Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

పంటసిరుల ఎత్తిపోతలు

* సాకారం కానున్న మరో ధాన్యాగారం

ఓ భారీ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం, పూర్తి చేయడం అంతా చకచకా జరిగిపోయింది. ఇది కూడా ఓ బ్యారేజీయో, రిజర్వాయరో, సొరంగ మార్గమో, ఒక లిఫ్ట్‌ పనో కాదు. ఇలాంటివన్నీ కలబోసిన అనేక భారీ నిర్మాణాలతో కూడిన అత్యంత భారీ, విశిష్టతలతో కూడిన కాళేశ్వరం ఎత్తిపోతల. ఈ ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం నాలుగేళ్లలో రూ.65వేల కోట్లు ఖర్చుపెట్టి ప్రధాన పనులన్నీ పూర్తి చేయడం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణ చరిత్రను తిరగరాయడమే. ఇంత తక్కువకాలంలో అంత ఎక్కువగా ఒక ప్రాజెక్టుపై ఖర్చుచేయడం, ప్రధాన పనులను పూర్తి చేయడం దేశంలో ఇదే మొదటిసారి. 22 లిఫ్టులు, 4,627 మెగావాట్ల సామర్థ్యంగల పంపులు, మూడు బ్యారేజీలు, 17 రిజర్వాయర్లు, 203 కిలోమీటర్ల దూరం సొరంగాలు, 1,531 కిలోమీటర్ల కాలువల నిర్మాణం... ఇలా అనేక పనుల సమాహారం- కాళేశ్వరం ప్రాజెక్టు! విదేశాల నుంచి మోటార్లు దిగుమతి చేసుకోవడంతో పాటు పనులన్నింటినీ ఏకకాలంలో జరిగేలా చూడటం, వీటన్నింటికీ మించి గత మూడేళ్లలో ఏడాదికి రూ.15వేల కోట్ల నుంచి రూ.20వేల కోట్ల వరకు ఈ ఒక్క ప్రాజెక్టుపైనే ఖర్చు చేయడం- సంకల్పం ఉంటే సాగునీటి ప్రాజెక్టు నిర్మాణం దశాబ్దాల పాటు కొనసాగాల్సిన అవసరం లేదని నిరూపించింది.

తక్కువ సమయంలోనే...
ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన భారీ ప్రాజెక్టుల్లో ఇది ఒకటిగా నిలవనుంది. చాలా ఎత్తుకు నీటిని తీసుకెళ్లే మార్గమధ్యంలో ఇన్ని భారీ లిఫ్టులుండే భారీ ఎత్తిపోతల పథకంగా కాళేశ్వరం గుర్తింపు పొందింది. భూగర్భంలోనే పంపుహౌస్‌లు నిర్మించడం, అత్యధికంగా 139 మెగావాట్ల సామర్థ్యం గల ఒక్కో మోటారును వినియోగించడం, ఎత్తిపోతల పథకానికి అవసరమైన నీటిని తోడేందుకు ఆసియాలోనే అతిపెద్దదైన బావిని తవ్వడం... ఇలా అనేక విశిష్టతలు కాళేశ్వరం ప్రాజెక్టులో ఉన్నాయి. 2008లో అప్పటి కాంగ్రెస్‌ ప్రభుత్వం చేపట్టిన ప్రాణహిత-చేవెళ్లను పునరాకృతి చేసి చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి 2016 మేలో శంకుస్థాపన జరిగింది. 2020 మే నెలలో ప్రాజెక్టు చివర ఉన్న రిజర్వాయర్‌లోకి నీటిని మళ్లించేలా ప్రభుత్వం పనులు పూర్తి చేయించింది. అంతర్రాష్ట్ర ఒప్పందం సహా కేంద్ర జలసంఘం నుంచి అన్ని అనుమతులూ సాధించింది. అన్ని పనులూ సమాంతరంగానే కొనసాగించి పూర్తి చేయగలిగింది. ప్రాజెక్టు పూర్తికావడం వల్ల రానున్న వానాకాలంలో తెలంగాణలో అత్యంత వెనకబడిన, కరవు ప్రాంతంలోని పొలాలకు నీరందనుంది. ఇదొక భగీరథ యత్నమే. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అత్యధిక సమయాన్ని ఈ ప్రాజెక్టుపైన పెట్టడం, నిరంతరం పురోగతిని గమనించడంతోపాటు నిధులకు ఆటంకం లేకుండా చూడటంవల్లే కాళేశ్వరం తక్కువ సమయంలో వాస్తవరూపం దాల్చింది. లక్ష్యంగా నిర్ణయించుకొన్న ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరందేలా డిస్ట్రిబ్యూటరీలు, పిల్లకాల్వలు పూర్తయితే- నిన్నటిదాకా కరవుతో అల్లాడిన ప్రాంతాల రూపురేఖలు మారిపోతాయి. తెలంగాణకు ‘గ్రోత్‌ ఇంజిన్‌’గా కాళేశ్వరం నిలవనుంది.

