Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

అదిగదిగో... ఆర్థిక నవలోకం..!

జులై 2013లో భారతదేశాన్ని ఆర్థిక సంక్షోభం అన్ని వైపుల నుంచి ఆవరించింది. 2008 నాటి ఆర్థిక మాంద్యం నుంచి త్వరగా కోలుకున్నామని మురిసిపోతున్న మనదేశానికి వివిధ ఆర్ధిక కొలబద్దలు ప్రతికూలంగా తయారవడం సవాలుగా మారింది. ద్రవ్యోల్బణం రెండంకెల గరిష్ఠ స్థాయికి చేరింది. ప్రస్తుత ఖాతాలో లోటు ఆందోళనకరంగా మారింది. మదుపుదారుల విశ్వాసం సన్నగిల్లడంతో మన రూపాయి విలవిల్లాడింది. దీంతో భారతదేశాన్ని ఆర్థిక ప్రతికూలతలు అన్ని వైపుల నుంచి ఆవరించినట్లయ్యింది. అప్పటికే బ్రెజిల్, ఇండోనేషియా, టర్కీ, దక్షిణాఫ్రికాల ఆర్ధిక వ్యవస్థలు ఆందోళనకరంగా తయారయ్యాయి. భారతదేశం కూడా ''ఆందోళనకర అయిదు ఆవిర్భవిస్తున్న ఆర్థిక వ్యవస్థలు" జాబితాలో చేరింది. ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉన్నాయి?

మధ్యంతర సమీక్ష

ఆర్థిక సంక్షోభ ప్రభావం 2014 ఎన్నికలపై కూడా పడింది. అందుకే ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడం కొత్త ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్య అంశంగా మారింది. సంకీర్ణాల యుగం అంతరించి రెండు దశాబ్దాల అనంతరం కేంద్రంలో స్పష్టమైన మెజార్టీతో ప్రభుత్వం కొలువుదీరింది. స్థిరమైన ఆర్థిక నిర్ణయాలను తీసుకునేందుకు అనువైన రాజకీయ వాతావరణం ఏర్పడింది.
¤ స్థూలంగా ఆర్థిక వ్యవస్థ స్థిరపడిందని 2014-15 వార్షిక మధ్యంతర సమీక్షలో కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. ఇందుకు కారణాలను కూడా కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పార్లమెంటుకు సమర్పించిన మధ్యంతర సమీక్షలో వివరించింది. సుస్థిర ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆర్థిక సంస్కరణల ప్రక్రియ వేగాన్ని పుంజుకుంది. ప్రపంచ ఆర్థిక అవలోకనం కూడా భారతదేశానికి సానుకూలంగా మారింది.
¤ నూతన రాజకీయ మార్పును మార్కెట్‌లు మనసారా స్వాగతించాయి. ఫలితం స్టాక్ మార్కెట్ ఊపందుకోవడమే. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకూ భారత స్టాక్ మార్కెట్ విలువ డాలర్లలో చూస్తే 33 శాతం పెరుగుదలను నమోదు చేసుకుంది. ఆవిర్భవిస్తున్న ఆర్థిక వ్యవస్థలలో ఇదే అధికం.
¤ భారతదేశంలోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ప్రవాహం పెరిగింది. అంతర్జాతీయ ద్రవ్యనిధి (ఐఎంఎఫ్) కూడా ఈ పరిణామాల పట్ల సానుకూలతను వ్యక్తం చేసింది.
¤ ప్రపంచ ఆర్థిక మాంద్యం 2008లో భారతదేశ ఆర్థిక వ్యవస్థను కుదిపేసే నాటికి దేశ స్థూల దేశీయోత్పత్తి సుమారు 9 శాతం వృద్ధి రేటును నమోదు చేసుకుంది. కానీ ఆర్థికమాంధ్యం దేశ ఆర్థిక వ్యవస్థను కుంగదీసింది. ఆ తర్వాత రెండేళ్లలో మనదేశ ఆర్థిక వ్యవస్థ తిరిగి పుంజుకున్నప్పటికీ మళ్లీ స్థూల ఆర్థిక కొలబద్దలన్నీ పతనావస్థను చూశాయి. 2010-14 మధ్యకాలంలో ఈ పతనం కొనసాగి చివరకు వృద్ధి రేటు 5 శాతం కిందికి కూడా పడిపోయింది.

