ధారించింది. సమతుల ఆహారం అందకపోవడంవల్ల 50శాతం మహిళలు, 75శాతం చిన్నారులు రక్తహీనతతో బాధపడుతున్నారని గణాంకాలు చాటుతున్నాయి. అన్ని రకాల పోషకాలు, ఖనిజ లవణాలు కలిగి ఉన్నప్పుడే దాన్ని పోషకాహారం అంటారు. బియ్యం, గోధుమలే ఆహార ధాన్యాలన్న ముద్ర దేశవాసుల్లో బలంగా నాటుకుంది. హరిత విప్లవంవల్ల ఈ రెండు పంటల దిగుబడులు ఇనుమడించిన మాట వాస్తవం. చిరు, తృణ ధాన్యాల ఆవశ్యకతను మాత్రం విస్మరించారు. వర్షాభావ పరిస్థితులపై ఎప్పటికప్పుడు వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నా, అధికంగా నీరు వినియోగించాల్సిన వరి పంటను పదేపదే వేస్తూ రైతులు నష్టపోతున్నారు. ఈ ఏడాదీ అదే పునరావృతమైంది. కనీసం ఇలాంటి సందర్భాల్లోనైనా రైతులు పంటల సరళి మార్చుకుని చిరు, తృణ ధాన్యాల సాగు వైపు దృష్టిసారించి ఉంటే ప్రస్తుత కరవు కష్టాల నుంచి కొంతవరకైనా బయటపడేవారు.

ఆదాయానికి భరోసా

సెప్టెంబరు రెండో తేదీవరకు దేశంలో సగటు వర్షపాతం 12శాతం తక్కువగా నమోదైంది. ఆంధ్రప్రదేశ్‌లో రెండు శాతం, తెలంగాణలో 29శాతం తక్కువగా వానలు పడ్డాయని వాతావరణ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. దేశవ్యాప్తంగా 42శాతం సాగువిస్తీర్ణంలో వానలు తక్కువగా కురిసినట్లు తేలింది. దేశం మొత్తంలో 54శాతం సాగు విస్తీర్ణానికి రుతుపవనాలే ఆధారం. అందులో 70శాతం వానలు నైరుతి రుతుపవనాల ద్వారానే కురవాలి. వరి పంట ఇప్పటికే దెబ్బతింది. మిగిలిన వర్షకాలంలో కురవబోయే వానలవల్ల చిరు, తృణ ధాన్యాల పంట సాగును చేపట్టడం రైతులకు ఎంతో శ్రేయస్కరం. భూస్వభావాన్నిబట్టి తక్కువ పెట్టుబడితో ఎలాంటి పంటలు వేసుకోవాలో నిపుణుల ద్వారా రైతులు తెలుసుకోవాలి. దీనివల్ల ఎంతో కొంత సాగు ఆదాయాన్ని వారు పొందగలుగుతారు. ధాన్యాలను స్థూలంగా రెండు రకాలుగా విభజిస్తారు. అవి మృదు, ముతక ధాన్యాలు. వరి, గోధుమలు మృదు ధాన్యాలు. ముతక ధాన్యాలను చిరు, తృణ ధాన్యాలుగా విభజించారు. జొన్న, మొక్కజొన్న, బార్లీ లాంటివి చిరుధాన్యాలు. సజ్జలు, రాగులు, వరిగలు, కొర్రలు, ఆరికలు, సామలు, వూదలను తృణ ధాన్యాలంటారు. మొత్తం పంటల సాగు విస్తీర్ణంలో ముతక ధాన్యాల సాగు వాటా 13.90శాతమే. అది సరాసరి 2.70కోట్ల హెక్టార్లు. అదే 4.41కోట్ల హెక్టార్లలో వరి, 3.05కోట్ల హెక్టార్లలో గోధుమ సాగవుతున్నాయి.

