Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

విపత్తుల్ని తట్టుకొనే విత్తులు!

* ఆపత్కాలంలో ఆత్మబంధువులు
ఉష్ణ, శీతల, సమశీతోష్ణ వాతావరణాలను సమానంగా కలిగి ఉన్న దేశం మనది. చక్కని వ్యవసాయానికి ఇవన్నీ సానుకూల పరిస్థితులు. వాతావరణం గాడి తప్పకుండా ఉంటే, దేశ వ్యవసాయ రంగం రైతు పాలిట పెన్నిధి అయ్యేది. దురదృష్టవశాత్తు ప్రపంచవ్యాప్తంగా చోటుచేసుకుంటున్న పర్యావరణ మార్పుల వల్ల స్థితిగతులు మారాయి. తరచూ అతివృష్టి లేదా అనావృష్టి ఏర్పడి దేశ వ్యవసాయ రంగాన్ని కుదిపేస్తున్నాయి. భవిష్యత్తులో ఉష్ణోగ్రతలు మరింత అధికంగా నమోదు కానున్నట్లు శాస్త్రజ్ఞులు హెచ్చరిస్తున్నారు. వర్షపాతంలో అనిశ్చితి చోటుచేసుకోనుంది. ఫలితంగా సాగునీటి కష్టాలు ప్రబలనున్నాయి. మరోవైపు హరిత విప్లవ ప్రభావం వల్ల రసాయన ఎరువుల వాడకం అధికమై, సాగుభూముల్లో ఆమ్ల, క్షారత్వాలు పెరిగిపోయాయి. భూములు చౌడుబారుతున్నాయి. ప్రధాన పంటలైన వరి, గోధుమల దిగుబడులను సగానికి కుదించే పరిణామాలివి. కాబట్టి, ప్రస్తుతం సాగు చేస్తున్న రకాలు భవిష్యత్తులో సేద్యానికి పనికిరావు. భవిష్యత్‌ దేశ ఆహార అవసరాల కోసం ప్రకృతి వైపరీత్యాలను తట్టుకోగల కొత్త వంగడాలను రూపొందించుకోవాల్సిన సమయమిది. అందుకోసం ఫిలిప్పీన్స్‌, చైనా వంటి దేశాల తరహాలో ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పరిశోధనలకు శ్రీకారం చుట్టాలి.