వేగంగా ఆర్థిక సంస్కరణలు

2014లో అనేక ఆర్థిక సంస్కరణల చర్యలు ప్రారంభమయ్యాయి. వీటిలో ముఖ్యమైనవి... డీజిల్ ధరలపై నియంత్రణను ఎత్తివేశారు. గ్యాస్ ధరను ఎం.ఎం.బి.టి.యు. కు 4.2 డాలర్ల నుంచి 6.17 డాలర్లకు అంటే ఏకంగా 33 శాతం పెంచారు. ఈ చర్యల ద్వారా చమురు, సహజవాయువు రంగాలలోకి మరింతగా దేశ, విదేశీ ప్రయివేటు పెట్టుబడులను ఆకర్షించవచ్చన్నది ప్రభుత్వ విధానం.
¤ ఇంధన ధరలను అంతర్జాతీయ మార్కెట్‌తో అనుసంధానం చేశారు. జాతీయస్థాయిలో వంట గ్యాసు సబ్సిడీలను నగదు బదిలీ ద్వారా అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాన్ని మరింతగా సడలిస్తూ రక్షణ రంగంలో సైతం 49 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను అనుమతించారు.
¤ ప్రభుత్వ వ్యయ నిర్వహణలో హేతుబద్ధతను తీసుకొచ్చేందుకు వ్యయ నిర్వహణ కమిషన్ ఏర్పాటయింది. ప్రధానమంత్రి జన్ ధన్ యోజన పథకం కింద ద్రవ్యసేవలను సమ్మిళితం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. దీని ద్వారా డిసెంబరు 2014 నాటికి తొమ్మిది కోట్ల ఖాతాలను తెరిచారు.
¤ బొగ్గురంగంలో కూడా సంస్కరణలను ప్రారంభించారు. బొగ్గు కేటాయింపులను వేలం ద్వారా చేపట్టనున్నారు. బొగ్గురంగంలో ప్రయివేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తున్నారు. బంగారంపై విధించిన పరిమాణాత్మక ఆంక్షలను ఎత్తివేశారు.
¤ పర్యావరణ అనుమతులను మంజూరు చేసే ప్రక్రియను వేగిర పరిచారు. కార్మిక సంస్కరణలను ప్రకటించారు. ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడుల ఉపసంహరణను ప్రారంభించారు.

అనుకూలంగా అంతర్జాతీయ వ్యవస్థ

ప్రపంచ ఆర్థిక వాతావరణం కూడా భారతదేశానికి ఈ కాలంలో సానుకూలంగా మారింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్న ఛాయలు కనిపిస్తున్నాయి. మరోవైపు భారతదేశం చేసుకునే ప్రధాన దిగుమతుల ధరలు గణనీయంగా తగ్గాయి. ఉదాహరణకు పెట్రోలియం ఉత్పత్తులు, బంగారం, వెండి, బొగ్గు, ఎరువులు, వంటనూనెలు మొదలగువాటి ధరలు బాగా తగ్గాయి. దీంతో భారతదేశానికి దిగుమతుల భారం తగ్గింది. భారతదేశ మొత్తం దిగుమతుల విలువలో వీటి విలువే 51 శాతం. స్థూల దేశీయోత్పత్తిలో 12 శాతం మేరకు వీటి వాటాయే.
¤ కొన్ని ఉత్పత్తుల దిగుమతుల ధరలు గణనీయంగా పడిపోయాయి. ఉదాహరణకు చమురు ధరలే 40 శాతం మేరకు క్షీణించాయి. దీనివల్ల భారతదేశ జీడీపీ 1.8 శాతం మేరకు ప్రభావానికి గురవుతోంది. ఇందులో చమురుధరల పతనం వల్లనే 1.5 శాతం ఉంటుంది.
¤ దిగుమతుల ధరల పతనం భారతదేశ ఆర్థిక వ్యవస్థకు అనేక రూపాలలో కలిసొచ్చింది. ప్రస్తుత ఖాతాలో లోటు తగ్గింది. ద్రవ్యోల్బణం చల్లబడింది. సబ్సిడీల భారం తగ్గింది. ఉదాహరణకు చమురు సబ్సిడీల భారమే దేశ జీడీపీలో ఒక శాతం మేరకు ఉంటుంది.

సంస్కరణల ప్రభావం...

