Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

చేజారుతున్న పంట సిరులు

సాధారణ పరిస్థితుల్లోనైతే ఈసరికి రబీ పంట కోతల కాలంలో పొలాల నుంచి విపణి కేంద్రాల వరకు ఎక్కడికక్కడ సందడి వాతావరణం నెలకొనేది. కరోనా వైరస్‌ పరచిన కటిక చీకట్ల మూలాన రైతుల బతుకులిప్పుడు చిన్నబోయాయి. దేశం నలుమూలలా రైతాంగాన్ని ఆవరించిన నిరాశా నిస్పృహలకు- పరిశోధన, రేటింగ్స్‌ సంస్థ ‘క్రిసిల్‌’ అధ్యయనం అద్దం పడుతోంది. నిరుడీ రోజుల్లో ప్రధాన విపణి కేంద్రాలకు చేరిన పంట దిగుబడులతో పోలిస్తే గోధుమలు, ఆవాల వంటివి 90 శాతానికి పైగా తగ్గుదల సూచిస్తున్నాయి. గోధుమ సాగుకు పేరొందిన పంజాబ్‌, హరియాణాలలో కోతల క్రతువు చురుకందుకోనేలేదు. రాష్ట్రాలవారీగా స్తబ్ధతకు నాలుగు ముఖ్య కారణాల్ని ‘క్రిసిల్‌’ అధ్యయనం చెబుతోంది. ఈసారి రబీ కోతల్లో జాప్యం, లాక్‌డౌన్‌ నేపథ్యంలో వ్యవసాయ కూలీల కొరత, తగినన్ని రవాణా వసతులు లేకుండాపోవడం, విపణి కేంద్రా(మండీ)లలో మందకొడితనం- రైతుల్ని దిక్కుతోచని అవస్థలోకి నెట్టేశాయి. అటు కోత, రవాణా పనులకు కూలీలు దొరక్క, ఇటు కొనుగోలుదారులు కానరాక అసంఖ్యాక రైతులు తీవ్ర అనిశ్చితిలో కూరుకుపోతున్నారు. ఎక్కడి సరకు అక్కడే ఉండిపోవడంతో బాగా దెబ్బతింటున్నది ముఖ్యంగా పండ్లు, కూరగాయల సాగుదారులే. ద్రాక్ష, బత్తాయి వంటివి కొనేవారు లేక విలపిస్తున్న రైతుల దుస్థితి, టన్నుల కొద్దీ పంటను ఉచితంగా పంచిపెడుతున్న ఉదంతాలు, తోటల్లోకి మేకల్ని వదులుతున్న వైనాలు- కరోనా విలయాన్ని కళ్లకు కట్టేవే. ఈ సీజన్‌లో లాభాలతో గలగలలాడాల్సిన మామిడి రైతులూ అంతర్రాష్ట్ర రవాణా నిలిచిపోయి కన్నీరుమున్నీరవుతున్నారు. పండిన పంటను సమీకరించే వ్యవస్థ, మౌలిక సదుపాయాలు కొరవడటంకన్నా- వ్యవసాయ ప్రధాన దేశంలో దారుణ దురవస్థ మరేముంటుంది?

మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి కోటి టన్నులకు పైగా వడ్లరాశులు తెలంగాణను మురిపించనున్నాయని సంబరంగా వెల్లడించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌- ప్రతి గింజనూ గ్రామీణ కేంద్రాల్లో ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. రబీ ధాన్యం, మొక్కజొన్నల సేకరణ నిమిత్తం రూ.28 వేలకోట్లకు పైగా భూరి మొత్తాన్నీ కేటాయించడం- రైతులోకానికి గొప్ప సాంత్వన ప్రసాదించిన విధాన నిర్ణయం. ఈ రకమైన చొరవ దేశమంతటా ప్రతి రాష్ట్రంలోనూ వ్యక్తం కావాల్సి ఉంది. తెలంగాణ ప్రభుత్వం ఉదారంగా స్పందించినప్పటికీ- తాలు, తరుగు పేరిట క్షేత్రస్థాయి నిర్వాహకుల చేతివాటం రైతుల్ని కుపితుల్ని చేస్తోంది. వ్యవస్థాగత తోడ్పాటు ఎండమావిని తలపిస్తున్న పలు రాష్ట్రాల్లో అర కొర మద్దతు ధరా అందని మానిపండై సాగుదారులు గుండెకోతకు గురవుతున్నారు. జాతి ఆహారభద్రతను స్వీయబాధ్యతగా భుజానికెత్తుకున్న రైతులు తమ శ్రమఫలాల్ని ఎంతో కొంతకు తెగనమ్ముకోవాల్సి రావడం, యావత్‌ దేశానికే తలవంపులు! 55 దేశాల్లో 13 కోట్లమందికి పైగా అభాగ్యులు దుర్భరమైన ఆహార సంక్షోభం ఎదుర్కొంటున్నారని మదింపు వేసిన ఐక్యరాజ్య సమితి, కరోనా దుష్ప్రభావంతో వారి సంఖ్య 26 కోట్లకు మించిపోనుందని ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. ఇటువంటప్పుడు పండిన పంటల్ని ఏ కారణంగానైనా కాలదన్నుకోవడం- ఎక్కిన కొమ్మను తెగనరుక్కునే మూర్ఖత్వమే అవుతుంది! జాతీయ గ్రామీణ ఉపాధి హామీ వేతనాలను తిండిగింజల రూపేణా చెల్లించడానికి అనుమతించాలంటూ ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రి భూపేష్‌ బఘేల్‌ కేంద్రానికి చేసిన సూచన వినూత్నంగా ఉంది. అందుకు మార్గం సుగమమైతే- ఒకవైపు ఉపాధి కల్పన, మరోపక్క ఆహార ధాన్యాల సద్వినియోగం... రెండూ సాధ్యమవుతాయి. అదేక్రమంలో తొందరగా పాడైపోయే సేద్య ఉత్పత్తుల్ని ప్రభుత్వాలే సేకరించి, తదుపరి ఎగుమతుల కోసం వీలైనంత శీతల గిడ్డంగుల్లో నిల్వచేసి, క్రమానుగతంగా ప్రజానీకానికీ పంపిణీ చేసే వ్యూహాలకు పదును పెట్టాలి. అసాధారణ పరిస్థితుల్లో అసాధారణ నిర్ణయాలే దేశాన్ని గట్టెక్కిస్తాయి!

Posted on 25-04-2020