సమస్యల సుడి

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పరిస్థితులు భిన్నంగా లేవు. తెలంగాణలో కరవు ఛాయలు పడని సంవత్సరం లేనే లేదు. సరాసరి వార్షిక వర్షపాతం 906మిల్లీమీటర్లు. నైరుతి రుతుపవనాలవల్ల 715మి.మీ, ఈశాన్య రుతుపవనాలవల్ల 129మి.మీ మేర వానలు పడాలి. గడచిన నలభై ఏళ్లలో ఒక్క సంవత్సరమైనా సాధారణ వర్షపాతం నమోదైన దాఖలాలు లేవు. మహబూబ్‌నగర్‌, నల్గొండ జిల్లాల్లో లోటు వర్షపాతంవల్ల కరవు కోరలు చాచడం షరా మామూలైంది. నల్గొండ జిల్లాలో భూమి కింది పొరల్లోకి ఫ్లోరైడ్‌ను తీసుకువెళ్లగలిగే వర్షపాతం కొరవడి, సమస్య తీవ్రత ప్రజలను వేధిస్తోంది. ప్రపంచంలోని తీవ్ర వర్షాభావ ప్రాంతాల్లో మహబూబ్‌నగర్‌ ఒకటి. నీటి సంరక్షణ పద్ధతులు, కృత్రిమ నీటి చేర్పు పద్ధతులు ఎన్ని పాటించినా ఆ జిల్లాలో భూగర్భ జలమట్టాల్లో వృద్ధి నమోదు కావడం లేదు. నగర, పట్టణ ప్రాంతాలు అధికంగా ఉన్న మెదక్‌, రంగారెడ్డి జిల్లాల్లో నీటి ఎద్దడి సహజం. మిగిలిన జిల్లాల్లో ఏదో ఒకచోట సాగునీటికి నిత్యం కటకటే. మొత్తం తెలంగాణలో 85శాతానికి పైగా సాగుకు వర్షాలే ఆధారం. కృష్ణా, గోదావరి నదుల ద్వారా సమకూరుతున్న సాగునీటి సదుపాయం తక్కువే. వరి మినహా దాదాపు అన్ని పంటలూ వర్షాధారంగా సాగవుతున్నవే. పంటకాలంలో ఏదో ఒక సమయంలో నీటిఎద్దడివల్ల నాణ్యత, దిగుబడులు గణనీయంగా తగ్గిపోతున్నాయి. కుటుంబ అవసరాల కోసమో, వ్యవసాయ విధానాల మీద అవగాహన ఉండటంవల్లో అనేకమంది రైతులు సాగునీటి కొరతను సైతం లెక్కచేయకుండా వరి పంట సాగు వైపే మొగ్గుచూపుతున్నారు. వారు వేసే వరి రకాలకు నీటిఎద్దడిని తట్టుకునే సామర్థ్యం లేకపోవటంవల్ల కనీస సాగు ఖర్చులూ రైతుకు రావడం లేదు. వరంగల్‌, నల్గొండ, కరీంనగర్‌ జిల్లాల్లో పత్తి, మిరప, పొద్దుతిరుగుడు పంటలు వేస్తున్నారు. వీటికి పెట్టుబడులు అధికంగానే పెట్టాలి. ఒక్కసారి పంట బెట్టకు గురైతే, రైతు ఆర్థికంగా చితికిపోతున్నాడు. వరంగల్‌, కరీంనగర్‌, ఖమ్మం జిల్లాల్లో వరి పంటను అదేపనిగా సంవత్సరాల తరబడి సాగు చేయడం, రసాయన ఎరువులు విరివిగా వాడటంవల్ల కొన్ని భూములు ఆమ్లత్వాన్ని, మరికొన్ని భూములు క్షారత్వాన్ని సంతరించుకున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తాంధ్ర ప్రాంతంలో అతివృష్టి, ముంపు ప్రభావాలుంటే, తీవ్ర అనావృష్టివల్ల రాయలసీమలో పంట దిగుబడులు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. రాయలసీమలోని కర్నూలు, కడప, అనంతపురం జిల్లాలకూ వర్షాధార పంటలే దిక్కు. తీవ్ర వర్షాభావ సమస్యతో సతమతమవుతున్న జిల్లా అనంతపురం. ఏళ్ల తరబడి భూగర్భ జలాల వాడకంవల్ల ఆయా జిల్లాల్లో మట్టాలు పాతాళానికి పడిపోయాయి. ఖరీఫ్‌ కాలంలో మాత్రమే వేరుసెనగ, పొద్దుతిరుగుడు వంటి పంట వేసి వరుణుడి కరుణ కోసం ఎదురుచూడాల్సి వస్తోంది. పంటల బీమా సౌకర్యమూ అరకొరే. పొడవైన సముద్రతీరం కలిగి ఉండటం వల్ల కోస్తా ప్రాంతాల్లో పంటలు తరచూ ముంపుబారిన పడుతున్నాయి. రాష్ట్రంలో 44శాతం మేర సాగుభూములు ముంపు బెడదను ఎదుర్కొంటున్నాయి. మూడు నాలుగేళ్లకు ఒకసారి తీవ్రమైన తుపానులు, వరదలు సంభవిస్తున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ శతాబ్దంలో 60కిపైగా తుపానులు ఎదురయ్యాయి. సునామీ వచ్చినప్పుడు కోస్తాజిల్లాల్లో లక్షల ఎకరాల్లో పంటలు తుడిచిపెట్టుకుపోయాయి. ఎక్కువ నీటి అవసరంగల వరి వంటి పంట దిగుబడులు ఈ రకాల ప్రకృతి వైపరీత్యాలవల్ల చేతికి రాకుండా పోతున్నాయి. అసలే నీటిముంపు, వరదలు- దీనికి తోడు నల్లరేగడి, ఒండ్రు నేలలు కావడంతో నేలల్లో తేమ ఎక్కువ కాలం నిలిచి ఉండటంవల్ల క్షారత్వం ఏర్పడి పంటల దిగుబడిపై ప్రభావం చూపిస్తున్నాయి.