2014-15 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ వృద్ధి రేటు కాస్తంత కోలుకుని 5.4 శాతం నుంచి 5.9 శాతం మేరకు ఉండగలదని జులై 2014లో పార్లమెంటుకు కేంద్ర ప్రభుత్వం సమర్పించిన 2013-14 సంవత్సర ఆర్థిక సర్వే పేర్కొంది. వృద్ధిరేటు పెద్దగా కోలుకోదని అంచనాకు రావడానికి కారణాలను కూడా ఆర్థిక సర్వే విశ్లేషించింది.

ఇందులో ముఖ్యమైనవి...
¤ సంస్కరణల ఫలితాలు ప్రభావం చూపడానికి సమయం పడుతుంది. ఆసియా దేశాలు, ముఖ్యంగా చైనా ఆర్థిక వ్యవస్థ మందకొడిగా ఉండటం వల్ల భారతదేశ ఎగుమతులు ప్రతికూల ప్రభావానికి లోనవుతాయి.
¤ రుతుపవనాలు సరిగాలేక వర్షపాతం సాధారణ స్థాయికన్నా తక్కువగా ఉంటుంది. ద్రవ్యోల్బణ ప్రభావం ఫలితంగా రిజర్వు బ్యాంకు ద్రవ్యపరమైన చర్యలను తీసుకోవడంలో ఇబ్బందులు తప్పవు. పైకారణాల వల్ల 2014-15 ఆర్థిక సంవత్సరంలో కూడా వృద్ధి రేటు ఆశించిన స్థాయిలో పెరగదని ఆర్థిక సర్వే అంచనా వేసింది.
¤ అయితే పరిస్థితి ఊహించిన దానికంటే మెరుగ్గా ఉంటుందని కేంద్రప్రభుత్వం ఇటీవల పార్లమెంటుకు సమర్పించిన మధ్యంతర ఆర్థిక సమీక్షలో పేర్కొంది. ఇందుకు ముఖ్యంగా రెండు కారణాలను సమీక్ష విశ్లేషించింది. మొదటిది ఆర్థిక సంస్కరణల చర్యలను వేగంగా తీసుకోవడం, రెండోది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ మెరుగ్గా కోలుకోవడం అని సమీక్ష పేర్కొంది.
¤ పెట్టుబడులు ఇంకా పుంజుకోవాల్సి ఉంది. ఆర్థిక వ్యవస్థపై రుతుపవనాల ప్రతికూలత అంత ఎక్కువగా ఉండకపోవచ్చు. అందువల్ల ఆర్థిక సర్వేలో అంచనా వేసిన దానికంటే ఎక్కువ వృద్ధి రేటును భారత ఆర్థిక వ్యవస్థ నమోదు చేయవచ్చని మధ్యంతర వార్షిక ఆర్థిక సమీక్ష పేర్కొంది.
¤ భారతదేశ ఆర్థిక వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరంలో 5.5 శాతం ఉండగలదని మధ్యంతర సమీక్ష అంచనా వేసింది.
¤ ఆర్థిక వ్యవస్థలో స్థూలంగా స్థిరత్వాన్ని సాధించడం ఆర్థిక వృద్ధిరేటుకు సానుకూల పరిణామం. దీనితోపాటు స్థిరమైన ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ప్రయివేటు పెట్టుబడులకు దేశ ఆర్థిక వ్యవస్థపై విశ్వాసం పెరుగుతుంది. ఇది మొత్తం మీద ఆర్థిక వృద్ధికి సానుకూలంగా ఉంటుంది.
¤ రష్యా సంక్షోభం మినహా కొత్తగా ప్రపంచాన్ని కుదిపేసే అంశాలేవీ సమీప భవిష్యత్తులో కనిపించడం లేదు. చమురు, వ్యవసాయోత్పత్తుల ధరలు పెద్దగా పెరగకపోవచ్చని అంచనా వేస్తున్నారు.
¤ ముఖ్యంగా భారతదేశ ఆర్థిక వృద్ధి పెరుగుదలకు దేశీయ ఆర్థిక వ్యవస్థ నుంచే సవాళ్లు ఎదురవుతున్నాయి. పెట్టుబడులు భారీగా పెరగలేదు. మౌలిక వసతుల రంగంలో పెట్టుబడులు నిలిచిపోయాయి. పూర్తికాని ప్రాజెక్టులలో స్తంభించిన పెట్టుబడుల మొత్తం విలువ రూ. 18 లక్షల కోట్ల మేరకు ఉంటుందని అంచనా.
¤ భారత కార్పొరేట్ రంగం రుణభారాన్ని ఎదుర్కొంటోంది. ప్రపంచంలోనే కార్పొరేట్ రుణభారం అధికంగా ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. ఈ రుణభారం బ్యాంకింగ్ రంగంలో నిరర్థక ఆస్తులను పెంచింది. ఫలితంగా కార్పొరేట్ లాభదాయకతపై ప్రతికూల ప్రభావం పడింది. దీని ప్రభావం పెట్టుబడులపై కూడా ఉంటోంది.

