Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

ముదురుతున్న మాంద్యం

* నిపుణుల సేవలకు సమయం

ఆర్థిక వ్యవస్థపై అనునిత్యం వెలువడుతున్న ప్రతికూల వార్తలు మందగమనం పరిస్థితుల్ని చాటిచెబుతున్నాయి. ఆర్థిక సంక్షోభం నివారణకు తీసుకుంటున్న చర్యలు మాత్రం ఇప్పటికీ అస్పష్టంగానే ఉన్నాయి. విధానాల్ని రూపొందించే నిర్ణయాత్మక స్థానాల్లో ప్రత్యేక వృత్తి నిపుణులకు అవకాశం కల్పించడం ద్వారా కుదేలైన పరిశ్రమ మనోభావాల్ని ఉత్తేజపరచవచ్చు.

ఆర్థిక వ్యవస్థ కుంచించుకుపోతున్నకొద్దీ, కనీసం అయిదు శాతం వృద్ధిరేటును సాధించడమూ కష్టమయ్యేలా ఉంది. వరసగా రెండో నెల సెప్టెంబరులో... పారిశ్రామిక ఉత్పత్తి సూచీ తిరోగమనంలో కొనసాగింది. 4.3 శాతం క్షీణత నమోదైంది. ఇది ఎనిమిదేళ్ల కనిష్ఠం. ఆగస్టులో 1.4 శాతం పడిపోయి, 81 నెలల కనిష్ఠానికి కుప్పకూలింది. 2018-19లో వృద్ధిరేటు 5.2 శాతంగా ఉండగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 1.3 శాతం వద్దే నిలిచింది. ఈ ఏడాది మిగిలిన కాలవ్యవధిలో ఎలా కోలుకుంటుందనేది చూడాల్సి ఉంది. వినియోగదారుల శక్తి తగ్గిపోతోందన్న సంగతి స్పష్టమవుతోంది. ప్రజల వద్ద విచక్షణతో ఖర్చు చేసేందుకు మిగిలిన మొత్తమూ చాలా తక్కువగానే ఉంది. పెద్దగా హడావుడి, ఆర్భాటం లేకుండా గడిచి పోయిన దీపావళి పండగే ఇందుకు నిదర్శనం.

భారత పరపతి రేటింగును సుస్థిరం నుంచి ప్రతికూలానికి తగ్గిస్తూ ‘మూడీస్‌’ తీసుకున్న నిర్ణయం దిగజారుతున్న ఆర్థిక దుస్థితికి నిదర్శనంగా నిలిచింది. ఇదంతా అసంబద్ధమంటూ పాలకులు కొట్టిపారేయవచ్చుగాని, మందగమనాన్ని సూచిస్తున్న అనేక సంకేతాల్ని తిరస్కరించలేరు. 2019-20 తొలి త్రైమాసికంలో వృద్ధి అయిదు శాతానికి పడిపోయింది. ఇది ఆరేళ్ల కనిష్ఠానికి సమానం. రెండో త్రైమాసికానికి వచ్చేసరికి అయిదు శాతం వృద్ధిరేటును సాధించడం కూడా కష్టంగా మారింది. తక్కువ స్థాయి పన్ను వసూళ్లు సైతం మందగమనానికి సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఆదాయ పన్ను విభాగం ఏకంగా వసూళ్ల లక్ష్యాన్ని తగ్గించాలని కోరింది.

కొన్ని వాస్తవిక పరిణామాల కారణంగా భారత్‌ను విదేశీ పెట్టుబడుల్ని ఆకర్షించే అయస్కాంతంగా మార్చడం కష్టంగా మారింది. ప్రపంచబ్యాంకు రూపొందించే సులభతర వాణిజ్య సూచీలో భారత్‌ ర్యాంకులు మెరుగుపడుతున్నా, పలు ప్రమాదకర సంకేతాలు సైతం దర్శనమిస్తున్నాయి. వోడాఫోన్‌-ఐడియా ఉదంతమే ఒక ఉదాహరణ. ఆ బ్రిటన్‌ సంస్థ భారత విభాగం పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయింది. నిష్క్రమణకు సిద్ధమైంది. దేశంలో అనుకూల, సుస్థిర, పారదర్శక వాణిజ్య వాతావరణం లేకపోవడమే ప్రధాన సమస్య అని ఆరోపిస్తోంది. ఇతర టెలికా సంస్థల ఆర్థిక ఆరోగ్యమూ అంతంతమాత్రంగానే ఉంది. ఈ క్రమంలో దేశ విదేశీ పెట్టుబడిదారులకు తప్పుడు సంకేతాలు వెళ్లకుండా ప్రభుత్వం ఈ రంగంలో నెలకొంటున్న ప్రతికూల పరిస్థితుల్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది. దురదృష్టవశాత్తూ, కుంగుబాటు దుస్థితిలో ఉన్న ఈ రంగం, అధికారుల ఆధిపత్య వైఖరితో మరింత దిగజారే ప్రమాదం ఉంది. తొలినాటి అతిపెద్ద విదేశీ పెట్టుబడి సంస్థగా పేరొందిన వోడాఫోన్‌ పతనం వాణిజ్యపరంగా మనోభావాల్ని దెబ్బతీసే ప్రమాదం లేకపోలేదు.