దేశ జనాభా 2050నాటికి 160కోట్లకు చేరనుంది. అప్పటికి ప్రజల అవసరాలకోసం 40.5కోట్ల టన్నుల మేర ఆహార ధాన్యాలు అవసరమవుతాయి. ప్రస్తుత ఉత్పత్తి 27.5కోట్ల టన్నులు మాత్రమే. ఒకవైపు సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. మరోవైపు ఉత్పాదకతా పెరగడం లేదు. ప్రస్తుత రకాల సాగుతో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోలేం. వాటిని అందుకోవడానికి దిగుబడులు పెంచగల అన్ని మార్గాలను వినియోగించుకోవాలి. ప్రకృతి వైపరీత్యాలను తట్టుకునే రకాల రూపకల్పనకు ఉపక్రమించాలి. ఇప్పటికే అధిక దిగుబడినిస్తున్న మేలైన రకాల్లో జీవ సాంకేతిక పద్ధతులు ఉపయోగించి, ప్రకృతి వైపరీత్యాలు తట్టుకునే జన్యువులను చొప్పించాలి. స్థానికంగా ఎదురవుతున్న సమస్యలను తట్టుకుని, దీటుగా దిగుబడి ఇవ్వగల రకాలను ఎక్కడికక్కడ ప్రాంతీయ పరిశోధనల ద్వారా అభివృద్ధి పరచాలి. తరచూ వరద ముంపు ఎదురయ్యే తీరప్రాంతాల్లో ప్రధానంగా సాగయ్యే వరిపంటను కాపాడుకోగల విధానాలను అన్వేషించాలి. అందుకు బయోటెక్నాలజీ సాయంతో అభివృద్ధి పరచిన రకాలను సాగుకోసం వాడుకోవచ్చు. దేశంలో విస్తృతంగా సాగయ్యే వరి రకం 'స్వర్ణ'లోకి నీటి ముంపు తట్టుకోగల జన్యువు ఎస్‌యూబీ-1ను చొప్పించి అభివృద్ధిపరచారు ఫిలిప్పీన్స్‌లోని అంతర్జాతీయ వరి పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు! ఈ రకం వరి 17 రోజులపాటు పూర్తిగా నీటిలో మునిగినా, తరవాత కోలుకుని అదేస్థాయి దిగుబడి ఇస్తుంది. అందుకే శ్రీలంక, భూటాన్‌, ఫిలిప్పీన్స్‌ దేశాలు ఈ రకాన్ని సాగుచేసి, దిగుబడి నష్టాలను గణనీయంగా తగ్గించుకోగలిగాయి. ఆంధ్రప్రదేశ్‌లోని ముంపు ప్రాంతాల్లో ఈ రకం వరి సాగును ప్రోత్సహిస్తే ఎంతో కొంత ఉపశమనం లభిస్తుంది. తెలంగాణలోని కరీంనగర్‌ జిల్లా రబీ కాలంలో అత్యల్ప ఉష్ణోగ్రతలవల్ల వరి పంటలో తాలు గింజలు ఎక్కువై దిగుబడి తగ్గిపోతోంది. అంతర్జాతీయ వరి పరిశోధన స్థానం రూపొందించిన చలిని తట్టుకునే రకాలను ఇక్కడ సాగుకు పరిశీలించాలి. నాగపూర్‌లోని కేంద్రీయ పత్తి పరిశోధన స్థానం బెట్టను తట్టుకునే పత్తి రకాలను అభివృద్ధిపరచింది. అయితే ప్రైవేటు విత్తన సంస్థల స్థాయిలో ప్రచారం లేకపోవడంవల్ల రైతుల అభిమానాన్ని ఈ రకాలు చూరగొనడం లేదు. ప్రపంచంలో బ్రెజిల్‌ తరవాత అత్యంత వైవిధ్యమైన వ్యవసాయ వాతావరణం కలిగిన దేశం భారత్‌. ప్రతి పంటలో అపారమైన జన్యువైవిధ్యం మనదేశం సొంతం. ప్రైవేటు విత్తన సంస్థలకు జన్యుభాండాగారంగా దేశం ప్రసిద్ధి పొందింది. బెట్ట, ముంపు, క్షారత్వం, ఆమ్లత్వం, పోషక లేమిని తట్టుకునే మేలైన పోషకాలు గల పంటలు దేశంలో కోకొల్లలు. కానీ, దేశంలోని పరిశోధన సంస్థలకు వీటి ప్రాముఖ్యం అర్థం కావడం లేదు. అధిక దిగుబడే లక్ష్యంగా సంస్థలు ముందుకెళ్తున్నాయి. చైనా లాంటి దేశాలు ప్రభుత్వ పరిశోధన సంస్థల ఫలితాలను రైతులకు చేరవేయడంలో ముందున్నాయి. వాస్తవానికి మనదేశంకన్నా అత్యంత దారుణమైన అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు చైనాలో ఉన్నాయి. జన్యువైవిధ్యం ఉన్న రకాలను సేకరించి జీవసాంకేతిక పద్ధతుల ద్వారా వాటిలో మేలైన జన్యువులు చొప్పించి ప్రపంచం అబ్బురపడే ఫలితాలను చైనా సాధిస్తోంది. ఉదాహరణకు, భారత్‌లో వరి పంట సరాసరి దిగుబడి హెక్టారుకు రెండు టన్నులు. చైనాలో అది 15 టన్నులు. అంటే, మనం ఏడున్నర హెక్టార్లలో పండిస్తున్న ధాన్యం చైనాలో ఒక్క హెక్టారులోనే రాబడుతున్నారన్నమాట!

