Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

అరకొర బీమా... ఇవ్వదు ధీమా!

* పంట నష్టం... రైతన్నకు పుట్టెడు కష్టం

అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాలతో పోలిస్తే- భారత వ్యవసాయ రంగం ఎదుర్కొంటున్న కష్టాలు చాలా ఎక్కువ. ప్రకృతి విపత్తులు అన్నదాతల ఆశలను ఆవిరి చేయడమే కాకుండా, దేశ ఆర్థిక వ్యవస్థనూ తలకిందులు చేస్తున్నాయి. దేశంలో 50 శాతానికిపైగా రైతులు అప్పుల్లో మునిగి ఉన్నట్లు జాతీయ నమూనా సర్వే అధ్యయనం స్పష్టం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో ఇది 93 శాతమని ‘సెస్‌’ అధ్యయనం గతంలోనే పేర్కొంది. ఈ క్రమంలో అయిదేళ్లలో రైతుల ఆదాయాలు రెట్టింపు చేస్తామన్న కేంద్ర ప్రభుత్వ లక్ష్యం సాకారం కావడం అసాధ్యంగానే కనిపిస్తోంది. పంట నష్టాల కారణంగా అప్పులు తీర్చలేని అన్నదాతలు చివరకు ఆత్మహత్యే శరణ్యమంటున్నారు. 1995-2015 మధ్య కాలంలో 3.10 లక్షల మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వ్యవసాయ సంక్షోభం పలు రాష్ట్రాల్లో రైతులు రోడ్డెక్కే పరిస్థితులు తీసుకొచ్చింది. రైతుల సమస్య పరిష్కారం కోసం ప్రతిసారీ పాలకులు వివిధ రకాల చర్యలు తీసుకుంటున్నామంటున్నా, అన్నదాతల జీవితాల్లో ఏ మాత్రం మెరుగుదల కనిపించడం లేదు. అనేక సమస్యలతో అల్లాడుతున్న రైతన్నల అగచాట్లను తీర్చే లక్ష్యంతో ప్రధాని మోదీ నాలుగేళ్ల క్రితం జనవరి 2016లో అంతకుముందున్న పంటల బీమా పథకాల స్థానంలో కొత్తగా ‘ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన’ను తీసుకొచ్చారు. గతంలో పాలకులు ప్రవేశపెట్టిన పలు బీమా పథకాలు రైతులకు మేలు చేయడంలో విఫలమైనందువల్ల దీన్ని ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏర్పడింది. గతంలో ఉన్న పంట బీమా పథకాల్లో రైతు చెల్లించాల్సిన ప్రీమియం అధికంగా ఉండి, నష్ట పరిహారం పరిమితంగా ఉండేది. ప్రీమియంలో ప్రభుత్వాల వాటా కూడా తక్కువే. కానీ, కొత్త పథకాన్ని పూర్తి భిన్నంగా ప్రవేశపెట్టారు. రైతులకు సత్వర పరిహారం అందించేందుకు, నష్టాన్ని అంచనా వేయడానికి ‘రిమోట్‌ సెన్సింగ్‌ స్మార్ట్‌ ఫోన్‌’, డ్రోన్‌ వంటి పరికరాలను ఉపయోగిస్తారు. రైతు కుటుంబాల ఆదాయాలు ఒడుదొడుకులకు లోనవకుండా, సేద్యాన్ని వీడి ఇతర ఉపాధి మార్గాలవైపు వెళ్లకుండా నివారించడానికి ఈ పథకం ఎంతో సహకరిస్తుంది.

