Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

విపత్తుల గుప్పిట వ్యవసాయం!

* పర్యావరణ సవాళ్లకు దీటైన వ్యూహం
ప్రపంచవ్యాప్తంగా వేగంగా చోటుచేసుకుంటున్న పర్యావరణ మార్పులు వ్యవసాయంపై తీవ్ర ప్రభావం కనబరచనున్నాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఆహారధాన్యాల ఉత్పత్తి తరిగిపోయే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడున్న దానికన్నా మరో రెండు సెంటిగ్రేడ్‌ డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగితే భారత్‌లో ప్రధాన ఆహారపంట అయిన వరి ఉత్పాదకత హెక్టారుకు ఒక టన్ను మేర కోసుకుపోనుంది. 2050నాటికి ఒక్క డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగినా దేశంలో ఇంకో ముఖ్యమైన ఆహారపంట గోధుమ ఉత్పాదకత క్షీణముఖం పడుతుంది. సాగుకు అనుకూలమైన భూమి తగ్గిపోనుంది. ప్రస్తుత రకాలు మున్ముందు సాగుకు పనికిరావు. ఏడాదికి కేవలం భారత్‌లోనే దాదాపు 70లక్షల టన్నులమేర ఉత్పత్తి పడిపోయే ప్రమాదముంది. దాని విలువ ప్రస్తుత ధరల ప్రకారం 150కోట్ల డాలర్లపైనే ఉండవచ్చని అంచనా. దానికితోడు ఆకస్మిక వరదలు, వర్షపాత క్షీణత వంటివి సంభవిస్తే ఇబ్బంది మరింత పెరుగుతుంది. 2009నాటి వర్షాభావ పరిస్థితులవల్ల కోటి 50లక్షల టన్నుల వరి, 40లక్షల టన్నుల అపరాల ఉత్పత్తి పడిపోయింది. ‘పర్యావరణ మార్పులవల్ల’ దేశ వ్యవసాయంలో అసాధారణ పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. 1900నుంచి 1910వరకు ప్రపంచవ్యాప్తంగా ఏటా సగటున 2.5 అసాధారణ వాతావరణ సమస్యలు తలెత్తితే- 2000నుంచి 2010నాటికి ఆ సగటు 350కి చేరినట్లు శాస్త్ర, పర్యావరణ కేంద్రం-2015 నివేదిక తెలుపుతోంది. నిలకడలేని వాతావరణ పరిస్థితులున్న దేశాల్లో భారత్‌ ప్రపంచంలోనే మూడోస్థానంలో నిలుస్తోంది. ఈ ఒక్క ఏడాదే దేశంలో 15రాష్ట్రాలపై పర్యావరణ అననుకూలతల ప్రభావం పడింది. దాదాపు 33శాతం పంటల సాగు విస్తీర్ణం దెబ్బతింది. రైతులు ఇరవై వేలకోట్ల రూపాయలపైనే నష్టపోయారు. పంటల బీమా వంటి మెరుగైన పథకాలు ప్రవేశపెట్టి ఆదుకొంటే తప్ప సేద్య రంగంలో రైతు మరెంతో కాలం నిలబడలేడని స్వామినాథన్‌ వంటి మహామహులు పదేపదే సూచిస్తున్నారు. ఈ సమస్యకు ఎంత త్వరగా పరిష్కారాలు వెదికితే దేశ ఆహార భవిష్యత్తుకు అంత భరోసా!

