Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

భూసారమే సర్వం

* ఇది అంతర్జాతీయ మొక్కల ఆరోగ్య వృద్ధి సంవత్సరం

దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలక పాత్ర వహిస్తున్నా, అన్నదాతలు ఆ యేటి కాయేడు ఎక్కువ ఆదాయం వచ్చే వ్యవసాయేతర రంగాలవైపు దృష్టి సారిస్తున్నారు. అధిక దిగుబడి వంగడాలు, ఉచిత విద్యుత్‌, ఉద్యాన పంటలు, బిందు సేద్యం, ‘హైడ్రోపోనిక్స్‌’ వంటి అధునాతన పద్ధతుల ద్వారా వ్యవసాయ దిగుబడులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నా- రైతుల ఆర్థిక స్థితిగతులు గొప్పగా ఏమీ లేవు. చాలామంది రైతులు ఆర్థికంగా గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారు. అత్యధిక శాతం రైతులు తమ పిల్లలను వ్యవసాయంలో దించడానికి ఇష్టపడటం లేదు. వీలైతే తాము కూడా వేరే ఉపాధి మార్గాలు చూసుకోవాలనుకుంటున్నారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడానికి ప్రభుత్వం కృషిచేస్తూనే ఉంది. 2020 సంవత్సరాన్ని మొక్కల ఆరోగ్య వృద్ధి వత్సరంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించగా, ఇటీవలే మనం జీవవైవిధ్య దినోత్సవం కూడా జరుపుకొన్నాం. గాలి, నీరు, నేల స్వచ్ఛంగా సారవంతంగా ఉంటేనే జీవవైవిధ్యం వర్ధిల్లి, మొక్కలు జవజీవాలతో కళకళలాడతాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని భారత ప్రభుత్వం కొంతకాలంగా భూసార రక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెడుతోంది. కేంద్ర, రాష్ట్ర పభుత్వాలు భూసార పరీక్ష చేసి, రైతులు ఏయే పంటలు ఏయే నేలల్లో వేయవచ్చో సూచించడానికి భూసార కార్డులు జారీచేస్తున్నాయి. నేల, మార్కెట్‌ రీతులను గమనించి సరైన పంట వేస్తే రైతులకు ఆర్థికంగా గిట్టుబాటు అవుతుంది. ఇక నుంచి తాము సూచించిన పంటలు వేసే రైతులకే రైతు బంధు పథకాన్ని వర్తింపజేస్తామని తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ముందు తరాల రైతులు ఏ సీజనులో ఏ పంట వేస్తే మంచి దిగుబడి వస్తుందో అనుభవంతో గ్రహించేవారు. భూసార రక్షణకు సంప్రదాయ పద్ధతులు అవలంబించి మంచి ఫలితాలు సాధించేవారు. తమ అనుభవ సారాన్ని తదుపరి తరాలవారికి అందించేవారు. ఒక పంట వేసిన తరవాత రెండో పంటగా దేన్ని వేయాలో, దేన్ని వేయకూడదో వారికి చక్కటి అవగాహన ఉండేది. భూసారం గురించి వారికి అంతర్లీనంగా అనుభవ రీత్యా ఎరుక ఉండేది. భూసార కార్డు లేకుండానే అప్పట్లో వారు సరైన పంటలు వేసుకునేవారు.

