Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

ప్రగతి చోదకంగా పెట్టుబడులు

* ఆర్థిక మాంద్యానికి విరుగుడు

* స్థిర వృద్ధికి సిసలైన పరిష్కారం

భారత ఆర్థిక వృద్ధిరేటు గతంలో కంటే తక్కువగా ఉంటుందన్న అంచనాతో అంతర్జాతీయ క్రెడిట్‌ రేటింగ్‌ సంస్థ ‘మూడీస్‌’ రెండు వారాల క్రితం క్రెడిట్‌ రేటింగ్‌ను ‘స్థిరం’ (స్టేబుల్‌) నుంచి ‘రుణాత్మకం’ (నెగెటివ్‌) స్థాయికి తగ్గించింది. తాజాగా ఆర్థిక మందగమనం ఊహించిన దానికంటే ఎక్కువ కాలం ఉంటుందని పేర్కొంటూ జీడీపీ వృద్ధిరేటు అంచనాను 5.8 నుంచి 5.6 శాతానికి కుదించింది. ఈ గణాంకాలు కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

కొన్నేళ్లుగా ఆర్థిక వ్యవస్థ వృద్ధిని అత్యంత ప్రభావితం చేసిన వినియోగం, పెట్టుబడుల్లో మందగమనం కనిపిస్తోంది. ప్రైవేట్‌ వ్యయం జీడీపీలో 66.2 శాతం (2012-14) నుంచి 57.5 శాతానికి (2015-19) క్షీణించింది. పెట్టుబడి రేటు 32.3 శాతానికి, జీడీపీ వృద్ధిరేటు ఆరేళ్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఇది రాబోయే సంక్లిష్ట పరిస్థితులకు సంకేతం. ఆర్థిక అసమానతలు, మౌలిక సదుపాయాల కల్పనలో లోటు, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉండటం ఇందుకు కారణాలు. ఈ పరిస్థితుల్లో ఆర్థిక వ్యవస్థలో జవసత్వాలను నింపి, ఆర్థికవృద్ధిని ప్రేరేపించడానికి కేంద్ర ప్రభుత్వం అనేక చర్యలు ప్రారంభించింది. పెట్టుబడులను పెంచేందుకు ప్రోత్సాహకాలను ప్రకటించింది. వీటిలో ప్రాథమిక కార్పొరేట్‌ పన్ను రేటును 30 నుంచి 22 శాతానికి తగ్గించడం; మౌలిక సదుపాయాలు, గృహ నిర్మాణ ప్రాజెక్టులకు రుణాల పెంపు; గృహ నిర్మాణ ఆర్థిక సంస్థలకు అందే సహాయాన్ని రూ.30,000 కోట్లకు పెంచడం ముఖ్యమైనవి. రాబోయే అయిదేళ్లలో మౌలిక సదుపాయాల రంగంలో కోటి కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టాలని బడ్జెట్‌లో ప్రతిపాదించడం ప్రధానమైనది. వీటిని ఏ ప్రాజెక్టులపై, ఏ విధంగా పెట్టాలనే విషయమై కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అధ్యక్షతన ఏర్పాటు చేసిన నిపుణుల సంఘం సూచనల మేరకు నిర్ణయం తీసుకుంటారు. మౌలిక సదుపాయాల రంగంలో ఇంత పెద్దమొత్తంలో పెట్టుబడి ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తుందనడంలో సందేహం లేదు. పెట్టిన పెట్టుబడి రాబడిగా మార్చడానికి అనువైన పరిస్థితులను సృష్టిస్తుంది. ఆర్థిక వ్యవస్థ పనితీరుపై నమ్మకాన్ని పెంచుతుంది. తద్వారా వ్యవస్థలో ద్రవ్యత్వం పెరుగుతుంది. అయితే అధిక ఆర్థిక వృద్ధిరేటును సాధించి దాన్ని ఆ స్థాయిలో నిలుపుకోవాలంటే ఈ ప్రతిపాదన కేవలం భౌతిక మౌలిక సదుపాయాల కల్పనకే పరిమితం కాకుండా, సామాజిక మౌలిక సదుపాయాల విస్తరణకూ వర్తింపజేయాలి.

