Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

‘సేంద్రియ’మే శరణ్యం!

* తీరు మారాల్సిన సేద్యం

అత్యధిక జనాభా కలిగిన భారత్‌ వంటి దేశాలకు నాణ్యమైన, ఆరోగ్యకరమైన, సహేతుకమైన ధరకు ఆహార ఉత్పత్తులు అందించడం అతిపెద్ద సవాలు. విచ్చలవిడిగా రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకంవల్ల భవిష్యత్తు తరాలకు ముప్పు తప్పదన్న హెచ్చరికలనూ ఖాతరు చేయకుండా- అధిక ఉత్పత్తి, అత్యధిక లాభాలమీదే దృష్టిపెడుతూ మొండిగా ముందుకు వెళుతున్న తీరును మార్చుకోవాలన్న విజ్ఞప్తులను ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే చెవికెక్కించుకుంటుండటం శుభసూచకం. ఇటీవల కేంద్ర బడ్జెట్లో దేశంలో సుస్థిర వ్యవసాయభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. 2020-’21 మధ్యకాలంలో సేంద్రియ వ్యవసాయ భూమిని నాలుగు లక్షల హెక్టార్లకు విస్తరించాలని బడ్జెట్లో దిశానిర్దేశం చేశారు. అన్నదాతలకు సేంద్రియ వ్యవసాయంలో శిక్షణ ఇచ్చి వారిని చైతన్యపరచేందుకు ఉద్దేశించిన పరంపరాగత్‌ కృషి వికాస్‌ పథకానికి హరిత విప్లవ బడ్జెట్‌ కింద అయిదువందల కోట్ల రూపాయలను కేటాయించారు. సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండించే రైతులు తమ ఉత్పత్తులకు మెరుగైన ధరను పొందాలంటే ‘సేంద్రియ సర్టిఫికేషన్‌’ తప్పనిసరి. ఆ రకంగా ‘సేంద్రియ సర్టిఫికేషన్‌’ కింద ఉన్న భూమి పరిమాణాన్ని ఇటీవల అదనంగా విస్తరించిన 0.51 లక్షల హెక్టార్లకు ఈ డబ్బును ఉపయోగించాలన్నది ప్రభుత్వ నిర్దేశం. దీనివల్ల సేంద్రియ ఉత్పత్తులు పెరిగి, ప్రజలకు పెద్దయెత్తున అందుబాటులోకి వస్తాయి. దానితోపాటు సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతులూ ఊపందుకుంటాయి. అంతక్రితం ఏడాదితో పోలిస్తే 2018-’19లో సేంద్రియ ఉత్పత్తుల ఎగుమతులు రూ.5,151 కోట్లకు పెరిగినట్లు అంచనాలున్నాయి.

దేశం పురోభివృద్ధి సాధించాలంటే కీలకమైన కొన్ని రంగాలు గుణాత్మకంగా మెరుగుపడాలని ప్రధాని నరేంద్ర మోదీ ఏనాడో స్పష్టీకరించారు. దేశంలో సేంద్రియ సేద్యాన్ని కొత్త పుంతలు తొక్కించడం ఆయన స్వప్నాల్లో ఒకటి. 2030నాటికి సేంద్రియ సేద్యాన్ని గణనీయంగా మెరుగుపరచాలని ప్రధాని లక్ష్య నిర్దేశం చేశారు. నిరుడు ఆర్థిక మంత్రిగా పీయూష్‌ గోయల్‌ సమర్పించిన బడ్జెట్లోనూ సేంద్రియ వ్యవసాయానికి పెద్దపీట వేశారు. తాజాగా నిర్మలా సీతారామన్‌ సమర్పించిన బడ్జెట్‌ సైతం సేంద్రియ సేద్యానికి సంబంధించి అదే ఒరవడిని కొనసాగించడం విశేషం. భారత వ్యవసాయ శుద్ధి, ఎగుమతుల అభివృద్ధి మండలి (అపెడా) అంచనాల ప్రకారం 2025నాటికి సేంద్రియ ఎగుమతుల విలువను మూడు లక్షల 60వేల కోట్ల రూపాయలకు చేర్చాలని తలపోస్తోంది. అయితే ఈ స్థాయికి ఎగుమతులను చేర్చాలంటే ధ్రువీకృత సేంద్రియ విత్తనాలు చాలినన్ని ఉన్నాయా, సంప్రదాయ సేంద్రియ విత్తనాలపై ఆధారపడితే ఆశించిన స్థాయిలో గణనీయ ఉత్పత్తులు సాధ్యమవుతాయా అన్న అంశాలపై మేధామథనం అవసరం. మేలిమి సేంద్రియ విత్తనాలను భారతీయ రైతులకు అందుబాటులోకి తీసుకురాకపోతే- ఉత్పత్తుల్లో ఆశించిన ఎదుగుదల సాధ్యంకాదు.

