Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

బలోపేతం చేస్తే బహు లాభం

* దివాలా చట్టం అమలుతీరు

అప్పు ఇచ్చినవారు తప్పని పరిస్థితుల్లో సాధ్యమైనంత ఎక్కువ మొత్తాలను రాబట్టుకోవడానికి తోడ్పడే దివాలా చట్టం దేశంలో 2016 నుంచి అమలులోకి వచ్చింది. రుణదాతలు, రుణగ్రహీతల కష్టనష్టాలను దృష్టిలో ఉంచుకుని, ఉభయులకూ తగు న్యాయం చేయడానికి ఈ చట్టం తీసుకొచ్చారు. సాధారణంగా వ్యాపారులు అనేక సంస్థలు, వ్యక్తుల నుంచి తీసుకొంటారు. దివాలా పరిస్థితుల్లో రుణగ్రహీతను అప్పులిచ్చినవారు వేధించడం వల్ల అంతగా ఉపయోగం ఉండదు. అందువల్ల దివాలా చట్టం కింద రుణాల వసూలు లేదా ఇతర విధాలుగా పరిష్కారం కోసం అందరూ కలిసి ఒక అంగీకారానికి రావడం ఉభయ తారకమవుతుంది. ఆ ప్రక్రియను పర్యవేక్షించడానికి ఏర్పడిన భారత దివాలా బోర్డు (ఐబీబీఐ), వివాదాల పరిష్కారంలో ఊపిరిసలపనంత ఒత్తిడిని ఎదుర్కొంటోంది. పోనుపోను పారుబాకీల బెడద పెరిగిపోవడమే ఈ ఒత్తిడికి మూలకారణం. ఐబీబీఐ రేయింబవళ్లు పరిష్కార ప్రక్రియలో నిమగ్నమైనా వివాదాల కొండ తరగడం లేదు. అయినప్పటికీ తనకున్న పరిమితుల్లోనే దివాలా బోర్డు చెప్పుకోదగిన ఫలితాలను సాధించింది. పారుబాకీల కేసు విచారణను 270 రోజుల్లో పూర్తి చేయాలని దివాలా చట్టం నిర్దేశిస్తోంది. వ్యాజ్యదారులు ఏదో ఒక సాకుతో పదేపదే విచారణ వాయిదాను కోరే అవకాశం లేకుండా చూడటానికే ఈ నిబంధనను విధించింది. చట్టం చెప్పిన వ్యవధిలో పని పూర్తి చేయడం అంత సులువేమీ కాదు.

విమర్శలు... సంక్లిష్టతలు
దివాలా చట్టం కింద కేసులను 270 రోజుల్లో పరిష్కరించవలసి ఉన్నా ఆచరణలో అలా జరగడం లేదు. అత్యధిక వ్యాజ్యాలకు సగటున 300 నుంచి 374 రోజుల వరకు పడుతోంది. కొన్నింటికి అంతకన్నా ఎక్కువ వ్యవధి తీసుకుంటున్నారు. పైగా పారుబాకీలవసూలు రేటు చాలా తక్కువగా ఉంది. ఈ రెండు అంశాల్లో దివాలా చట్టం మీద విమర్శలు వినిపిస్తున్నాయి. వీటిని తోసిపుచ్చలేం. కానీ, మొత్తం బకాయిల్లో అసలు ఎంత మొత్తాన్ని తిరిగి రాబట్టగలమనేది ఎవరూ చెప్పలేరు. ఏదైనా భారీ సంస్థ నష్టాలపాలైతే అది చేసిన అప్పుల్లో 10 శాతం మించి తిరిగిరావని ప్రపంచ అనుభవం చెబుతోంది. సంస్థ తన రుణదాతలకు పూర్తిగా ఎగనామం పెడితే ఎదురయ్యే పరిస్థితి ఇది. భారత్‌లో దివాలా చట్టం కింద సంస్థ మూసివేత నాటి విలువలో అయిదు నుంచి 60 శాతం వరకు రుణదాతలకు ముట్టడం విశేషం.

