Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


వ్యవసాయం

ఆహార నాణ్యతకు పురుగు!

* చట్టంలో రావాలి మార్పులు
దేశంలో ఆహార నాణ్యత పట్ల అనుమానాలు ముసురుకొంటున్నాయి. ముఖ్యంగా పంట ఉత్పత్తుల్లో పురుగుమందుల అవశేషాలు ఆందోళన కలిగిస్తున్నాయి. క్రిమిసంహారిణుల వినియోగంపై గట్టి నియంత్రణ కానీ, నిపుణుల మార్గదర్శకాలు కానీ లేకపోవడంతో పరిస్థితి విషమిస్తోంది. సంబంధిత చట్టసవరణ సహా కట్టుదిట్టమైన చర్యల ద్వారా ఈ పెడపోకడకు అడ్డుకట్ట వేయాల్సి ఉందిప్పుడు. సమీకృత క్రిమి సంహారిణుల నిర్వహణ కార్యక్రమం కింద జీవ క్రిమిసంహారిణులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని మొన్న లోక్‌సభకు తెలిపిన కేంద్ర వ్యవసాయ-రైతు సంక్షేమశాఖ సహాయ మంత్రి డాక్టర్‌ సంజీవ్‌కుమార్‌ బల్యన్‌, ఆ దిశలో ఏ విధంగా ముందడుగు వేస్తారో చూడాలి!

భారతదేశం 1960, 70లలో భారీయెత్తున ఆహారధాన్యాలు దిగుమతి చేసుకునేది. తరవాత రెండు దశాబ్దాల కాలంలోనే ఆహారధాన్యాల ఎగుమతిదారు స్థాయికి చేరింది. సంబంధిత పక్షాలన్నీ ఉమ్మడిగా సాధించిన విజయమది. సాగు క్షేత్రాల్లో అధిక దిగుబడులనిచ్చే రకాలు వేశారు. మెరుగైన ఎరువులు, పురుగుమందులు, విత్తనాలు ఉపయోగించారు. పంట విధానాన్నీ అభివృద్ధిపరచారు. వ్యవసాయ నిపుణుల సలహాలు, సూచనలూ బాగా ఉపకరించాయి. ఉత్పత్తి పెంపులో రైతులు ప్రధానపాత్ర పోషించారు. దేశంలో ఇప్పుడు తగినన్ని ఆహార నిల్వలు ఉన్నప్పటికీ ఆకలి చావులు తప్పకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పంపిణీ వ్యవస్థలో లోపాలే ఇందుకు ముఖ్య కారణం. రైతును జాతికి వెన్నెముకగా అభివర్ణిస్తున్నారు. ఇప్పుడు ఈ వెన్నెముకే విరిగి ముక్కలవుతోంది. దేశంలో రైతు పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. మరోవైపు మనకు లభిస్తున్న ఆహారం పోషక విలువలతో కూడుకున్నదేనా, ఆరోగ్యదాయకమైనదేనా, సురక్షితమేనా అన్న అనుమానాలూ ముసురుకొంటున్నాయి. అసలు, ఇలాంటి పరిస్థితి ఎందుకు వచ్చింది?

అవగాహనాలోపం

మొక్కలు ఆరోగ్యదాయకంగా ఉండి, అందించే ఆహారధాన్యాల మీదే మనుషుల ఆరోగ్యం చాలావరకు ఆధారపడి ఉంటుంది. తన ఆరోగ్యం చూసుకొంటున్న మనిషి, మొక్కల ఆరోగ్యాన్ని ఆ స్థాయిలో పట్టించుకుంటున్నాడా అని ప్రశ్నించుకుంటే, లేదనే సమాధానం వస్తుంది. మనిషి తన ఆరోగ్యం కోసం ఔషధాలు వాడతాడు. వైద్యుడి సలహామీద ఆ మందులు తీసుకుంటాడు. మొక్కల విషయంలో అలా జరగడం లేదు. పురుగుమందులు కొనుక్కుంటున్న రైతులు యథేచ్ఛగా వాటిని ఉపయోగిస్తుండటంతోనే చిక్కొచ్చి పడుతోంది. గట్టి నియంత్రణ కానీ, నిపుణుల మార్గదర్శకాలు కానీ లేకపోవడంతో పరిస్థితి విషమిస్తోంది. మొక్కల ఎదుగుదల సమయంలో చీడపీడలు, తెగుళ్ల బారిన పడకుండా చూసేందుకు పురుగుమందులు వాడతారు. ఆ సమయంలో సరైన జాగ్రత్తలు పాటించకపోతే మొక్కల్లో కానీ, వాటి ఉత్పత్తుల్లో కానీ అవక్షేపాలు ఉండిపోయి వినియోగదారుల మీద తీవ్ర దుష్ప్రభావం పడుతుంది.