అత్యధిక ఆయకట్టు
రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధికంగా నీటిని వినియోగించే, అత్యధిక ఆయకట్టుకు నీటిని సరఫరా చేసే ప్రాజెక్టుల జాబితాలో కాళేశ్వరం ఎత్తిపోతల చేరనుంది. ఇప్పటివరకు నాగార్జునసాగర్‌ కింద ఎక్కువ నీటి వినియోగం, ఆయకట్టు ఉంది. నాగార్జునసాగర్‌ కుడి, ఎడమ కాలువలు, కృష్ణాడెల్టా అవసరాలకు 400 శతకోటి ఘనపుటడుగు(శ.కో.ఘ.-టీఎమ్‌సీ)లకు పైగా కేటాయింపు ఉంది. 34 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా ఈ పథకం ఆయకట్టుకే కాదు, తెలంగాణలో అతి ముఖ్యమైన మరో అయిదు ప్రాజెక్టుల కింద స్థిరీకరణకు ఉపయోగపడుతుంది. కొత్తగా సాగులోకి వచ్చే ఆయకట్టు 13 జిల్లాల్లో 18.26 లక్షల ఎకరాలు కాగా, ఈ అయిదు ప్రాజెక్టుల కింద మరో 18.7 లక్షల ఎకరాల స్థిరీకరణ ఉంది. ప్రాజెక్టు పరిధిలో చెరువులనూ ఈ నీటితో నింపనున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో అత్యధిక ఆయకట్టుకు సాగునీరందిస్తూ ప్రతి రెండు, మూడేళ్లకోసారి వానాకాలం పంటకు ఆయకట్టుకు నీరందించలేని శ్రీరామసాగర్‌ ప్రాజెక్టుకోసం కాళేశ్వరం నీటితో పునరుజ్జీవ పథకాన్ని ప్రభుత్వం చేపట్టింది. ఇలా కాళేశ్వరం నీటితో తెలంగాణలో ఎక్కువ భాగం తడవనుంది. ప్రస్తుతం రోజూ రెండు టీఎమ్‌సీల నీటిని గోదావరి నుంచి మళ్లించే పనులు పూర్తయ్యాయి. మూడో టీఎమ్‌సీ నీటిని మళ్లించే పని కూడా త్వరలోనే పూర్తి కానుంది. ఇది జరిగితే వానాకాలం సీజన్‌లోనే 300 టీఎమ్‌సీలకు పైగా నీటిని మళ్లించడానికి అవకాశం ఉంది. మరోవైపు ఈ ప్రాజెక్టు ద్వారా ఏడాదంతా నీటిని తీసుకోవచ్చు. ఈ ఏడాది మే రెండోవారం వరకూ గోదావరి నుంచి నీటిని మళ్లించారు. ఈ ప్రాజెక్టులో భాగంగా గోదావరి నదిపైనే నిర్మించిన బ్యారేజీల నుంచి నీటిని వినియోగించుకోవడానికి అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు వల్ల భూగర్భ జలవృద్ధీ జరుగుతుంది. ఏ రకంగా చూసినా ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణలోని అత్యధిక సాగుభూముల రూపురేఖలు మారిపోనున్నాయి.