నేలలో పంటల ఎదుగుదలకు తోడ్పడే సూక్ష్మజీవులు సహజంగా ఉంటాయి. వీటిలో కొన్ని ప్రతికూల ఫలితాలను ఇచ్చేవీ ఉంటాయి. క్రితం సీజనులో వేసిన పంట నేల స్వభావాన్ని ప్రభావితం చేస్తుంది. ఎరువులు, సేంద్రియ మార్పులు నేలలోని సూక్ష్మజీవుల పరిమాణాన్ని పెంచడమో తగ్గించడమో చేస్తాయి. నేల స్వభావం, విత్తనాలు, గాలి, కంపోస్టు, నీరు కలగలసి కొన్ని సూక్ష్మజీవులను ఉత్పన్నం చేస్తాయి. నేలలో సహజంగా ఉన్న సూక్ష్మజీవులతో ఇవి సహజీవనం చేసినప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. నేల, వేళ్లు, ఆకుల ఉపరితలం, విత్తనాల చుట్టూ లోపల కూడా బ్యాక్టీరియా ఉంటాయి. వీటిలో కొన్నింటిని ప్రయోగశాలలో పెంచవచ్చు, కొన్నింటిని పెంచలేం. మొక్కలు, నేల మధ్య సమతౌల్యం ఉన్నప్పుడు ఆ నేల సారవంతం, స్వాస్థ్యమవుతుంది. వివిధ పంటలు వేసినప్పుడు నేలలోని సూక్ష్మజీవుల సంఖ్యలో హెచ్చుతగ్గులు వస్తుంటాయి. క్రితంసారి వేసిన పంటను గమనంలోకి తీసుకుని తదుపరి పంట ఏది వేయాలో నిర్ణయించుకోవాలి. సరైన ఎంపిక నేలలోని సూక్ష్మజీవుల సమతౌల్యాన్ని కాపాడుతుంది. నేలలోని సూక్ష్మ, స్థూల పోషకాలను పరిరక్షిస్తూ పంట ఏపుగా పెరగడానికి తోడ్పడుతుంది. నేడు మార్కెట్‌ లో పెద్ద పెద్ద సీతాఫలాలు, జామ, టమాటాలు చూపులకు ఇంపుగా నిండుగా కనిపిస్తున్నా- అవి పాత కాలపు పండ్లకు రుచిలో సాటిరావు. కొత్త తరహా పండ్లు ఎక్కువ కాలం చెడిపోకుండా నిల్వ ఉంటాయి కానీ, సంప్రదాయ పండ్లకు అవి ఏమాత్రం తూగవు. సంప్రదాయ పండ్లలో ఉన్న పోషక విలువలు ఈ పండ్లలో ఉండకపోవచ్ఛు కాబట్టి నేలలోని సూక్ష్మజీవులతోపాటు పోషకాలూ చాలా ముఖ్యం. ప్రభుత్వాలు రైతులకు ఇచ్చే భూసార కార్డుల్లో నేలలోని సూక్ష్మజీవులు, పోషకాల సమాచారమూ పొందుపరచాలి. రైతులు తాము చెప్పిన పంటనే వేయాలని షరతు పెడుతున్న ప్రభుత్వం ఈ విషయంలోనూ జాగ్రత్త తీసుకోవాలి.

ఒక్క గ్రాము మట్టిలో వందల కోట్ల సూక్ష్మజీవులు ఉంటాయి. వాటిలో హితకరమైనవి, హానికరమైనవీ ఉండవచ్ఛు వాటన్నింటినీ క్రోడీకరించి భూసార కార్డులో నమోదు చేయడం తేలిక కాదు. ఇక్కడ సాంకేతికత ఎంతో ఉపయోగపడుతుంది. ‘మెటాజీనోమిక్స్‌’ అనే సరికొత్త సాంకేతికతను ఇక్కడ ప్రస్తావించాలి. మట్టిలోని సూక్ష్మజీవుల డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏల విశ్లేషణ ద్వారా వాటిని వర్గీకరించవచ్ఛు సూక్ష్మజీవుల మధ్య పోలికలు, తేడాల పరిశీలన ఈ విశ్లేషణకు తోడ్పడుతుంది. నేల స్వభావం, సూక్ష్మజీవులకు సంబంధించి అందుబాటులో ఉన్న విస్తారమైన సమాచార రాశి (డేటా)ని చప్పున పరిశీలించి నిర్ధారణలను అందించడానికి శక్తిమంతమైన కంప్యూటర్లు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. ఏ సీజనులో ఏ పంట వేయాలి, దేనికి జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లలో ఎక్కువ గిరాకీ ఉంది అనే అంశాలను తెలుసుకోవడానికి సాంకేతికతలు, శాస్త్రీయ పద్ధతులు ప్రభుత్వాల చేతిలో ఉన్నాయి. అన్ని కోణాల నుంచి పరిశీలించిన తరవాతనే రైతులకు ఏయే పంటలు వేయాలో సూచించాలి!

- ఆచార్య పొదిలె అప్పారావు
(రచయిత- యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌, ఉప కులపతి)
Posted on 28-05-2020