నిర్వహణ అస్తవ్యస్తం
ఈ పథకంలో 2019 ఖరీఫ్‌ నాటికి రైతుల దరఖాస్తుల సంఖ్య భారీగా పెరిగింది. 2016-17లో 5.80 కోట్ల మంది రైతులు, 2017-18లో 5.25 కోట్ల మంది, 2018-19లో 5.64 కోట్ల మంది రైతులు ఈ పథకంలో సభ్యులుగా చేరారు. వసూలైన స్థూల ‘ప్రీమియం’ వరసగా ఈ మూడేళ్లలో రూ.22,008 కోట్లు, రూ.25,481 కోట్లు, రూ.29,035 కోట్లుగా ఉంది. దీన్ని బట్టి రైతుల సంఖ్య తగ్గినా ‘ప్రీమియం’ మాత్రం పెరుగుతోందని తెలుస్తోంది. ఇందులో రైతుల వాటా వరసగా రూ.4,227 కోట్లు, రూ.4,431 కోట్లు, రూ.4,889 కోట్లుగా ఉంది. 2019-20 ఖరీఫ్‌ సీజనులోనే సుమారు 3.70 కోట్ల మంది ఈ పథకంలో నమోదయ్యారని, వారిలో ఎక్కువమంది బ్యాంకు రుణగ్రహీతలు కాదని అంచనా. బీమా కంపెనీలు రైతులకు చెల్లించిన నష్టపరిహారాన్ని, అవి వసూలు చేసిన ప్రీమియంతో పోలిస్తే ఎంతో తేడా కనిపిస్తోంది. ఈ తేడాను బీమా కంపెనీలకు లభించిన లాభంగా చెప్పవచ్ఛు ఇది మొదటి ఏడాది రూ.5,391 కోట్లు; మిగిలిన రెండేళ్లు వరసగా రూ.3,776 కోట్లు, రూ.14,789 కోట్లుగా ఉంది. ఈ పథకం వల్ల బీమా కంపెనీలే ఎక్కువగా లాభపడినట్లు తెలుస్తోంది. ఫలితంగా, బీమా కంపెనీలకు లబ్ధి చేకూర్చేందుకే ఈ పథకం ప్రవేశపెట్టారని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఈ పథకం నిర్వహణ లోపభూయిష్ఠంగా మారింది. వ్యవసాయ మంత్రిత్వశాఖ పూర్తి స్థాయిలో దృష్టి సారించకపోవడంతో ఏటా వేల కోట్ల రూపాయల బీమా సొమ్మును కంపెనీలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేసే పరిస్థితి నెలకొంది. 2018 డిసెంబరులో ముగిసిన ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు అయిదు వేల కోట్ల రూపాయల బీమా నష్టపరిహారం చెల్లించకపోవడం చూస్తేనే- ఈ పథకం అమలు తీరు ఎలా ఉందో బోధపడుతుంది. ఆ ఏడాది ఖరీఫ్‌ సీజనులో ఈ పథకం కింద రైతులకు రూ.14,813 కోట్ల మేర నష్టపరిహారం చెల్లించాల్సి ఉండగా, 2019 జులై నాటికి రూ.9,799 కోట్లు మాత్రమే చెల్లించాయి. 45 జిల్లాల్లో రైతులకు బీమా సొమ్మును ఇప్పటికీ 50 శాతందాకా చెల్లించాల్సి ఉండటం గమనార్హం. పథకం నిబంధనల ప్రకారం ఖరీఫ్‌ లేదా రబీ సీజను ముగిసిన రెండు నెలల్లోగా రైతుల బకాయిలు చెల్లించాలి. 2018 ఖరీఫ్‌ సీజను ఆ ఏడు డిసెంబరుతో ముగిసింది. కానీ ఆ మరుసటి ఏడాది చివరికి కూడా బీమా కంపెనీల మధ్య సమన్వయం లేక రైతులకు చెల్లింపులు పూర్తిగా జరగలేదు. మరోవైపు, కొన్ని పంటల బీమా ప్రీమియం అధికంగా ఉన్నట్లు రైతులు వాపోతున్నారు. దీంతో ఈ ఏడాది అంటే 2020 ఖరీఫ్‌ సీజన్‌ నాటికి ఆయా పంటలను ఈ పథకం నుంచి తొలగించాలని నిర్ణయించిన కేంద్రం- రాష్ట్రాల అభిప్రాయాలు సేకరిస్తోంది. మరోవైపు, బీమా కంపెనీలకు స్వల్ప కాలవ్యవధిని నిర్ణయించడం వల్లా ఇబ్బందులు తలెత్తుతున్నట్లు తెలుస్తోంది. 2018-19లో మరాఠ్వాడా ప్రాంతంలో రైతులు ఆత్మహత్య చేసుకుంటే, బీమా కంపెనీలు ఈ పథకం ద్వారా రూ.1,237 కోట్ల లాభం పొందినట్లు ‘సహ’ చట్టం స్పష్టం చేస్తోంది. అంటే ఒక్కో ఆత్మహత్యకు సగటున కోటి రూపాయల దాకా బీమా కంపెనీలు లాభం పొందాయి. నష్ట పరిహారం లెక్కించే విషయంలో బీమా కంపెనీల్లో తగిన పరిజ్ఞానం కలిగిన నిపుణులు లేకపోవడం దారుణం.