ద్రవ్యోల్బణం తగ్గడంతో పన్నుల ద్వారా వచ్చే ఆదాయం తక్కువగా ఉండొచ్చని అంచనా. ద్రవ్యోల్బణం తగ్గడం వినియోగదారులకు అనుకూలంగా ఉన్నప్పటికీ ప్రభుత్వానికి పన్నుల ద్వారా వచ్చే ఆదాయానికి గండిపడుతోంది. ఫలితంగా ఆర్థిక వృద్ధి రేటుకు సవాలుగా ఉంటోందని మధ్యంతర సమీక్ష పేర్కొంది. కానీ ద్రవ్యోల్బణం తగ్గడం వల్ల ప్రభుత్వం చేసే వ్యయం కూడా తగ్గుతుంది. ఫలితంగా ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.

సవాళ్లను అధిగమించాలంటే...
¤ ఆర్థిక సవాళ్లను అధిగమించాలంటే నిలిచిపోయిన ప్రాజెక్టులను త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా బొగ్గు, గ్యాస్ సరఫరాలకు హామీ ఇవ్వాలి. ఇప్పటికే ఈదిశగా ప్రభుత్వం చర్యలను ప్రారంభించిందని మధ్యంతర సమీక్ష పేర్కొంది.
¤ బొగ్గు రంగంలో సంస్కరణలను ప్రవేశ పెడుతున్నారు. సుప్రీంకోర్టు తీర్పుతో నిలిచిపోయిన బొగ్గు కేటాయింపులను తిరిగి వేలం పాటల ద్వారా కేటాయించే చర్యలు మొదలుపెట్టారు.
¤ పర్యావరణ అనుమతులను, భూమి, ఇతర కేటాయింపులను త్వరితగతిన పూర్తిచేయగలగాలి. దీనికున్న అవరోధాలను తొలగించాలి. కార్మిక సంస్కరణలను చేపట్టాలి. ఈ సంస్కరణల చర్యలకు ఇప్పటికే శ్రీకారం చుట్టారని మధ్యంతర సమీక్ష విశ్లేషించింది.
¤ ప్రయివేటు పెట్టుబడులను భారీగా ఆకర్షించగలగాలి. ముఖ్యంగా ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్యం ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. అందుకే ప్రయివేటు పెట్టుబడులకు తోడుగా ప్రభుత్వ పెట్టుబడులు కూడా పెరగాల్సి ఉందని మధ్యంతర సమీక్షయే విశ్లేషించడం గమనార్హం.
¤ 2007-2008 మధ్య కాలం నుంచి 2013-14 మధ్య కాలంలో కార్పొరేట్ పెట్టుబడులు 7 నుంచి 8 శాతం మేరకు తగ్గాయి. ఈ కాలంలో ప్రభుత్వ పెట్టుబడులు కూడా 1.5 శాతం మేరకు తగ్గాయి. అందువల్ల ఆర్థిక వృద్ధిరేటును మళ్లీ గాడిన పెట్టాలంటే ప్రభుత్వ, ప్రయివేటు పెట్టుబడులు రెండూ పెరగాల్సి ఉంది. దీంతోపాటు అవసరమైన చట్టపరమైన మార్పులను ప్రవేశ పెట్టాల్సి ఉంటుందని సమీక్ష విశ్లేషించింది.
¤ భారతదేశ ఆర్థిక వ్యవస్థలో ఈ సానుకూల మార్పులు వచ్చినప్పుడే పెట్టుబడులు కూడా అధికంగా రాగలవని మధ్యంతర సమీక్ష వ్యాఖ్యానించింది. ఆర్థిక వృద్ధికి స్థూలంగా సానుకూల పరిస్థితి ఉంది. దీని ప్రభావం ఇప్పటికిప్పుడు లేకపోయినా భవిష్యత్తులో ఆర్థిక వృద్ధి మరింత వేగంగా పెరగవచ్చనేది మధ్యంతర సమీక్ష చేసిన విశ్లేషణ సారాంశం.

(రచయిత - ప్రొఫెసర్ కె. నాగేశ్వర్)
Posted on 12-1-2015