Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

రబీ రైతుకు కరోనా సవాళ్లు

* ఫలం చేతికందే దశలో పాట్లు

తెలుగు రాష్ట్రాల్లో రబీ సీజన్‌ చివరి దశలో ఉన్నాం. ఊహించని రీతిలో ప్రపంచాన్ని చుట్టుముట్టేసిన కరోనా కారణంగా మూడు వారాలుగా ఎటూ కదల్లేని స్థితి. ఓ వైపు బతుకుపోరాటం సాగుతుంటే, మరోవైపు జీవనాధారమైన సేద్యం సాగే మార్గం లేక అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. అకాల వర్షాలు, వడగండ్ల ధాటికి వేల ఎకరాల్లో అన్నదాతలకు అపార నష్టం వాటిల్లింది. ప్రభుత్వాలు కొంతవరకు తోడ్పడుతున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు సంక్లిష్టంగా ఉన్నాయి. కూలీలు దొరక్క, కోత యంత్రాలు లేక, రవాణా భారమై ఏం చేయాలో పాలుపోని స్థితిలో రైతులోకం తల్లడిల్లుతోంది. పంటలు చేతికందే దశలో పడరాని పాట్లు పడుతోంది. కరోనా మహమ్మారి కోట్లాది మంది ఉపాధి పాలిట శాపమైంది. రబీ పంటల కోత, నూర్పిడి, అమ్మకాలు జోరుగా సాగాల్సిన పరిస్థితుల్లో లాక్‌డౌన్‌వల్ల రైతులు బిక్కచచ్చిపోయే పరిస్థితి తలెత్తింది.

అన్ని పంటలమీదా ప్రభావం
ప్రధానంగా వరి, మొక్కజొన్న, మినుము, పెసర, శెనగ కోత, నూర్పిడి దశలో ఉన్నాయి. మామిడి, బత్తాయి, నిమ్మ, అరటి, ద్రాక్ష, పుచ్చ, కూరగాయ పంటలు విపణికి వచ్చే కాలమిది. గ్రామాల్లో కూలీల్ని వెతుక్కుని కోతలు, నూర్పిళ్లు చేయడానికి రైతులు ఆపసోపాలు పడుతున్నారు. పరిస్థితులు సాధారణంగా ఉన్నప్పుడు బిహార్‌ వంటి ఇతర రాష్ట్రాలకు చెందిన కూలీలు అందుబాటులో ఉండేవారు. ప్రస్తుతం వారు సొంతూళ్లలోనే ఉండిపోవడం, సీజన్‌కు ముందే వచ్చే అలవాటు ఉండటంతో లాక్‌డౌన్‌ విధించడం రైతులకు శాపమైంది. గ్రామాల్లో స్థానికంగా ఉండే కూలీలు కొన్ని పంటలకోత, నూర్పిళ్లకు సరిపోరు. పైగా కూలీలు ఉపాధి హామీ పనులకు పోతున్నారు. ఆ పథకం కింద కూలీకి రూ.240 ఇస్తున్నారు. రైతులు చెల్లించే కూలీ రూ.150 కావడంతో కూలీలు ముందుకు రావడం లేదు. ఇలాంటి సమయంలోనైనా ఉపాధి హామీ కూలీలను వ్యవసాయ పనులతో అనుసంధానించేలా పాలకులు నిర్ణయిస్తే బాగుంటుంది. కోతల సమయానికి పొరుగు రాష్ట్రాల నుంచి రావాల్సిన యంత్రాలు లాక్‌డౌన్‌ వల్ల రాలేని స్థితి వల్ల రైతులకు దిక్కుతోచడం లేదు. వీటికితోడు ధాన్యం ఇతర పంటల కొనుగోళ్లకు ప్రభుత్వమే ఏర్పాట్లు చేయడంలో కొన్ని లోపాల కారణంగా అన్నదాతలకు సమస్యలు తప్పడం లేదు. మార్కెట్లు తెరవక, ధాన్యం పట్టేందుకు గోనె సంచులు, ఆరబోతకు టార్పాలిన్‌ పట్టలు అందుబాటులో లేకపోవడంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీనివల్ల ప్రభుత్వం నిర్దేశించిన తేమ శాతానికి తగ్గట్లు పంటను తీసుకురావడం రైతుకు కష్టమవుతోంది. యంత్రాంగం ధాన్యం సేకరించాక ఆ ధాన్యాన్ని లారీలకు ఎక్కించే వరకు రైతులదే బాధ్యత. తగిన వాహనాలు లేని కారణంగా ధాన్యం అమ్మినవాళ్లు కూడా అమ్మకం కేంద్రాల్లోనే వేచిఉండాల్సి వస్తోంది. ఇది జాప్యానికి దారితీస్తుండటం, ఈ సమయంలోనే అక్కడక్కడా వడగళ్ల వానలు పడుతుండటంతో రైతులకు తీవ్ర నష్టం కలుగుతోంది. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లకు పటిష్ఠ ప్రణాళికను సిద్ధం చేసినప్పటికీ, రైతుల ఆవేదనను దృష్టిలో ఉంచుకుని తగిన ఏర్పాట్లు చేయడం యంత్రాంగం బాధ్యతగా తీసుకోవాలి.