అమెరికా, జర్మనీ వంటి దేశాల్లో సేంద్రియ విత్తన పరిశ్రమ శాఖోపశాఖలుగా విస్తరించింది. నిరంతర పరిశోధనలతో అక్కడి పరిశ్రమ అద్భుతంగా పురోగమిస్తోంది. భారత్‌లో సేంద్రియ విత్తన పరిశ్రమ ఇంకా ప్రాథమిక స్థాయిలోనే కొట్టుమిట్టాడుతోంది. రసాయనాలతో విత్తన శుద్ధి చేసిన విత్తనాలనే సేంద్రియ విత్తనాలుగా ఇప్పటికీ దేశంలో చాలామంది భ్రమపడుతుంటారు. ప్రకృతి ధర్మాలకు అనుగుణంగా, సహజ వనరులతో, సంప్రదాయ పద్ధతులను అనుసరించి ధ్రువీకృత సేంద్రియ నేలల్లో పండించిన వాటినే సేంద్రియ విత్తనాలుగా పరిగణించాలి. ఈ ప్రాతిపదికన అసలు సిసలైన సేంద్రియ విత్తనాల అందుబాటు భారత్‌లో కష్టంగానే ఉందని చెప్పాలి. ప్రస్తుతం అందుబాటులోని సాంకేతిక విజ్ఞానం ప్రకారం సేంద్రియ విత్తనాల్లో ఇతర సూక్ష్మ అవశేషాలు ఏవైనా ఉంటే వాటిని వెంటనే కనిపెట్టేందుకు వీలుంది. ఈ పరిజ్ఞానాన్ని మరింత విస్తరించాలి. ఎందుకంటే అమెరికా, ఐరోపా సమాఖ్య (ఈయూ) దేశాలకు చేసే సేంద్రియ ఎగుమతులకు సంబంధించి ఈ ప్రమాణాలు మరింత కీలకం కానున్నాయి. 2024నాటికి ప్రపంచ సేద్య విత్తన విపణి రూ.40 వేల కోట్లకు విస్తరించనున్నట్లు నివేదికలు అంచనా వేస్తున్నాయి. కాబట్టి భారత్‌ సైతం సేంద్రియ వ్యవసాయానికి మాత్రమే కాకుండా- సేంద్రియ విత్తనాలకూ కేంద్ర స్థానంగా మారాల్సిన అవసరం ఉరుముతోంది. సిక్కిం, ఉత్తరాఖండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఈశాన్య రాష్ట్రాలను సేంద్రియ విత్తన కీలక స్థావరాలుగా అభివృద్ధి చేయాల్సి ఉంది. జీవ వైవిధ్యానికి పెట్టని కోటగా ఉన్న భారత్‌లో సేంద్రియ విత్తనాలకు అపారమైన అవకాశాలున్నాయి. సేంద్రియ సేద్యంతో ముడివడిన వివిధ సంస్థలు; వ్యవసాయ విశ్వవిద్యాలయాలు ఈ క్రతువులో కీలక పాత్ర పోషించాలి. భారత్‌ను అతిపెద్ద సేంద్రియ ఎగుమతి దారుగా తీర్చిదిద్దాలన్న మోదీ ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే- సేంద్రియ వ్యవసాయ విస్తరణలో ఎదురవుతున్న అడ్డంకులన్నింటినీ తొలగించడం తప్పనిసరి. నిబద్ధంగా పనిచేస్తే సేంద్రియ విత్తనాల ఎగుమతులను పదిశాతం పెంచాలన్న ప్రభుత్వ లక్ష్యం నెరవేరడం అసాధ్యం కాదు. దానివల్ల భారతీయ రైతుల ఆదాయాలూ గణనీయంగా పెరుగుతాయి. అంతటా సేంద్రియ ఉత్పత్తులకు గిరాకీ పెరుగుతున్న తరుణమిది. రైతుల ఆదాయాలను ఇబ్బడిముబ్బడిగా పెంచేందుకు ఇంతకుమించిన మార్గం మరొకటి లేదు.

- ఇంద్ర శేఖర్‌ సింగ్‌
(రచయిత- ‘జాతీయ విత్తన సంఘం-విధాన రూపకల్పన’ డైరెక్టర్‌)
Posted on 19-02-2020