Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

బడుగు రైతులకు గొడుగు?

* సేద్య సంస్కరణలు కొత్త పుంతలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ ఈ నెల 15వ తేదీన ప్రకటించిన మూడు సంస్కరణలు- వ్యవసాయ ఉత్పత్తుల ధరలు, ఉత్పత్తి, వాణిజ్యాలకు స్వేచ్ఛ కల్పించేందుకు, ఈ రంగం వాస్తవిక సామర్థ్యం గుర్తించేందుకు తోడ్పడతాయి. ఈ కీలక సంస్కరణలు దళారులు, వర్తక ముఠాల కబంధ హస్తాల నుంచి రైతులకు విముక్తి కలిగించనున్నాయి. వ్యవసాయ రంగం సరఫరా గొలుసు వ్యవస్థలో సరికొత్త మార్గాలకు దారి చూపి, పెట్టుబడులను పెంచి, పోటీ తత్వానికి దారితీసే అవకాశమూ ఉంది. దీనివల్ల ఈ రంగంలో అస్థిరత తగ్గి, స్థిరత్వం ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

శుభ సూచకాలు
మొదటిది: ప్రభుత్వం నిత్యావసర సరకుల చట్టాన్ని (ఈసీఏ) సవరించి, వ్యవసాయ ఉత్పత్తులపై నియంత్రణల్ని తొలగించనుంది. ఇకపై జాతీయ విపత్తులు, తీవ్ర కరవు కాటకాలు వంటి పరిస్థితుల్లో మాత్రమే సరకుల నిల్వలపై పరిమితులు విధించే అవకాశం ఉంది. ఆహారపదార్థాల కొరత వంటి పరిస్థితులు ఏర్పడినప్పుడు వ్యాపారులు ధరలు పెంచకుండా నిరోధిస్తూ, ఈసీఏ వినియోగదారులను కాపాడుతూ వస్తోంది. వ్యవసాయ సరఫరా గొలుసు వ్యవస్థలో ఆహార శుద్ధి చేసేవారు తదితరులపై నిల్వ పరిమితులు తొలగించడంవల్ల ఈ రంగంలోకి మరిన్ని పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఈ కారణంగా ప్రస్తుతం పరిశ్రమ ఎదుర్కొంటున్న అనిశ్చితి సైతం తొలగనుంది. సరకు నిల్వల పరిమితుల్ని అకస్మాత్తుగా తగ్గిస్తారనే భయం, ఆందోళన లేకుండా కంపెనీలు ఇకపై ఉత్పత్తి, అమ్మకాలపై ప్రణాళికలు రూపొందించుకునే అవకాశాలున్నాయి. ఎగుమతులనూ అంచనా వేసే అవకాశం ఉండటం వల్ల అవీ ప్రయోజనకరంగా మారవచ్ఛు.

రెండోది: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే కొత్త చట్టంతో అంతర్‌ రాష్ట్ర వర్తకంపై ఉన్న అన్ని రకాల అడ్డంకులూ తొలగిపోయే అవకాశం ఉంది. వ్యవసాయోత్పత్తుల ఇ-వర్తకానికి సంబంధించి స్పష్టమైన విధివిధానాలూ తీసుకురానున్నారు. ప్రస్తుతం చాలా రాష్ట్రాల్లో రైతులు తమ ఉత్పత్తుల్ని వ్యవసాయ మార్కెట్లు/ మండీల్లో మాత్రమే అమ్ముకోవాల్సి వస్తోంది. ఇప్పుడూ కొంతమేర అంతర్రాష్ట్ర వ్యాపారం నడుస్తున్నా, ఇతర రాష్ట్రాలకు వ్యవసాయ ఉత్పత్తుల్ని రవాణా చేసేందుకు కొన్ని అనుమతులు అవసరమవుతున్నాయి. ఈ ప్రక్రియలో ఎలాంటి అడ్డంకులూ లేకుండా పూర్తి స్వేచ్ఛ కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతర్రాష్ట్ర అడ్డంకుల్ని తొలగిస్తే, కొనుగోలుదారులు నేరుగా రైతు వద్దకే వెళ్లి కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీనివల్ల వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్‌ కమిటీ (ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో మార్కెట్‌ యార్డులు; ఇతర రాష్ట్రాల్లో ఏపీఎంసీ)లకు వెళ్లాల్సిన అవసరం ఉండదు.

