Ask the Expert
|
Feedback
|
About us
|
Contact us
|
Pratibha Home


ఆర్థిక రంగం

మరింత పదునుగా సంస్కరణలు

* ఆర్థిక పునరుజ్జీవ చర్యలు

భారత స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి.రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019-20) రెండో త్రైమాసికమైన జులై-సెప్టెంబరు మధ్యకాలంలో గత ఆరేళ్లలో ఎన్నడూ లేనంత తక్కువగా 4.5 శాతానికి తగ్గిపోయింది. 2018-19లో ఇదే త్రైమాసికంలో ఈ రేటు 7.1 శాతంగా ఉంది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరునెలల్లో జీడీపీ వృద్ధిరేటు 4.8 శాతం. గత సంవత్సరం ఇదే కాలంలో 7.5 శాతం. ఎనిమిది ప్రధాన మౌలిక వసతుల పరిశ్రమల్లో ఉత్పత్తి అక్టోబరు నెలలో 5.8 శాతం మేర తగ్గిపోయింది. పారిశ్రామికోత్పత్తి, వినియోగదారుల గిరాకీ, ప్రైవేటు పెట్టుబడులు, ఎగుమతులు క్షీణించడం జీడీపీ వృద్ధిని దెబ్బతీశాయి. ఆర్థిక మందగమనానికి ఇంతకన్నా నిదర్శనమేం కావాలి? ప్రపంచమంతటా గిరాకీ తగ్గిపోవడం, అమెరికా-చైనా వాణిజ్య యుద్ధం కూడా భారత జీడీపీని కిందకు లాగుతున్నాయి. ఈ పరిస్థితిలో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. 2019-20లో కేంద్ర ప్రభుత్వానికి జీఎస్టీ, ప్రత్యక్ష పన్నుల వసూళ్లలో రూ.2.7 లక్షల కోట్ల మేరకు బొర్రె పడనుంది. ఆర్థిక వ్యవస్థను మళ్ళీ గాడిన పెట్టే ప్రయత్నంలో ప్రభుత్వం వివిధ పథకాలపై వ్యయాన్ని పెంచింది. కానీ, దానివల్ల విత్తలోటు కట్టుతప్పుతోంది. ఏతావతా 2019-20లో భారత జీడీపీ వృద్ధి.రేటు ఆరు శాతానికి తగ్గుతుందని ఐక్యరాజ్య సమితి వాణిజ్యం, అభివృద్ధి. సంస్థ (అన్‌క్టాడ్‌) లెక్కగట్టింది (2018లో ఈ రేటు 7.4 శాతం). ప్రపంచ బ్యాంకు కూడా 7.5 నుంచి ఆరు శాతానికి అంచనాలను కుదించింది. రుణ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ దీన్ని 5.8 శాతానికి తగ్గించింది. ఐఎమ్‌ఎఫ్‌ 7.1 శాతం నుంచి 6.1 శాతానికి తెగ్గోసింది. స్వదేశంలో వస్తుసేవలకు గిరాకీ తగ్గడం దీనికి కారణమంది. పారిశ్రామికోత్పత్తి కుంగి నిరుద్యోగం పెరగడం, ఆటొమొబైల్స్‌ సహా ఇతర రంగాల్లోనూ విక్రయాలు తగ్గడం, అమెరికా-చైనాల వాణిజ్య వైరం వల్ల మన ఎగుమతులూ మందగించడం... అన్నీ కలిసి భారత్‌కు పగ్గాలు వేస్తున్నాయి. ఆర్థిక మందగతిని అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వం గత మూడు నాలుగు నెలల్లో కొన్ని చర్యలు తీసుకుంది. వివిధ రంగాల్లో వృద్ధికి ఊతమివ్వడానికి 32 నిర్ణయాలు తీసుకుంది. స్థిరాస్తి రంగాన్ని గాడిన పెట్టడానికి రూ.25,000 కోట్ల ప్యాకేజీ ప్రకటించింది.