రైతులు సరైన అవగాహన లేకుండా పురుగుమందుల్ని పొలాల్లో చల్లుతున్నారు. విక్రేతలూ ఏమీ తెలియకుండానే అమ్ముతున్నారు. తయారీదారుల నుంచి తగిన మార్గదర్శకాలు లభించడం లేదు. ఎక్కడ ఎలాంటి పురుగుమందుల్ని ఎంత మోతాదులో వాడాలో వ్యవసాయ విస్తరణ సంస్థా చెప్పదు. పురుగుమందుల చట్టం ప్రధానంగా తయారీని నియంత్రించడానికే పరిమితమైంది. వినియోగానికి సంబంధించిన అంశాలతో దానికి ప్రమేయం లేదు. ఇలాంటప్పుడు దుష్ప్రభావాలకు ఎవర్ని బాధ్యుల్ని చేయాలన్నా కష్టమే. వాస్తవంలో చాలా దేశాలకన్నా భారత్‌లో పురుగుమందుల వినియోగం తక్కువ. హెక్టారుకు సగటు పురుగుమందుల వినియోగం జపాన్‌లో 11 కిలోలు, అమెరికాలో తొమ్మిది కిలోలు, ఐరోపాలో మూడు కిలోలు. భారత్‌లో మాత్రం 575 గ్రాములే. అయినప్పటికీ భారత పంట ఉత్పత్తుల్లో పురుగుమందుల అవశేషాలు ఆందోళనకర స్థాయిలో ఉంటున్నాయి. దేశంలో పురుగుమందులను సరైన రీతిలో ఉపయోగించకపోవడమే ఇందుకు కారణంగా కనిపిస్తోంది. పురుగుమందుల్ని సద్వినియోగం చేసుకుంటే పండ్లు, కూరగాయలు సహా ఆరోగ్యదాయకమైన ఉత్పత్తుల్ని తక్కువ ధరలోనే పొందే అవకాశం ఉంటుంది. ఇప్పుడలా జరగడం లేదు. పురుగుమందుల వినియోగానికి సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ఉత్పత్తిదారులకు తెలియజేయడంలో విస్తరణ విభాగం విఫలమవుతోంది. సరైన సమాచారాన్ని అందించి, అందులో చేసిన సూచనలను తు.చ. తప్పకుండా పాటించకపోతే విపరిణామాలు తప్పవని హెచ్చరిస్తే, ఆ మేరకు రైతుల్లో అవగాహన కల్పిస్తే- ఉత్పత్తుల్లో పురుగుమందుల అవశేషాలకు ఆస్కారమే ఉండదు. అత్యధికంగా హెక్టారుకు 11కిలోల పురుగుమందుల్ని పంట పొలాల్లో వాడుతున్న జపాన్‌లో అత్యంత నాణ్యమైన ఆహారం లభిస్తోంది. అక్కడి జీవన ప్రమాణాలు బాగా మెరుగుపడ్డాయి. ఆయుఃప్రమాణం కొన్ని దశకాల క్రితమే 75ఏళ్లు దాటింది. క్రిమిసంహారిణుల కారణంగా ప్రజారోగ్యం క్షీణించే పక్షంలో, జపాన్‌లో పరిస్థితి ఇప్పుడూ దానికి పూర్తి విరుద్ధంగా ఉండాలి కదా! తగిన పురుగుమందులను సరైన పద్ధతుల్లో, అవసరమైన మోతాదుల్లో వినియోగిస్తేనే సత్ఫలితం ఉంటుంది. ఈ విషయంలో ముఖ్యంగా రైతులకు విస్తృత అవగాహన కల్పించేందుకు వ్యవసాయ నిపుణులు ముందుకు రావలసిన అవసరం ఉందిప్పుడు!

సత్వరం దిద్దుబాటు చర్యలు

ప్రజారోగ్యమే దేశప్రగతికి ఆలంబన. నాణ్యమైన ఆహార పదార్థాలు అందుకు కీలకావసరం. పర్యావరణ సమతుల్యానికి భంగం వాటిల్లకుండా చూస్తూనే, పంట దిగుబడులను భారీగా పెంచడం ముఖ్యం. అదే సమయంలో భూక్షయానికీ తావు లేకుండా చూడాలి. సమీకృత పంట నిర్వహణ పద్ధతుల ద్వారానే అది సాధ్యం. పురుగుమందులు సహా ఉత్పాదకాల సక్రమ వినియోగానికి వీలుగా సరైన సలహాలు ఇస్తూ, రైతుల్ని ఆ దిశలో నడిపేందుకు ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలి. రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచేందుకు నడుంకట్టాలి. వ్యవసాయ నిపుణుల పాత్రను పునర్‌ నిర్వచించాలి. వారి అనుమతి లేనిదే పురుగుమందులు, ఎరువులు అమ్మకుండా క్రిమిసంహారిణుల చట్టాన్ని సవరించాలి. సర్కారు సత్వరం స్పందించి ఈ తరహా చర్యలు చేపట్టకపోతే మున్ముందు పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉంది. వ్యవసాయ నిపుణులు మూగ ప్రేక్షకులుగానే మిగులుతారు. ఇష్టానుసారం పురుగుమందులు వాడే రైతులు, ఆ పురుగుమందుల అవశేషాలతో కూడుకున్న ఆహార ధాన్యాలు తినే వినియోగదారులూ దెబ్బతింటారు. ఒక్క పురుగుమందుల తయారీ, అమ్మకందారులు మాత్రమే లాభపడతారు. అప్పుడిక ఆహారధాన్యాలు విషతుల్యమవుతున్నాయని ఎవరిని నిందించినా ఎలాంటి ప్రయోజనం ఉండదు. పరిస్థితి పూర్తిగా చేజారకముందే చక్కదిద్దేందుకు పాలకులు సిద్ధపడాల్సిన సమయమిదే!

(రచయిత - సీహెచ్‌ నరసింహారావు)
Posted on 26-12-2015