అసలు కారణాలు
ఒక దేశ మానవ వనరుల అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి స్థాయికి ఆ దేశంలోని భౌతిక, సామాజిక, మౌలిక సదుపాయాల్లో సాధించిన ప్రగతికి దగ్గరి సంబంధం ఉంది. నాణ్యమైన, సమృద్ధిగా ఉండే భౌతిక మౌలిక సదుపాయాలు దేశీయ ఉత్పత్తిలో ప్రధాన నిర్ణాయకాలైతే, సాంఘిక మౌలిక సదుపాయాలు మానవ అభివృద్ధిలో, ఆర్థిక పురోగతిలో కీలక పాత్ర పోషిస్తాయి. నాణ్యమైన నైపుణ్యాలతో కూడిన విద్య, ఆరోగ్యకరమైన పరిస్థితుల ద్వారానే మానవ వనరుల అభివృద్ధి సాధ్యమవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మొత్తం వ్యయం విద్యారంగంపై జీడీపీలో కనీసం ఆరు శాతానికి తగ్గకుండా ఖర్చుపెట్టాలని ఎన్నో సంఘాలు ప్రభుత్వాన్ని కోరినా అది 4.6 శాతానికి మాత్రమే పరిమితమైంది. ఇది ప్రపంచ సగటుకంటే దిగువనే ఉంది. ఆరోగ్య రంగంపై జీడీపీలో 1.5 శాతమే భారత్‌ ఖర్చు చేస్తుండగా, అమెరికాలో అది 18 శాతంగా ఉండటం గమనార్హం. దీనివల్ల భారత ప్రజలు విద్య, వైద్యంపై అధికంగా ఖర్చుపెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

దేశంలో ముఖ్యంగా 1991నాటి సరళీకృత విధానాల అమలు తరవాత ఆర్థిక అసమానతలు అసాధారణంగా పెరిగాయి. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 1993-94 నుంచి అసమానతలను కొలిచే సూచీలో గణనీయమైన పెరుగుదల వచ్చినట్లు ఆక్స్‌ఫామ్‌ అధ్యయనం (2018) పేర్కొంది. 2017లో సంపదలో 73 శాతం అత్యంత ధనవంతులైన ఒక శాతం ప్రజలకు చేరింది. జనాభాలో 67 శాతం ప్రజల సంపదలో కేవలం ఒక శాతం పెరుగుదల వచ్చింది. వేతనస్థాయుల్లోనూ వ్యత్యాసం కనిపిస్తుంది.

సామాజిక మౌలిక సదుపాయాల్లో ప్రపంచ పోటీతత్వ సూచీ (2018) ప్రకారం 140 దేశాల్లో భారత్‌ 58వ (2017లో 64వ స్థానం) స్థానంలో ఉంది. చైనా 28వ స్థానంతో బ్రిక్స్‌ దేశాల్లో అగ్రభాగాన ఉంది. భౌతిక సదుపాయాలపై భారత్‌ చేసే వ్యయం తగ్గుతోంది. మార్చి 2019 నాటికి, జీడీపీలో పెట్టుబడి 29.8 శాతం ఉంది. ఇది 15 ఏళ్ల సగటు (34.8 శాతం) కంటే తక్కువ. మౌలిక సదుపాయాల అభివృద్ధి ఉక్కు, సిమెంట్‌, వాహన, స్థిరాస్తి, విద్యుత్‌ వంటి అనేక రంగాలకు ప్రోత్సాహాన్నిస్తుంది. దేశంలో మౌలిక సదుపాయాల రంగంలో లోటు జీడీపీలో నాలుగు నుంచి అయిదు శాతం వరకు ఉంది. ఈ లోటును భర్తీ చేస్తేనే రాబోయే రోజుల్లో మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులతో ఆర్థిక వృద్ధిని ప్రేరేపించవచ్చు. అప్పుడు జీడీపీలో ఒక శాతం మౌలిక సదుపాయాల రంగంలో ఖర్చు పెడితే వివిధ రంగాలు ప్రభావితమవుతాయి. ఫలితంగా జీడీపీలో వృద్ధి కనీసం రెండు శాతం ఉంటుందని ఎస్‌అండ్‌పీ పరిశోధనల్లో తేలింది.