స్థూలంగా ద్రవ్యోల్బణం రిజర్వుబ్యాంకు పరామితుల పరిధిలో నిరపాయకర స్థితిలోనే ఉన్నా, ఆహార సరకుల ధరల్లో తీవ్ర పెరుగుదల నమోదైంది. కాకపోతే, రిజర్వు బ్యాంకు నిరర్థక ఆస్తుల సంక్షోభాన్ని పరిష్కరించడంలో మాత్రం విఫలమైంది. మొండిబాకీలుగా పేరొందిన సుమారు నాలుగు లక్షల కోట్ల రూపాయల రుణాలు ఇప్పటికీ బ్యాంకింగ్‌ రంగాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. పదేపదే రేటు కోతలు చోటుచేసుకుంటున్నా, రుణ పంపిణీ ఇప్పటికీ మందకొడిగానే ఉంది. స్థిరాస్తి, వాహన రంగం తదితరాల వృద్ధికి ఊతమిచ్చేవాటిలో ఒక్కొక్కటీ మందగమనంలో చిక్కుకుపోతున్నాయి. వచ్చేనెలలో జరిగే మరో విడత రేటు తగ్గింపు పరిస్థితిని చక్కదిద్దడంలో ఉపకరిస్తుందని చెప్పే సంకేతాలు కనిపించడం లేదు. 2011-12తో పోలిస్తే, 2017-18లో తలసరి వినియోగం తగ్గిన విషయాన్ని వెల్లడిస్తున్న వినియోగ సర్వేను తొక్కిపెట్టడం... ఆర్థికరంగంపై ప్రతికూల పరిస్థితుల్ని ఎత్తిచూపే అంశాల్ని జనం దృష్టికి రాకుండా చేసే ధోరణికి ప్రతీకగా నిలుస్తున్నాయి.

భూమి, కార్మిక మార్కెట్లను సరళీకృతం చేయాల్సి ఉంది. పెట్టుబడుల ఉపసంహరణ జరగాలి. ఆర్థిక వ్యవస్థలోని ఉత్పాదక రంగాలపై నియంత్రణల్ని సరళీకరించే దిశగా ధైర్యవంతమైన నిర్ణయాలు తీసుకోవడానికి విస్పష్ట మెజారిటీతో అధికారంలోకి వచ్చిన ప్రధాని నరేంద్రమోదీకి ఇప్పటికీ అవకాశం ఉంది. నిజాయతీ కలిగిన వ్యాపార వర్గం వృద్ధి చెందేందుకు సుస్థిర, పారదర్శక విధానాల్ని అందించేందుకూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ‘ఆర్‌సెప్‌’లో చేరకూడదని తీసుకున్న నిర్ణయం మనలోని భయాన్ని ప్రతిబింబిస్తోంది. ప్రపంచ పోటీని ఎదుర్కొనే విషయంలో సంసిద్ధత లోపాన్నీ చూపుతోంది. ఇలాంటి రక్షణాత్మక అడ్డంకులకు బదులుగా, మనం ప్రపంచ వ్యవస్థతో కలిసి సాగేలా సంసిద్ధులమవ్వాలి. మందకొడి ఆర్థిక వ్యవస్థలు వృద్ధి వాహనాన్ని ఎక్కే అవకాశాన్నీ కోల్పోతాయి. ప్రపంచ ప్రధాన స్రవంతిలో ధైర్యంగా చేరిన వాళ్లు వేగవంతమైన వృద్ధి, సౌభాగ్య ఫలాల ప్రయోజనాల్ని అందుకుంటారు. ఆర్థిక విధాన నిర్ణయాల్లో నిపుణుల తోడ్పాటు ఉపయుక్తంగా ఉంటుంది. ప్రభుత్వంలో ఆయా రంగాలకు చెందిన నిపుణుల్ని చేర్చడం నాయకత్వ విశ్వాసానికి సంకేతంగా నిలుస్తుంది తప్ప బలహీనతకు కాదన్న సంగతి గుర్తుంచుకోవాలి.

- వీరేంద్రకపూర్‌
Posted on 18-11-2019