ప్రమాదఘంటిక

తెలుగు రాష్ట్రాలపై పర్యావరణ మార్పులు ఇప్పటికే పంజా విసిరాయి. మున్ముందు మరిన్ని సవాళ్లు పొంచి ఉన్నట్లు ప్రపంచ బ్యాంకు ఇటీవల సమర్పించిన ‘షాక్‌ వేవ్స్‌’ నివేదిక తెలుపుతోంది. ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ మార్పులు, పరిణామాలను అధ్యయనం చేసిన ప్రపంచ బ్యాంకు ‘పేదరిక నిర్మూలనపై పర్యావరణ మార్పుల ప్రభావం, నిర్వహణ’(షాక్‌వేవ్స్‌) నివేదికను వెలువరించింది. తెలుగు రాష్ట్రాలపై పర్యావరణ ప్రభావాన్ని అందులో ప్రత్యేకంగా చర్చించారు. గడచిన పాతికేళ్లలో పర్యావరణ మార్పుల ప్రభావం గురించిన చర్చ అందులో జరిగింది. 14శాతం ప్రజలు పేదరికంనుంచి బయటపడితే ఏడాదికి సగటున 12శాతం తిరిగి పేదరికంలోకి జారుకుంటున్నట్లు అందులో తేలింది. ఎండల తీవ్రత, వర్షపాతలేమివల్ల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గడచిన 25ఏళ్లలో 15వేలమందికి పైగా పేదలు చనిపోయారు. 2030నాటికి అయిదు శాతంమేర ఆహారధాన్యాల ఉత్పత్తి పడిపోయే సూచనలున్నాయి. దాంతో పేదరికం పెరగనుంది. కరవు, నీటి వనరుల కొరత కారణంగా దిగుబడులు తగ్గి, ఆహార ద్రవ్యోల్బణం పెరగనుందని ఆ నివేదిక చెబుతోంది. ఇక దేశంలో 2013-’14లో 26.5కోట్ల టన్నుల ఆహారధాన్యాల ఉత్పత్తి ఉంటే, 2014-’15లో అది నాలుగు శాతం తగ్గి 25.3కోట్ల టన్నుల దగ్గర నిలిచింది. అందుకు కారణం అననుకూల పర్యావరణ పరిస్థితులే!

ఇటీవల పారిస్‌లో ముగిసిన కాప్‌-21 సదస్సులో భారత ప్రభుత్వం తాను చేపట్టబోయే చర్యలను ప్రకటించింది. పర్యావరణ మార్పులకు అనుగుణంగా చర్యలు చేపట్టేందుకు వచ్చే 15ఏళ్లలో రూ.165లక్షల కోట్లు ఖర్చు చేయనున్నట్లు సర్కారు ప్రకటించింది. కర్బన ఉద్గారాల్లో మూడోస్థానంలో ఉన్న భారత్‌- సౌరశక్తి ఉత్పత్తిని పెంపొందించేందుకు రూ.198కోట్లు కేటాయించింది. భవిష్యత్తులో వాతావరణ మార్పులు తట్టుకునేందుకు సమీకృత అభివృద్ధే శరణ్యమని ప్రపంచ బ్యాంకు నివేదిక స్పష్టం చేస్తోంది. ఎదురయ్యే పర్యావరణ వైపరీత్యాలను, కరవు కాటకాలను తట్టుకునేలా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలి. అధిక ఉష్ణోగ్రతలు తట్టుకునే రకాలు, వ్యవసాయ పద్ధతులను రైతులకు చేరవేయాలి. ముఖ్యంగా వ్యవసాయాధారిత రంగాలపై పన్ను భారం తగ్గించాలి. పేద ప్రజల సంక్షేమానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలి. మొత్తంగా రక్షణ కవచంగా ప్రభుత్వం ప్రజలకు చేరువ కావాలి.