పరిష్కారంలో సవాళ్లు
దేశ ఆర్థిక రథం జోరుగా పరుగులు తీయడమన్నది ప్రైవేటు వ్యాపారాల విస్తరణతోనే సాధ్యపడుతుంది. పెట్టుబడులు లేకుండా వ్యాపారం లేదు. ప్రారంభ పెట్టుబడుల్లో కొంత భాగాన్ని సొంత వనరుల నుంచి సేకరించి, మిగతాది ఆర్థిక సంస్థల నుంచి సేకరించడం రివాజు. వ్యాపారం లాభసాటిగా జరిగితే అంతా బాగానే ఉంటుంది. నష్టాలు చుట్టుముడితే అప్పుల మీద అప్పులు తెచ్చి నడిపించడంకన్నా మూసివేయడమే మేలు. వేగంగా వ్యాపారాన్ని ప్రారంభించడానికి, నష్టాలొస్తే అంతే వేగంగా మూసివేయడానికి వీలున్న వాతావరణంలోనే వ్యవస్థాపకులు చొరవగా ముందుకొస్తారు. ఈ సందర్భంలో రుణదాతల ప్రయోజనాల మాటేమిటనే ప్రశ్న వస్తుంది. తమ రుణాలు తిరిగివస్తాయనే భరోసా ఉన్నప్పుడే వ్యాపారాలకు నిధులు లభిస్తాయి. సంపన్న దేశాల్లో బాండ్ల మార్కెట్‌ ద్వారా సంస్థలకు పెట్టుబడులు సమకూరుతాయి. అలాంటి మార్కెట్‌ మన దేశంలో పూర్తిస్థాయిలో ఏర్పడనందువల్లే పెట్టుబడుల కొరత ఎదుర్కొంటున్నాం. రుణదాతలు తమ డబ్బు రాబట్టుకోవడం కోసం ఏళ్లతరబడి న్యాయస్థానాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. భారత న్యాయస్థానాల్లో మూడు కోట్లకు పైగా కేసులు ఇప్పటికీ అపరిష్కృతంగా ఉన్నందువల్ల ఇలాంటి వ్యాజ్యాలను వేగంగా పరిష్కరించలేకపోతున్నాయి. దివాలా చట్టం పరిష్కార ప్రక్రియను వేగవంతం చేస్తుందని ఆశించినా అది నెరవేరలేదని అసంతృప్తి వ్యక్తమవుతోంది. అపార్థాలు, అపోహలే ఈ అసంతృప్తికి కారణమని చెప్పక తప్పదు. ఆర్థిక సంస్థలు ఇచ్చిన మొత్తం అప్పుల్లో రూ.3.32 లక్షల కోట్లను తిరిగి రాబట్టవచ్చునని తేలింది. ఇది కాకుండా రాజకీయ సంబంధాలున్న 12 భారీ సంస్థలు రూ.3.45 లక్షల కోట్ల మేరకు బాకీ పడగా, రిజర్వుబ్యాంకు వాటిపై చర్యలకు ఆదేశించింది. వీటిలో ఏడు సంస్థల నుంచి లక్ష కోట్ల రూపాయల మేర దివాలా చట్టం కింద తిరిగి రాబట్టగలిగారు. వీటిలో నాలుగు సంస్థలకు ఇచ్చిన రుణాల్లో 40 శాతాన్ని, మూడింటిలో 50 శాతం రుణాలను వసూలు చేసుకున్నారు. మిగతా సంస్థల వ్యాజ్యాల విచారణ ఇంకా సాగుతోంది.

ఈ చట్టం కింద గడువు లోపల వ్యాజ్యాలు పరిష్కారం కాని మాట నిజమే. కానీ, కొత్త చట్టాలు పూర్తిస్థాయిలో అమలులోకి రావడానికి కొంత సమయం పడుతుందని గ్రహించాలి. ఏ చట్టమైనా ఆచరణలో కుదురుకుని స్థిరంగా ఫలితాలు ఇవ్వాలంటే కనీసం మూడు నుంచి అయిదేళ్లు పడుతుంది. నియంతృత్వ దేశాల్లో ఈ ప్రక్రియ వేగంగా జరగవచ్చు. ప్రజాస్వామ్య దేశాల్లో అనివార్యంగా ఆలస్యమవుతుంది. ఇక్కడ న్యాయస్థానాలు, చట్టాలను దాటి ఎవరూ ముందుకు వెళ్లలేరు. ప్రభుత్వాలు సైతం పారుబాకీల వసూలు ప్రక్రియను వేగవంతం చేయలేవు. ఏ విధంగానూ ప్రభావిత పరచలేవు. ప్రభుత్వం ఒకవేళ జోక్యం చేసుకున్నా దాన్ని సవాలు చేసే హక్కును రాజ్యాంగం పౌరులకు కట్టబెట్టింది. అందువల్ల దివాలా చట్టం కింద జరిగిన విచారణ ప్రక్రియలో చట్టవిరుద్ధంగా జోక్యం చేసుకుంటే కక్షిదారులు ఉన్నత న్యాయస్థానాలను ఆశ్రయించవచ్చు. అదే జరిగితే న్యాయస్థానాలు దివాలా చట్ట విచారణ కార్యక్రమాన్ని వాయిదా వేయిస్తాయి. ఫలితంగా వ్యాజ్యం పరిష్కారం కావడం బాగా ఆలస్యమవుతుంది. భూషణ్‌ స్టీల్‌, ఎస్సార్‌ స్టీల్‌ వంటి వ్యాజ్యాల విచారణలో జరిగింది ఇదే. ఈ తరహా వ్యాజ్యాల్లో తన వద్దకు వచ్చిన అప్పీళ్లను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడానికి సుప్రీంకోర్టు ప్రయత్నించడం ఊరటనిచ్చే విషయం. పారుబాకీలను మొదట తమకే చెల్లించాలని రెండు ప్రభుత్వ విభాగాలు పోటీ పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి. దీన్ని చక్కదిద్దడానికి చట్టంలో తగు మార్పులు చేర్పులు చేయాలి. ఒకే గ్రూపులో పలు సంస్థలు దివాలా తీసినప్పుడు బకాయిల వసూలుకు అనుసరించాల్సిన పద్ధతిపై యు.కె.సిన్హా కమిటీ త్వరలోనే నివేదిక సమర్పించనుంది. దేశంలో వివిధ గ్రూపులకు చెందిన 47 సంస్థల నుంచి లక్ష కోట్ల రూపాయలు వసూలు కావలసి ఉంది.