రైతులు పంట నిల్వ చేసుకునేందుకు తగినన్ని గోదాములు లేవు. శుభకార్యాలు సైతం ఆగిపోవడంతో మల్లె, బంతి తదితర పూలను సాగుచేసిన రైతులకు కొనేవారు లేక కోట్లలో నష్టం వాటిల్లింది. కొన్ని గ్రామాల్లో కూరగాయలను కోసే కూలీలు, రవాణా వసతి లేక తోటల్లోనే పారబోస్తోంటే మరికొన్ని చోట్ల ప్రజలు వాటిని అధిక ధరలు పెట్టి కొనాల్సి వస్తోంది. ప్రభుత్వం వీటిని సమన్వయం చేస్తే ప్రజలందరికీ లాక్‌డౌన్‌ కాలంలో ఇబ్బందులు ఉండవు. కొన్నిచోట్ల మార్కెటింగ్‌ శాఖ అధికారులు రైతుల నుంచి నేరుగా పంటను సేకరించి పట్టణాలు, గ్రామాలకు రవాణా చేసి మహిళా సంఘాల ద్వారా ఇళ్ల వద్దనే ప్రజలకు విక్రయిస్తున్నారు. అలాంటిచోట్ల రైతులకు మంచి ధరలూ దక్కుతున్నాయి. ఈ తరహా సమన్వయం తెలుగు రాష్ట్రాల్లో సంపూర్ణంగా అమలైతే లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ రైతులకు ఇబ్బందులు తలెత్తవు.

