Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

తెలంగాణ మార్గదర్శి

దార్శనికత, ఘన సంకల్ప దీక్షల కలనేతగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ సృష్టిస్తున్న తెలంగాణ నమూనా- దేశానికే దిక్సూచి కాగల సమగ్ర వ్యవసాయ విధానాన్ని ఆవిష్కరిస్తోంది. పండిన పూటా పండగ చేసుకోలేని దండగమారి సేద్యం బడుగు రైతుల బతుకులతో మృత్యు క్రీడలాడటాన్ని ఓ రైతుగా అవలోకించి, ముఖ్యమంత్రిగా ఆలోచించి, అవరోధాల్ని అధిగమించి చేపట్టిన చర్యలు- దేశ ధాన్యాగారంగా తెలంగాణను సువ్యవస్థీకరించాయి. రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్‌, సాంకేతిక అద్భుతమనదగ్గ ప్రాజెక్టులతో బీడు భూములకు జలసిరుల అభిషేకం, అన్నదాతలకు ఆలంబనగా రైతుబంధు, రుణ మాఫీలు, పంట కొనుగోళ్లు- ఈ సాహసోపేత విధానసేద్యమే హరిత తెలంగాణకు ఊపిరులూదింది. ఈ ఏడాది కోటీ 35 లక్షల ఎకరాల్లో ఏరువాక సాగనున్న వేళ- రైతుకు, దేశానికి ఉభయ తారకమయ్యేలా సమగ్ర వ్యవసాయ ప్రణాళికపై కేసీఆర్‌ దృష్టి సారించడాన్ని సహర్షంగా స్వాగతించాలి. అమెరికా తరవాత అత్యధికంగా సేద్యయోగ్య భూములున్న ఇండియా పేరుకు వ్యవసాయ దేశమేగాని, శాస్త్రీయమైన పంటల ప్రణాళికల ఊసే లేకుండా రైతు భవితను అక్షరాలా గాలిలో దీపం చేసేసింది. అందరూ ఏం వేస్తే ఆ పంటకే మొగ్గే సగటు రైతుకు- వడ్డీ వ్యాపారులిచ్చిందే పెట్టుబడి, మార్కెట్‌ శక్తులు అంటగట్టిన విత్తనంతోనే సాగుబడి! ఆ ‘పాత’క పద్ధతికి చెల్లుకొట్టి, ఏ రైతు ఏ పంట పండించాలో ప్రభుత్వమే నిర్ధారించాలని, అందుకు వ్యవసాయ అధికారులు శాస్త్రవేత్తల సహకారం తీసుకోవాలని, ఆ పంటల విత్తనాలు మాత్రమే మార్కెట్లో లభ్యమయ్యేలా చూడాలన్న నిపుణుల సూచన విప్లవాత్మకమైనది. దేశీయంగానే కాదు, విదేశాల్లోనూ గిరాకీగల పంటల సాగును క్రమబద్ధంగా పట్టాలకెక్కించే క్రమంలో, రైతులకు క్రమశిక్షణ మప్పేలా కొంత కఠినంగా వ్యవహరించాలన్న హితవూ మన్నికైనది. ఇతర రాష్ట్రాలూ అందిపుచ్చుకోవాల్సిన చొరవ ఇది!

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ ఎంత ఆర్థిక కల్లోలం సృష్టిస్తున్నా ఇండియా ధీమాగా ఉండటానికి కారణం- ఆహార భద్రతకు భరోసా ఇచ్చేలా ఉన్న వ్యవసాయ దిగుబడులే. ప్రపంచ జనాభాలో 16శాతానికి ప్రాతినిధ్యం వహించే 66 దేశాలు ఆహార దిగుమతులపైనే ఆధారపడుతున్న దురవస్థను గుర్తించి- స్వాభావిక బలిమిని రైతులకు దేశానికీ సహజసిద్ధ కలిమిగా మార్చే వ్యూహాత్మక పరివర్తనకు ఇండియా సిద్ధం కావలసిందే! రైతు ప్రయోజనాలు, సేద్య ప్రగతి, గ్రామీణాభివృద్ధిని వేర్వేరుగా పరిగణించినంతకాలం నికర పురోగతి ఎండమావేనన్న ప్రధాని మోదీ- కొవిడ్‌ అనంతర ఆర్థిక వ్యూహాల్లో సమగ్ర వ్యవసాయ విధానానికి అగ్ర ప్రాధాన్యం ఇవ్వాలి. ఒక హెక్టారు సాగు భూమిలో ఇండియా కంటే రెండునుంచి నాలుగింతల ఫలసాయాన్ని చైనా రాబడుతుంటే- ప్రపంచంలోనే అత్యధికంగా ఇక్కడ పోగుపడిన 102 వ్యవసాయ పరిశోధన సంస్థలు, 65 అగ్రి విశ్వవిద్యాలయాలూ ఏం ఉద్ధరిస్తున్నట్లు? వాటిలోని నిపుణ మానవ వనరుల్ని వినియోగించి భిన్న భౌగోళిక వాతావరణ మండలాలున్న ఇండియాలో ఏ నేల ఏయే పంటలకు అనుకూలమన్న సేద్య యోగ్యత నిర్ధారణ శాస్త్రీయంగా జరపాలి. ఎంత విస్తీర్ణంలో ఎలాంటి పంటలు సాగు చేస్తే దేశ అవసరాలు తీరుతాయో, విదేశీ మార్కెట్లలో మరి ఏయే పంటలకు గిరాకీ ఎంత ఉంటుందో సక్రమంగా మదింపు వేసి సమగ్ర వ్యవసాయ ప్రణాళికకు రూపుదిద్దాలి. అధిక దిగుబడులిచ్చే మేలిమి వంగడాల్ని యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చెయ్యడం, ఆహార శుద్ధి పరిశ్రమల్ని విరివిగా నెలకొల్పి రైతు కష్టం ఏ దశలోనూ వృథా కాకుండా కాచుకోవడం నిష్ఠగా జరగాలి. డాక్టర్‌ స్వామినాథన్‌ సూచించినట్లు, రైతు తలెత్తుకు బతికేందుకే కాదు, రేపటి తరమూ సుక్షేత్రాల్లో సిరుల పంటకు తరలి వచ్చేలా వ్యవసాయం లాభసాటి కావాలి. రైతు బతుకులో పచ్చదనమే లక్ష్యంగా తెలంగాణ చేస్తున్న సదాలోచన- దేశవ్యాప్త వ్యవసాయ సంస్కరణలకు కరదీపికగా మారాలి!

Posted on 12-05-2020