అయిదు దశాబ్దాల క్రితం హరిత విప్లవ కాలంలో కోటి టన్నుల గోధుమలను దేశంలోకి దిగుమతి చేసుకుంటే- ఇవాళ కోటి టన్నుల అపరాలు దిగుమతి చేసుకుంటున్నాం. పెరిగిన సాంకేతికత, శాస్త్రీయ విజ్ఞానం దిగుబడుల పరిస్థితిని మెరుగుపరచలేకపోయిందంటే- అందుకు కారణం పర్యావరణ మార్పులే! గడచిన 30ఏళ్లుగా క్షామ పరిస్థితుల కారణంగా అభివృద్ధి చెందుతున్న దేశాలు విలవిల్లాడాయి. ప్రకృతి విపత్తులవల్ల ప్రపంచవ్యాప్తంగా లక్షన్నరకోట్ల అమెరికన్‌ డాలర్ల నష్టం జరిగినట్లు ప్రపంచ ఆహార, వ్యవసాయ సంస్థ వెల్లడిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా 250కోట్లమంది వ్యవసాయంపై ఆధారపడుతుంటే- ప్రభుత్వాలు మాత్రం మొత్తంగా తమ కేటాయింపుల్లో కేవలం 4.2శాతాన్నే సేద్యంకోసం వెచ్చిస్తున్నాయి. దేశంలో పర్యావరణ మార్పులవల్ల 2013లో 35వేల హెక్టార్లలో దిగుబడులు తగ్గితే 2014లో కోటి 83లక్షల హెక్టార్లపై ఆ ప్రభావం పడింది. 1950నుంచి దేశంలో పర్యావరణ మార్పులు కనిపిస్తున్నప్పటికీ గడచిన దశాబ్దం నుంచి అవి మరింతగా ప్రస్ఫుటమవుతున్నాయి. ఉత్తరాఖంఢ్‌ను ముంచెత్తిన వరదలు, ఆంధ్రప్రదేశ్‌ను హోరెత్తించిన వేడి గాలులు, చెన్నైను ఉక్కిరిబిక్కిరి చేసిన అత్యధిక వర్షపాతం వంటివి ఇందుకు నిదర్శనలు. గడచిన 14ఏళ్లలో దేశంలో 131భారీ వరదలు, 51తుపానులు, ఉద్ధృతమైన 26 వేడి-చలిగాలులు, మూడు పెద్ద కరవులు సంభవించినట్లు అధ్యయనాలు తెలుపుతున్నాయి. వాటి ఫలితంగా సుమారు 5,100కోట్ల డాలర్ల మేర నష్టం జరిగినట్లు అంచనా. కానీ, ఈ సమస్యలను ఎదుర్కొనేందుకు భారత్‌ వెచ్చిస్తున్న నిధులు అంతగా సత్ఫలితాలు ఇవ్వడం లేదు. స్థూల దేశీయోత్పత్తిలో రెండు శాతం పర్యావరణ మార్పులను అనుకూలంగా మార్చుకోవడానికి భారత ప్రభుత్వం ఖర్చు పెడుతోంది. నేరుగా పర్యావరణ మార్పులను సానుకూలంగా మార్చుకోవడం కోసమే 21 పథకాలు ప్రవేశపెట్టినట్లు ప్రభుత్వాలు చెప్పుకొంటున్నాయి. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం మొత్తంగా అయిదు కోట్ల డాలర్లు, రాష్ట్ర ప్రభుత్వాలు దాదాపు 4,800కోట్ల డాలర్లు 2013-’14లో ఖర్చు చేసినట్లు గణాంకాలు తెలుపుతున్నాయి. అయితే 2030నాటికి కనీసం 16,800 కోట్ల డాలర్లు అవసరమని, అందులో 83శాతం ప్రత్యేకించి వ్యవసాయ వ్యవస్థలను పర్యావరణ సవాళ్ల నుంచి కాపాడుకోవడానికి కావాలని రాష్ట్రాలు కోరుతున్నాయి. ఇటీవలి పర్యావరణ మార్పులవల్ల మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, కర్ణాటకల్లో పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రైతులను ఆదుకోవటానికి, ఆహార ద్రవ్యోల్బణం తగ్గించేందుకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించాల్సిన తరుణమిది.