ఆహార, వ్యవసాయ సంస్థ 2013నాటి గణాంకాల ప్రకారం దేశంలో ముతక ధాన్యాల దిగుబడి హెక్టారుకు 1.7టన్నులు. ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్న ఒమన్‌ 12.7టన్నుల దిగుబడి సాధిస్తోంది. ముతక ధాన్యాల ప్రపంచ సగటు దిగుబడి 3.92టన్నులు. నీరు, విత్తనం, ఎరువుల వాడకం తక్కువ కావడంవల్ల మనదేశంలో ముతక ధాన్యాల దిగుబడి పడిపోతోంది. వరితో పోల్చినప్పుడు ముతక ధాన్యాలకు తక్కువ నీరు సరిపోతుంది. వరి పంటకు అవసరమైన నీటిలో సగానికన్నా తక్కువతో ముతక ధాన్యాలను విరివిగా పండించవచ్చు. మనదేశంలో ముతక ధాన్యాల పంటల సరళి పరిశీలిస్తే- విస్తీర్ణంలో రాజస్థాన్‌, ఉత్పత్తిలో కర్ణాటక, దిగుబడిలో పంజాబ్‌ ముందున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విస్తీర్ణంలో ఆరు, ఉత్పత్తిలో నాలుగు, దిగుబడిలో రెండో స్థానం సాధించింది. చక్కెర వ్యాధి నియంత్రణలో చిరు, తృణ ధాన్యాలు ఎంతగానో దోహదపడతాయి. ఈ ధాన్యాల్లో మెగ్నీషియం, పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటమే అందుకు కారణం. బియ్యం, గోధుమల్లో పిండి పదార్థాలు ఎక్కువ. దీనివల్ల అవి చక్కెర వ్యాధికి కారకాలుగా మారుతున్నాయి. మనిషి ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలుచేసే లక్షణం చిరు, తృణ ధాన్యాల సొంతం. అయినా ఆదరణ కొరవడటంతో వీటి సాగు పెరగడమే లేదు. సరైన మద్దతు ధర ఇవ్వగల మార్కెట్‌ వ్యవస్థ లేకపోవడం, ప్రభుత్వ ప్రోత్సాహం లభించకపోవడం దీనికి కారణాలు. ముతక ధాన్యాల ఆహారం రుచికరంగా చేయడం కొంత కష్టం. ఎక్కువ కాలం నిల్వ ఉండని గుణం వల్ల ఈ ధాన్యాలకు ఆదరణ పెరగడం లేదు. ఇటీవలి కాలంలో యువతతోపాటు నడివయసువారిలోనూ ఆరోగ్యంపట్ల స్పృహ పెరుగుతోంది. ఫలితంగా వారి ఆహారపు అలవాట్లలో మార్పులు వస్తున్నాయి. చిరు, తృణ ధాన్యాలను విడివిడిగా కాకుండా మిగతా ఆహార పదార్థాలతో కలిపి, విలువ జోడింపుతో ఆదరణ పెరిగేలా చర్యలు చేపట్టాలి. దీనికోసం వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించాలి.