ప్రపంచ ప్రమాణాలతో పోల్చినప్పుడు భారత్‌లో మౌలిక సదుపాయాల రంగంలో నాణ్యత నామమాత్రం. రహదారులు, రైల్వేలు, టెలిఫోన్‌ రంగాల పనితీరు కొంత మెరుగుపడింది. తలసరి ఆదాయ స్థాయితో పోల్చినప్పుడు చైనా, ఇతర అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల కంటే భారత్‌ వెనకబడి ఉంది. విద్యుత్‌ సదుపాయం, దాని తలసరి వినియోగం, అంతర్జాల సౌకర్యం, విమాన ప్రయాణ స్థాయి, ఓడరేవుల నాణ్యత వంటి రంగాల్లో భారత్‌ పనితీరు ఇతర అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలతో పోలిస్తే చాలా తక్కువగా ఉంది. ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంక్షోభం తరవాత తయారీ రంగాన్ని ద్రవ్య సమస్యలు చుట్టుముట్టాయి. ఎన్‌బీఎఫ్‌సీ (బ్యాంకింగేతర ఆర్థిక సంస్థ)లు భారీ ప్రాజెక్టులకు రుణాలను నిలిపేశాయి. అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థకు చేయూతనిస్తూ, పెరుగుతున్న జనాభాకు కావలసిన అవసరాలను తీర్చే విధంగా భౌతిక మౌలిక సదుపాయాల నాణ్యతను మరింత విస్తరించి, వాటిని మెరుగుపరచాలి. దీనికోసం ఒక బలమైన సంస్థాగత యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.

సామాజికాభివృద్ధి కీలకం
సామాజికంగా వెనకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ఆరోగ్య సంరక్షణ, విద్యా రంగాల్లో అధికంగా వ్యయం చేయాలి. సేవల్లో నాణ్యతను పెంచాలి. సామాజిక, భౌతిక మౌలిక సదుపాయాల కల్పన రంగాల్లో పెట్టే పెట్టుబడుల నుంచి ఫలితాలు అందడానికి ఎక్కువ సమయం పట్టవచ్చు. కొన్ని రంగాలు, కొంతమంది ఆదాయాల వృద్ధి ఎంతో కాలం దేశ ఆర్థిక వ్యవస్థను కాపాడలేదు. చైనాకు దీటుగా ప్రపంచ పటంలో నిలబడాలంటే, తాత్కాలిక ఉపశమనాలకు ముగింపు పలకాలి. ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తక్షణమే నడుం బిగించాలి. దీనికోసం అన్ని రకాల ప్రయత్నాలు చేయడం అవసరం. పేదప్రజల ఆర్థిక స్థితిని మెరుగుపరచే మార్గాలపై దృష్టి పెట్టాలి. ఈ ప్రయత్నాలు వారి ఆస్తులను పెంచే విధంగా, సామర్థ్యాలను పెంపొందించేలా ఉండాలి. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో ఏర్పాటు చేసిన అభివృద్ధి బ్యాంకుల్లో చాలావరకు వాణిజ్య బ్యాంకులుగా రూపాంతరం చెందాయి. మౌలిక సదుపాయాల కల్పన రంగానికి వాణిజ్య బ్యాంకులు ఇచ్చే రుణాలు వాటి ఆస్తిఅప్పుల పట్టికల అసమతుల్యతకు కారణమవుతాయి. దీనివల్లే వాణిజ్య బ్యాంకులు మౌలిక సదుపాయాల రంగంలో పెట్టుబడులు పెట్టడానికి అంతగా ఆసక్తి చూపడం లేదు. అందువల్ల జాతీయ మౌలిక సదుపాయాల విధానంలో భాగంగా అభివృద్ధి బ్యాంకులను పునరుద్ధరించాలి. ప్రతిపాదించిన పెట్టుబడుల్లో గణనీయమైన మొత్తాన్ని మూలధన రూపంలో వీటికి అందించాలి. ఆర్థిక వ్యవస్థ ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రభుత్వ వ్యయం అత్యంత కీలకం. కాని, కేంద్ర ప్రభుత్వ ద్రవ్యలోటు ఇప్పటికే ఎఫ్‌ఆర్‌బీఎం చట్ట పరిమితి దాటింది. ఇంతపెద్ద మొత్తంలో నిధులను ప్రభుత్వం ఎలా సమకూరుస్తుందన్నది ప్రశ్నగానే ఉంది. మితిమీరిన ప్రభుత్వ వ్యయం ద్రవ్యోల్బణానికి దారి తీసే ప్రమాదమూ లేకపోలేదు. వీటన్నింటినీ సమస్వయపరుస్తూ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలపైనే ప్రస్తుత సంక్షోభానికి పరిష్కారం ఆధారపడి ఉంది!

