Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

మెరవని పసిడి పథకాలు

* నగదీకరణకు దేవుడేనా దిక్కు?
పెరిగిపోతున్న పసిడి దిగుమతులు దేశ ఆర్థిక వ్యవస్థను అయోమయంలో పడేస్తున్నాయి. వాటిని కట్టడిచేసే ప్రయత్నంలో భాగంగా మోదీ ప్రభుత్వం ఈ ఏడాది నవంబరు అయిదున మూడు పసిడి పథకాలు (పసిడి బాండ్ల పథకం, పసిడి నగదీకరణ పథకం, సార్వభౌమ పసిడి నాణాల పథకం) ప్రారంభించింది. ఈ మూడింటిలో మొదటి రెండూ చాలా ముఖ్యమైనవి. పసిడి బాండ్ల పథకం ప్రభుత్వ అంచనాల మేరకు విజయవంతమైంది. పసిడి నగదీకరణ పథకం మాత్రం ప్రభుత్వానికి ఆశాభంగం కలిగించింది. పసిడి బాండ్ల పథకం కింద 63వేల దరఖాస్తుల ద్వారా రూ.246కోట్ల విలువచేసే 917టన్నుల పసిడి బాండ్లు కేవలం 15రోజుల్లో అమ్ముడయ్యాయి. ఇవి సుమారు ఒక సంవత్సరం పసిడి దిగుమతులకు సమానం. అంటే, ఈ పథకం ఒక సంవత్సరం బంగారం దిగుమతులను అరికట్టగలిగింది. పసిడి నగదీకరణ విషయంలో ఇందుకు విరుద్ధంగా జరిగింది. దేశంలో నిరుపయోగంగా ఉన్న 20వేల టన్నుల్లో 400గ్రాముల పసిడి మాత్రమే బ్యాంకులను ఆకర్షించగలిగింది. ఇచ్చిన కాలవ్యవధి తక్కువగా ఉండటం, ప్రజల్లో చాలామందికి సరైన సమాచారం లేకపోవడం ఈ పథకం విఫలం కావడానికి ముఖ్యకారణాలు. అనుకున్నదొక్కటి అయినది వేరొక్కటి కావడంతో కేంద్రం ఈ విషయంలో నిపుణుల సలహా తీసుకోవాలని నిర్ణయించింది.

తరగని మోజుతో తంటాలు

భారతీయులకు ముఖ్యంగా పడతులకు బంగారం అంటే ఎంతో ఇష్టం. ఈ మోజు వెలకట్టలేనిది, విడదీయలేనిది. అటువంటి వస్తువు నేడు దేశానికి తీవ్రమైన సమస్యను తెచ్చిపెడుతోంది. దేశప్రజలకు ప్రాణసమానమైన బంగారమే నేడు దేశ ఆర్థిక వ్యవస్థకు ప్రతిబంధకంగా మారింది. చిదంబరం కేంద్ర ఆర్థికమంత్రిగా ఉన్నప్పుడు బంగారం కొనడం వాయిదా వేయాల్సిందిగా దేశ ప్రజలను కోరారంటే- సమస్య ఎంత జటిలమైనదో విశదమవుతుంది. చివరకు పెరిగిపోతున్న పసిడి దిగుమతులను నియంత్రించడానికి కస్టమ్స్‌ సుంకాన్ని రెండు శాతం నుంచి అంచెలంచెలుగా 10శాతానికి పెంచారు. ఇదికాక దిగుమతులపై కొన్ని కఠిన ఆంక్షలు విధించారు. ఈ చర్యల ద్వారా కొంతమేరకు పసిడి దిగుమతులను కట్టడిచేయగలిగినా, పసిడి అక్రమ రవాణాను అరికట్టగలిగినా పూర్తిస్థాయిలో మాత్రం అడ్డుకోలేకపోతున్నారు. దీనికంతటికీ కారణం పసిడిపై గల మోజే. ముఖ్యంగా భారతీయ మహిళలు సొంత బంగారాన్ని విడిచిపెట్టడానికి ససేమిరా ఒప్పుకోరు. తమ ఆభరణాలను కరిగించడానికి సమ్మతించరు. శుభకార్యాల్లో బంగారం ఒంటిపై లేకపోతే, తోటి స్త్రీలు తమను చులకనగా చూస్తారన్న భావన వారిలో అధికం. డిపాజిట్‌ గడువు ముగిసేనాటికి పసిడి ధర అనూహ్యంగా తగ్గిపోతే డిపాజిట్‌దారుడు చాలా నష్టపోతాడు. ఈ పథకానికి స్పందన కొరవడటానికి ఇదీ ఒక కారణం. ఈ తగ్గుదల అనేది బహు అరుదు. అనాదిగా తమ పూర్వీకుల నుంచి సంక్రమిస్తున్న బంగారాన్ని వదులుకోవడానికి, కరిగించడానికి ప్రజలు ససేమిరా ఇష్టపడటంలేదు. ప్రజలు ముందుకు రాకపోవడంవల్లే ప్రఖ్యాత దేవాలయాల్లో నిక్షిప్తంగా, నిరుపయోగంగా ఉన్న బంగారంపై ప్రభుత్వం దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తోంది.