మౌలిక వసతుల లేమి
దేశవ్యాప్తంగా బకాయిల వ్యాజ్యాలు అనేకం ఉన్నాయి. చట్టం చెప్పిన గడువులో వాటిని పరిష్కరించాలంటే విస్తృత మౌలిక వసతులు కావాలి. అవి లేనందునే దివాలా వ్యాజ్యాలు త్వరగా తెమలడం లేదు. వీటి పరిష్కారానికి ఉద్దేశించిన నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ (ఎన్‌సీఎల్‌టీ) ప్రధాన న్యాయస్థానం దిల్లీలో ఉంటే, దేశమంతటా 13 డివిజన్‌ బెంచీలు ఉన్నాయి. కేంద్ర రాష్ట్రాలు గట్టిగా కృషి చేయకపోవడం వల్లే ఎన్‌సీఎల్‌టీకి తగినంతమంది సిబ్బంది కాని, మౌలిక వసతులు కాని సమకూరలేదు. అపరిష్కృత కేసులను వేగంగా పరిష్కరించాలంటే 69 బెంచీలు కావాలి. వ్యాపార ఒప్పందాలను పాటించడం, వివాదాలు తలెత్తితే వేగంగా పరిష్కరించడం ద్వారానే సులభంగా వ్యాపారం జరిగే వాతావరణాన్ని కల్పించగలుగుతాం. రాష్ట్ర ప్రభుత్వాలు దివాలా చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయడం అటుంచి, జిల్లాల్లో వాణిజ్య వ్యాజ్యాల పరిష్కార న్యాయస్థానాలను సైతం ఏర్పాటు చేయలేకపోయాయి. 2015 చట్టం ప్రకారం దేశంలోని అన్ని జిల్లాల్లో వాణిజ్య న్యాయస్థానాలను నెలకొల్పవలసి ఉంది. కొద్దో గొప్పో వాణిజ్య న్యాయస్థానాలు పనిచేస్తున్నా వాటికీ తగిన వసతులు లేవు.దివాలా కేసులను వేగంగా పరిష్కరించడానికి 2016లో ఐబీసీ చట్టం తీసుకురావడానికి ముందు, పరిస్థితి అస్తవ్యస్తంగా ఉండేది. భారత్‌లో ఇలాంటి వ్యాజ్యాల పరిష్కారానికి 2015లో 4.3 సంవత్సరాలు పట్టగా, బ్రిటన్‌లో ఓ ఏడాది, అమెరికాలో ఒకటిన్నర సంవత్సరం, దక్షిణాఫ్రికాలో రెండేళ్లు మాత్రమే పట్టేది. బ్యాంకుల పారుబాకీల సత్వర పరిష్కారానికి ఐబీసీ తోడ్పడుతుందని ఆశించినా ఆ ప్రక్రియ ఇటీవల కొంత మందగించింది. పరిస్థితి ఇలానే ఉంటే ఐబీసీ పరమార్థం దెబ్బతింటుందని ఈ ఏడాది ఆ చట్టానికి కొన్ని సవరణలు చేశారు. అవి పార్లమెంటు ఉభయ సభల ఆమోదం పొందాయి. దివాలా వ్యాజ్యాల్లో అత్యధికం స్థిరాస్తి రంగంలోనే దాఖలయ్యాయి. గృహ కొనుగోలుదారులను ఫైనాన్షియల్‌ రుణదాతలుగా గుర్తించి మొట్టమొదట వారి బకాయిలనే చెల్లించాలని తాజా సవరణలు నిర్దేశించాయి. ఫైనాన్షియల్‌ రుణదాతలకు ప్రథమ ప్రాధాన్యమిచ్చి మిగతావారినందరినీ ఆపరేషనల్‌ రుణదాతలుగా గుర్తించారు. ఈమధ్య కాలంలో పలు స్థిరాస్తి ప్రాజెక్టులు దివాలా తీసిన నేపథ్యంలో ఇది మంచి నిర్ణయమే. కానీ, ఆచరణలోకి వచ్చేసరికి ఆపరేషనల్‌ రుణదాతలే పరిష్కారం కోసం ఎక్కువ వ్యాజ్యాలు వేస్తున్నారు. మిగతా రంగాలకన్నా ఉక్కు రంగంలో బకాయిల వసూలు ఎక్కువగా (53 శాతం) కనిపిస్తోంది. మిగతా రంగాల్లో ఇది 31 శాతమే. ఐబీసీ పరిష్కార యంత్రాంగానికి న్యాయమూర్తుల కొరత మరో పెద్ద సమస్య. ఈ లోపాలన్నీ సరిదిద్దితే ఐబీసీ వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుంది.

Posted on 07-11-2019