జాగ్రత్తలు పాటిస్తూ...
భౌతిక దూరం పాటించడం వంటి ప్రభుత్వ సూచనలను దృష్టిలో ఉంచుకుని పంట కోత, నూర్పిడి, క్రయవిక్రయాల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. రైతులు, కూలీలు వీటిని ఆచరించేలా చూడాలి. గత పక్షం రోజుల్లో మిర్చి మార్కెట్లలో చాలాచోట్ల ఈ జాగ్రత్తల్ని గాలికొదిలేశారు. తెలుగు రాష్ట్రాల్లో వడగండ్ల వానలతో ధాన్యం తడిసిపోవడం, కాయలు రాలి పైరు వాలిపోయి అరటి, మామిడి, మొక్కజొన్న రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. సింహభాగం రైతులు పంటల బీమా చేయించని నేపథ్యంలో వారిని ఆదుకునేందుకు పాలకులు ఈ కష్టకాలంలో చొరవ చూపాలి. కరోనా, అకాల వర్షాలతో పంటల్ని కోల్పోయిన, నష్టపోయిన రైతులకు పరిస్థితులు కుదురుకున్నాక ఖరీఫ్‌ సాయాన్ని సత్వరమే అందించాలి. ప్రస్తుతం పలు రకాల పండ్లు మార్కెట్లకు రానున్న తరుణంలో అధికారులు ఆయా మార్కెట్లను తెరిస్తే వ్యాపారులు ముందుకు వచ్చి కొనుగోళ్లు చేపడతారని రైతులంటున్నారు. ముఖ్యంగా పొరుగు రాష్ట్రాలకు విక్రయించే మామిడి వంటి పండ్ల విషయంలో అధికారులు చొరవ చూపాలి. మినహాయింపు కార్యకలాపాలకు సంబంధించి ఆయా సంస్ధల సిబ్బంది యంత్రాలు, పనిముట్లు, రవాణా వాహనాలకు సత్వరమే అనుమతులిస్తే సాగు పనులకు ఇబ్బందులు లేకుండా చూడవచ్చు. ఈ నెలతో సాగు పనులు పూర్తవుతాయి కాబట్టి జూన్‌లో వచ్చే ఖరీఫ్‌ కోసం మే తొలివారం నుంచి భూసార పరీక్షలు, విత్తన సేకరణ, సరఫరా, నేల తయారీ ఏర్పాట్లు కీలకమైనవి. యంత్రాంగం వీటికి సన్నద్ధం కావడం అత్యంత అవసరం. లాక్‌డౌన్‌ సవాళ్లను ఎదుర్కోవడంతో పాటు వ్యవసాయ పనులకు ఆటంకాలు లేకుండా చూడటం, క్షేత్రస్థాయిలో రైతులు వాస్తవ సమస్యలను అర్థం చేసుకుని అందుకుతగ్గ ఏర్పాట్లు చేయడం, మద్దతు ధరలు అందేలా చూడటం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బాధ్యత.

తోటల్లోనే మగ్గుతున్న పండ్లు
ప్రజా రవాణా స్తంభించడంతో అరటి, ద్రాక్ష, బొప్పాయి, పుచ్చ, నిమ్మ, బత్తాయి వంటి పండ్ల తోటల రైతులకు అపార నష్టం కలుగుతోంది. జనవరిలో కిలో నిమ్మ ధర రూ.30 ఉంది. సాధారణంగా ఈ సమయంలో కిలోకు రూ.50 పలకాల్సిన నిమ్మకాయలకు రూ.10 కూడా దక్కడం లేదు. బహిరంగ విపణిలో మాత్రం మూడు నిమ్మకాయలు రూ.10కి విక్రయిస్తున్నారు. కూలీలు దొరక్క పుచ్చ, అరటి వంటి ఉద్యాన పంటలు చెట్లకే మాగిపోతున్నాయి. సాధారణ రోజుల్లో రైతులనుంచి ఒక్కో అరటి గెల రూ.250కి పైనే కొనేవారు. నేడు పంట కొనేవారూ లేక రైతులు కొందరు గ్రామాల్లో తిరుగుతూ ఒక్కో అరటి గెలను రూ.50కి అమ్ముతుంటే మార్కెట్లో డజను అరటి రూ.50 పలుకుతోంది. ఇదే తరుణంలో పెద్దయెత్తున విపణులకు చేరాల్సిన మామిడి కాయలను తెంపడం, మార్కెట్లకు తరలించడం ఇబ్బందిగా మారింది. కోత దశ నుంచి కాయల నాణ్యత, తరలింపు ప్రక్రియ వరకు కూలీల అవసరం ఎంతో అధికం. లారీలు కూడా అద్దెకు రావడం లేదు. విదేశాలకు ఉత్పత్తులు తరలించే దారులు మూసుకుపోయాయి. సరకు రవాణాకు, ఎగుమతులకు ఇబ్బందులు లేకుండా చూస్తామంటున్న పాలకుల ప్రకటనలు నీటి మీద రాతలవుతున్నాయి. తెలంగాణలో కూపన్లు పొందిన రైతులు వారికిచ్చిన సమయం ప్రకారం కొనుగోలు కేంద్రానికి రావాలని చెబుతున్నారు. అందుకుతగ్గ రవాణా వసతులు లేవనేదే రైతుల బాధ.

- అమిర్నేని హరికృష్ణ
Posted on 13-04-2020