Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

జోరెత్తుతున్న మోసాల ఖాతా

దేశం నలుమూలలా ప్రభుత్వరంగ బ్యాంకుల్ని బురిడీ కొట్టించి కోట్లకు కోట్లు దోచేసే బాగోతాలు ఇంతలంతలవుతున్నాయి. కేంద్ర ఆర్థిక శాఖామాత్యులు నిర్మలా సీతారామన్‌ రాజ్యసభాముఖంగా చేసిన ప్రకటన, ఈ నిష్ఠుర సత్యాన్ని ధ్రువీకరిస్తోంది. ఆ మధ్య, పదకొండేళ్ల వ్యవధిలో బ్యాంకు మోసాలకు సంబంధించి నమోదైన కేసులు 53వేలకు మించిపోయాయన్న సమాచారం అక్రమార్కుల ఉరవడిని కళ్లకు కట్టింది. మునుపటితో పోలిస్తే రెండేళ్లక్రితం కేసులు (5961), మోసాల విలువ (సుమారు రూ.41వేలకోట్లు)లో ‘గణనీయ వృద్ధి’ గగ్గోలు పుట్టించింది. 6800 కేసులు, సుమారు రూ.71వేలకోట్ల నష్టాలతో దశాబ్దంలోనే గరిష్ఠ రికార్డు నిరుడు నమోదైంది. అదిప్పుడు బద్దలైపోయినట్లేనన్నది ఆర్థికమంత్రి తాజా ప్రకటన సారాంశం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఆరుమాసాల్లోనే (ఏప్రిల్‌, సెప్టెంబర్ల మధ్య) 5743 మోసాల కేసుల పుణ్యమా అని బ్యాంకులు నష్టపోయిన మొత్తం రమారమి రూ.96వేలకోట్లు! వాస్తవానికి ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 2480 మోసాల రూపేణా బ్యాంకులకు రూ.32వేలకోట్ల మేర ఆర్థిక నేరగాళ్లు కుచ్చుటోపీ పెట్టారని రెండు నెలలక్రితం ఆర్‌బీఐ వెల్లడించింది. రెండో త్రైమాసికం గడిచేసరికి నష్టాల పరిమాణం మూడింతలకు ఎగబాకడం నిశ్చేష్టపరుస్తోంది. మున్ముందు బ్యాంకుల్లో మోసాలు పునరావృతం కాకుండా నివారించే లక్ష్యంతో కేసులవారీగా వంచన ఎలా చోటుచేసుకుందో కేంద్ర నిఘాసంఘం లోతుగా విశ్లేషిస్తున్నదన్న కథనాలు వెలుగుచూశాయి. ప్రభుత్వమూ నిర్దిష్ట చర్యలు చేపట్టినట్లు మంత్రి చెబుతున్నారు. అయినా కేసులు జోరెత్తి నష్టాలు ఇంతగా పెచ్చరిల్లుతుండటం వ్యవస్థాగత లోటుపాట్లు నిక్షేపంగా కొనసాగుతున్నాయని చాటుతోంది. అంతర్గత కట్టుబాట్లు, వెలుపలి నియంత్రణలు కాగితాలకే పరిమితమై బ్యాంకుల్లో మోసాల ఖాతా విస్తరించడం- పర్యవేక్షణ నిలువునా నీరోడుతున్న దయనీయ దుస్థితికి దర్పణం పడుతోంది!

రిజర్వ్‌ బ్యాంక్‌ నూతన సారథిగా అధికార పగ్గాలు చేపట్టిన కొత్తల్లో శక్తికాంతదాస్‌ ఈ ఏడాది మొదట్లో బ్యాంకింగ్‌ రంగం తెరిపిన పడుతోందని ఆశావహ దృశ్యం ఆవిష్కరించారు. మూడేళ్ల వ్యవధిలో తొలిసారి బ్యాంకుల ఆస్తుల్లో ఎన్‌పీఏ(మొండిబాకీ)ల నిష్పత్తి తగ్గడం శుభసూచకమని నాడాయన ‘ఆర్థిక స్థిరత్వ నివేదిక’లో కితాబిచ్చారు. అదే సమయంలో ప్రభుత్వరంగ బ్యాంకుల పాలన ప్రమాణాలు మెరుగుపరచడానికంటూ దాస్‌ మరిన్ని సంస్కరణల ఆవశ్యకతను ప్రస్తావించడానికి కారణం- మోసాల పద్దు విజృంభణ. కొంతమంది అధికారులు అక్రమార్కులతో అంటకాగి విద్రోహాలకు పాల్పడుతున్నారని బ్యాంకర్లే వాపోవడం- దిద్దుబాటు చర్యలు కార్యరూపం దాల్చనే లేదని నిరూపిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరు నెలల్లో ఎస్‌బీఐ రూ.25,400కోట్ల మేర మోసపోగా- పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (రూ.10,800కోట్లు), బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (రూ.8,300కోట్లు) ఆ జాబితాలో వెన్నంటి నిలిచాయి. ఉద్దేశపూర్వక ఎగవేతదారుల ఫొటోల్ని ప్రభుత్వరంగ బ్యాంకులు ప్రచురింపజేయాలని, రూ.50కోట్లకుపైన రుణాలు పొందిన సంస్థల ప్రమోటర్లు/డైరెక్టర్ల పాస్‌పోర్ట్‌ కాపీ తప్పనిసరిగా తీసుకోవాలన్న రిజర్వ్‌ బ్యాంక్‌ ఆదేశాలు ఆచరణలో ప్రభావశూన్యమవుతున్నాయి. ఇంటిదొంగల కారణంగా తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక, మహారాష్ట్రల్లో బ్యాంకు మోసాలు ఉద్ధృతమవుతున్నాయని; ఆర్థిక నష్టాల్లో రాజస్థాన్‌దే ప్రథమ స్థానమని లోగడ రిజర్వ్‌ బ్యాంకే లెక్కచెప్పింది. బ్యాంకుల్లో అంతర్గతంగా ఎన్నో కంతలున్నాయని అది బహిరంగంగా అంగీకరించిన దరిమిలా, అత్యవసర చికిత్స ఇప్పటికీ ఎండమావినే తలపిస్తుండటం దురదృష్టకరం!