సమర్థ నీటి వినియోగంపై దృష్టి
ఈ మహా ప్రాజెక్టు ద్వారా మళ్లించిన నీటిని అత్యంత సమర్థంగా వినియోగించుకోవడం కీలకం. కాళేశ్వరం ద్వారా కొత్తగా సాగులోకి వచ్చే ఆయకట్టుకు కేంద్ర జలసంఘం ఆమోదించిన నివేదిక ప్రకారం 134.5 టీఎమ్‌సీల కేటాయింపు ఉంది. ఈ నీటితో 18.25 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు సాగునీరు అందించాల్సి ఉంది. సమగ్ర ప్రాజెక్టు నివేదిక ప్రకారం వరితోపాటు పత్తి, మొక్కజొన్న, కంది, జొన్న, మిర్చి... ఇలా అన్ని పంటల సాగు ఉంది. ఈ పంటల ప్రకారమే నీటి వినియోగాన్ని నిర్ధారించారు. ఆచరణలోనూ ఇది అమలు జరిగినప్పుడే నిర్దేశించుకొన్న ఆయకట్టుకు నీరందుతుంది. ఎక్కువ నీటిని తీసుకొనే పంటలను సాగుచేస్తే ఆ ప్రభావం మొత్తం ప్రాజెక్టుపై పడుతుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొనే తెలంగాణ ప్రభుత్వం నిర్దేశిత పంటల సాగుపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఉదాహరణకు నాగార్జునసాగర్‌ కుడి, ఎడమకాలువలకు ఉన్న నీటి కేటాయింపు 264 టీఎమ్‌సీలు. కానీ 400 టీఎమ్‌సీలు వినియోగించిన సందర్భాలూ ఉన్నాయి. అయినా చివరి ఆయకట్టు భూములకు నీరందని పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ కాలువ ద్వారా నీటి ప్రవాహం జరుగుతుంది. నాగార్జునసాగర్‌ నిండి వరద నీటిని కిందికి వదిలినప్పుడు కాలువల నిండా నీటిని విడుదల చేయడానికి ఎలాంటి ఇబ్బందీ ఉండదు. కాళేశ్వరం అలా కాదు- అదనంగా అవసరమైన ప్రతి టీఎమ్‌సీని ఎత్తిపోయాల్సిందే. ప్రతి టీఎమ్‌సీకి అదనంగా విద్యుత్తు అవసరం అవుతుంది. ప్రస్తుతం రోజుకు రెండు టీఎమ్‌సీల నీటిని ఎత్తిపోసేలా మోటార్లు, పంపులు అమర్చారు. ఇవి పూర్తి స్థాయిలో నడిస్తే 4,627 మెగావాట్ల విద్యుత్తు అవసరమవుతుంది. కేంద్ర జలసంఘం ఆమోదించిన నివేదిక ప్రకారం ఏటా విద్యుత్తు ఖర్చు రూ.4,067 కోట్లు. ఎకరా ఆయకట్టుకు నీటిని సరఫరా చేయడానికి ప్రస్తుతం రెగ్యులేటరీ అథారిటీ నిర్ణయించిన యూనిట్‌ ధర రూ.6.40 ప్రకారం రూ.28 వేలు అవుతుంది. అతి తక్కువగా యూనిట్‌ ధర మూడు రూపాయలను పరిగణనలోకి తీసుకొన్నా- ఎకరా ఆయకట్టుకు నీటిని సరఫరా చేయడానికి రూ.13 వేలు ఖర్చవుతుందని అంచనా. ఈ విద్యుత్తు ఛార్జీలను రైతుల నుంచి వసూలు చేయకూడదని ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది. కొండపోచమ్మ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ మరోసారి ఈ విషయాన్ని ప్రకటించారు. నిర్ణయించిన పంటలను వేయకుండా ఎక్కువ నీటిని తీసుకొనే పంటల జోలికెళ్తే ఒక ఎకరా ఆయకట్టుకు అయ్యే విద్యుత్తు ఖర్చు గణనీయంగా పెరుగుతుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకొని ఆరంభం నుంచే సమర్థ నీటి వినియోగంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.

- ఎం.ఎల్‌.నరసింహారెడ్డి
Posted on 31-05-2020