రంగంలోకి ఆర్‌బీఐ
మోదీ సర్కారు లక్షించిన విధంగా 2024-25కల్లా భారత్‌ను అయిదు లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడానికి కేంద్రం రెండు, మూడు నెలల నుంచి కొన్ని కీలక చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. మొదటగా రిజర్వు బ్యాంకు (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన సంఘం 2019లో మొత్తం అయిదుసార్లు రెపో రేటును తగ్గించింది. మార్జినల్‌ స్టాండింగ్‌ ఫెసిలిటీ రేటును, బ్యాంకు రేటును 5.40 శాతానికి కుదించింది. వాణిజ్య బ్యాంకులకు అవసరమైనప్పుడు ఆర్‌బీఐ ఈ రేట్లపైనే నిధులు ఇస్తుంది. రెపో రేటు తగ్గిస్తే వాణిజ్య బ్యాంకులు రిజర్వు బ్యాంకు నుంచి చవగ్గా నిధులు తీసుకుని వ్యక్తులకు, కంపెనీలకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వగలుగుతాయి. ఈ రుణాల వల్ల గిరాకీ, పెట్టుబడులు, ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి. ఇన్నేళ్లుగా రిజర్వు బ్యాంకు వడ్డీరేట్లు తగ్గించినా, బ్యాంకులు వినియోగదారులకు ఆ లబ్ధిని బదిలీచేయలేదు. ఈసారి మాత్రం రిటైల్‌ రుణాలను తక్కువ వడ్డీకి ఇవ్వడానికి సిద్ధం కావడం స్వాగతించాల్సిన అంశం. దీనివల్ల గృహ, వాహన, ఇతర చిల్లర రుణాలపై నెలసరి వాయిదా మొత్తాలు (ఈఎమ్‌ఐ) తగ్గి మళ్ళీ గిరాకీ పుంజుకొంటుంది. గిరాకీని తట్టుకోవడానికి పెట్టుబడులు అవసరమవుతాయి. తద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ప్రభుత్వం ఆశిస్తోంది.

భారతదేశ పారిశ్రామికోత్పత్తిలో 49 శాతం ఆటొమొబైల్‌ రంగానిదే. ఈ పరిశ్రమ ప్రత్యక్షంగా పరోక్షంగా 3.7 కోట్లమందికి ఉపాధి చూపుతోంది. ఉక్కు, అల్యూమినియం, టైర్లు తదితర పరిశ్రమలకు వాహన రంగంతో ప్రత్యక్ష సంబంధం ఉంది. వాహనాలకు గిరాకీ తగ్గితే పై పరిశ్రమలూ దెబ్బతింటాయి. 2019 ఏప్రిల్‌-జూన్‌లో అంతకుముందు సంవత్సరం అదేకాలంతో పోలిస్తే ప్రయాణికుల వాహన విక్రయాలు 18.42 శాతం తగ్గాయి. అన్ని రకాల వాహన విక్రయాలు 12.35 శాతం తగ్గాయి. దీనివల్ల లక్షలాది ఉద్యోగులు ఉపాధి కోల్పోయే ప్రమాదం ముంచుకొస్తోంది. దీన్ని గమనించిన ప్రభుత్వం వాహన రంగానికి వత్తాసు ఇచ్చే చర్యలను ఆగస్టు 23న ప్రకటించింది. వాటిలో భాగంగా ప్రభుత్వ విభాగాలు కొత్త వాహనాలను కొనుగోలు చేయరాదన్న నిషేధాన్ని ఎత్తివేసింది. ఆగస్టు 30న పది ప్రభుత్వరంగ బ్యాంకులను విలీనం చేసి నాలుగు పెద్ద బ్యాంకులుగా రూపాంతరం చెందించింది. విలీనం వల్ల బ్యాంకుల నిధుల లభ్యత పెరిగి ఎక్కువ రుణాలు ఇవ్వగలుగుతాయి. ప్రభుత్వరంగ బ్యాంకులకు కేంద్రం రూ.70,000 కోట్ల అదనపు నిధులను అందించనుంది. రుణ వితరణ పెంచడానికి అదీ ఉపయోగపడుతుంది.

ఔత్సాహికులకు అండగా...
ఈ ఏడాది కేంద్ర బడ్జెట్‌లో రెండు కోట్ల రూపాయల నుంచి అయిదు కోట్ల రూపాయల వరకు వార్షికాదాయం కలిగినవారిపై సర్‌ఛార్జిని 15 శాతం నుంచి 25 శాతానికి పెంచారు. అయిదు కోట్ల రూపాయలు, అంతకుమించి ఆదాయం ఉంటే 37 శాతం చెల్లించాల్సిందే. దీన్ని నిరసిస్తూ విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపరు(ఎఫ్‌పీఐ)లు బడ్జెట్‌ వెలువడిన వెంటనే రూ.24,000 కోట్ల నిధులను భారతీయ స్టాక్‌ మార్కెట్ల నుంచి ఉపసంహరించారు. దాంతో ప్రభుత్వం మూలధన లాభాలపై సర్‌ఛార్జీ పెంపును విరమించింది. అంకుర సంస్థలపై ‘ఏంజెల్‌ పన్ను’నూ తొలగించి, ఔత్సాహిక వ్యవస్థాపకులకు కొత్త ఊతమిచ్చింది.