పసిడి నగదీకరణ పథకం విజయవంతం కావాలంటే దేశంలోని కనీసం 100 ప్రముఖ దేవాలయాల్లోని బంగారం అవసరమని ప్రభుత్వం భావిస్తోంది. దీనిద్వారా ఏటా కనీసం 1000 టన్నుల బంగారం ఈ పథకానికి లభ్యమవుతుంది. మనదేశం ఏటా దిగుమతి చేసుకుంటున్న బంగారానికి ఇది సమానం. అంటే పసిడిని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ మేరకు మన వాణిజ్య లోటు తగ్గుతుంది కూడా. మోదీ ప్రభుత్వం ఆ దిశలో అడుగులు వేయడం మొదలుపెట్టింది. దీనిలో భాగంగా మొట్టమొదట 5000 సంవత్సరాలు పురాతన చరిత్రగల, ప్రపంచంలోనే సంపన్న హిందూ దేవాలయమైన తిరుపతి వేంకటేశ్వరస్వామి సన్నిధిలో గల 5.5టన్నుల (ఇంతకన్నా ఎక్కువ ఉండవచ్చు) పసిడిని ఈ పథకం పరిధిలోకి తీసుకురావాలని ఇటీవల నిశ్చయించింది. సంపన్నులు, జమీందారులు, మహారాజులు పుణ్యం కోసమంటూ వివిధ దేవాలయాల్లోని దేవుళ్లకు బంగారు ఆభరణాలు, కడ్డీలు, నాణాలు సమర్పిస్తూ వచ్చారు. చాలా దేవాలయాల్లో బంగారు నిక్షేపాలను భూమిలోపల దాచి ఉంచారు. తిరువనంతపురం అనంతపద్మనాభస్వామి దేవాలయమే దీనికి నిదర్శనం. తిరుపతి దేవస్థానం తమ వద్దగల చాలా బంగారాన్ని స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా వద్ద ఒక రూపాయి వడ్డీ లభించే 1999నాటి పథకం కింద ఇదివరకే డిపాజిట్‌ చేశారు. తిరుపతి దేవస్థానంవద్ద ఉన్న 5.5టన్నుల బంగారాన్ని ఈ పథకం కిందకి తీసుకురాగలితే రాబోయే అయిదు, ఆరు సంవత్సరాల వరకు మనదేశం పసిడి దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఆ మేరకు మన వాణిజ్యలోటు కూడా తగ్గుతుంది. దేవస్థానం దేవాలయ పెట్టుబడి కమిటీ కూడా ఈ పథకానికి సుముఖంగా ఉండటం విశేషం. తద్వారా గతంలో డిపాజిట్‌ చేసిన పసిడిని ఈ కొత్త పథకంలో డిపాజిట్‌ చేస్తే, ఒక శాతం నుంచి 2.5శాతం వడ్డీ లభిస్తుంది. దీన్ని దైవ కార్యకలాపాలకు ప్రజాసంక్షేమ కార్యక్రమాలకు వినియోగించవచ్చు.