రైతుకు కొత్త అండ

రెండో హరిత విప్లవాన్ని అత్యంత త్వరగా సాధించాలని కేంద్రప్రభుత్వం ఉవ్విళ్లూరుతోంది. కానీ, మొదటి హరిత విప్లవం ఫలితాలే అందని రాష్ట్రాలు దేశంలో 70శాతం పైనే ఉన్నాయి. ఫలితాలు పొందిన పంజాబ్‌, హరియాణా, ఉత్తర్‌ ప్రదేశ్‌ రాష్ట్రాలు భూమి ఉత్పాదకత, దిగుబడి లేమి సమస్యలు ఎదుర్కొంటున్నాయి. దేశ అవసరాల్లో 60శాతం పైగా నూనెగింజలను భారత్‌ దిగుమతి చేసుకుంటోంది. దీని విలువ వెయ్యి కోట్ల డాలర్ల పైమాటే. ముడిఇంధనం, బంగారం తరవాత అత్యధిక దిగుమతి సుంకం ఈ దిగుమతులకే చెల్లిస్తున్నాం. 70వ జాతీయ నమూనా సర్వే చెప్పిన చేదునిజాలు ఇలాంటివి మరెన్నో ఉన్నాయి. ఉపాధి హామీ పనులు సహా మొత్తం రైతు కుటుంబం వివిధ రూపాల్లో పడుతున్న శ్రమకు నెలకు దక్కుతున్న సరాసరి మొత్తం రూ.6,426 మాత్రమే. దక్కని మద్దతు ధరలు, అందని నిపుణుల సూచనలు, పెరిగిపోతున్న పెట్టుబడి ఖర్చులతో రైతు కాడి మేడి వదిలేస్తున్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే- భారత వ్యవసాయం సంక్షోభం అంచులో ఉంది. ప్రభుత్వ విధానాలతోపాటు, బలమైన విత్తన రంగంతోనే ఈ దుస్థితి నుంచి బయటపడవచ్చు. తద్వారా దేశ రైతాంగాన్ని దీటుగా ఆదుకోవచ్చు!

రబీకి ముందస్తు వ్యూహం

ఖరీఫ్‌ పంటకాలంలో వర్షాభావం కారణంగా దారుణంగా దెబ్బతిన్న తెలుగు రైతును ప్రస్తుత రబీలోనైనా ఆదుకోవాలంటే ప్రభుత్వాలు నిర్దిష్ట చర్యలతో ముందుకు రావాల్సి ఉంటుంది. ముఖ్యంగా, రైతుకు సరైన మార్గనిర్దేశం అత్యవసరం. భూగర్భ జలాలపై ఆధారపడే పరిస్థితి లేదు. అందువల్ల దీర్ఘకాలిక వరి రకాల జోలికి వెళ్లరాదు. బావులు, చెరువుల కింద పూర్తిస్థాయి సాగునీటి సదుపాయంపై నమ్మకం ఉంటే- స్వల్ప, మధ్యకాలిక రకాలనే ఎంచుకోవాలి. వరికి ప్రత్యామ్నాయంగా ఆరుతడి పంటల సాగు అన్ని విధాలా మేలు. నేలరకాల్ని బట్టి సెనగ, కంది, మినుములు, పెసర్ల వంటివి ఎంచుకోవచ్చు. మహబూబ్‌నగర్‌, అనంతపురం జిల్లాల్లో కేవలం సాగునీటి ఆధారంగానే వేరుసెనగ సాగు చేసుకోవచ్చు. వరి మాగాణుల్లో అపరాలతోపాటు వీలున్నచోట్ల కూరగాయల సాగు లాభదాయకం. రైతు రబీలోనూ కుదేలు కారాదంటే, ప్రభుత్వం నాణ్యమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచడంతో పాటు, అవసరమైన మేర బ్యాంకు రుణాలు లభించేలా చూడటం కీలకం!

- డాక్టర్ పిడిగెం సైద‌య్య
(ర‌చ‌యిత, శాస్త్రవేత్త - ఉద్యాన విశ్వవిద్యాల‌యం)
Posted on 16-10-2015