మౌలిక సౌకర్యాల రంగంలోని కంపెనీలకు ఆర్థిక సేవలను అందజేసే ఐఎల్‌ అండ్‌ ఎఫ్‌ఎస్‌ సంస్థ సంక్షోభం బ్యాంకింగేతర ఫైనాన్షియల్‌ కంపెనీల (ఎన్‌బీఎఫ్‌సీల) దుస్థితిని వెలుగులోకి తెచ్చింది. తమ ఆస్తుల విలువకు మించి రుణాలివ్వడం, ఆస్తులకన్నా అప్పులు పెరిగిపోవడం వంటి సమస్యలతో ఎన్‌బీఎఫ్‌సీలు కునారిల్లిపోయాయి. అంతకన్నా మించి నిధుల కటకటతో అవి వ్యాపారం చేయలేని గడ్డు స్థితికి చేరుకున్నాయి. ఇది స్థిరాస్తి రంగంతో సహా పలు రంగాలపై వ్యతిరేక ప్రభావం చూపింది. పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వం రంగంలోకి దిగి, ఒక ఎన్‌బీఎఫ్‌సీకి బ్యాంకులు ఇవ్వగల రుణాల పరిమితిని 15 నుంచి 20 శాతానికి పెంచింది. వ్యవసాయం, సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు, గృహనిర్మాణ రంగాలకు ఎన్‌బీఎఫ్‌సీలు ఇచ్చే రుణాలను ప్రాధాన్య రుణాలుగా పరిగణిస్తామని ప్రకటించింది. ఈ చర్యలు బ్యాంకుల నుంచి ఎన్‌బీఎఫ్‌సీలకు రుణ వితరణను పెంచుతాయని ప్రభుత్వ అంచనా. గృహ నిర్మాణ రంగానికి, ఎగుమతులకు ఊతమివ్వడానికి కేంద్రం ముఖ్యమైన రాయితీలు ఇచ్చింది. పేద, మధ్యతరగతి కోసం చేపట్టి, అర్ధాంతరంగా నిలిచిపోయిన గృహనిర్మాణ ప్రాజెక్టులను పూర్తి చేయడానికి రూ.10,000 కోట్ల నిధిని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించింది. ఎగుమతులపై పన్నులు లేదా సుంకాల మినహాయింపు కోసం కొత్త పథకాన్ని ప్రారంభించింది. జీఎస్టీ ‘ఇన్‌ పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌’ల చెల్లింపులకు స్వయంచాలిత ఎలక్ట్రానిక్‌ మార్గాన్ని ఏర్పరచి ఎగుమతిదారులకు అండగా నిలవనుంది. వారికి నిర్వహణ మూలధనాన్ని (వర్కింగ్‌ క్యాపిటల్‌) అందించే బ్యాంకులకు ఎగుమతి రుణహామీ సంస్థ ద్వారా అధిక బీమా రక్షణను అందిస్తారు. చాలాకాలం తరవాత ఎగుమతి రుణాలనూ ప్రాధాన్య రుణాలుగా పరిగణిస్తామని కేంద్రం ప్రకటించింది. సెప్టెంబరు 20న కేంద్రం ఆకస్మికంగా తీసుకున్న ఓ నిర్ణయం అందరినీ విస్మయంలో ముంచెత్తింది. ప్రభుత్వం నుంచి ఎటువంటి పన్ను రాయితీలూ పొందని స్వదేశీ కంపెనీలపై కార్పొరేట్‌ పన్ను రేటును 30 నుంచి 22 శాతానికి తగ్గించడం పెట్టుబడులకు గొప్ప ఊతమిస్తుందని భావిస్తున్నారు. దీంతోపాటు ఈ ఏడాది అక్టోబరు ఒకటో తేదీ తరవాత స్థాపితమై 2023 మార్చి 31లోపు ఉత్పత్తి ప్రారంభించే పరిశ్రమలపై పన్నును 15 శాతానికి తగ్గించారు. ఇకపై 22 శాతం కార్పొరేట్‌ పన్ను రేటు వర్తించే స్వదేశీ కంపెనీలు అంతిమంగా 25.17 శాతం పన్నును, కొత్త పరిశ్రమలు 17.1 శాతం మేర పన్నును చెల్లించాల్సి ఉంటుంది. ఈ కార్పొరేట్‌ పన్ను రాయితీ- జీఎస్టీ తరవాత ఎంతో ముఖ్యమైన సంస్కరణ. కార్పొరేట్‌ పన్ను తక్కువగా ఉంటే అంతర్జాతీయ విపణిలో మన ఉత్పత్తులు విదేశీ సరకులతో పోటీ పడగలుగుతాయి. విదేశీ పెట్టుబడులూ తరలివస్తాయి.