పౌరుల విశ్వాసమే పునాదిగా ప్రజాధనానికి ధర్మకర్తృత్వం వహిస్తూ జాతి ప్రగతికి దోహదపడాల్సిన బ్యాంకింగ్‌ రంగాన నిష్పూచీ ధోరణుల ప్రజ్వలనమే, సమస్యకు మూలం. కీలక స్థానాల్లోని అధికారులు ఏళ్లతరబడి ఒకే చోట పాతుకుపోవడం ఎన్నో అనర్థాలు తెచ్చిపెడుతోందన్న కేంద్ర నిఘా సంఘం విశ్లేషణ అక్షరసత్యం. బ్యాంకుల గతి రీతుల్ని, యాజమాన్య బాధ్యతల్ని వ్యవహార సరళిని కూలంకషంగా విశ్లేషించి లోతైన చర్యలు చేపట్టాల్సిందిగా అరవింద్‌ సుబ్రమణియన్‌ వంటి నిపుణులు నిరుడే సూచించారు. రాజీవ్‌ కుమార్‌ కమిటీ సిఫార్సుల అనుసారం- ఎఫ్‌ఐఆర్‌ (ప్రాథమిక సమాచార నివేదిక) నమోదు కాకముందే అనుమానితులపై లుకౌట్‌ నోటీసుల జారీని కోరే అవకాశాన్ని బ్యాంకుల ఛైర్మన్లు, ఎమ్‌డీలు, సీఈఓలకు ప్రభుత్వం కట్టబెట్టింది. ఏం ఒరిగింది? సగటున ప్రతి నాలుగు గంటలకొక కుంభకోణం రెక్కవిచ్చుకునేలా ఉద్దేశపూర్వక ఎగవేతదారులకు లోపాయికారీ తోడ్పాటు అందిస్తున్న ఇంటిదొంగలపై ఈగైనా వాలని వాతావరణంలో బ్యాంకుల ఆర్థిక భద్రతపై భరోసా గుండుసున్న. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో వేల కోట్ల రూపాయల మహా కుంభకోణాన్ని ఏడేళ్లుగా ఆడిట్‌, నియంత్రణ సంస్థలు పసిగట్టలేకపోవడం ఏమిటని విత్తమంత్రిగా అరుణ్‌ జైట్లీ నిగ్గదీశారు. నీరవ్‌ మోదీ ఉదంతం తరవాత కట్టుదిట్టంగా వ్యవహరించాలని ఆర్‌బీఐ, కేంద్రం కఠిన నిబంధనావళిని నిర్దేశించాయి. ఇప్పటికీ ఏమైనా అవకతవకలు సంభవించాక వాటిని కనుక్కోవడానికి బ్యాంకులకు సగటున 22 నెలల కాలం పడుతున్నదంటే ఏమనుకోవాలి? మోసాల రూపేణా బ్యాంకులు నష్టపోతున్న వేలకోట్ల రూపాయల్లో ప్రతి ఒక్క పైసా ప్రజాధనమే. పన్నెండేళ్లలో తాము నష్టపోయినట్లు బ్యాంకులు అధికారికంగా ఆర్‌బీఐకి తెలిపిన సమాచారం ప్రాతిపదికన, ఆర్థిక నేరగాళ్ల పాలబడిన సొత్తు దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలు. బ్యాంకుల్లో నిష్పాక్షిక ఆడిటింగ్‌ నిర్వహించి, అవసరమైతే తక్షణ చర్యలు చేపట్టగల స్వతంత్ర వ్యవస్థనొకదాన్ని నెలకొల్పి పార్లమెంటుకు జవాబుదారీ చేయడమే ఇందుకు సరైన విరుగుడు!

Posted on 22-11-2019