ఈ పథకం కింద పంట నష్టం అంచనా వేయడంలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నట్లు కేంద్రం చెబుతోంది. ఫలితంగా సకాలంలో నష్ట పరిహారం చెల్లించలేని పరిస్థితి తలెత్తుతోందని చెబుతున్నారు. ఈ పథకం కింద పంటల దిగుబడిని ‘క్రాప్‌ కటింగ్‌’ ప్రయోగాల ద్వారా అంచనా వేస్తారు. ఈ తరహాలో దేశంలో లక్షల సంఖ్యలో ప్రయోగాలను తక్కువ సమయంలో చేయడం చాలాకష్టం. ఇందుకోసం ఉపయోగిస్తున్న సాఫ్ట్‌వేర్‌ యాప్‌ 15 శాతం సామర్థంతోనైనా పని చేయడం లేదని అధికారులు చెబుతున్నారు. పరిహారం చెల్లింపులో జరుగుతున్న ఆలస్యానికి రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యమే కారణమని కేంద్రం ఆరోపిస్తోంది. మరోవైపు బ్యాంకుల నుంచి రుణాలు పొందే సమయంలోనే, తమ వద్దనుంచి బీమా ప్రీమియం వసూలు చేస్తుండటంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ తదితర 10 రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది.

పరిహారం లెక్కించగలవారే లేరు!
ఫసల్‌ బీమా యోజనలో ఖరీఫ్‌ పంటకు బీమా చేసిన మొత్తంలో రెండు శాతాన్ని, రబీ పంటకు 1.5 శాతాన్ని, వాణిజ్య పంటలకు అయిదు శాతాన్ని వాయిదా ప్రీమియంగా నిర్ణయిస్తారు. వాస్తవ పంట దిగుబడికి, గడచిన ఏడేళ్ల పంట సగటు దిగుబడికి మధ్య తేడాను పంటనష్టంగా పరిగణిస్తారు. క్లెయిములను నిర్ణయించేటప్పుడు ఏడేళ్లలో ప్రకృతి విపత్తులు సంభవించిన రెండేళ్లను మినహాయించి పండిన సగటు పంటను, రైతు ఎంచుకున్న నష్టం పూర్తిస్థాయి (ఇండెమ్నిటీ లెవెల్‌) శాతంతో గుణిస్తారు. ఈ స్థాయి 70-90 శాతం మధ్య ఉంటుంది. తదనుగుణంగా వాయిదా ప్రీమియం కూడా మారుతుంది. ఉదాహరణకు రైతు బీమా చేసిన మొత్తం సగటు దిగుబడి 60 క్వింటాలు, వాస్తవ దిగుబడి 45 క్వింటాలు అనుకుందాం. రైతు బీమా రూ.60 వేలకు చేశారనుకుంటే, పంటనష్టం 25 శాతంగా ఉంటుంది. దీనికి లభించే నష్ట పరిహారం రూ.15 వేలు. ప్రకృతి విపత్తుల కారణంగా సంభవించిన నష్టాలన్నింటికీ ఈ పథకం కింద రైతుకు పరిహారం చెల్లిస్తారు. కేంద్ర హోంశాఖ పరిధిలోని విపత్తు నిధి కిందగానీ, జాతీయ విపత్తు నిధి నుంచిగానీ పంటనష్టంలో మూడోవంతును సత్వర ఉపశమనం కింద ఆర్థికసాయంగా అందిస్తారు.