వ్యవస్థీకృత లోపాలే శాపాలు
ప్రముఖ ఆర్థికవేత్త రితిన్‌ రాయ్‌ అభిప్రాయం ప్రకారం వ్యవస్థీకృత సమస్యల వల్ల దేశంలో సంక్షోభం మొదలైంది. సామాజిక, ఆర్థిక రంగాల్లో ఉన్నత స్థానంలో ఉండే కేవలం 10 కోట్ల మంది వివిధ వస్తుసేవల డిమాండు ఇప్పటివరకు దేశాభివృద్ధిని ప్రధానంగా ప్రభావితం చేసింది. వీరు తమకు కావాల్సిన వస్తు సేవలను ఇప్పటికే దాదాపుగా అందుకున్నారు. దరిమిలా వీరు వినియోగ గిరాకీలో స్తబ్ధత ఏర్పడింది. ఇది అభివృద్ధి చెందుతున్న భారత్‌లాంటి ఆర్థిక వ్యవస్థలకు హాని కలిగించే అంశం. సంపదలో అసమానతలు అభివృద్ధి చెందుతున్న దేశాల ఆర్థికవృద్ధికి ప్రధాన అవరోధమని ఆర్థికవేత్తలు గుర్తించారు. ఈ అంతరాలు ఎక్కువైతే, దిగువస్థాయిలో ఉన్న కుటుంబాలు ఉన్నతస్థాయికి చేరుకోవడానికి చేసే ప్రయత్నాల్లో కదలిక నెమ్మదిగా ఉంటుంది. ఆర్థిక వృద్ధిరేట్లను నిలబెట్టుకోవడానికి ప్రభుత్వం ఆర్థిక, మానవ వనరులను భారీగా సమీకరించాల్సి ఉంటుంది. ఆర్థిక అసమానతలు తీవ్రంగా ఉంటే మానవ వనరుల లభ్యత కొరతగా ఉంటుంది. బ్రెజిల్‌, దక్షిణాఫ్రికా ఇందుకు నిదర్శనం. ఈ దేశాలు తమ ఆర్థిక ఉత్పత్తిని చాలాకాలం పాటు వేగంగా పెంచగలిగాయి. కానీ అది అధిక శాతం ప్రజల జీవితాల్లో ఎలాంటి మార్పూ తీసుకురాలేదు. భారత్‌లోనూ జరిగింది ఇదే!

Posted on 16-11-2019