ప్రభుత్వం ఎంపిక చేసిన అన్ని దేవాలయాలు ఈ పథకానికి సుముఖంగా ఉండకపోవచ్చు. దేవాలయాల్లోని బంగారం భక్తులు భక్తితో దేవుడి అలంకరణ కోసం సమర్పించుకున్నది. అటువంటి బంగారాన్ని దేవుడి సన్నిధానంలో కాకుండా కరిగించడానికి భక్తులు ఇష్టపడక పోవచ్చు. అలాచేస్తే వారి మనోభావాలను, నమ్మకాలను దెబ్బతీసినట్లు అవుతుంది. ముంబయిలోని 200 సంవత్సరాల చరిత్రగల శ్రీసిద్ధి వినాయక దేవస్థానం కమిటీ ఈ విషయంలో తమ విముఖతను ఇప్పటికే వ్యక్తపరచింది. తిరువనంతపురంలోని అనంత పద్మనాభస్వామి దేవాలయంలోగల అశేష నిధి ఎంతో పురాతన చరిత్ర కలిగి ఉంది. కేవలం ఒక బ్యాంకు బాండు కోసం దాన్ని కరిగించడానికి ఆ దేవస్థానంవారు ఒప్పుకొనకపోవచ్చు. అంతేగాక, కరిగించే ప్రక్రియలో బంగారంలో ఉన్న రాగి వంటివి పోవడం వల్ల ఇచ్చే బంగారం తగ్గిపోతుంది. ప్రముఖ దేవాలయాల దేవస్థానాలన్నింటినీ ఒక్కతాటిపైకి తీసుకురాగలిగితే ఆ ఘనత మోదీ ప్రభుత్వానికే దక్కుతుంది.

తీరుమారాలి...

పసిడి వినిమయం విషయంలో చైనా తరవాత ద్వితీయస్థానం మన దేశానిదే. పసిడిపైగల మోజువల్ల 2012-2013లో భారత్‌ పసిడి దిగుమతులు వాణిజ్యలోటులో 28శాతం ఆక్రమించాయి. ప్రస్తుత పసిడి పథకాలు విజయవంతం కావాలంటే ప్రజలను క్షేత్రస్థాయిలో చైతన్యవంతులను చేయాల్సి ఉంటుంది. పసిడి దిగుమతివల్ల ఎదురవుతున్న కష్టనష్టాల గురించి ప్రజలకు వివరించాలి. అప్పటికీ వారిలో మార్పురాకపోతే, బంగారు నియంత్రణ పథకం ద్వారా గట్టి చర్యలు చేపట్టాలి. సంపన్నులు, ఎక్కువ బంగారం కలిగివున్నవారు ఏటా ఆదాయపు పన్ను మాదిరిగా తమ వద్దనున్న బంగారాన్ని ప్రభుత్వానికి తెలియజేసేలా చూడాలి. ప్రజలు బంగారు నిల్వల సమాచారం స్వచ్ఛందంగా సమర్పించనప్పుడు కఠిన నిర్ణయాలకూ వెనకాడరాదు. బ్యాంకులు డిపాజిట్‌ ద్వారా సేకరించిన బంగారాన్ని ప్రైవేటు బంగారు నగల వర్తకులకు దిగుమతి ధర కన్నా తక్కువకు ఇవ్వజూపితే వారు ఆ బంగారాన్ని భారీగా కొనే అవకాశం ఉంది. పసిడి దిగుమతులను కట్టడి చేసే ప్రయత్నంలో భాగంగా కేంద్రం స్టాక్‌ఎక్స్ఛేంజ్‌ తరహాలో గోల్డ్‌ ఎక్స్ఛేంజిను ఏర్పాటుచేసే యోచనలో ఉంది. బంగారాన్ని కొనదలచినవారు, అమ్మదలిచినవారు ఈ ఎక్స్ఛేంజ్‌ ద్వారా ఒక నియంత్రిత పద్ధతిలో తమ కార్యకలాపాలను చేసుకోవచ్చు. వ్యక్తిగత మనోభావాలకన్నా దేశ శ్రేయమే ముఖ్యమని భావించి సంపన్నులు, బంగారం అధికంగా గలవారు ఈ పథకానికి చేయూత ఇవ్వాలి. అలాగే, ప్రభుత్వం ఎంపికచేసిన దేవాలయాలు తిరుపతి మాదిరిగా సహకరిస్తే ఈ పథకం తప్పక విజయవంతమవుతుంది.

- ఆచార్య బి. రామ‌కృష్ణారావు
(ర‌చ‌యిత - ఆర్థిక, వాణిజ్య రంగ నిపుణులు)
Posted on 18-12-2015