ప్రైవేటు బీమా కంపెనీలన్నీ ఒకేమాటపై నిలిచి ప్రీమియం మొత్తాలను అధికస్థాయికి తీసుకెళ్లడం, ద్వారా అవి లబ్ధి పొందుతున్నాయని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. బీమా కంపెనీలు రైతులకు ఏటా చెల్లిస్తున్న నష్టపరిహార మొత్తంలో సుమారు 50 శాతం కేవలం దేశంలోని 40 జిల్లాల రైతులకే చెల్లిస్తుండటం గమనార్హం. ఈ జిల్లాలన్నీ ప్రకృతి విపత్తుల ధాటికి దెబ్బతింటున్నవే. అవి ముఖ్యంగా కరవు ప్రాంతాలే. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో సంభవించిన అకాల వర్షాల కారణంగా రైతులు వేసిన ఉల్లి, సోయాబీన్‌, దానిమ్మ వంటి పంటలు తీవ్రస్థాయిలో దెబ్బతిని చెల్లించాల్సిన నష్టపరిహారం పెరిగిపోవడంతో కొన్ని కంపెనీలు ఈ పథకం నుంచి తప్పుకోవడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అతివృష్టి, అనావృష్టి తరచూ సంభవిస్తున్న ప్రాంతాల్లో బీమా కంపెనీలకు ఈ పథకం లాభసాటికాదు. ఈ పథకం సత్ఫలితాలు ఇవ్వాలంటే రైతు చెల్లించాల్సిన బీమా ప్రీమియంలో మరికొంత భాగం ప్రభుత్వాలే భరించాలి. రైతులకు నకిలీ విత్తనాల వల్ల జరుగుతున్న నష్టాన్ని, అలాగే ఏనుగులు, అడవి పందులు, ఎలుగుబంట్లు వంటి జంతువులు పంటలకు చేస్తున్న నష్టాన్ని ఈ పథకంలో చేర్చకపోవడం విచారకరం. ప్రైవేటు బీమా కంపెనీల ఆగడాలను అరికట్టాలంటే ప్రీమియంపై గరిష్ఠ పరిమితిని విధించాలి. దీనివల్ల బీమా కంపెనీలు అంతకన్నా తక్కువ ధరను ‘కోట్‌’ చేస్తాయి. ప్రైవేటు కంపెనీలు ఇష్టం వచ్చిన రీతిలో ప్రీమియం నిర్ణయించడంతో అందరిపైనా భారం పడుతోంది. ప్రస్తుతం ప్రభుత్వాలు ప్రీమియం సొమ్మును ఆయా బీమా కంపెనీలకు చెల్లిస్తున్నాయి. దీని స్థానంలో ప్రభుత్వ బీమా కంపెనీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా నిధి ఏర్పాటు చేసి, దాని నుంచే ప్రీమియం చెల్లించే సాధ్యాసాధ్యాలను పరిశీలించాలి. దీనివల్ల ప్రైవేటు బీమా కంపెనీలకు అనుచిత లబ్ధి కలగకుండా, అన్నదాతలకు గరిష్ఠ ప్రయోజనం చేకూర్చే అవకాశాలు మెరుగుపడతాయి.

- ప్రొఫెసర్‌ పి.వెంకటేశ్వర్లు
(రచయిత, ఆంధ్ర విశ్వవిద్యాలయ వాణిజ్య విభాగ ఆచార్యులు)
Posted on 20-02-2020