సమన్వయంతోనే ముందడుగు

పర్యావరణ మార్పులు తగ్గించడం కేవలం భారత్‌ స్థాయిలో సాధ్యమయ్యే వ్యవహారం కాదు. ఇందుకోసం స్థానిక, జాతీయ, అంతర్జాతీయ స్థాయుల్లో సమగ్ర కార్యాచరణ అవసరం. కోపెన్‌హెగన్‌ సదస్సులో నిర్ణయించినట్లు ఉద్గారాల తగ్గింపు ద్వారా ప్రపంచ ఉష్ణోగ్రత రెండు డిగ్రీల సెంటీగ్రేడ్‌ కంటే అదనంగా పెరగకుండా భారత్‌ కృషి చేయాలి. శీతోష్ణ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు పెరిగితే ఒకే పంట స్థానంలో రెండు, మూడు పంటలు వేయడం సాధ్యపడుతుంది. హిమాలయ ఆవరణ వ్యవస్థలను కాపాడుకోవటంతోపాటు- గంగ, బ్రహ్మపుత్ర నదుల నీటి మట్టాలను పరిరక్షించి వ్యవసాయానికి వూతమిచ్చే చర్యలు తీసుకోవాలి. ‘సార్క్‌’ దేశాలతోపాటు, ప్రాంతీయంగానూ ఇందుకు సహకారం సాధించాలి. జాతీయస్థాయిలో పర్యావరణ అనుకూల విధానాలకు పెద్దపీట వేయాలి. సుస్థిర సాగు వ్యవస్థలు రూపొందించాలి. వ్యవసాయం-పర్యావరణం ప్రాతిపదికన స్థానిక సాంకేతిక పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వాలి. పంటల మార్పిడి, జీవ సేంద్రియ ఎరువులను ఆవరణ వ్యవస్థలో ఇమిడ్చి- ఆధునికతను జోడించటం ద్వారా సుస్థిర వ్యవసాయం సాధించాలి. భూ ఆరోగ్య పరిరక్షణ, నీటి సంరక్షణ, భూసారం పెంపొందింపు, నేలకోత నివారణ ద్వారా ఉత్పాదకతను పెంచడాన్ని దీర్ఘకాలిక లక్ష్యాలుగా ఎంచుకోవాలి. వ్యవసాయ వైవిధ్యం ద్వారా పర్యావరణ ప్రతికూలతలను ఎదుర్కోవచ్చు. ఉత్పాదకతను పెంచడంతోపాటు పంట సారాన్ని; పశుపక్ష్యాదులు, నీరు, నేల వనరులను కాపాడగల శక్తి జీవవైవిధ్యానికి ఉంది. భిన్నమైన పంటలు వేయడం ద్వారా చీడపీడలను, కరవుకాటకాలను కొంతమేరకు తట్టుకోవచ్చు. వర్షాధార ప్రాంతాలకు తగిన వ్యవసాయ విధివిధానాలు రూపొందించాలి. చేపలు, కోళ్లు, అటవీ ఉత్పత్తులు, పాడితో కూడిన ఉత్పత్తి బహుళ ఆహార సాగు వ్యవస్థలకు ప్రాధాన్యమివ్వాలి. పట్టణాలు, నగరాలనుంచి వెలువడే వ్యర్థాలనూ ఉపయోగించుకోగలిగే సేద్య విధానాలను రూపొందించాలి. తద్వారా దిగుబడి నష్టాలను కొంతమేర తగ్గించుకోవచ్చు. ఇంకుడు గుంతలు, పోషక ఎరువులనిచ్చే చెట్లు, బయోగ్యాస్‌ వాడకం పెంపొందించటం ద్వారా వర్షాధార ప్రాంతాల్లో వ్యవసాయాన్ని చాలావరకు పునరుద్ధరించవచ్చు. చీడపీడలను ముందస్తుగా పసిగడుతూనే, తక్కువ ఖర్చుతో వాటిని దీటుగా ఎదుర్కొనే తరుణోపాయాలు అవసరం. వ్యవసాయ పరపతి, పంటల బీమా వ్యవస్థలను మరింత సమగ్రంగా రూపొందించాలి. చిన్న, సన్నకారు రైతులకు ఆసరాగా నిలిచేలా వాటిని మలచుకోవాలి. సాగునీటి భద్రతను పెంపొందించాలి. రైతుకు నికరంగా ఆదాయం అందించే వ్యవసాయ విధానాలు కావాలిప్పుడు. భూమిలో సేంద్రియ కర్బనం పెంచడం పర్యావరణ మార్పులను తట్టుకొనే మెరుగైన మార్గం. భూమిలో కర్బన పదార్థాన్ని పెంపొందించటం ద్వారా 2030నాటికి 600కోట్ల టన్నుల నుంచి వెయ్యి కోట్ల మేర విడుదలయ్యే బొగ్గుపులుసు వాయువును తగ్గించవచ్చని అంచనా. అతివృష్టి, అనావృష్టివల్ల గోధుమ, వరి, ఉద్యాన పంటలు దెబ్బతింటున్నాయి. వేడిగాలులవల్ల పాల దిగుబడి, కోళ్ల మనుగడ దెబ్బతిననుంది. ఇప్పటివరకు వీటి నుంచి రైతులను కాపాడే రక్షణ ఛత్రం వూసేలేదు. పంటల బీమా తప్ప మరో రక్షణ ఛత్రం ప్రభుత్వం ఇప్పటివరకూ ప్రతిపాదించలేదు. దేశంలో 20శాతం రైతులు మాత్రమే పంటల బీమా చేస్తున్నారు. 80శాతం రైతులు దీని పరిధిలోకే రావడంలేదు. పంట దెబ్బతిన్నప్పుడు కేవలం 50శాతమే నష్టపరిహారంగా ఇస్తున్నారు. అది గరిష్ఠంగా రెండు హెక్టార్ల వరకే! కోట్లమంది రైతుల భవిష్యత్తుతో, దేశ ఆహార భద్రతతో ముడివడిన సమస్యలివి. పర్యావరణ మార్పులనుంచి వ్యవసాయాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. అందుకోసం సమగ్ర ప్రణాళికలతో, ముందస్తు వ్యూహాలతో కార్యాచరణకు దిగాల్సిన సమయమిది!

- డాక్టర్ పిడిగెం సైద‌య్య
(ర‌చ‌యిత, శాస్త్రవేత్త - ఉద్యాన విశ్వవిద్యాల‌యం)
Posted on 18-12-2015