చిరు ధాన్యాల సాగు నిలదొక్కుకుని, స్థిరంగా జరగడానికి నాలుగు అంశాల్లో మార్పులు రావాలి. అవి- తయారీ, పోషకాల వినియోగం, విపణి విధానం, సంస్థాగత ప్రణాళిక చర్యలు! ఉత్పత్తి, తయారీ విషయంలో కొత్త వంగడాలను రైతులకు అందుబాటులోకి తీసుకొని రావడం కీలకం. శాస్త్రీయ పద్ధతుల్లో వివిధ ముతక ధాన్యాల పంట యాజమాన్యం చేపట్టాలి. దిగుబడుల నిల్వ సామర్థ్యం పెరిగేలా చేయాలి. ముతక ధాన్యాల పిండిని ఇతర పదార్థాలతో మిళితం చేసి బలవర్థక ఆహారంగా వాడవచ్చు. యువత, నడివయసువారి అవసరాలకు అనుగుణంగా ఆయా పదార్థాలను వివిధ మిశ్రమాలుగా రూపొందించాలి. రాగి మాల్ట్‌, కార్న్‌ సూప్‌, జొన్న చపాతీ తదితరాలు ఇలాంటివే. పోషకాల వినియోగంలో భాగంగా జింక్‌, ఐరన్‌, కాల్షియం, ఫాస్ఫరస్‌, ఖనిజ లవణాలు ఎక్కువగా ముతక ధాన్యాల్లో ఉంటాయని వివరించాలి. పోషక విలువల పెంపుదలకోసం ముతక ధాన్యాలను పాలతోనూ మిళితం చేయవచ్చు. జాతీయ పాడి పరిశోధన సంస్థ తయారీ సజ్జల లస్సీ అందుకో ఉదాహరణ! ఉత్పత్తులు, ఉప ఉత్పత్తులను లాభదాయకంగా అమ్ముకోవడానికి సమర్థమంతమైన విపణి వ్యవస్థ, వాటి విధానాలను రూపొందించి రైతులను ప్రోత్సహించాలి. ముతక ధాన్యాల ఉత్పత్తులు, విలువ జోడింపు ఉత్పత్తుల మార్కెటింగ్‌లో ఉత్పత్తిదారుడు, వినియోగదారుల మధ్య సాధ్యమైనంతవరకు దళారులు ప్రవేశించకుండా చూడాలి. అంతిమంగా రైతుకు గిట్టుబాటు ధర దక్కితే మరెందరో ముతక ధాన్యాల సాగువైపు సహజంగానే మొగ్గుచూపిస్తారు.

మరిన్ని ప్రోత్సాహకాలతో మేలు

కనీస మద్దతు ధర విధానాన్ని ముతక ధాన్యాలకూ విస్తరించడంపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన సమయమిది. ప్రస్తుతం పది ముతక ధాన్యాల్లో జొన్న, మొక్కజొన్న, సజ్జ, రాగులకు మాత్రమే కనీస మద్దతు ధర ప్రకటిస్తున్నారు. మిగతావాటిని విస్మరిస్తున్నారు. ఈ ధాన్యాల్లోని పోషక విలువలపై విస్తృత ప్రచారం జరగాలి. సంప్రదాయ ఆహార పదార్థాల విశిష్టతను ప్రజలకు తెలియజెప్పాలి. ప్రభుత్వం అందజేసే ప్రోత్సాహక పథకాల గురించి రైతులకు సమాచారం అందజేయడమూ ఎంతో అవసరం. ఆ దిశగా ప్రభుత్వపరమైన చొరవ మొదలైంది. పోషకాహార భద్రత కోసం చిరు, తృణ ధాన్యాల సాగు పెంపుదలకోసం ప్రోత్సాహక పథకానికి కేంద్రప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఈ పంటలను సాగుచేయటానికి ముందుకు వచ్చే రైతులకు ప్రోత్సాహకాల రూపంలో ముడిసరకులు, రుణ సదుపాయాలను అందించాలి. ఈ ధాన్యాలను 'ప్రజా పంపిణీ వ్యవస్థ' సరకుల జాబితాలో చేరిస్తే ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు సైతం లబ్ధి చేకూరుతుంది. ఇకపై వీటిని ముతక ధాన్యాలు అని పిలవకుండా పోషక ధాన్యాలుగా వాడుకలోకి తెస్తే, వీటి నిజమైన ఆహారపు విలువ ప్రజలకు అవగతం అవుతుంది. పోషక ధాన్యాల ఆహారానికి ప్రజలు అలవాటు పడితే ప్రపంచ ఆకలి సూచీలో భారత్‌ స్థానం కచ్చితంగా మెరుగుపడుతుంది. దేశంలో పోషకాహార లేమి సమస్యకు కొంతమేర పరిష్కారం లభిస్తుంది. మహిళలు, చిన్నారుల్లో పోషకాహార సమస్యలు గణనీయంగా తగ్గుముఖం పడతాయి. అప్పుడు దేశ ప్రజలకు ఆహారంతోపాటు, పోషకాహార భద్రతా లభిస్తుంది!

- డాక్టర్ ఐ.వి.వై. రామారావు (ర‌చ‌యిత - వ్యవ‌సాయ ఆర్థిక శాస్త్రవేత్త)
Posted on 16-09-2015