మూడోది: ఆహార శుద్ధి చేసేవారు, పెద్దస్థాయి చిల్లర వర్తకులు, ఎగుమతిదారులు వంటివారితో రైతులు న్యాయబద్ధంగా, పారదర్శకంగా మెరుగైన రీతిలో వ్యవహారాలు నడిపేలా ప్రభుత్వం చట్టపరమైన విధివిధానాలను రూపొందించనుంది. ఈ ప్రక్రియలో రైతులకు రిస్కు తగ్గించడం, రాబడిపై హామీ, నాణ్యతాప్రమాణాల సాధన సుసాధ్యమవుతుంది. విధివిధానాలకు సంబంధించిన వివరాలు ఇంకా వెల్లడి కాకపోయినా, సంస్కరణల వల్ల ప్రభుత్వం మరిన్ని పంటల్లో ఒప్పంద వ్యవసాయానికి అనుమతినిచ్చే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించి ఫ్యూచర్స్‌ ట్రేడింగ్‌కూ మెరుగైన విధివిధానాలను రూపొందించే అవకాశం ఉంది. మొత్తంగా... వ్యవసాయ సరఫరా గొలుసు వ్యవస్థలను పూర్తిస్థాయిలో ప్రక్షాళించడంతోపాటు, మరింత సమర్థంగా పనిచేసే దిశగా సంస్కరణలను ఉద్దేశించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, వినియోగదారులపైనా ఎక్కువ భారం పడకుండా, చిన్న రైతులకూ గిట్టుబాటు ధర దక్కేలా చూడనుంది. ప్రభుత్వం ఈ సంస్కరణల్ని ఇదే స్థాయిలో ముందుకు తీసుకెళ్తే, పరిస్థితుల్లో భారీ మార్పులు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి. భారత్‌లో ఇప్పటికే ఎలెక్ట్రానిక్‌ జాతీయ వ్యవసాయ మార్కెట్‌ (ఈ-నామ్‌)ను ఏర్పాటు చేసినా, అది అనుకున్నంతగా విజయవంతం కాలేదు. తగిన నాణ్యతానియంత్రణ వ్యవస్థ, వివాద పరిష్కార యంత్రాంగం దన్ను లేకపోవడమే ఈ వైఫల్యానికి కారణమైంది. రాష్ట్ర ప్రభుత్వాల పరంగానూ అడ్డంకులు ఎదురయ్యాయి. రైతులకు రాయితీ విద్యుత్తు వంటి గణనీయ ప్రయోజనాలు అందించే రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిగా అన్నదాతల ఉత్పత్తుల్ని తమ రాష్ట్రం పరిధిలోనే ఉంచేందుకు యత్నిస్తాయి. ఉదాహరణకు... పశ్చిమ్‌ బంగ ప్రభుత్వం బంగళాదుంపల రైతులు తమ ఉత్పత్తుల్ని రాష్ట్రం వెలుపల అమ్ముకునే స్వేచ్ఛను ఎన్నడూ కల్పించలేదు. రాష్ట్రంలోని వినియోగదారులకు బంగాళాదుంప చౌకగా అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే ఇలాంటి కట్టడి విధించింది. ప్రతి రాష్ట్రానికీ తమవైన సొంత లైసెన్సింగ్‌, పన్నుల విధానం ఉంటాయి. వీటినీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది.

అడ్డంకులను అధిగమిస్తేనే...
ఓ భారీ సంస్కరణను తీసుకురావాలంటే, ప్రభుత్వం ఎన్నో అడ్డంకుల్ని అధిగమించాల్సి వస్తుంది. బలమైన దళారి వ్యవస్థ నుంచీ ప్రతిఘటన ఎదురవుతుంది. వ్యవసాయ మార్కెటింగ్‌ సంస్కరణల విషయానికొస్తే- 2016లో కేంద్రం నమూనా ఏపీఎంసీ చట్టంతో ముందుకొస్తే, దాన్ని స్వీకరించేందుకు పలు రాష్ట్రాలు తిరస్కరించాయి. మధ్యవర్తులను తొలగిస్తే- ఉత్పత్తిదారులకు, వినియోగదారులకు ఇద్దరికీ ప్రయోజనమే. కానీ, అందరు రైతులూ పెద్దయెత్తున దిగుబడులు సాధించలేరన్న సంగతి గుర్తుంచుకోవాలి. గొలుసు వ్యవస్థలో చిట్టచివరనుండే రైతుతో సంప్రదింపులు జరపడమూ సమస్యే. ఇలాంటి సమస్యను పరిష్కరించడమూ కష్టమే. భారత్‌లోని వ్యవస్థీకృత చిల్లర వర్తకానికి పెద్ద సంఖ్యలో ఉన్న రైతుల నుంచి ఉత్పత్తుల్ని సేకరించే సామర్థ్యమూ లేదు.

ఉదారంగా నిధులివ్వాలి
నిత్యావసర సరకుల చట్టంలో పేర్కొన్న సరకులు సగటు ఇంటి బడ్జెట్‌లో ప్రధాన భాగమన్న సంగతి గుర్తుంచుకోవాలి. సరకుల నిల్వలపై నియంత్రణలు ఎత్తివేయడం వల్ల వినియోగదారులకు ధరల పెరుగుదల సెగ తగలవచ్ఛు ఎందుకంటే, సరకుల నిల్వలపై ఆంక్షల్ని కేవలం కొన్ని ప్రత్యేక సందర్భాలకే పరిమితం చేయడం వల్ల ధరలు పైపైకి ఎగబాకే ప్రమాదం ఉంటుంది. రేషన్‌ కార్డులుండే పేదలకు సరకులను సరఫరా చేసి సహాయపడినా, మిగతా వారు మాత్రం పెరిగిన ధరల్ని చెల్లించాల్సిందే. ధరలు పెరిగినప్పుడు మధ్యతరగతి ప్రజలు ఆ బాధను భరించాల్సి ఉంటుంది. ఈ చట్టానికి రాష్ట్రాల నుంచే ప్రతిఘటన ఎదురయ్యే అవకాశం ఉంది. మొత్తానికి ఈ సంస్కరణల్ని ముందుకు తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం భారీ స్థాయిలో వ్యయం చేయాల్సి ఉంటుంది. వ్యవసాయం రాష్ట్ర పరిధిలోని అంశం కావడంతో రాజ్యాంగ సవరణ అవసరం కావచ్ఛు అంతర్రాష్ట్ర వాణిజ్యం కేంద్ర పరిధిలోని అంశమని ఆర్థికమంత్రి ఇప్పటికే స్పష్టం చేయడం గమనార్హం. రైతులకు జాతీయ స్థాయిలో మార్కెట్‌ అందుబాటులోకి తీసుకురావడం ద్వారా వచ్చే ఎన్నికల నాటికి అన్నదాతల ఆదాయం రెట్టింపు చేస్తామన్న హామీని నెరవేర్చే అవకాశాలు మెరుగుపడతాయి.

Posted on 22-05-2020