ఫలితాలకు సమయం
చైనా, దక్షిణ కొరియా, ఇండొనేసియాల్లో కార్పొరేట్‌ పన్ను 25 శాతమే. సింగపూర్‌, హాంకాంగ్‌లలోనైతే కేవలం 17 శాతం. బ్రిటన్‌లో 19 శాతమైతే, థాయ్‌లాండ్‌లో 20 శాతం. అంతర్జాతీయంగా కార్పొరేట్‌ పన్ను సగటు రేటు 23.79 శాతమైతే, ఆసియాలో 21.09 శాతం. భారత ప్రభుత్వమూ చైనాకు దీటుగా కార్పొరేట్‌ పన్ను తగ్గించి పారిశ్రామిక వృద్ధి.కి బాటలు వేస్తోంది. అంతర్జాతీయ సగటుకు దగ్గరగా కార్పొరేట్‌ పన్నును తీసుకురావడం ద్వారా విదేశీ పెట్టుబడులను స్వాగతించి ‘మేకిన్‌ ఇండియా’ రథాన్ని జోరుగా ముందుకు ఉరికించాలని ప్రభుత్వం లక్షిస్తోంది. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు ఫలితం దీర్ఘకాలంలో కనిపించే మాట నిజమే కానీ, ఆలోపు కంపెనీల చేతిలో ఎక్కువ నగదు మిగులుతుంది. అలా మిగిలే డబ్బుతో కంపెనీలు పాత రుణాలు తీర్చడం, వాటాదారులకు అధిక డివిడెండ్లు చెల్లించడం, తమ ఉత్పత్తుల ధరలు తగ్గించి అమ్మకాలు పెంచుకోవడం, కొత్త పెట్టుబడులు పెట్టడం వంటివి చేయగలుగుతాయి. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు వల్ల్ల వస్తుసేవలకు గిరాకీ అధికమవుతుంది. దాన్ని తీర్చడానికి ఉత్పత్తి పెంపుదల అవసరమవుతుంది. అందుకోసం పెట్టుబడులు ప్రవహించి ఉపాధి అవకాశాలు విస్తరిస్తాయి. కార్పొరేట్‌ పన్ను తగ్గింపు వల్ల ప్రభుత్వం ఏటా రూ.1.45 లక్షల కోట్ల పన్ను ఆదాయాన్ని కోల్పోయినా, ఆ డబ్బు ప్రైవేటు రంగానికి చేరి ఆర్థిక వ్యవస్థ మళ్ళీ పుంజుకొంటుందని అంచనా. దానివల్ల ప్రభుత్వానికి పన్ను ఆదాయం ఇనుమడించి, లోటు భర్తీ అవుతుందని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. వారి అంచనాలు నిజం కావడానికి సమయం పడుతుంది. ఈలోపు అంతర్జాతీయ రుణ రేటింగ్‌ సంస్థ మూడీస్‌ నవంబరు ఏడున భారత్‌ రేటింగును సుస్థిరం నుంచి ప్రతికూలానికి తగ్గించింది. దీంతోపాటు అనేక భారతీయ కంపెనీల రేటింగునూ తగ్గించింది. దేశాలకు కాని, కంపెనీలకు కాని మంచి రేటింగ్‌ ఉంటేనే విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, అంతర్జాతీయ రుణాలు తేలిగ్గా లభిస్తాయి. పరిస్థితిని తక్షణం చక్కదిద్దకపోతే భారత్‌ రుణఊబిలోకి, మాంద్యంలోకి జారిపోయే ప్రమాదం ఉందని మూడీస్‌ హెచ్చరించింది. ఆ విపత్తును తప్పించుకోవాలంటే భారత్‌ వేగంగా వ్యవస్థాపరమైన సంస్కరణలు చేపట్టి, ప్రపంచంలో అత్యంత వేగంగా పురోగమిస్తున్న ఆర్థిక వ్యవస్థగా తన ప్రతిష్ఠను పునరుద్ధరించుకోవాలి!

- డాక్టర్‌ టి.సిద్ధయ్య
(రచయిత- శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయ మాజీ రిజిస్ట్రార్‌)
Posted on 11-12-2019